ఏదైనా సరే 20 గంటల్లోనే నేర్చుకోవడం ఎలా?

ఫొటో సోర్స్, Getty Images
లెక్కల్లో చిక్కుముడులను విప్పాలనుకుంటున్నారా... రష్యన్ భాషలో మాట్లాడాలనుకుంటున్నారా... కెమిస్ట్రీలోని మిస్టరీని ఛేదించాలనుకుంటున్నారా.. చిన్న చిట్కా పాటిస్తే చాలు ఏంత కష్టమైనా సబ్జెక్టైనా సరే మీకు ఒంటపట్టేస్తుంది.
ఇంతకీ ఆ చిట్కా ఏంటంటే... నేర్చుకునే మొదటి 20 గంటలు శ్రద్ధతో ఏకాగ్రతగా ఆ విషయంపై దృష్టిపెట్టడం.
నిజానికి మన మెదడుకు దేనినైనా నేర్చుకునే సామర్థ్యం ఉంది. ముఖ్యంగా ఒక సబ్జెక్టును మొదటి 20 గంటల్లో అద్భుతంగా నేర్చుకునే సామర్థ్యం మెదడుకు ఉందని పరిశోధకులు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఏదైనా ఒక కొత్త సబ్జెక్టు లేదా నైపుణ్యాన్ని నేర్చుకునే క్రమంలో మొదటి 20 గంటలే చాలా కీలకమని, ఆ సమయంలోనే సంబంధిత అంశాన్ని ఎక్కువగా నేర్చుకుంటామని వారు పేర్కొంటున్నారు.
19వ శతాబ్దానికి చెందిన జర్మన్ తత్వవేత్త, మనస్తత్వ శాస్త్రవేత్త హెర్మన్ ఎబింగ్హస్ కొత్త సమాచారాన్ని మొదడు ఎలా నిక్షిప్తం చేసుకుంటుందో తొలిసారి పరిశోధించారు.
లెర్నింగ్ కర్వ్ అనే ప్రతిపాదనతో ఎబింగ్హస్ ముందుకు వచ్చారు.
కొత్తగా నేర్చుకునే నైపుణ్యం(జ్ఞానం), దానికి పట్టే సమయం(కాలం) అనే రెండు అంశాలను గ్రాఫ్‌పై తీసుకొని విశ్లేషించారు.
జ్ఞానాన్ని Y అనే రేఖాంశంపై, కాలాన్ని X అనే అక్షాంశంపై తీసుకొని రెండింటి మధ్య బేధాన్ని గ్రాఫ్‌పై చూపించారు.

