#CWG2018: భారత్‌కు నాలుగో స్వర్ణం సాధించిన తెలుగబ్బాయి రాగాల వెంకట్ రాహుల్

ఫొటో సోర్స్, AFP
కామన్వెల్త్ క్రీడల్లో పురుషుల వెయిట్ లిఫ్టింగ్‌లో భారత్‌కు మరో స్వర్ణం లభించింది.
21 ఏళ్ల రాగాల వెంకట్ రాహుల్ 85 కిలోల విభాగంలో పోటీ పడి మొత్తం 338 కిలోల బరువెత్తి బంగారు పతకం సాధించాడు.
రాహుల్ స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా స్టూవర్ట్‌పురం గ్రామం.
85 కిలోల విభాగంలో సమోవాకు చెందిన డాన్ ఓపెలోజ్ మొత్తం 331 కిలోల బరువెత్తి రజతం గెల్చుకోగా, మలేషియాకు చెందిన మహమ్మద్ ఫజరుల్ మొహ్‌దాద్ 328 కిలోల బరువునెత్తి కాంస్యం గెల్చుకున్నాడు.
అంతకు ముందు, తమిళనాడుకు చెందిన వెయిట్ లిఫ్టర్ సతీష్ కుమార్ శివలింగం భారత్‌కు మూడో స్వర్ణం సాధించిన విషయం తెలిసిందే.
మరోవైపు, భారత్-పాకిస్తాన్‌ల మధ్య జరిగిన హాకీ మ్యాచ్ 2-2తో డ్రా అయ్యింది.
పతకాల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచిన భారత్‌కు ఇప్పటి వరకు నాలుగు స్వర్ణ పతకాలు సహా మొత్తం ఆరు పతకాలు లభించాయి.
ఆస్ట్రేలియా 18 స్వర్ణాలు సహా మొత్తం 55 పతకాలతో అగ్ర స్థానంలో నిలిచింది.

ఫొటో సోర్స్, Mark Metcalfe/Getty Images
కామన్వెల్త్ క్రీడల్లో 85 కిలోగ్రాముల విభాగంలో బంగారు పతకం గెల్చుకున్న తొలి భారతీయుడు రాగాల వెంకట్ రాహుల్.
ఈ కామన్వెల్త్ క్రీడల్లో రాహుల్ గోల్డ్ సాధిస్తాడని తొలి నుంచీ అంచనాలున్నాయి.
2014లో జరిగిన యూత్ ఒలింపిక్స్‌లో ఆయన 77 కిలోల విభాగంలో రజత పతకం గెల్చుకున్నాడు. ఆసియన్ జూనియర్ ఛాంపియన్‌షిప్‌లో కూడా ఆయన స్వర్ణం సాధించాడు.
రాహుల్‌కు క్రీడల పట్ల ఆసక్తి వారసత్వంగా లభించింది. ఆయన తండ్రి రాగాల మధు కబడ్డీ క్రీడాకారుడు. అట్లాగే ఆయన వెయిట్ లిఫ్టర్ కూడా. రాహుల్‌ను పిన్న వయస్సులోనే క్రీడల్లోకి తీసుకొచ్చింది ఆయన తండ్రిగారే.
హైదరాబాద్‌లోని స్టేట్ స్పోర్ట్స్ స్కూల్‌లో ప్రవేశం పొందిన తర్వాత రాహుల్ కెరీర్‌కు సరైన దిశ లభించింది.
గతంలో రాహుల్ సాధించిన పతకాలివీ:
- 2017: గోల్డ్ కోస్ట్, కామన్వెల్త్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించాడు.
- 2015: పుణె కామన్వెల్త్ ఛాంపియన్‌షిప్‌లో రజతం గెలిచాడు.
- 2013: మలేషియాలో జరిగిన కామన్వెల్త్ యూత్ అండ్ జూనియర్ వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో 2 బంగారు పతకాలు సాధించాడు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








