యాపిల్, గూగుల్, ఫేస్‌బుక్, అమెజాన్, నెట్‌ఫ్లిక్స్... వీటి భవిష్యత్తు ఏమిటి?

- రచయిత, అమోల్ రాజన్
- హోదా, బీబీసీ మీడియా ఎడిటర్
టెక్నాలజీ కంపెనీల షేర్లు గత వారం బాగా నష్టపోయాయి. దశాబ్ద కాలంగా ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న టెక్నాలజీ దిగ్గజాలు ఫేస్‌బుక్, యాపిల్, అమెజాన్, నెట్‌ఫ్లిక్స్, గూగుల్(ఎఫ్‌ఏఏఎన్‌జీల)కు గత వారం నిరాశాజనకంగా ఉంది.
ఒక దశలో ఈ ఐదు సంస్థల మార్కెట్ విలువ గరిష్ఠ స్థాయితో పోలిస్తే 20 శాతానికి పైగా పతనమైంది. ఫలితంగా వేల కోట్ల డాలర్ల వీటి సంపద ఆవిరైపోయింది.
ఈ ఏడాది ట్రిలియన్ డాలర్ మార్కెట్ విలువను దాటిన తొలి సంస్థ యాపిల్. కొంతకాలం తర్వాత దీని మార్కెట్ విలువ 840 బిలియన్ డాలర్లకు పడిపోయింది.
ట్రిలియన్ డాలర్ మైలురాయిని అందుకున్న అమెజాన్ మార్కెట్ విలువ ఈ నెల 20న మంగళవారం 731 బిలియన్ డాలర్లకు పతనమైంది. అంటే ట్రిలియన్ డాలర్ విలువలో దాదాపు పావు భాగం కోల్పోయినట్లు లెక్క.
ఫేస్‌బుక్ మార్కెట్ విలువ గత ఏడాది మొదట్లో ఎంతుందో ఇప్పుడూ సుమారు అంతే ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
అసలు టెక్ కంపెనీల షేర్లు ఎందుకు పతనమవుతున్నాయి? సంస్థల స్థూల ఆర్థిక స్థితిగతులపై ఈ పతనం ఎలాంటి సంకేతాలు పంపుతోంది?
మార్కెట్ ఒడిదుడుకులు, పెట్టుబడి పెట్టాలా, వద్దా అనే అంశాల గురించి ఆలోచించేటప్పుడు ప్రాథమిక అంశాలను, దీర్ఘకాలిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలి.
నిరాశాజనక పరిస్థితులను ఎదుర్కొన్నప్పటికీ, ఈ దిగ్గజ టెక్ కంపెనీలు సుసంపన్నమైనవి. ఇవి ప్రపంచంలోకెల్లా అత్యంత చురుకైన ఆవిష్కర్తలు పనిచేసే సంస్థలు. ప్రణాళికల రూపకల్పనలో ఈ సంస్థలు సమర్థవంతమైనవి. ఇవి లాభాలనూ పెద్దయెత్తున గడిస్తున్నాయి. అమెజాన్‌నే ఉదాహరణగా తీసుకొంటే ఈ సంస్థకు రికార్డు స్థాయిలో లాభాలు వచ్చాయి. యాపిల్, ఫేస్‌బుక్ అయితే అంచనాలు మించి లాభాలను ఆర్జించాయి.
ప్రపంచ స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధిరేటు బలహీనంగా ఉండటం, అమెరికా-చైనా వాణిజ్య పోరు వల్ల స్టాక్‌మార్కెట్లపై ప్రతికూల ప్రభావం పడుతోంది. ఈ నేపథ్యంలో టెక్ షేర్లు కూడా దీనిని ఎదుర్కోక తప్పదు.

ఫొటో సోర్స్, Getty Images
టెక్ కంపెనీల పురోగతి: మూడు మార్పుల ప్రభావం
టెక్ కంపెనీల పురోగతిని నెమ్మదింపజేయగల మౌలికమైన మార్పులు మూడు ఉన్నాయి.
