మోన్‌సాంటోకి రూ.1,996 కోట్ల జరిమానా: భారత్‌లోనూ భారీగా 'కేన్సర్ కారక' గ్లైఫోసేట్ వాడకం

ఫొటో సోర్స్, AFP
పురుగు మందులు, విత్తన తయారీ సంస్థ 'మోన్‌సాంటో' 289 మిలియన్ డాలర్ల (భారత కరెన్సీలో రూ. 1,996 కోట్లకు పైనే) పరిహారం చెల్లించాలని అమెరికాలోని కాలిఫోర్నియా కోర్టు తీర్పునిచ్చింది. మోన్‌సాంటోకు చెందిన కలుపు నివారణ మందులోని 'గ్లైఫోసేట్' రసాయనం వల్ల తనకు కేన్సర్ వచ్చిందంటూ ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో కాలిఫోర్నియా కోర్టు పై విధంగా తీర్పు వెలువరించింది.
తన కలుపు నివారణ ఉత్పత్తులు రేన్జర్ ప్రో, రౌండ్‌అప్ మందులు ప్రమాదకరమైనవని తెలిసినా, వినియోగదారులను హెచ్చరించడంలో మోన్‌సాంటో విఫలమైందని కోర్టు భావించింది.
కేన్సర్‌కు గ్లైఫోసేట్ రసాయనానికి సంబంధం ఉందన్న ఆరోపణలతో.. కోర్టులో విచారణ దశకు వెళ్లిన మొట్టమొదటి కేసు ఇదే. కానీ గ్లైఫోసేట్‌తో కేన్సర్ వస్తుందన్న ఆరోపణలను మోన్‌సాంటో ఖండించింది. కోర్టు తీర్పును సవాలు చేస్తూ పైకోర్టుకు వెళ్తామని ఆ సంస్థ వెల్లడించింది.
''కోర్టు విషయాన్ని తప్పుగా అర్థం చేసుకుంది'' అని ఆ సంస్థ ఉపాధ్యక్షుడు స్కాట్ పార్ట్‌రిడ్జ్ అన్నారు.
అమెరికా వ్యాప్తంగా 5 వేల మందికి పైగా దాదాపు ఇలాంటి అంశాల్లోనే కోర్టును ఆశ్రయించారు.
ఈ కేసు వేసిన వ్యక్తి పేరు డేవాన్ జాన్సన్. వైద్య పరీక్షల్లో అతనికి ‘నాన్-హాడ్జ్‌కిన్ లింఫోమా’ ఉన్నట్లు 2014లో నిర్ధరణ అయ్యిందని.. అతడు తాను పని చేసే స్కూలులో 'రేన్జర్ ప్రో' మందును వాడేవారని అతని తరఫు లాయర్లు తెలిపారు.

ఫొటో సోర్స్, REUTERS
భారత్‌లో గ్లైఫోసేట్ వాడకం..
జన్యు మార్పిడి (జీఎం) పంటలను ప్రవేశపెట్టిన నాటి నుంచి ప్రపంచవ్యాప్తంగా గ్లైఫోసేట్ వాడకం 1,500 శాతం పెరిగిందని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్‌కు చెందిన డౌన్‌టుఎర్త్ వెల్లడించింది.
భారత్‌లోనూ ఈ మందు వినియోగం భారీగానే ఉంది.
ఈ రసాయనం పిచికారీ చేసిన చోట కలుపు మొక్కలు కొన్ని రోజుల్లోనే భగ్గున మాడిపోతాయి. వేర్లతో సహా నాశనమవుతాయి. ఉద్యాన పంటతో పాటు, కొన్ని వర్షాధార పంటల్లో కూలీల ఖర్చు తగ్గించుకునేందుకు కొందరు రైతులు ఈ మందు వైపు మొగ్గు చూపుతారు.
"మేము దాదాపు పదేళ్ల నుంచి పండ్ల తోటలో కలుపు నివారణ కోసం గ్లైఫోసేట్‌ను వాడేవాళ్లం. ఎరువుల దుకాణంకు వెళ్లి, కలుపుమందు కావాలంటే.. ఇచ్చేవారు. నీటిలో ఈ మందుతో పాటు, యూరియా కలిపి పిచికారి చేయాలని సూచిస్తారు. కలుపు తీసేందుకు కూలీలను పెడితే వేల రూపాయలు ఖర్చవుతాయి. అంతేకాకుండా మొలక దశలో ఉన్న కలుపు మొక్కలను చేతితో పీకేయాలంటే సాధ్యం కాని పని. అదే ఈ మందు చల్లితే.. కొంచెం తక్కువ ఖర్చుతోనే పెద్ద మొక్కలతో పాటు, అప్పుడప్పుడే బయటకొస్తున్న పిలకలు కూడా మాడిపోతాయి. వయ్యారి భామ లాంటి మొండి మొక్కలు కూడా వారం రోజుల్లోనే చనిపోతాయి. ఈ మందు వివిధ కంపెనీల పేర్లతో దొరుకుతుండేది. అయితే.. కొన్ని నెలలుగా మేము దాన్ని వాడలేదు" అని నల్లగొండ జిల్లాకు చెందిన పరమేశ్ అనే రైతు వివరించారు.

