అదిగదిగో 5జీ: ఈ 5జీ వస్తే ఎలా ఉంటుంది?

ఫొటో సోర్స్, Getty Images
సూపర్‌ఫాస్ట్ 5జీ మొబైల్ ఇంటర్నెట్ వచ్చే ఏడాది రంగంలోకి దిగుతోంది. అది ఇప్పుడున్న డౌన్‌లోడ్ స్పీడ్ కన్నా 10, 20 రెట్లు అధికంగా ఉంటుందని చెప్తున్నారు. మరైతే అది మన జీవితాల్లో తేగల మార్పు ఏమిటి? ఈ 5జీ కోసం మనం కొత్త ఫోన్లు కొనుక్కోవాలా? మారుమూల ప్రాంతాల్లోని వారికి ఇప్పుడున్న నెట్ కనెక్టివిటీ సమస్యను 5జీ పరిష్కరిస్తుందా?
అసలు 5జీ అంటే ఏమిటి?
ఇది ఐదో తరం మొబైల్ ఇంటర్నెట్ కనెక్టివిటీ. అప్‌లోడ్, డౌన్‌లోడ్ స్పీడ్లు ఇంకా వేగంగా ఉంటాయి. కవరేజీ ఇంకా విస్తృతంగా.. కనెక్షన్లు మరింత స్థిరంగా ఉంటాయి.
రేడియో స్పెక్ట్రమ్‌ను ఇంకా బాగా ఉపయోగించుకోవటం.. ఏకకాలంలో మరిన్ని డివైజ్‌లను మొబైల్ ఇంటర్నెట్‌కు కనెక్ట్ అయ్యేలా వీలుకల్పించటం ఇందులో ముఖ్యమైన విషయాలు.

ఫొటో సోర్స్, Getty Images
దీనివల్ల మనకు లాభం ఏమిటి?
‘‘5జీ వస్తే మన స్మార్ట్‌ఫోన్లతో ఇప్పుడు చేస్తున్న పనులన్నీ మరింత వేగంగా బాగా చేయగలం’’ అంటున్నారు మొబైల్ డాటా ఎనలటిక్స్ కంపెనీ ప్రతినిధి ఇయాన్ ఫాగ్.
‘‘స్మార్ట్ గ్లాస్ మీద ఆగ్‌మెంటెడ్ రియాలిటీ, మొబైల్ వర్చువల్ రియాలిటీ, ఇంకా అధిక క్వాలిటీ వీడియో, నగరాలను మరింత స్మార్ట్‌గా చేసే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్.. ఇవన్నీ సాధ్యమవుతాయి’’ అని ఆయన చెప్పారు.
‘‘అయితే.. నిజంగా ఉత్తేజం కలిగించే అంశం ఏమిటంటే.. మనం ఇప్పుడు ఊహించలేని చాలా కొత్త సర్వీసులు 5జీలో పుట్టుకురావచ్చు’’ అని పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
డ్రోన్ల గుంపులు 5జీ నెట్‌వర్క్ ద్వారా తమలో తాము, బేస్ స్టేషన్లతో వైర్‌లెస్‌గా సమాచారం ఇచ్చిపుచ్చుకుంటూ.. సమన్వయంతో గాలింపు, సహాయ చర్యలు, అగ్ని ప్రమాదాలపై సమీక్ష, ట్రాఫిక్ పర్యవేక్షణ వంటివి నిర్వహించటం కూడా జరగొచ్చు.
అలాగే.. స్వయంచాలిత వాహనాలు పరస్పరం సమాచార మార్పిడికి, లైవ్ మ్యాప్‌లు, ట్రాఫిక్ డాటా అధ్యయనం చేస్తూ కదలటానికి కూడా 5జీ నెట్‌వర్క్ కీలకమవుతుంది.
ఇక వ్యక్తిగతంగా చూస్తే.. మొబైల్ గేమ్‌లు ఆడుకునే వాళ్లకి.. ఆ సాఫ్ట్‌వేర్‌లో జాప్యం ఇంకా తగ్గిపోతుంది. మొబైల్ వీడియోలు తక్షణమే డౌన్‌లోడ్, ప్లే అవుతాయి. మధ్యలో స్తంభించిపోవటం వంటి సమస్యలేవీ ఉండబోవు.
వీడియో కాల్స్ మరింత స్పష్టంగా ఉంటాయి. కనెక్టివిటీ సమస్యలేవీ ఉండవు. శరీరం మీద ధరించే ఫిట్‌నెస్ డివైజ్‌లు మన ఆరోగ్యాన్ని నిరంతరం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటాయి. ఎలాంటి అత్యవసర పరిస్థితి ఎదురైనా తక్షణమే డాక్టర్లను అలర్ట్ చేస్తాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది?