మొదటి మార్పు- ప్రపంచవ్యాప్తంగా ద్రవ్య విధానం కఠినతరమవుతోంది. చాన్నాళ్లు తక్కువ వడ్డీరేట్లకు రుణాలు లభిస్తూ వచ్చాయి. ఇది రుణగ్రహీతలకు మంచి చేసేదే. అయితే సాధారణంగా తక్కువ వడ్డీ రేట్లకే రుణాలు లభిస్తుంటే పెట్టుబడిదారులు లాభాలు రాబట్టడంపై అంత ఉత్సాహంగా ఉండరు. రుణ భారం ఎక్కువగా ఉంటే తగిన స్థాయిలో లాభాలు పొందడంపై దృష్టి కేంద్రీకరిస్తారు.
వడ్డీ రేట్లు పెరిగితే ఈక్విటీలపై భారం పడుతుంది. టెక్ కంపెనీల షేర్లపై ఈ ప్రభావం కనిపిస్తోంది.
రెండో మార్పు ఏంటంటే- అమెరికా, బెల్జియం, జర్మనీ, భారత్ సహా ప్రపంచమంతటా శాసనకర్తలు టెక్ కంపెనీలపై మెరుగైన నియంత్రణ సామాజిక అవసరమని భావించడం. ఆర్థికపరంగా చూస్తే ఇది సాధ్యం కావచ్చనే భావన కూడా వారిలో ఉంది.
మూడో కారణమేంటంటే- తీవ్రమవుతున్న జాతీయవాదం. చాలా దేశాల్లో ఇది అనేక అంతర్జాతీయ కంపెనీల స్వేచ్ఛకు పరిమితులు తీసుకొచ్చింది.
వినియోగదారుల డేటాపై నియంత్రణను కంపెనీల చేతుల్లోంచి వినియోగదారుల చేతుల్లోకి బదలాయించే 'జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్(జీడీపీఆర్)'ను ఈ సందర్భంలో ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. ఈ రెగ్యులేషన్ యూరప్‌లో విజయవంతమైతే ఇతర ప్రాంతాల్లోనూ విస్తృతంగా ఈ తరహా నిబంధనలు తీసుకొచ్చే అవకాశముంది.
మూడో మార్పు ఏంటంటే- టెక్ కంపెనీలు వృద్ధిలో గరిష్ఠ స్థాయికి చేరుకొంటుండటం, అంతకుమించి ఎదిగే అవకాశాలు పెద్దగా లేకపోవడం.
ఫేస్‌బుక్, యాపిల్ లాంటి సంస్థలు ఇప్పటికే తమ రంగాల్లో గరిష్ఠ వృద్ధిని చేరుకొని ఉంటే భవిష్యత్తులో ఏమవుతుంది?
సుదీర్ఘకాలంగా యాపిల్ వృద్ధి ప్రధానంగా ఐఫోన్‌పైనే ఆధారపడి ఉంది. అయితే కొత్త వర్షన్ వచ్చే కొద్దీ ఐఫోన్‌కు ఆదరణ తగ్గిపోతోంది. ప్రత్యర్థులు ఐఫోన్‌కు పోటీగా దీటైన ఫోన్లను విడుదల చేయడం, మార్కెట్లు గరిష్ఠ స్థాయికి చేరుకోవడం ఈ పరిస్థితికి కారణాలు.

ఫొటో సోర్స్, Getty Images
ఫేస్‌బుక్ విషయానికి వస్తే, కీలక మార్కెట్లు అయిన అమెరికా, కెనడా, యూరప్‌లలో గత త్రైమాసికంలో ఈ సంస్థ ఎలాంటి పురోగతినీ సాధించలేదు.
శరవేగంగా వృద్ధి చెందుతూ వచ్చిన, 260 కోట్ల అంతర్జాతీయ యూజర్ల సంఖ్యను అందుకొనే దిశగా సాగుతున్న కంపెనీ ఆలోచనా తీరును ఈ పరిణామం ఎలా ప్రభావితం చేస్తుందో చూడాలి. ఫేస్‌బుక్ అందుకోగల గరిష్ఠ యూజర్ల సంఖ్య 300 కోట్లు అయితే అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది?
దీనిని దృష్టిలో ఉంచుకొనే ఫేస్‌బుక్ తన యాజమాన్యంలోని సోషల్ నెట్‌వర్క్ ఇన్‌స్టాగ్రామ్ నుంచి ఎక్కువ లబ్ధి పొందాలని చూస్తోంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కువ ప్రకటనలు ఉంచుతోంది.
