టిప్పుపై ఇప్పుడెందుకు అంత ద్వేషం?

ఫొటో సోర్స్, Thinkstock
- రచయిత, ఉసతుల్లా ఖాన్
- హోదా, బీబీసీ కోసం
టిప్పు సుల్తాన్ ఆస్థానంలో చాలా మంది హిందువులకు కీలకబాధ్యతలు కట్టబెట్టారు.
టిప్పు హోంమంత్రి షమయ్యా అయ్యంగార్. ఢిల్లీ మొఘల్ ఆస్థానంలో మైసూర్ ప్రతినిధులు మూల్‌చంద్, దీవాన్ రాయ్. టిప్పు రాజ్యంలో దీవాన్ పూర్ణయ్య.
టిప్పుకు పూర్ణయ్యపై ఎంత నమ్మకమంటే, తాను మరణించే ముందు ఆయన తన కుమారుడి చేతిని పూర్ణయ్య చేతిలో పెట్టి మరణించాడు.
ఇప్పుడు కొత్తగా ప్రచారంలో ఉన్న సిద్ధాంతం ప్రకారం.. టిప్పు మైసూర్‌లో 8 వేల హిందూ ఆలయాలను నేలమట్టం చేశాడు.
మరి తన సొంత రాజప్రాసాదానికి దగ్గరలో ఉన్న రంగనాథ స్వామి ఆలయాన్ని మాత్రం టిప్పు ఎలా మర్చిపోయాడు?

ఫొటో సోర్స్, BONHAMS
టిప్పుకు హిందూ మతం అంటే ద్వేషమా?
టిప్పు కోటలో పది రోజుల పాటు దసరా ఉత్సవాలను జరుపుకొనేవారు. ఆయన మరణించాక కూడా ఈ సంప్రదాయం కొనసాగుతోంది.
రికార్డుల ప్రకారం, టిప్పు ప్రభుత్వం ఏటా 158 ఆలయాలకు వితరణ ఇచ్చేది. భూమాన్యాలు కూడా ఇచ్చింది.
1791లో పేష్వా మాధవరావుకు చెందిన మరాఠా సైన్యం శృంగేరీ మఠాన్ని ముట్టడించడంతో.. శంకారాచార్య టిప్పుకు 30 ఉత్తరాలు రాశారు.
మఠానికి కావాల్సిన ధనసహాయం చేసి, దానిని పునరుద్ధరించడానికి మనుషులను పంపాడు టిప్పు.
ఆ ఉత్తరాలు ఇప్పటికీ మైసూర్ ఆర్కియాలజీ విభాగం వద్ద భద్రంగా ఉన్నాయి.

ఫొటో సోర్స్, TWITTER
గతాన్ని మర్చిపోయారా?
కోలార్‌లోని మూకాంబికా ఆలయంలో ఇప్పటికీ ఉదయం 7.30 గంటలకు టిప్పు పేరుతో ప్రార్థనలు ప్రారంభిస్తారు.
సుమారు రెండు వందల ఏళ్లుగా అమ్మమ్మలు, నాన్నమ్మలు టిప్పు గీతాలను పాడుతున్నారు. కనీసం వాటినైనా ఆపేయించగలరా?
పోనీ దాన్నంతా మర్చిపోదాం. 70వ దశకంలో కర్ణాటక ఆర్‌ఎస్‌ఎస్ శాఖ 'భారత్ భారతి' పేరిట కొన్ని పుస్తకాలను విడుదల చేసింది. దానిలో టిప్పు సుల్తాన్ పేరిట ఒక పుస్తకాన్ని ప్రచురించారు.

ఫొటో సోర్స్, Getty Images
కర్ణాటక మొదటి బీజేపీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప 2012లో కర్ణాటక జనతా పార్టీ పేరిట కొత్త పార్టీని ఏర్పాటు చేశారు.
ఆ సందర్భంగా ఆయన టిప్పు లాంటి తలపాగా ధరించి, అలాంటి ఖడ్గాన్నే చేతబూని.. లక్షలాది మంది హిందువులను హత్య చేశారని చెబుతున్న టిప్పు సుల్తాన్‌ను గౌరవించారు.
కానీ 2014లో యడ్యూరప్ప తిరిగి బీజేపీలో చేరిన నాటి నుంచి టిప్పు పేరు వినడానికి కూడా ఇష్టపడ్డం లేదు.
తాజాగా కేంద్ర మంత్రి అనంత్ కుమార్ హెగ్డే టిప్పు సుల్తాన్ జయంతిని నిర్వహించి, కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం హిందువుల పుండుపై కారం చల్లుతోందని ఆరోపించారు.
మరి టిప్పు నుంచి భారత దేశాన్ని రక్షించాడని బీజేపీ వచ్చే ఏడాది నుంచి లార్డ్ కార్న్‌వాలిస్ జయంతిని జరుపుకుంటుందో ఏమో!
మా ఇతర కథనాలు:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