చాలా దేశాలు 2020 సంవత్సరం కన్నా ముందే 5జీ సర్వీసులను ప్రారంభించే అవకాశముంది. అయితే.. కతార్‌కు చెందిన ఊరెడూ నెట్‌వర్క్ తాము ఇప్పటికే 5జీ వాణిజ్య సర్వీస్‌ను ప్రారంభించినట్లు చెప్తోంది.
దక్షిణ కొరియా వచ్చే ఏడాది ప్రారంభించాలని ప్రయత్నిస్తోంది. ఆ దేశంలోని మూడు అతి పెద్ద నెట్‌వర్క్ సంస్థలు ఒకేసారి దీనిని ప్రారంభించటానికి అంగీకరించాయి.
చైనా కూడా 2019లో ఈ సర్వీసులను ప్రారంభించటానికి వేగంగా సిద్ధమవుతోంది.
ఇదిలావుంటే.. కొత్త సర్వీసుల విషయంలో మొబైల్ తయారీ సంస్థలతో కలిసి ప్రయోగాలు చేస్తున్న టెలికాం కంపెనీలకు.. స్పెక్ట్రమ్‌ను వేలంవేసి విక్రయించటంలో ప్రపంచ వ్యాప్తంగా నియంత్రణ సంస్థలు బిజీగా ఉన్నాయి.
భారత్‌లోకి ఎప్పుడు వస్తుంది?
మన దేశంలో 3జీ, 4జీ మొబైల్ ఇంటర్నెట్ టెక్నాలజీ ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలకన్నా చాలా ఆలస్యంగానే అందుబాటులోకి వచ్చింది. కానీ 5జీ విషయంలో అలాకానివ్వబోమని బీఎస్‌ఎన్ఎల్ అంటోంది.
ప్రపంచ దేశాలతో పాటే భారత్‌లోనూ అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నామని చెప్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
ఇది ఎలా పనిచేస్తుంది?
ఇందులో పలు రకాల కొత్త టెక్నాలజీలను ఉపయోగిస్తారు. ప్రామాణిక టెక్నాలజీలు పాతవే ఉంటాయి. 3.5 గిగాహెర్ట్జ్ నుంచి 26 గిగాహెర్ట్జ్‌కు మించి ఉండే హయర్ - ఫ్రీక్వెన్సీ బ్యాండ్లకు చాలా సామర్థ్యం ఉంటుంది. కానీ వాటి వేవ్‌లెంగ్త్‌లు తక్కువగానే ఉంటాయి.
ఇందుకోసం.. ఎక్కువ సంఖ్యలో ట్రాన్స్‌మిటర్లు, రిసీవర్ల మధ్య ‘‘మిల్లీమీటర్ వేవ్స్’’ అని పిలిచే ఈ తరంగాలను ట్రాన్స్‌మిట్ చేయటానికి నేలకు దగ్గరగా చిన్నపాటి ఫోన్ ఏంటెనాలు గుంపులు గుంపులుగా కనిపించొచ్చు. దీనివల్ల ఎక్కువ సాంద్రతలో వినియోగానికి వీలుకలుగుతుంది. కానీ ఇది చాలా వ్యయంతో కూడుకున్నది. టెలికామ్ కంపెనీలు ఇంకా పూర్తిస్థాయిలో దీనికి సిద్ధపడలేదు.
4జీ కంటే భిన్నంగా ఉంటుందా?
అవును. ఇది సరికొత్త రేడియో టెక్నాలజీ. కానీ ఆరంభంలో మనకు భారీ స్థాయి హైస్పీడ్ కనిపించకపోవచ్చు. ఎందుకంటే నెట్‌వర్క్ ఆపరేటర్లు తమ కస్టమర్లకు మరింత స్థిరమైన సర్వీస్ అందించే సామర్థ్యం పెంచుకోవటానికి.. ప్రస్తుతమున్న 4జీ నెట్‌వర్క్ మీదే మొదట దీనిని ఆపరేట్ చేసే అవకాశముంది.
ఈ 5జీ టెక్నాలజీని ఆపరేటర్ ఏ స్పెక్ట్రమ్ బ్యాండ్ల మీద నిర్వహిస్తారు, కొత్త మాస్ట్‌లు, ట్రాన్స్‌మిటర్ల మీద ఎంత వెచ్చించారు అనే వాటిమీద మనకు లభించే స్పీడ్ ఆధారపడి ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
ఎంత ఫాస్ట్‌గా ఉంటుంది?
