స్నేహానికి సరిహద్దులు లేవని నిరూపించిన చిన్నారులు

ఫొటో సోర్స్, AFP/gettyimages
- రచయిత, ప్రాజక్తా ధులాప్
- హోదా, బీబీసీ ప్రతినిధి
రిషికేశ్ దగ్గర ఉన్న అతిపెద్ద నిధి అతని స్నేహితుడు పంపిన నాలుగు ఉత్తరాలు. ఈ ఉత్తరాలు పాకిస్తాన్‌లో ఉండే సమియుల్లా పంపినవి.
ముంబయిలోని అనుయోగ్ విద్యాలయం విద్యార్థి రిషికేశ్. సమియుల్లా పాకిస్తాన్‌లోని లాహోర్ గ్రామర్ స్కూల్‌లో చదువుతున్నాడు.
ఈ ఇద్దరూ ఉత్తరాల ద్వారా 'పెన్- ఫ్రెండ్స్' అయ్యారు. వాళ్లది ఓ కొత్త ప్రపంచం. వాళ్ల మధ్య 'భారత్', 'పాకిస్తాన్' అనే సరిహద్దులు లేవు.

ఫొటో సోర్స్, ROUTES2ROOTS
పాకిస్తాన్‌లో వడా-పావ్ దొరుకుతుందా?
రిషికేశ్ రాసిన మొదటి ఉత్తరంలో తన గురించి వివరించారు. దానికి సమియుల్లా స్పందించారు. ఉత్తరాల్లో తమ గురించి, తమ కుటుంబాలు, తినే ఆహారం, ఆటలు, అలవాట్ల గురించి చెప్పుకోవడం ద్వారా వారి మధ్య స్నేహం మొగ్గ తొడిగింది.
ముంబయి గురించి, గేట్ వే ఆఫ్ ఇండియా గురించి, ఆలయాల గురించిన వివరాలను, ఫొటోలను రిషికేశ్ పంపేవారు. అటువైపు నుంచి లాహోర్ కోట, బాద్‌షాహి మసీదుల గురించి సమియుల్లా చెప్పేవారు.
ఇద్దరూ పరస్పరం అన్ని రకాల ప్రశ్నలూ వేసుకునేవారు. "పాకిస్తాన్‌లో వడా-పావ్ దొరుకుతుందా?" దగ్గరి నుంచి "హాకీ మీకు కూడా జాతీయ క్రీడేనా?" వరకు.
ఈ ఉత్తరాల మార్పిడి 2016లో ప్రారంభమైంది. 2017లో పాకిస్తాన్‌లోని తన స్నేహితుడ్ని ముఖాముఖిగా కలవాలని హృషికేశ్ నిర్ణయించుకున్నారు. లాహోర్ వెళ్లే అవకాశం దొరికింది. లాహోర్‌లో ఉండే తన స్నేహితుడు సమియుల్లాను కలవబోతున్నందుకు ఆనందపడ్డారు.
ముంబయి నుంచి నాకోసం ఏం తీసుకొస్తావు? అని తన నాలుగో ఉత్తరంలో సమియుల్లా అడిగాడు.
రిషికేశ్ తన తండ్రి సలహాతో ఇద్దరికీ డ్రెస్సులు కుట్టించుకోవాలని నిర్ణయించారు. అందుకు రెండు పఠానీ సూట్లు కుట్టివ్వాలని స్థానిక అబ్బాస్ టైలర్‌ని కోరాడు.
పాస్‌పోర్ట్ వచ్చింది, వీసా ప్రక్రియ పూర్తయింది. టికెట్లు కూడా బుక్ చేశారు. అన్ని ఏర్పాట్లూ అయ్యాక.. ఆ పర్యటనను రద్దు చేసుకోవాల్సి వచ్చింది.
దాంతో, తన 'పెన్- ఫ్రెండ్'ని కలిసి, అతని దేశాన్ని చూసి రావాలనుకున్న రిషికేశ్ కల నెరవేరలేదు.