యూజర్ల డేటాను సోషల్ నెట్‌వర్క్‌లు దుర్వినియోగపరచడంపై వివాదాలు తీవ్రమై, యూజర్లు పూర్తిగా ప్రైవేటు వేదికైన వాట్సాప్‌కు పరిమితమైతే ఏమవుతుతుంది? వాట్సాప్‌లో ప్రకటనలు చాలా పరిమితంగా ఉంటాయి. ఉదాహరణకు యూజర్‌ను ఫేస్‌బుక్ న్యూస్ ఫీడ్ ద్వారా కంటే వాట్సాప్ ద్వారా కారు కొనేలా చేయడం చాలా కష్టం. వాట్సాప్ కూడా ఫేస్‌బుక్‌దే.
పెట్టుబడిదారులపై ప్రభావం
టెక్ కంపెనీలను ప్రత్యేకించి ఫేస్‌బుక్‌ను చుట్టుముడుతున్న వివాదాలు పెట్టుబడిదారుల ఆలోచనలను ప్రభావితం చేస్తాయి.
దాదాపు దశాబ్ద కాలంగా ప్రపంచవ్యాప్తంగా కార్మికులు ఆర్థిక ఒడిదొడుకులపై పోరాడుతూ, విపత్తును నివారించారు. అదే సమయంలో టెక్ కంపెనీలు అంతులేని స్వేచ్ఛను అనుభవించాయి. వడ్డీరేట్లు, నియంత్రణలు తక్కువగా ఉన్న కాలంలో శరవేగంగా పురోగమించాయి. కొత్త కొత్త మార్కెట్‌ల రూపంలో వీటికి అవకాశాలు వెల్లువెత్తాయి. అంతర్జాతీయవాదం బలంగా ఉన్న సమయంలో ఈ సంస్థల పన్ను వ్యవహారాల విషయంలో ఆయా దేశాలు కఠినంగా వ్యవహరించలేదు.
ఇప్పుడు వడ్డీరేట్లు పెరుగుతున్నాయి. నియంత్రణలు అమల్లోకి వస్తున్నాయి. సంస్థల వృద్ధి గరిష్ఠ స్థాయికి చేరుకొంటోంది. ప్రత్యర్థుల నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. అంతర్జాతీయవాదం స్థానంలో జాతీయవాదం వచ్చి చేరుతోంది. పన్ను వ్యవహారాలపై నిశిత పరిశీలన మొదలైంది. అందుకే సంస్థల పరిస్థితులు మారిపోతున్నాయి.
స్టాక్ మార్కెట్లలో గత వారం ఎదురైన నిరాశాజనక పరిస్థితుల నుంచి టెక్ కంపెనీలు కచ్చితంగా కోలుకొంటాయి. వీటి మార్కెట్ విలువ కూడా మెరుగుపడొచ్చు. అయినప్పటికీ రానున్నకాలంలో టెక్ రంగానికి గడ్డు పరిస్థితులు తప్పవు.
ఇవి కూడా చదవండి:
- 26/11 ముంబయి దాడులు: ‘ఆ మారణకాండ నుంచి నేనెలా బైటపడ్డానంటే..’
- నల్లడబ్బు స్విస్ బ్యాంకులకు ఎలా తరలిపోతోంది?
- ఆ రోజు ఈ ఫొటో తీసింది ఎవరు? కసబ్ గురించి ఆ ఫొటో జర్నలిస్టు ఏమంటున్నారు?
- తెలంగాణలో 24 గంటల విద్యుత్ విజయమా? వ్యయమా?
- ‘క్రైస్తవ మత ప్రచారకుడిని చంపిన అండమాన్ ఆదిమజాతి ప్రజలు’
- అయోధ్యలో ఉద్ధవ్ థాకరే: 'రామ మందిరం కట్టకపోతే, ప్రభుత్వం కూడా ఉండదు'
- నమ్మకాలు-నిజాలు: పత్యం అంటే ఏమిటి? పాటించకపోతే ఏమవుతుంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








