ఐపీఎల్ 2019: హనుమ విహారి తల్లి విజయలక్ష్మి - ‘ప్రపంచంలో బెస్ట్ బ్యాట్స్‌మన్ కావాలన్నదే విహారి జీవితాశయం’

ఫొటో సోర్స్, hanumavihari1/facebook
ఐపీఎల్ 2019 వేలంలో ఆల్‌రౌండర్ హనుమ విహారిని రూ.2 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కైవసం చేసుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్లు విహారి కోసం పోటీపడ్డాయి. విహారి కనీస ధర రూ.50 లక్షలు.
ఈ సందర్భంగా విహారి కోచ్ జాన్ మనోజ్ బీబీసీ ప్రతినిధి దీప్తి బత్తినితో మాట్లాడుతూ ‘‘విహారికి ఐపీఎల్ ఒక అత్యున్నతనమైన వేదిక. నిజానికి ఇది (వేలంలో ధర) మేము ఊహించిందే. డబ్బు విషయం పక్కన పెడితే, తన టాలెంట్‌ని చూపించేందుకు విహారికి ఐపీఎల్ ఒక మంచి వేదిక. ఇంతకుముందు ఐపీఎల్ ఆడినప్పటికీ గత సీజన్లో ఆడ లేకపోయాడు. ఇప్పుడు భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో ఆడుతున్నాడు" అని అన్నారు.
విహారి తల్లి గాదె విజయలక్ష్మి మాట్లాడుతూ.. "నిన్న (18.12.2018) వేలం జరుగుతున్నప్పుడు విహారి నాతో వీడియో కాల్‌లోనే ఉన్నాడు. సాధారణంగా తన మనోభావాలను పెద్దగా వ్యక్తపరిచే మనిషి కాదు విహారి. వేలంలో తనకు వచ్చిన అవకాశంపై చాలా సంతోషంగా ఉన్నాడు. డబ్బు సంగతి ఎలా ఉన్నా, ఐపీఎల్ ఒక గొప్ప అవకాశం’’ అని చెప్పారు.
‘‘విహారికి క్రికెట్ అంటే చాలా ఇష్టం. అవకాశం ఉంటే ఏడాదిలో ప్రతి రోజూ ఏదో ఒక మ్యాచ్ ఆడేందుకే ప్రయత్నం చేస్తాడు" అని ఆమె తెలిపారు.
‘‘విహారి సెలబ్రేషన్స్‌కి పెద్దగా ప్రాధాన్యం ఇచ్చే మనిషి కాదు, కానీ, చాలా పట్టుదలతో ఉన్నవాడు. ఏ జట్టులో ఆడితే ఆ జట్టుని గెలిపించాలన్నదే విహారి పట్టుదల. ఎప్పటికైనా, ప్రపంచంలో బెస్ట్ బ్యాట్స్‌మన్ అనిపించుకోవాలన్నదే విహారి జీవితాశయం" అని చెప్పారు విజయలక్ష్మి.

ఫొటో సోర్స్, hanumavihari1/facebook
ఇదీ హనుమ విహారి ప్రస్థానం
కాకినాడలో 1993 అక్టోబర్ 13న జన్మించిన హనుమ విహారి ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 67 మ్యాచ్‌లు ఆడి 5,402 పరుగులు చేశాడు. ఇందులో 15 సెంచరీలు, 27 అర్ధ శతకాలు ఉన్నాయి. అత్యుత్తమ స్కోరు 302 నాటౌట్.
ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఇంగ్లండ్‌తో ఓవల్ మైదానంలో జరిగిన టెస్టు మ్యాచ్‌తో భారత జట్టు తరపున మొదటి సారి ఆడిన విహారి తన రెండో టెస్టు మ్యాచ్‌ను తాజాగా ఆస్ట్రేలియాతో పెర్త్ టెస్టులో ఆడాడు. ఈ రెండు టెస్టుల్లో 104 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 56.
2013, 2015 ఐపీఎల్ సీజన్స్‌లో విహారి మొత్తం 22 మ్యాచులు ఆడాడు. 280 పరుగులు చేశాడు. ఒక వికెట్ తీశాడు.
దేశవాళీ క్రికెట్‌లో ఆంధ్రా, హైదరాబాద్, సౌత్‌జోన్ తరపున.. ఐపీఎల్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడిన విహారి ఇంతకు ముందు ఇండియా ఎ, ఇండియా అండర్-19 జట్లలోనూ సభ్యుడు.
2012లో అండర్ 19 వరల్డ్ కప్ కైవసం చేసుకున్న భారత క్రికెట్ జట్టులో విహారి కూడా ఒక సభ్యుడు.