ఫొటో సోర్స్, ANIYOG VIDYALAY
రిషికేశ్ ఒక్కరే కాదు.. మొత్తం 212 మంది భారతీయ విద్యార్థులు ఇలాగే సరిహద్దుకు అవతల ఉన్న తమ 'కలం-స్నేహితుల'కు లేఖలు రాశారు.
'ఎక్చేంజ్ ఫర్ చేంజ్' అనే ఇచ్చిపుచ్చుకునే కార్యక్రమంలో భాగంగా వెయ్యికి పైగా ఉత్తరాలు అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు ప్రయాణించాయి.
ముంబయిలోని అనుయోగ్ స్కూల్‌కు చెందిన ఉపాధ్యాయులు మనీషా ఘెవెడే ఆ కార్యక్రమం గురించి మాట్లాడుతూ, "రెండు దేశాల్లోనూ హిందీ ఉమ్మడి భాష అయినప్పటికీ మేము ఇంగ్లీషును ఎంచుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే, భారత్‌లో హిందీ లిపి వాడతాం, వాళ్లేమో ఊర్దూ వాడతారు. ఉత్తరాలు రాయడంలో మా పిల్లలు కాస్త ఇబ్బందిపడేవారు. దాంతో, మేము సాయం చేసేవాళ్లం. పిల్లలు వారి సొంత ప్రశ్నలను, ఆలోచనలను ఉత్తరంలో రాసేటప్పుడు చాలా సంతోషపడేవారు. అటువైపు నుంచి స్పందన కోసం ఆసక్తిగా ఎదురుచూసేవారు" అని వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
ఉత్తరాల ద్వారా పరిచయం పెరిగిన తర్వాత, రెండోది పరస్పరం కలుసుకోవడం. అయితే, కొందరు పిల్లలు లాహోర్ వెళ్లేందుకు ఆసక్తి చూపినా, వారి తల్లిదండ్రులు ఒప్పుకునేవారు కాదు.
"హిందూ, ముస్లింల మధ్య మతపరమైన సంబంధాల మీద దృష్టికోణాన్ని మార్చాల్చిన అవసరముంది. ఇలాంటి విషయాల గురించి పిల్లలు ప్రతికూలంగా ఆలోచించడం మొదలుపెట్టకముందే వారిలో సానుకూల దృక్పథాన్ని పెంపొందించే ప్రయత్నం చేయాలి. మేము పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడాం. రెండు కుటుంబాలు తమ పిల్లలను లాహోర్ పంపేందుకు అంగీకరించాయి. విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులం కూడా వెళ్లాల్సి ఉండెను" అని అనుయోగ్ పాఠశాల నిర్వాహకుడు సతీష్ చిందార్కర్ వివరించారు.
సరిహద్దు వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న కారణంగా, బుక్ చేసుకున్న టికెట్లను రద్దు చేసుకోవాలని తమకు ఆందేశాలు వచ్చాయని సతీష్ తెలిపారు.
ఎప్పటికైనా తమ విద్యార్థులను పాకిస్తాన్‌కు తీసుకెళ్తానన్న ఆశాభావంతో ఉన్నారాయన.

ఫొటో సోర్స్, ROUTES2ROOTS
భారత్, పాకిస్తాన్ విద్యార్థులు పరస్పరం తమ గురించి, తమ సంస్కృతుల గురించి తెలుసుకునే అవకాశం కల్పించేందుకు దిల్లీలోని 'రూట్స్2రూట్స్' అనే సంస్థ 2010లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది.
ఏడేళ్లలో ముంబయి, దిల్లీ, డెహ్రాడూన్, లాహోర్, కరాచీ, ఇస్లామాబాద్ నగరాలకు చెందిన 50,000 మందికి పైగా చిన్నారులు 'పెన్- ఫ్రెండ్స్' అయ్యారని ఆ సంస్థ వ్యవస్థాపకులు రాకేశ్ గుప్తా తెలిపారు.
"ఇరువురి సంస్కృతులను, సంప్రదాయాలను పరస్పరం గౌరవించుకుంటే.. శాంతిని నెలకొల్పడం అనేది పెద్ద సమస్యేమీ కాదు. ద్వేష భావాన్ని, వైరాన్ని చిన్నారుల మెదళ్ల నుంచి దూరం చేయాలి. ఇతరుల దేశాన్ని గౌరవించేలా చిన్నతనంలోనే నేర్పించాలి. భారత్, పాకిస్తాన్ మధ్య స్నేహపూర్వక బంధానికి కావాల్సింది ఇదే" అని రాకేశ్ గుప్తా అభిప్రాయపడ్డారు.
అయితే, 'ఎక్చేంజ్ ఫర్ చేంజ్' కార్యక్రమాన్ని ఆపేయాల్సిరావడం ఆయన్ను తీవ్ర నిరాశపరిచింది.