ప్రస్తుతమున్న 4జీ మొబైల్ నెట్‌వర్క్ రంగం.. 1జీబీపీఎస్ (గిగాబైట్ పర్ సెకండ్ = 1,000ఎంబీపీఎస్) వేగాన్ని అందుకోగలమని ఇంకా ఆశావహంగానే ఉన్నప్పటికీ.. వీటిలో అత్యంత వేగవంతమైన నెట్‌వర్క్ ఇప్పుడు సగటున 45ఎంబీపీఎస్ (మెగాబిట్స్ పర్ సెకండ్) అందిస్తోంది.
కొత్త 5జీ నెట్‌వర్క్ వాస్తవ పరిస్థితుల్లో (లాబొరేటరీల పరిశీలన పరిస్థితుల్లో కాకుండా) ఇప్పుడున్న వేగంకన్నా 10 నుంచి 20 రెట్లు అధిక వేగంగా బ్రౌజింగ్, డౌన్‌లోడ్ స్పీడ్లు అందించగలదని చిప్ తయారీ సంస్థ క్వాల్‌కామ్ భావిస్తోంది.
అంటే.. ఒక హైడెఫినిషన్ సినిమా వీడియోని ఒక్క నిమిషంలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ప్రస్తుతమున్న 4జీ ఎల్‌టీఈ నెట్‌వర్క్‌తో పాటు నిర్మించిన 5జీ నెట్‌వర్క్‌లో ఈ వేగం ఉంటుంది. ఇక చాలా అధిక ఫ్రీక్వెన్సీల్లో (ఉదాహరణకు 30జీహెచ్) ఆపరేట్ అయ్యే ప్రత్యేక 5జీ నెట్‌వర్క్‌లో అయితే.. గిగాబైట్ కన్నా అధిక బ్రౌజింగ్ స్పీడ్లు ప్రామాణికంగా ఉంటాయి. కానీ ఇవి అందుబాటులోకి రావటానికి ఇంకొన్నేళ్లు పట్టొచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
మనకు ఈ 5జీ అవసరం ఏమిటి?
ప్రపంచం మొబైల్‌గా మారిపోతోంది. మనం వినియోగించుకుంటున్న డాటా ఏటేటా పెరుగుతోంది. వీడియో, మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్రజాదరణ పెరిగేకొద్దీ డాటా వినియోగం విపరీతంగా పెరుగుతోంది.
ప్రస్తుతమున్న స్పెక్ట్రమ్ బ్యాండ్లు ఇరుకవుతున్నాయి. దీనివల్ల సర్వీసుల్లో అంతరాయాలు కలుగుతున్నాయి. ప్రత్యేకించి ఒకే ప్రాంతంలో చాలా మంది జనం ఒకే సమయంలో ఆన్‌లైన్ మొబైల్ సర్వీసులను యాక్సెస్ కావటానికి ప్రయత్నం చేసినపుడు ఈ సమస్య ఎక్కువగా ఉంది.
5జీ టెక్నాలజీ ఏక కాలంలో వేలాది డివైజ్‌లను.. మొబైల్ ఫోన్లు మొదలుకుని సెన్సార్లు, వీడియో కెమెరాలు, స్మార్ట్ స్ట్రీట్ లైట్ల వరకూ.. చాలా సులభంగా నిర్వహించగలదు.

ఫొటో సోర్స్, Getty Images
5జీ కోసం మనకు కొత్త ఫోను అవసరమా?
అవును. అయితే.. 2009/10 లో 4జీ టెక్నాలజీని ప్రవేశపెట్టినపుడు.. దానికి సంబంధించిన మౌలికసదుపాయాల ఏర్పాటు పూర్తికాకముందే దానికి సరిపడే స్మార్ట్ ఫోన్లు మార్కెట్‌లోకి వచ్చాయి. దీనివల్ల.. నెట్‌వర్క్ సరిగా లేకపోయినా తాము అధిక మొత్తంలో చెల్లిస్తున్నామన్న అసంతృప్తి కొంత వినియోగదారుల్లో వ్యక్తమైంది.
కానీ ఈసారి మొబైల్ ఫోన్ తయారీదారులు అదే పొరపాటు చేయకపోవచ్చునని ఇయాన్ ఫాగ్ అంటారు. కొత్త నెట్‌వర్క్‌లు సిద్ధమైన తర్వాతే.. బహుశా 2019 చివర్లో 5జీ హ్యాండ్‌సెట్లను విడుదల చేయవచ్చు.
ఈ కొత్త తరం ఫోన్లు.. 4జీ, 5జీ నెట్‌వర్క్‌ల మధ్య నిరాటంకంగా మారగలవు. తద్వారా సర్వీస్ మరింత స్థిరంగా ఉంటుంది.
