అనధికారిక ఖాతాల ఏరివేతలో ఫేస్‌బుక్, ట్విటర్

ఫొటో సోర్స్, Reuters
ఇరాన్, రష్యా దేశాలకు చెందిన అనధికారిక, తప్పుదోవ పట్టించే అకౌంట్లను తొలగించినట్లు ఫేస్‌బుక్, ట్విటర్ ప్రకటించాయి. అనధికారిక, మోసపూరిత అంశాల ప్రామాణికంగా ఈ అకౌంట్లను తొలగించినట్లు ఆ సంస్థలు తెలిపాయి.
ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ ప్రకారం.. ఇలాంటి తప్పుదోవపట్టించే 650కుపైగా ఫేస్‌బుక్ పేజీలు, గ్రూపులను గుర్తించారు. ఇరాన్‌కు చెందినట్లు స్పష్టమైన ఆధారాలున్న 284 అకౌంట్లను రద్దు చేసినట్లు ట్విటర్ తెలిపింది.
అమెరికా రాజకీయ సంస్థలపై రష్యన్ హ్యాకర్లు చేసిన సైబర్ దాడులను అడ్డుకున్నామని మైక్రోసాఫ్ట్ ప్రకటించిన మరుసటి రోజే.. ఫేస్‌బుక్, ట్విటర్ ఈ ప్రకటన చేశాయి.
నెలల దర్యాప్తు అనంతరం మంగళవారం రష్యా, ఇరాన్ దేశాలకు చెందిన ఉద్యమాలు, ప్రచార కార్యక్రమాలతో సంబంధం ఉన్న అనధికారిక అకౌంట్లను గుర్తించామని ఫేస్‌బుక్ తెలిపింది.
''విశ్వసనీయత కోసమే ఫేస్‌బుక్‌లో ఇలాంటి ప్రవర్తనను నిషేధించాం. ఫేస్‌బుక్ యూజర్లు.. తాము స్నేహం చేస్తున్న వ్యక్తులను నమ్మగలిగేలా ఉండాలి'' అని ఆ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.
ఇలాంటి అనధికారిక అకౌంట్ల ద్వారా జరుగుతున్న ప్రచారం మధ్యప్రాచ్య దేశాలు, లాటిన్ అమెరికా, ఇంగ్లండ్, అమెరికా ప్రజలను లక్ష్యంగా చేసుకున్నట్లు ఫేస్‌బుక్ తెలిపింది. మరోవైపు.. తమ దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని స్పష్టం చేసింది.

ఫొటో సోర్స్, Getty Images
ఈ అకౌంట్లను ఎలా గుర్తించారు?
సోషల్ మీడియాలోని అనేక ఖాతాలు.. ఇరాన్‌కు చెందిన విషయాలను ప్రచారం చేస్తున్నాయని సైబర్ సెక్యూరిటీ సంస్థ 'ఫైర్ ఐ' తెలిపింది. ఈ విషయం ఆధారంగా ఫేస్‌బుక్, ట్విటర్ సంస్థలు తమ పని ప్రారంభించాయి.
76 ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలతోపాటు కొన్ని ఫేస్‌బుక్ పేజీలకు ఇరాన్ ప్రభుత్వ మీడియా సంస్థతో సంబంధం ఉందని, రష్యాకు చెందిన కొన్ని అనుమానిత ఖాతాలను కూడా గుర్తించామని ఫేస్‌బుక్ తెలిపింది.
ఈ ఖాతాల ద్వారా 2011 నాటి మధ్యప్రాచ్య రాజకీయాలకు చెందిన అరబిక్, ఫార్సి భాషల్లోని వీడియోలను ప్రచారం చేస్తూ, అమెరికా, ఇంగ్లండ్ దేశాల రాజకీయాలకు చెందిన సమాచారాన్ని ఇంగ్లిష్ భాషలో కూడా షేర్ చేస్తున్నారని ఫేస్‌బుక్ పేర్కొంది.
గతంలో.. రష్యా మిలిటరీ నిఘా సంస్థకు చెందిన ఒక ఫేస్‌బుక్ ఖాతాను అమెరికా ప్రభుత్వం గుర్తించింది. ఆ ఖాతాతో సంబంధం ఉన్న తక్కిన ఖాతాలను కూడా రద్దు చేసినట్లు ఫేస్‌బుక్ ప్రకటించింది.
తమ దర్యాప్తులో తేలిన విషయాలను అమెరికా, ఇంగ్లండ్ ప్రభుత్వాలకు కూడా అందించినట్లు చెప్పింది.

ఫొటో సోర్స్, Getty Images
అంతకు ముందు ఏం జరిగిందంటే..
- అమెరికా రాజకీయ సంస్థలు ఇంటర్నేషనల్ రిపబ్లికన్ ఇన్‌స్టిట్యూట్, హడ్సన్ ఇన్‌స్టిట్యూట్ థింక్ ట్యాంక్‌ల నుంచి సమాచారాన్ని దొంగలించడానికి రష్యా హ్యాకర్లు ప్రయత్నించారని, కానీ ఈ సైబర్ దాడిని తాము విజయవంతంగా ఎదుర్కొన్నామని మైక్రోసాఫ్ట్ తెలిపింది.
- ఈ దాడుల వెనుక ఫ్యాన్సీ బేర్స్ హ్యాకింగ్ సంస్థ హస్తం ఉన్నట్లు మైక్రోసాఫ్ట్ పేర్కొంది.
- అంతకు నెల రోజుల ముందు.. హిల్లరీ క్లింటన్, డెమొక్రటిక్ పార్టీ ఉపయోగించిన కంప్యూటర్లను హ్యాక్ చేశారంటూ రష్యా నిఘా సంస్థకు చెందిన 12 మందిపై అమెరికా కేసు నమోదు చేసింది.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