ఫొటో సోర్స్, ROUTES2ROOTS
ఈ కార్యక్రమంలో భాగంగా లాహోర్‌కు చెందిన 60 మంది విద్యార్థులు భారత్‌ను సందర్శించారు. తమ టీచర్లతో కలిసి దిల్లీలో 2 రోజులు గడిపిన తర్వాత తాజ్ మహల్‌ను కూడా చూసి వచ్చారు.
"గత ఏడేళ్లలో చిన్నారులను భారత్ నుంచి పాకిస్తాన్‌కు తీసుకెళ్లాం, అటు నుంచి భారత్‌కు తీసుకొచ్చాం. అందుకు రెండు దేశాల ప్రభుత్వాలు, అధికారులు మాకు చాలా సాయపడ్డారు. కానీ, గత ఏడాది పాకిస్తాన్ పిల్లలను వెంటనే వెనక్కి పంపించేయాలని భారత హోంశాఖ మమ్మల్ని ఆదేశించింది. దాంతో, ఆ చిన్నారులు టూర్‌ని మధ్యలోనే ముగించుకుని వెనక్కి వెళ్లాల్సి వచ్చింది" అని గుప్తా గుర్తుచేశారు.
లాహోర్ విద్యార్థులు భారత్‌లోని తమ స్నేహితులను కలుసుకోలేకపోవడానికి ఇదే కారణం.
"ఎన్నో ప్రయత్నాల తర్వాత భారత్, పాకిస్తాన్ విద్యార్థుల మధ్య స్నేహం ఏర్పడింది. మళ్లీ అలాంటిది జరగాలంటే సులువైన పని కాదు" అంటారు రాకేశ్.
ప్రస్తుతం రిషికేశ్ పదో తరగతి చదువుతున్నాడు. తన ఆలోచనలను పాకిస్తాన్ స్నేహితుడితో ఎలా పంచుకునేవాడో వివరించాడు.
"ఇప్పటికీ ఏదో ఒక రోజు నేను పాకిస్తాన్ వెళ్లి సమియుల్లాను కలుస్తాన్న ఆశ ఉంది. సమియుల్లా నన్ను గుర్తుపడతాడో లేదో చెప్పలేను. ఎందుకంటే అప్పటి నుంచి మేం టచ్‌లో లేము. కానీ, ఇప్పటికీ అతన్ని కలవాలని ఉంది. అతడు నా ఫ్రెండ్."
ఇవి కూడా చదవండి:
- పాకిస్తాన్ అణుకేంద్రం గుట్టు ‘రా’ ఎలా కనిపెట్టింది?
- బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడగడలాడించిన తండ్రీకూతుళ్లు
- ఇదో 'టైపు' కళ: ఈయన చిత్రాలను ఎలా టైప్ చేస్తున్నారో చూడండి
- పగలు లాయర్లు... రాత్రుళ్లు బార్లో ‘డ్రాగ్’ డాన్సర్లు
- సోషల్: అద్దె ఇంటికి ఎవరైనా అద్దె కట్టాల్సిందే కదా, మరి కులం అడగడం ఎందుకు?
- BBC Special: కాళేశ్వరం ప్రాజెక్టు పర్యటక ప్రాంతంగా ఎందుకు మారింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