5జీ రాకతో.. ఫిక్స్‌డ్ లైన్ సర్వీసుల కథ ముగుస్తుందా?
కాదు. ఫైబర్ ఆప్టిక్, కాపర్ వైర్ ఫిక్స్‌డ్ లైన్ బ్రాడ్‌బ్యాండ్ కోసం టెలికాం కంపెనీలు చాలా వ్యయం చేశాయి. వాటిని అంత తొందరపడి వదిలేసుకోవు. ఇళ్లు, ఆఫీసుల్లో బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులు ఇంకా చాలా ఏళ్లపాటు ప్రధానంగా ఫిక్సడ్ లైన్ ద్వారానే కొనసాగుతాయి.
వైర్‌లెస్ కనెక్టివిటీ ఎంత మెరుగుపడినా కూడా చాలా మంది.. భౌతికంగా ఉండే వైర్ల ద్వారా లభించే స్థిరత్వం, ఖచ్చితత్వానికే ప్రాధాన్యత ఇస్తారు.
మనం బయటకు వెళ్లినపుడు ప్రపంచంతో అనుసంధానమవటానికి 5జీ మొబైల్ అదనపు సర్వీసులా ఉపయోగపడుతుంది. చాలా కాలంగా ప్రచారంలో ఉన్న ‘‘ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్’’ ఆచరణలోకి రావటానికి ఇది దోహదపడుతుంది.

ఫొటో సోర్స్, Getty Images
5జీ.. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తుందా?
గ్రామీణ ప్రాంతాల్లో సిగ్నల్స్ లేకపోవటం, డాటా స్పీడ్ తక్కువగా ఉండటమనే సమస్యలు, ఫిర్యాదులు భారత్ సహా చాలా దేశాల్లో ఎక్కువగానే ఉన్నాయి. ఈ సమస్యకు 5జీ పరిష్కారం కాబోదు.
ఈ 5జీ టెక్నాలజీ హై-ఫ్రీక్వెన్సీ బ్యాండ్ల మీద నడిచినప్పటికీ.. తక్కువ దూరాలనే కవర్ చేస్తుంది. ఇది ప్రధానంగా పట్టణ ప్రాంత సర్వీసు. జనసాంద్రత అధికంగా ఉండే ప్రాంతాలకు ఉద్దేశించినది.
దూర ప్రాంతాలకు తక్కువ ఫ్రీక్వెన్సీ బ్యాండ్లు (600 - 800 మెగాహెర్ట్జ్) బాగా పనిచేస్తాయి. కాబట్టి నెట్‌వర్క్ ఆపరేటర్లు.. 5జీని అందుబాటులోకి తెస్తూనే.. 4జీ కవరేజీని మెరుగుపరచటం మీద దృష్టి సారిస్తాయి.
కానీ.. వాణిజ్య వాస్తవం ఏమిటంటే బాగా మారుమూల ప్రాంతాల్లోని కొందరు ప్రజలకు నెట్‌వర్క్ కనెక్టివిటీ ఇంకా అంతమాత్రంగానే ఉంటుంది. ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తే కానీ ఆ ప్రాంతాల్లో ఈ సర్వీసులు మెరుగుపడవు.
- తొలిరాత్రి కన్యత్వ పరీక్ష: నెత్తురు కనిపించకపోతే ఆమెకు నరకమే!
- #UnseenLives: వెనక 40 మంది పురుషులున్నా, నేను ఆ మరకను దాచుకోలేదు
- ‘అది భార్యాభర్తల పడక సీన్... అలా నటించడానికి నాకేమీ సిగ్గనిపించలేదు’
- గోరక్షకుడికి వివేకానందుడి ప్రశ్నలు: గోరక్షణ కోసం భిక్షకు వచ్చినపుడు వివేకానందుడు ఏమన్నారంటే..
- కరణ్ థాపర్: ‘మోదీ ముఖంలో కోపం, అడ్వాణీ కళ్లలో నీళ్లు, భుట్టో చూపులో ప్రేమ.. అన్నీ చూశా’
- వీళ్లకు కావల్సింది భార్యలా? లేక బ్యూటీ క్వీన్లు, వంట మనుషులా?
- మాజీ గర్ల్ ఫ్రెండ్, మాజీ బాయ్ ఫ్రెండ్ : బంధాలపై గతాల నీలినీడలు
- తల్లిపాలు ఎంతకాలం ఇస్తే మంచిది.. రెండేళ్లా? ఐదేళ్లా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