ఫొటో సోర్స్, Getty Images
మొదట కాలం, నేర్చుకునే సామర్థ్యం(జ్ఞానం) అనులోమానుపాతంలో ఉండటం ఆయన గ్రహించారు. అంటే సమయం పెరుగుతున్నకొద్దీ కొత్త విషయాన్ని ఆకళింపు చేసుకునే సామర్థ్యం పెరగడం గమనించారు.
అయితే, కొన్ని గంటల తర్వాత మెదడు గ్రహించే సామర్థ్యం కుంటుపడిపోయింది. కాలం మాత్రం పెరుగుతూ పోయింది.
కొత్త విషయాన్ని నేర్చుకోడానికి ఎంత సమయం పడుతుందో తెలుసుకోడానికి ఇటీవల చాలా మంది ఎబింగ్హస్ గ్రాఫ్‌నే ఆశ్రయిస్తున్నారు.
ముఖ్యంగా వ్యాపార రంగంలో ఉత్పాదికతను అంచనా వేసేందుకు ఈ గ్రాఫ్‌ను తరచుగా వినియోగిస్తున్నారు.
మనం కొత్త విషయాన్ని నేర్చుకోవడం ప్రారంభించినప్పుడు తొలి 20 గంటల సమయమే చాలా కీలకం. ఎందుకంటే కొత్త విషయాలను నేర్చుకోవాలని అనుకున్నప్పుడు మన మొదడు వెంటనే ఉద్దీపనం చెంది ప్రతిస్పందిస్తుంది. సాధ్యమైనంత సమాచారాన్ని తనలో నిక్షిప్తం చేసుకోడానికి సిద్ధమవుతుంది.
అయితే, ఈకాలంలో పరిస్థితి మారింది. ఉద్దీపన చర్యలు తరచుగా పునరావృతం అవుతున్నాయి. దీంతో మెదడు ప్రతిస్పందన తక్కువగా ఉంటోంది. అలాగే, వేగంగా నేర్చుకునే విధానం ఆగిపోతోంది. ఈ దశనే హబిచ్యుయేషన్ అంటారు.
మనం ఏదైనా కొత్త అంశాన్ని చదువుతున్నప్పుడు అది ఎంత క్లిష్టమైనదైనా ప్రారంభంలోనే ఎక్కువగా అర్థం చేసుకోగలం. ఆ తర్వాత అర్థంచేసుకునే సామర్థ్యం తగ్గుతూ వస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
నేర్చుకునే పద్ధతిని కనుక్కోండి
ఒక అంశాన్ని మొదలుపెట్టిన కొత్తలోనే ఎక్కువగా నేర్చుకోగలమని అమెరికా రచయత జోష్ కౌఫ్మన్ గట్టిగా నమ్ముతారు. ‘మీ పనితీరు మెరుగుపరుచుకోవడం ఎలా’ అనే అంశంపై ఆయన శిక్షణ ఇస్తుంటారు.
అత్యధికంగా అమ్ముడుపోయిన ఆయన పుస్తకం 'ద ఫస్ట్ 20 అవర్స్: మాస్టరింగ్ ది టఫెస్ట్ పార్ట్ ఆఫ్ లెర్నింగ్ ఎనీథింగ్' ముందుమాటలోనూ ఆయన ఇదే విషయాన్ని ప్రస్తావించారు.
ఏదైనా ఒక విషయాన్ని నేర్చుకోవాలంటే దాన్ని అంశాలుగా విభజించుకోవాలని, రోజూ ఏకాగ్రతతో 45 నిమిషాలు ఆ అంశంపై కూర్చోవాలని ప్రతిపాదించారు.
మనం ఎంచుకున్న సబ్జెక్టులో నిపుణులం కాకపోవచ్చు కానీ, 20 గంటలు ఏకాగ్రతతో కష్టపడితే కచ్చితంగా పట్టు సాధించగలం. ఆ కాస్త సామర్థ్యం సంపాదించగలిగితే ఆ తర్వాత నెమ్మదిగా అందులో పరిపూర్ణత సాధించవచ్చు అని అంటారాయన.
ఇంకో పద్దతిలోనూ కొత్త నైపుణ్యాలను త్వరగా నేర్చుకోవచ్చు. అదే అయిదు గంటల పద్ధతి. ఈ విధానంలో వారంలో అయిదు రోజులు, రోజూ ఒక గంట కొత్త విషయాన్ని నేర్చుకునేందుకు కేటాయించాలి.
అమెరికా జాతి నిర్మాతల్లో ఒకరైన బెంజిమన్ ఫ్రాంక్లిన్ ఈ విధానాన్నే పాటించేవారు. ఒక కొత్త విషయాన్ని నేర్చుకునేందుకు ఆయన రోజూ కొంత సమయాన్ని కేటాయించేవారు.
సోమవారం నుంచి శుక్రవారం వరకు ఒక గంటపాటు కొత్త విషయాలు నేర్చుకునేవారు. తాను ఎంచుకున్న విషయాన్ని నేర్చుకున్నానని భావిస్తే వెంటనే కొత్త అంశం గురించి ఆలోచించేవారు. ఇలా జీవితాంతం ఆయన నేర్చుకునే ప్రక్రియను కొనసాగించారు.

ఫొటో సోర్స్, Getty Images
ఓప్రా విన్ఫ్రే, బిల్ గేట్స్, ఎలాన్ మస్క్, వారెన్ బఫెట్, మార్క్ జూకర్‌బర్గ్ తదితర విజయవంతమైన వ్యాపారవేత్తలను మీ విజయ రహస్యం ఏమిటని అడిగినప్పుడు, నేర్చుకోవాలనే తపనే తమను ఈ స్థాయికి తీసుకొచ్చిందని చెబుతారు.
మీరు నిరంతరం జ్ఞాన సముపార్జన చేయాలంటే రెండు విషయాలను కచ్చితంగా పాటించాలి. ఒకటి నేర్చుకోవాలనే తపనతో ఉండటం, రెండు సాధించాలనే స్వీయ క్రమశిక్షణను అలవర్చుకోవడం.
మా ఇతర కథనాలు:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








