గౌతం గంభీర్: ఆడింది నేను, పొగడ్తలు ధోనీకి.. రాజకీయాల్లోకి రానేరాను.. వేరే వాళ్ల చేతిలో రబ్బర్ స్టాంపులా ఉండను

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సూర్యాంశీ పాండేయ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
2007 టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో పాకిస్తాన్‌పై చేసిన 75 పరుగులతో భారత్ ఆ ఆ ఫార్మాట్‌లో తొలి చాంపియన్‌గా నిలిచింది.
2008లో దిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో ఆస్ట్రేలియాపై డబుల్ సెంచరీ.
2009లో న్యూజీలాండ్‌పై రెండో టెస్టులో 600 నిమిషాలు క్రీజులో నిలిచిన 'ద వాల్'.
2011లో ప్రపంచకప్ ఫైనల్లో 97 పరుగులు చేసి భారత్ విజయంలో కీలక పాత్ర.
గౌతం గంభీర్ చేసిన ఈ 4 ఇన్నింగ్స్‌లు భారత క్రికెట్ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతాయి.
డిసెంబర్ 4న సోషల్ మీడియాలో వీడియో ద్వారా అన్ని క్రికెట్ ఫార్మాట్ల నుంచి రిటైర్ అవుతున్నట్టు గౌతం గంభీర్ ప్రకటించాడు.
కానీ గంభీర్ తన ఆట నుంచి మాత్రమే రిటైర్ కాగలడు, అభిమానుల మనసుల నుంచి మాత్రం ఎప్పటికీ రిటైర్ కాలేడు. రిటైర్‌మెంట్ నిర్ణయం వెనుక గౌతం గంభీర్ మనసులో ఉన్న అసలు విషయం తెలుసుకోవాలని బీబీసీ అతడిని పలకరించింది.
గంభీర్ ఇంటికి వెళ్లగానే ఒక పెద్ద గదిలో అతడు అందుకున్న అవార్డులన్నీ అందంగా పొందికగా అమర్చి కనిపించాయి. ఆ ట్రోఫీలన్నీ గౌతం గంభీర్ క్రికెట్ కెరీర్‌ను కళ్లకు కడుతున్న ఒక అద్దంలా కనిపించాయి.

గతం గుర్తుచేసిన ట్రోఫీ
ఇంట్లో ఉన్న ట్రోఫీలు అన్నిటిలో మీకు ప్రత్యేకంగా అనిపించే అవార్డు ఏది అని గంభీర్‌ను అడిగితే..
కళ్లలో ఆనాటి జ్ఞాపకాలు నింపుకున్న గంభీర్ 'ఐసీసీ టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్' ట్రోఫీ వైపు చూపించాడు. "అది చాలా ప్రత్యేకం, ఎందుకంటే 2009లో నాకు 'ఐసీసీ టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్' రావడమే కాదు. భారత జట్టుకు కూడా 'టెస్ట్ టీమ్ ఆఫ్ ద ఇయర్' అవార్డు లభించింది" అన్నాడు.
2009లో గౌతం గంభీర్ న్యూజీలాండ్‌పై రెండో టెస్టులో 600 నిమిషాలు క్రీజులోనే ఉండి 137 పరుగులు చేశాడు.
గౌతం గంభీర్ తన కెరీర్‌లో సంతోషాలు, బాధ పడ్డ క్షణాలు, వ్యక్తిగత జీవితంలోని ఎన్నో విషయాలు చెప్పాడు.

ఫొటో సోర్స్, Getty Images
కెరీర్లో స్పెషల్ ఇన్నింగ్స్
ప్రశ్నల పరంపర మొదలవగానే 2007 టీ20 ప్రపంచ కప్, 2011 ప్రపంచ కప్ ఫైనల్స్‌లో తన ప్రదర్శన గురించి గంభీర్ చెప్పాడు.
"ఆ విజయాలు నా మనసులో ఎప్పటికీ ప్రత్యేకంగా నిలిచిపోతాయి. దానితోపాటు 2010-11లో దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్ కూడా. దానిని డ్రా చేసుకోవడంలో భారత్ సక్సెస్ అయ్యింది" అన్నాడు.
ఆ టెస్ట్ సిరీస్ గురించి చెప్పిన గంభీర్.. "ఆస్ట్రేలియా తప్ప వేరే ఏ జట్టూ దక్షిణాఫ్రికాపై వారి హోమ్ గ్రౌండ్‌లో ఆధిపత్యం చూపించలేకపోయింది. అలాంటి సమయంలో మేం ఆ టెస్ట్ సిరీస్ డ్రా చేయడం అద్భుతమే" అన్నాడు.

