బీసీసీఐ ప్రపంచంలోనే అత్యంత సంపన్న క్రీడా సంస్థా?

ఫొటో సోర్స్, Getty Images
ప్రపంచవ్యాప్తంగా భారత క్రికెట్ జట్టు ప్రసార హక్కుల కోసం రూపర్ట్ మర్డోక్‌కు చెందిన స్టార్ ఇండియా, భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ)కు రూ.6138 కోట్లు చెల్లిస్తోంది. ఇది గతంలోకన్నా 59 శాతం ఎక్కువ. అంటే బీసీసీఐ సంపద ఇప్పుడు గతంలో కన్నా పెరిగింది.
గత సెప్టెంబర్‌లోనే బీసీసీఐ ఐదేళ్ల పాటు ఐపీఎల్ ప్రసార హక్కులను సుమారు రూ.16 వేల కోట్లకు స్టార్‌కు విక్రయించింది.
2017 ఫోర్బ్స్ జాబితా ప్రకారం, నేషనల్ ఫుట్‌బాల్ లీగ్ (ఎన్‌ఎఫ్‌ఎల్) ప్రపంచంలోనే అత్యంత విలువైన స్పోర్ట్స్ ఈవెంట్ బ్రాండ్‌గా గుర్తింపు పొందింది. దాని బ్రాండ్ విలువ రూ.4 వేల కోట్ల పైనే. ఈ జాబితాలో క్రికెట్ చోటు దక్కించుకోలేకున్నా, ఫోర్బ్స్ 2012లో విడుదల చేసిన ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఆదాయాన్ని ఆర్జిస్తున్న క్రీడల జాబితాలో రూ.25 కోట్లతో ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ 10వ స్థానాన్ని పొందింది.

ఇతర బోర్డులతో పోలిస్తే బీసీసీఐ ఎక్కడ ఉంది?
బీసీసీఐ 2015-16 వార్షిక నివేదిక ప్రకారం, బీసీసీఐ లాభాలు 928 శాతం పెరిగి రూ.1,714 కోట్లకు చేరాయి. ఆదాయం ఇంతలా పెరగడానికి ప్రధాన కారణం ఛాంపియన్స్ లీగ్ టీ20ను రద్దు చేయడమే.
మొత్తానికి బీసీసీఐ ఆదాయం 65 శాతం పెరిగి, రూ.3,576.17 కోట్లకు చేరుకుని, బీసీసీఐ ప్రపంచంలోనే అతి సంపన్న క్రికెట్ సంస్థగా మారింది.
2017లో ఐసీసీ ఆమోదించిన నూతన ఆదాయ పంపకాల ప్రకారం కూడా, ఇతర దేశాల క్రికెట్ బోర్డులతో పోలిస్తే బీసీసీఐ సింహభాగాన్ని అందుకుంటోంది.

2016 నుంచి 2023 వరకు మొత్తం ఆదాయంలో బీసీసీఐకు రూ.2600 కోట్లు అందితే, ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) రూ.902 కోట్లు అందుకుంటుంది. బీసీసీఐ ఆదాయం ఈసీబీ ఆదాయానికి దాదాపు మూడు రెట్లు. ఇటీవలే టెస్ట్ క్రికెట్ ఆడే అర్హత సంపాదించుకున్న ఐర్లాండ్, అఫ్ఘానిస్తాన్‌లు ఇతర ఐసీసీ సభ్యులతో కలిసి రూ.15 వందల కోట్లు పంచుకుంటాయి.

మీడియా హక్కులు
ఇటీవల భారత క్రికెట్ మరియు ఐపీఎల్ హక్కులను స్టార్ ఇండియా పొందిన విషయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే ప్రపంచంలోని ఇతర పోటీదార్లతో పోలిస్తే, ఇది సముద్రంలో నీటి బొట్టంతే.
ఎన్‌ఎఫ్‌ఎల్ (2014-2022) ప్రసార హక్కుల కోసం ఫాక్స్, ఎన్‌బీసీ, సీబీఎస్‌లు రూ.1.75 లక్షల కోట్లు చెల్లించాయి. ఐపీఎల్ ఐదేళ్ల ప్రసార హక్కులు రూ.16 వేల కోట్లు మాత్రమే.
ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ లాంటి ఇతర లీగ్‌లతో పోలిస్తే ఐపీఎల్ విలువ చాలా తక్కువే అయినా, అది వేగంగా పెరుగుతోంది అనడంలో తప్పు లేదు. బీసీసీఐ ఇదే వేగంతో వివిధ ఫార్మాట్‌ల వేలాన్ని కొనసాగిస్తే, ప్రపంచంలోని అత్యంత సంపన్న క్రీడా సంస్థలలో ఒకటయ్యే కాలం ఎంతో దూరంలో లేదు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








