సిరియా: రసాయన దాడిలో 70 మంది మృతి

ఫొటో సోర్స్, Reuters
సిరియాలోని తూర్పు ఘూటాలో జరిగిన అనుమానిత విషవాయువు దాడిలో 70 మంది ప్రజలు మరణించి ఉంటారని స్థానికులు, అధికారులు తెలిపారు.
తిరుగుబాటుదార్ల ఆధీనంలోని చివరి నగరం దూమాపై రసాయన దాడి జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఈ అంశంపై స్వచ్ఛంద సంస్థ ‘వైట్ హెల్మెట్’ ట్వీట్ చేసింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే ఆస్కారముందని పేర్కొంది. దాడికి గురైన ఓ బేస్‌మెంట్‌లో గుట్టలుగా పడివున్న మృతుల ఊహాచిత్రాలను ట్విటర్‌లో పోస్ట్ చేసింది.
అనంతరం, ఆ ట్వీట్‌ను తొలగించి, మృతుల సంఖ్య 150 అని మరో ట్వీట్ చేసింది.
విషవాయువు దాడి ఆరోపణలను సిరియా ప్రభుత్వం ఖండించింది. ఇదంతా కట్టు కథ అంటూ కొట్టిపారేసింది.

ఫొటో సోర్స్, AFP/Getty Images
ఈ ఘటనపై అమెరికా స్పందిస్తూ- పరిస్థితిని సమీక్షిస్తున్నామని చెప్పింది. విషరసాయన దాడి వాస్తవమైతే సిరియా ప్రభుత్వానికి మద్దతిస్తున్న రష్యా ఈ ఘటనకు బాధ్యత వహించాలని అమెరికా డిమాండ్ చేసింది. సిరియా ప్రభుత్వం గతంలోనూ సొంత పౌరులపైనే రసాయన ఆయుధాలను ప్రయోగించిందని ఆరోపించింది.
తిరుగుబాటుదార్లకు మద్దతు తెలుపుతున్న మీడియా కూడా ట్విటర్‌లో స్పందించింది. ఈ రసాయనదాడిలో దాదాపు వెయ్యి మందికిపైగా సిరియన్లు దుష్ప్ర భావానికి లోనయ్యారని పేర్కొంది.
గగనతల దాడిలో భాగంగా.. హెలికాప్టర్ నుంచి ఓ బ్యారెల్‌ను కిందకు జారవిడిచారని, అందులో విషపూరిత ‘సారిన్’ రసాయనం ఉందని స్థానిక మీడియా ఆరోపించింది. ఇంతవరకు తిరుగుబాటుదార్ల అధీనంలోని దూమా నగరాన్ని, సిరియా ప్రభుత్వ బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