ఫొటో సోర్స్, AFP
ధోనీ అంటే కోపమా?
ఆ రెండు సందర్భాల్లో ధోనీ కెప్టెన్సీపై ప్రశంసలు వెల్లువెత్తడంతో అతడితోపాటు, జట్టు భాగస్వామ్యం మరుగున పడిపోయిందా అనే ప్రశ్నకు సమాధానం ఇచ్చాడు.
"భారత్‌లో ఆ లోపం ఉంది. ఎప్పుడు ఏ పెద్ద టోర్నమెంటు జరిగినా, లేదా వరల్డ్ కప్ లాంటి పోటీలు జరిగినా జట్టు గెలిస్తే, కేవలం కెప్టెన్‌కే ప్రశంసలు లభిస్తాయి" అని గంభీర్ చెప్పాడు.
విదేశాల్లో ఇలాంటి ట్రెండ్ లేదు. నా ఆట గురించి ఎక్కడైనా కొంతమందైనా చర్చించి ఉంటారని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే ఆటలో కెప్టెన్ పాత్ర కీలకం అవుతుంది. అందుకే అతడిని కచ్చితంగా ప్రశంసించాలి".
ధోనీ మాట రావడంతో, గౌతం గంభీర్‌కు ధోనీపై కోపం ఉంది అనే విషయం కూడా ప్రస్తావనకు వచ్చింది. గంభీర్ మెరుగైన ఆటతీరు చూపినా 2015 ప్రపంచకప్ ఆడే జట్టులో అతడికి చోటు దక్కలేదు. అది అతడి కోపం వల్లేనా. గంభీర్ ఆ ప్రపంచకప్‌లో ఆడలేకపోయాని బాధపడుతున్నాడా? అనే ప్రశ్న వచ్చింది.

ఫొటో సోర్స్, GARETH COPLEY
బాగా ఆడినా చోటు దక్కలేదు
"20 ఏళ్ల కెరియర్లో 50 ఓవర్ల ఒకే ఒక ప్రపంచకప్(2011) ఆడగలిగాని నాకు ఇప్పటికీ చాలా బాధగా ఉంటుంది. 2015లో మంచి ఫాంలో ఉన్నా జట్టులో చోటు లభించకపోవడం చాలా కష్టంగా అనిపించింది" అన్నాడు గంభీర్.
కానీ, దానికి వేరే ఎవరో కారణం అని తను అనుకోవడం లేదని గంభీర్ చెప్పాడు. ధోనీ గురించి తన మనసులో ఎలాంటి కోపం లేదన్నాడు.
తనకు ధోనీపై ఎలాంటి కోపం లేదని స్పష్టంగా చెప్పిన గంభీర్.. మైదానంలో తన కోపం వల్ల ఎంతోమంది ఆటగాళ్లతో గొడవలు వచ్చాయని కూడా అన్నాడు.

ఫొటో సోర్స్, Getty Images
ఏ గొడవైనా జట్టు కోసమే
2013లో ఒక ఐపీఎల్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు తనకు, కోహ్లీకి మధ్య జరిగిన వాదనలో వ్యక్తిగత కారణాలేవీ లేవని గంభీర్ చెప్పాడు. తను కోహ్లీతో గొడవపడ్డా, లేదా వేరే ఏ ఆటగాడితో వాదనకు దిగినా అది కేవలం తన జట్టు కోసమే అన్నాడు. జట్టు కోసం ఆడటమే కాదు, గొడవ కూడా పడతానన్నాడు.
"ఎందుకంటే క్రికెట్ అనేది మెదడుతోనే కాదు, మనసుతో కూడా ఆడాలి. ఇలాంటి గొడవలు ఆటలో భాగం మాత్రమే. మైదానం బయట నాకు ఎవరితోనూ వ్యక్తిగత విరోధాలు" లేవు.

ఫొటో సోర్స్, Getty Images
క్రికెటర్ కాకుంటే ఆర్మీ ఆఫీసర్
గంబీర్ రికార్డ్స్, కోపం గురించి మనకు తెలిసింది. ఇక క్రికెట్ గురించి.. దాని గురించి చెప్పిన గంభీర్ ఒక వేళ తను క్రికెటర్ కాకుంటే ఆర్మీలో ఆఫీసర్ అయ్యుండేవాడినని చెప్పాడు.
"సైన్యం, దేశం ఈ రెండు నాకిష్టం. నాకు క్రికెటర్ కంటే ఆర్మీ ఆఫీసర్ అయ్యుండే బాగుండేదని అనిపిస్తుంది. ఇండియన్ ఆర్మీ అనేది నా ఫస్ట్ లవ్. అది ఎప్పటికీ అలాగే ఉంటుంది.
గంభీరంగా ఉండే తన వ్యక్తిత్వం ఆర్మీకి సరిగ్గా సరిపోతుందని గంభీర్ చెప్పాడు. కానీ మాడ్రన్ స్కూల్లో చదుతున్నప్పుడు, స్పోర్ట్స్ ఆడుతున్నప్పుడు అతడికి క్రికెట్ అంటే ఒక ఇష్టం ఏర్పడింది. ఆ ప్రేమ తన అభిరుచిగా ఎప్పుడు మారిందో తనకే తెలీదని అంటాడు.
చివరి రంజీ ట్రోఫీ ఆడిన తర్వాత క్రికెట్ ప్రపంచానికి గంభీర్ వీడ్కోలు పలికాడు. అయితే తర్వాతేంటి?