ఫొటో సోర్స్, AFP
తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు
అయితే.. వ్యవసాయ అధికారుల సిఫారసు లేకుండా గ్లైఫోసేట్‌ను డీలర్లు అమ్మడానికి వీళ్లేదని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ కమిషనర్ జగన్ మోహన్ బీబీసీతో చెప్పారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నోటీసు జారీ చేసిందని తెలిపారు.
విత్తనాలు వేయని భూముల్లో గ్లైఫోసేట్ చల్లాలనుకున్నాసరే.. వ్యవసాయ అధికారుల అనుమతులు తప్పనిసరని ఆయన అన్నారు.
ఈ ఏడాది జూలై 10 నుంచి ఆ ఆదేశాలు అమల్లోకి వస్తున్నాయని తెలంగాణ వ్యవసాయశాఖ జారీ చేసిన సర్క్యులర్‌లో వివరించారు. అంతకు ముందు ఆంధ్రప్రదేశ్, మహరాష్ట్రలోనూ ఇలాంటి నిబంధనలు వచ్చాయి.
రాష్ట్రంలో గ్లైఫోసేట్ 20.2% ఎస్‌ఎల్, గ్లైఫోసేట్ 41% ఎస్‌ఎల్ మందులను అమ్మవద్దని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మందును వాడకుండా రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా, మండల స్థాయి అధికారులకు సూచించింది. తేయాకు తోటల్లో, పంటలు సాగు చేయని ప్రాంతాల్లో వాడే కలుపు నివారణ మందుగా మాత్రమే గ్లైఫోసేట్ నమోదై ఉందని వివరించింది.
ఈ అంశంపై మోన్‌సాంటో ప్రతినిధి అరుణ్ గోపాల కృష్ణన్ బీబీసీతో మాట్లాడుతూ.. తెలంగాణలో గ్లైఫోసైట్‌ను అడ్డగోలుగా వాడటం వల్ల ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చన్నారు.

ఫొటో సోర్స్, TELANGANA Agriculture Dept.
గ్లైఫోసేట్ కేన్సర్ కారకమా?
'గ్లైఫోసేట్ అన్నది కేన్సర్ ప్రేరక రసాయనం' కావచ్చు అని 2015లో ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన అంతర్జాతీయ కేన్సర్ పరిశోధనా సంస్థ తెలిపింది. అయితే.. పిచికారీ చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదమేమీ ఉండదని అమెరికా పర్యావరణ పరిరక్షణ సంస్థ (ఈపీఎ) వెల్లడించింది.
గ్లైఫోసేట్ వల్ల మనుషుల్లో కేన్సర్‌కు కారణమయ్యే అవకాశం లేదని యూరోపియన్ ఫుడ్ సేఫ్టీ అథారిటీ (ఈఎఫ్‌ఎస్‌ఎ) చెబుతోంది.
ఈ విషయంలో ప్రపంచవ్యాప్తంగా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.
ఈ మందు వాడకాన్ని నిషేధించాలంటూ ఓటేసిన దేశాల్లో ఫ్రాన్స్, బెల్జియం, శ్రీలంక ఉన్నాయి.
గ్లైఫోసేట్‌ను మూడేళ్లలోగా నిషేధించాలని గతేడాది ఫ్రాన్స్ నిర్ణయించింది. మూడేళ్లలోగా ఎంత త్వరగా ప్రత్యామ్నాయం కనుగొంటే, అంత త్వరగా గ్లైఫోసేట్‌ను నిషేధించాలంటూ 2017 నవంబర్‌లో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రాన్ ట్వీట్ చేశారు.
ఈ రసాయనంపై 2015లో శ్రీలంక నిషేధం విధించింది. కొలంబియాలో ఎత్తు నుంచి పిచికారీ చేయడంపై నిషేధం ఉంది.
బ్రిటన్, జర్మనీ, పోలాండ్ తదితర దేశాలు మాత్రం ఈ మందుకు అనుకూలంగా ఓటేశాయి.
గ్లైఫోసేట్ చల్లితే మంచి మొక్కలు కూడా చనిపోతాయన్న కారణంతో పార్కుల్లో, గార్డెన్లలో దాని వాడకాన్ని కొన్ని దేశాలు, రాష్ట్రాలు నిషేధించాయి.

