సోహ్రబుద్దీన్ ఎన్‌కౌంటర్ కేసు: నిందితులందరికీ విముక్తి... సీబీఐ వద్ద సరైన ఆధారాల్లేవన్న ప్రత్యేక న్యాయస్థానం

సోహ్రబుద్ధీన్ షేక్ చనిపోయిన 13ఏళ్ల తర్వాత ముంబయిలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తీర్పు వెలువరించింది.
గుజరాత్, రాజస్థాన్ పోలీసులకు వాంటెడ్ క్రిమినెల్‌గా ఉన్న సోహ్రబుద్దీన్‌ను పోలీసులు 2005 నవంబరులో ఎన్‌కౌంటర్‌లో కాల్చి చంపారు. కానీ, అది నకిలీ ఎన్‌కౌంటర్ అని సీబీఐ ఆరోపించింది.
ఈ కేసులో కుట్ర కోణాన్ని నిరూపించేందుకు తగిన ఆధారాలు లేవని, సీబీఐ సమర్పించిన ఆధారాలు సంతృప్తికరంగా లేవని న్యాయమూర్తి జేఎస్ శర్మ అన్నారు.
‘‘చనిపోయిన ముగ్గురి కుటుంబాల పట్ల నాకు జాలి కలుగుతోంది. కానీ, నేను చేయగలిగింది ఏమీ లేదు. తన ముందుకు తీసుకువచ్చిన ఆధారాలను బట్టే న్యాయస్థానం పనిచేస్తుంది. దురదృష్టవశాత్తూ (ఈ కేసులో) ఆధారాలు లేవు’’ అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.
సీబీఐ చెప్పేదాని ప్రకారం... ఆ రోజు సోహ్రబుద్దీన్, అతడి భార్య కౌసర్‌బీ బస్సులో హైదరాబాద్ నుంచి మహారాష్ట్రలోని సంగ్లీకి ప్రయాణిస్తున్నారు. మార్గమధ్యలో గుజరాత్, రాజస్థాన్ పోలీసులు అతడిని అడ్డగించి, తీసుకెళ్లి గాంధీనగర్ దగ్గర కాల్చి చంపారు. కౌసర్‌బీని చంపడానికి ముందు ఒక ఎస్‌ఐ ఆమెను రేప్ చేశాడని కూడా ఆరోపణలు ఎదురయ్యాయి.
ఈ ఫేక్ ఎన్‌కౌంటర్ కేసులో ప్రత్యక్ష సాక్షిగా ఉన్న సోహ్రబుద్దీన్ అనుచరుడు తుల్సీ ప్రజాపతిని 2006 డిసెంబరులో గుజరాత్‌లోని బనస్కాంతా జిల్లాలో గుజరాత్, రాజస్థాన్ పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారని సీబీఐ ఆరోపిస్తోంది.
ఈ నకిలీ ఎన్‌కౌంటర్లలో భాగస్వాములుగా ఉన్నారని సీబీఐ ఆరోపించిన 38మందిలో 16మందికి ఇప్పటికే ఈ కేసు నుంచి విముక్తి లభించింది. వాళ్లలో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కూడా ఉన్నారు. ఎన్‌కౌంటర్ జరిగిన సమయంలో ఆయన గుజరాత్ హోం మంత్రిగా ఉండేవారు. ఆయనతో పాటు డీజీ వంజారా లాంటి మాజీ ఐపీఎస్ అధికారులు కూడా కేసు నుంచి బయటపడ్డారు.

ప్రస్తుతం 22 మంది నిందితులు కేసు విచారణను ఎదుర్కొంటున్నారు. వాళ్లలో గుజరాత్, రాజస్థాన్‌లకు చెందిన పోలీస్ అధికారులే ఎక్కువమంది ఉన్నారు.
నాటి డీఐజీ వంజారాతో సహా అనేకమంది సీనియర్ అధికారుల పేర్లను సీబీఐ తన ఛార్జ్ షీట్‌లో చేర్చింది.
గతంలో సీఆర్‌పీసీ సెక్షన్ 313 కింద తమ వాంగ్మూలాన్ని రికార్డు చేస్తూ సీబీఐ తమను కావాలనే ఈ కేసులో ఇరికిస్తోందని చాలామంది నిందితులు పేర్కొన్నారు. సెక్షన్ 313 ప్రకారం సాక్ష్యాలను పరిశీలించాక నిందితులకు తమ వాంగ్మూలాన్ని ఇచ్చేందుకు మరో అవకాశం కల్పిస్తారు.
రాజస్థాన్‌కు చెందిన నాటి ఇన్‌స్పెక్టర్ అబ్దుల్ రెహ్మాన్, సోహ్రబుద్దీన్‌ను కాల్చారని సీబీఐ చెబుతోంది. కానీ రెహ్మాన్ ఆ ఆరోపణతో పాటు, సోహ్రబుద్దీన్ కేసులో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశాడనే అభియోగాన్నీ ఖండించారు. మరోపక్క ప్రజాపతి ఎన్‌కౌంటర్ కేసులో విచారణ ఎదుర్కొంటోన్న ఆశిష్ పాండ్య.. వృత్తిలో భాగంగా ఆత్మ రక్షణ కోసమే తుపాకీ పేల్చినట్లు కోర్టులో చెప్పారు.
‘ఆ ఎన్‌కౌంటర్ నకిలీది కాదు. నేను ఆత్మరక్షణ కోసమే ట్రిగ్గర్ నొక్కాను. విధుల్లో భాగంగానే ఆ పని చేశాను’ అని ఆశిష్ చెప్పారు. నాడు గుజరాత్‌లో ఇన్‌స్పెక్టర్‌గా ఉన్న ఆశిష్, ప్రజాపతి కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందంలో సభ్యుడు.