ఫొటో సోర్స్, Getty Images
గంభీర్ రాజకీయాల్లోకి వస్తారా?
గంభీర్ రాజకీయాల్లోకి వస్తాడేమోనని చాలా మంది అనుకున్నారు. అదే విషయాన్ని గంభీర్ అడిగితే.. "రాజకీయాల్లోకి రానే రాను" అన్నాడు.
"ఈ వదంతులు ఎందుకొస్తున్నాయో నాకు తెలీదు. నాకు దేశానికి సేవ చేయాలని అనిపిస్తే నా ఫౌండేషన్ ద్వారా అది చేస్తా, వేరే వాళ్ల చేతిలో రబ్బర్ స్టాంపులా ఉండను".
గౌతం గంభీర్ చేసిన కొన్ని ట్వీట్స్ చూసి కొందరు అతడు బీజేపీ మద్దతిస్తాడని అనుకున్నారు. దానికి గంభీర్ "మీరు నా ట్విటర్ హ్యాండిల్ చూడండి. నేను బీజేపీని కూడా ట్యాగ్ చేస్తూ విమర్శలు చేశాను" అన్నాడు.
అలా అయితే గంభీర్ 2014 ఎన్నికల కోసం అమృత్ సర్‌లో అరుణ్ జైట్లీ ర్యాలీ కోసం ఎందుకు వెళ్లాడు
సమాధానంగా "నాకు చిన్నప్పటి నుంచి అరుణ్ జైట్లీ తెలుసు. అంతే కాదు, 1999 నుంచి 2013 వరకూ అరుణ్ జైట్లీ డీడీసీఏ( దిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్) అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. అందుకే మా మధ్య ఒక ప్రొఫెషనల్ బంధం కూడా ఉంది. అంతే తప్ప వేరే ఎలాంటి బంధం లేదు" అన్నాడు గంభీర్.

ఫొటో సోర్స్, Getty Images
భార్యాపిల్లలే నా జీవితం
తర్వాత అతడి వ్యక్తిగత జీవితం దగ్గరికి వచ్చాం. అప్పుడే మైదానంలో గంభీరంగా ఉండే గౌతం మనసులో చాలా దూరం ఆలోచించే ఒక మంచి మనిషి కూడా ఉన్నాడనిపించింది.
"నా బార్య నతాషా జైన్ బాగా ఆలోచించి చక్కటి నిర్ణయాలు తీసుకుంటుంది. అందుకే నా జీవితం బ్యాలెన్స్‌గా ఉంది" అన్నాడు గంభీర్.
"నతాషా వాళ్ల నాన్న, మా నాన్న మంచి స్నేహితులు. అలా నాకు నతాషా బాగా తెలుసు. మేం మొదట ఫ్రెండ్స్ అయ్యాం. ఆ స్నేహం తర్వాత ప్రేమగా మారడానికి ఎక్కువ సమయం పట్టలేదు"
2011లో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. గౌతం గంభీర్‌కు ఇద్దరు అమ్మాయిలు. ఇరానీ స్టైల్లో గంభీర్ వారికి ఆజీన్, అనైజా అనే పేర్లు పెట్టాడు.
తన కూతుళ్లకు చిన్నప్పటి నుంచీ "జీవితంలో నిర్భయంగా ఉండాలి. తక్కువ ఆలోచించాలి, ఎప్పుడూ చిరునవ్వుతో ఉండాలి" అనే విషయాలను నేర్పిస్తున్నాను అని గంభీర్ చెప్పాడు.
ఇవి కూడా చదవండి:
- ఎగ్జిట్ పోల్స్‌ను ఎంత వరకు నమ్మొచ్చు? తుది ఫలితాలను అవి ఎంత వరకు అంచనా వేయగలవు?
- పెయిడ్ న్యూస్: ‘తెలంగాణ ఎన్నికల్లో రూ.100 కోట్ల చెల్లింపు వార్తలు’
- బాయ్ ఫ్రెండ్ కోసం భార్య గొంతునులిమి చంపిన భర్త
- అగస్టా వెస్ట్‌ల్యాండ్: సీబీఐ అరెస్ట్ చేసిన క్రిస్టియన్ మైకేల్ ఎవరు?
- గ్రేట్ వాల్ ఆఫ్ చైనా: ప్రకృతి దాడిని తట్టుకోగలదా
- అయోధ్య: ఇది నిజంగానే రామ జన్మస్థలమా? దీని చరిత్ర ఏమిటి?
- భారతదేశం ఇస్లామిక్ పేర్ల మీద యుద్ధం ప్రకటించిందా?
- ప్రవాసాంధ్రులు ఏపీకి పంపిస్తున్న డబ్బులు ఎంతో తెలుసా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