ఫొటో సోర్స్, hanuma vihari
11 ఏళ్ల నుంచే స్కూల్ తరపున మైదానంలోకి
విహారి క్రికెట్ ప్రయాణం ఎలా మొదలైందో వివరిస్తూ విజయలక్ష్మి.. "ఎనిమిదేళ్ల వయసులో హైదరాబాద్‌లోని జింఖానా గ్రౌండ్స్‌లో క్రికెట్ కోచింగ్‌కి వెళ్లేవాడు. తరువాత సెయింట్ ఆండ్రూస్ స్కూల్‌లో చదుకున్నాడు. ఆరో తరగతి అంటే పదకొండు ఏళ్ల వయసు నుంచే స్కూల్ టీం తరపున క్రికెట్ ఆడటం మొదలు పెట్టాడు. ఆలా 17 ఏళ్ల వయసులో రంజీ టీంకి ఎంపికయ్యాడు" అని తెలిపారు.
పుట్టింది కాకినాడలో.. పెరిగింది తెలంగాణలో
విహారి పుట్టింది కాకినాడలో అయినా.. తండ్రి గోదావరిఖనిలోని సింగరేణి బొగ్గుగనులలో ఉద్యోగి కావటంతో విహారి మూడేళ్ల వయసు వరకూ గోదావరిఖని, మణుగూరుల్లో పెరిగారు. ఆ తరువాత హైదరాబాద్ వచ్చేశారు. విహారి చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయారు.
‘‘నాకు తెలిసిన వాళ్లలో ధైర్యవంతులు, మంచి మనిషి ఎవరంటే.. అది మా అమ్మే. ఆమే నాకు నిజమైన స్ఫూర్తి’’ అని విజయలక్ష్మి పుట్టినరోజు సందర్భంగా ఒకసారి విహారి తన ఫేస్‌బుక్ పోస్టులో రాశారు.
ఇవి కూడా చదవండి:
- ఐపీఎల్: అభిమానుల కోసం 'చెన్నై సూపర్‌కింగ్స్' ఉచిత రైలు
- ఐపీఎల్ 2019: ఇండియా తరపున ఒక్క మ్యాచ్ ఆడకుండానే వేలంలో రూ.8.4 కోట్లు
- బీసీసీఐ ప్రపంచంలోనే అత్యంత సంపన్న క్రీడా సంస్థా?
- ఎంఎస్ ధోని: ‘నమ్మిన దాని కోసం పోరాడుతూనే ఉండండి’
- టికెట్ కలెక్టర్ నుంచి ట్రోఫీ కలెక్టర్ వరకూ ఎంఎస్ ధోనీ జర్నీ
- సచిన్ టెండూల్కర్ ‘లిటిల్ మాస్టర్’ ఎలా అయ్యారు?
- గూగుల్ రాక ముందు జీవితం ఎలా ఉండేది?
- #FIFA2018: క్రికెట్‌లో ప్రపంచాన్ని శాసిస్తున్న భారత్ ఫుట్‌బాల్‌లో ఎందుకు వెనకబడింది?
- BBC exclusive: ‘టీం ఇండియా దశ, దిశ మార్చా.. నన్నే టీంలోంచి తీసేశారు’
- వీవీఎస్ లక్ష్మణ్: నంబర్ త్రీగా ఆడడం వెనుక అసలు చరిత్ర
- చైనాలో నూడుల్స్ అమ్మకాలు ఎందుకు తగ్గాయ్?
- మిథాలీ రాజ్ వర్సెస్ రమేశ్ పొవార్: వివాదం ఇలా మొదలైంది
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