మొదట ఈ ఎన్‌కౌంటర్ కేసును గుజరాత్ సీఐడీ విచారించింది. తరువాత 2010లో అది సీబీఐకి బదిలీ అయింది. విచారణ క్రమంలో న్యాయస్థానం 210 మంది సాక్షుల వాంగ్మూలాన్ని సేకరించింది. వాళ్లలో 91మంది సీబీఐకి వ్యతిరేకంగా వాంగ్మూలం ఇచ్చారు.
అయితే ఈ కేసు తమకు ఎన్‌కౌంటర్ జరిగిన ఐదేళ్ల తరువాత అప్పగించారని, అప్పటికే అందులో చాలా లొసుగులున్నాయని సీబీఐ తరఫు న్యాయవాది బీపీ రాజు అన్నారు. ఐదేళ్ల తరువాత సీబీఐ రంగంలోకి దిగితే, 12 ఏళ్ల తరువాత సాక్షుల, సాక్ష్యాల పరిశీలన మొదలైందని, అందుకే విచారణలో కొన్ని 'ఖాళీలు’ కనిపిస్తున్నాయని ఆయన కోర్టుకు చెప్పారు.
కొందరు ముఖ్య సాక్షులు కూడా కేసు విచారణ సమయంలో తమకు వ్యతిరేకంగా మారారని, దాని వల్ల సీబీఐ విచారణలో అవరోధాలు ఏర్పడ్డాయని రాజు అన్నారు. ఆయన మాటలకు న్యాయమూర్తి స్పందిస్తూ, ‘నేను సీబీఐని నిందించను. సీఐడీని నిందించను. ఇక్కడ వాంగ్మూలాలు, సాక్ష్యాలు ఉన్నాయి. సాక్షులు ఇక్కడికి వచ్చి ఏమీ చెప్పకపోతే అది మీ తప్పు కాదు. మీరు మీ పని చేశారు’ అని అన్నారు.
కేసులో విచారణ పారదర్శకంగా సాగేందుకు సీబీఐ కోరిక మేరకు 2012 సెప్టెంబరులో కేసును ముంబైకి బదిలీ చేశారు. 2013లో సోహ్రబుద్దీన్, కౌసర్ బీ, ప్రజాపతి ఎన్‌కౌంటర్ కేసులను ముంబైకి బదిలీ చేయమని సుప్రీం కోర్టు సూచించడంతో నాటి నుంచి ఆ మూడు కేసులను కలిపి విచారించడం మొదలుపెట్టారు.
ఇవి కూడా చదవండి
- ‘‘అమిత్ షాపై కేసును తిరగదోడాలి’’
- అమిత్ షా సుప్రీంకోర్టుకు వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడుతున్నారు?
- అమిత్ షా నిందితుడుగా ఉన్న కేసు విచారణ చేస్తున్న జడ్జి మృతిపై అనుమానాలు
- ఈజిప్ట్ సమాధిలో హిందూ దేవతల విగ్రహాలు దొరికాయా
- బ్రిటన్ను అధిగమించి 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనున్న భారత్
- నీళ్ళ లోపల చూడగలరు, చలికి వణకరు, ఎత్తులంటే ఏమాత్రం భయపడరు...
- ఏదైనా సరే... 20 గంటల్లోనే నేర్చుకోవడం ఎలా
- నన్ను స్పీకర్ లేని టీవీ అంటూ విమర్శలు చేశారు : మిస్ డెఫ్ ఆసియా నిష్టా
- ‘‘కొన్ని నెలలు కోమాలో ఉన్నా.. రెండు సార్లు ఉరివేసుకున్నా’’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