ఫొటో సోర్స్, Getty Images
తాజా వివాదంపై బీబీసీ ఉత్తర అమెరికా ప్రతినిధి జేమ్స్ కుక్ విశ్లేషణ
గ్లైఫోసేట్ రసాయనం ప్రపంచంలో చాలా సాధారణమైన కలుపు నివారణ మందు. 2015లో అంతర్జాతీయ కేన్సర్ పరిశోధనా సంస్థ గ్లైఫోసేట్ అన్నది 'కేన్సర్ ప్రేరక రసాయనం' కావచ్చు.. అని పేర్కొంది. కానీ అమెరికా పర్యావరణ పరిరక్షణ సంస్థ(ఈపీఏ) మాత్రం, జాగ్రత్తగా వాడితే గ్లైఫోసేట్ వల్ల ప్రమాదం లేదని నొక్కిచెప్పింది.
అయితే.. ఈపీఏ నిర్ణయాన్ని పారిశ్రామిక వర్గాలు ప్రభావితం చేశాయని సామాజిక కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.
ప్రభుత్వ అధికారులు, మోన్‌సాంటో సంస్థతో చేతులు కలిపారన్న ఆరోపణలపై న్యాయ విచారణ జరిపించాలని కొందరు డెమోక్రాట్లు గతంలో కోరారు.

ఫొటో సోర్స్, AFP
ఈ మధ్యకాలంలో.. కాఫీపై కూడా కేన్సర్ హెచ్చరిక గుర్తు ముద్రించాలని కాలిఫోర్నియాలోని ఒక కోర్టు ఆదేశించింది.
కాలిఫోర్నియా ప్రభుత్వం పేర్కొన్న కేన్సర్ కారకాల జాబితాలో గ్లైఫోసేట్ కూడా ఉంది. కానీ, దానిపై కేన్సర్ కారకం అనే గుర్తును ముద్రించకుండా ఉండేందుకు తయారీదారులు కోర్టును ఆశ్రయించారు.
అటు యూరప్ దేశాల్లో కూడా గ్లైఫోసేట్‌పై యుద్ధం జరుగుతోంది. ఫ్రాన్స్‌లో ప్రజాప్రతినిధుల నుంచి గ్లైఫోసేట్‌పై పెద్దఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మాక్రన్ కూడా ఈ రసాయనాన్ని నిషేధించాలని ప్రయత్నిస్తున్నారు. మరోవైపు యూరోపియన్ కమీషన్, ఈ రసాయనానికి అనుమతిని మరో 5 ఏళ్ల పాటు పొడిగించింది.

ఫొటో సోర్స్, AFP
తాజా కోర్టు తీర్పుపై మోన్‌సాంటో స్పందిస్తూ.. ''ఈ రోజు వెలువడిన కోర్టు తీర్పు 800 మందికి పైగా శాస్త్రవేత్తల అధ్యయనాలను, సమీక్షలను మార్చలేదు. అమెరికా పర్యావరణ పరిరక్షణ సంస్థ, అమెరికా జాతీయ ఆరోగ్య మరియు నియమావళి సంస్థ, ప్రపంచంలోని ఇతర సంస్థలు గ్లైఫోసేట్ వల్ల కేన్సర్ రాదని ఇదివరకే తేల్చి చెప్పాయి'' అని వివరించింది.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








