'అయోధ్యలో రామ మందిరం కట్టకపోతే మోదీ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి రాలేదు' : ఉద్ధవ్ థాకరే

ఫొటో సోర్స్, TWITTER/SHIVSENA
'మోదీ ప్రభుత్వం అయోధ్యలో రామ మందిరం కట్టకపోతే, అది బహుశా మరోసారి అధికారంలోకి రాలేద'ని అయోధ్యలో పర్యటిస్తున్న శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే అన్నారు.
ఆదివారం తన కుటుంబంతో కలిసి రామ్ లల్లాను దర్శించుకున్న తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
'రామ మందిరం కట్టకపోతే ఏం చేస్తారని' మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఉద్ధవ్ సమాధానం ఇచ్చారు.
"మొదట ప్రభుత్వం దీనిపై పని చేయనివ్వండి. ఈ ప్రభుత్వం బలంగా ఉంది. వీళ్లు కట్టకపోతే ఇంకెవరు కడతారు. ఈ ప్రభుత్వం గుడి కట్టకపోతే, ఆలయాన్ని మాత్రం కచ్చితంగా నిర్మిస్తారు. కానీ ఈ ప్రభుత్వం ఉండదు" అని ఉద్ధవ్ అన్నారు.
"నాకు ఎలాంటి రహస్య ఎజెండాలూ లేవు. దేశప్రజల భావోద్వేగాలు చూసే నేనొచ్చాను. ప్రపంచంలోని హిందువులంతా రామ మందిరం ఎప్పుడు కడతారో తెలుసుకోవాలని అనుకుంటున్నారు. ఎన్నికల సమయంలో అందరూ రామ జపం చేస్తారు. నెలలు, ఏళ్లు గడిచిపోతున్నాయి, తరాలు మారిపోతున్నాయి. కానీ రామ మందిరం మాత్రం నిర్మించలేదు" అని ఉద్ధవ్ అన్నారు. .

ఫొటో సోర్స్, TWITTER/SHIVSENA
మనోభావాలతో చెలగాటమా?
"మందిరం ఎక్కడ ఉండేదో అక్కడే ఉంది, ఉంటుంది అని ముఖ్యమంత్రి యోగి అన్నారు. కానీ అది కనిపించడం లేదే? వీలైనంత త్వరగా ఆలయం నిర్మించాలి. రండి, ఒక చట్టం చేయండి. శివసేన సహకరిస్తుంది. హిందువుల మనోభావాలతో చెలగాటం వద్దు" అని ఆయన అన్నారు.
"ఇప్పుడు హిందువులు ఎంత బలంగా ఉన్నారంటే, దెబ్బలు తినడం మాత్రం జరగదు" అని ఉద్ధవ్ చెప్పారు.
అంతకుముందు శివసేన చీఫ్ శ్రీరాముడి దర్శనం కోసం వెళ్లారు.
"ఈరోజు దర్శనానికి వెళ్లినప్పుడు అక్కడ ఒక ప్రత్యేక అనుభూతి కలిగింది. అక్కడ కచ్చితంగా ఏదో చైతన్యం ఉంది. కానీ, ఆలయంలోకి వెళ్తుంటే ఏదో జైల్లోకి వెళ్తున్నట్టు అనిపించడమే బాధేసింది" అన్నారు.
"ఆలయం కట్టడానికి రాజ్యాంగ పరిధిలోని అన్ని అవకాశాలను అన్వేషిస్తామని ప్రభుత్వం చెప్పింది. గత నాలుగేళ్లుగా ఏయే అవకాశాలను చూశారు. రామ మందిరం నిర్మాణం దిశగా ముందుకు కదలడానికి మీకు ఒక్క అవకాశం కూడా దొరకలేదా? అని ఉద్ధవ్ అన్నారు.

ఫొటో సోర్స్, TWITTER/SHIVSENA
ఆర్డినెన్స్ తెస్తే, మద్దతిస్తాం
అంతకు ముందు శనివారం లక్ష్మణ్ ఖిలా మైదానంలో ఆయన బీజేపీపై విమర్శలు సంధించారు. "ఈరోజు మాకు ఆలయం ఎప్పుడు నిర్మిస్తారో తేదీ చెప్పండి, తర్వాత మిగతావన్నీ జరిగిపోతాయి" అన్నారు.
"గత నాలుగున్నరేళ్ల నుంచి బీజేపీ రామమందిరం అంశంపై నిద్రపోతోంది. ఈ అంశంపై బీజేపీ బిల్లు లేదా ఆర్డినెన్స్ తీసుకురావాలి. మా పార్టీ దానికి కచ్చితంగా మద్దతు ఇస్తుంది" అని ఉద్ధవ్ థాకరే చెప్పారు.
"వాజ్‌పేయిది సంకీర్ణ ప్రభుత్వం. అప్పుడు ఆలయం అంశం లేవనెత్తడం బహుశా కఠినంగా ఉండచ్చు. కానీ ఇప్పుడు ప్రభుత్వం చాలా బలంగా ఉంది. కేంద్ర, రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది"
"ఆలయం నిర్మించలేకపోతే, మా వల్ల కాదని ప్రభుత్వానికి చెప్పేయండి" అని ఠాకరే అన్నారు.
ఇవి కూడా చదవండి:
- జమాల్ ఖషోగ్జీ హత్య కేసు: సౌదీ యువరాజును సీఐఏ నిందించలేదన్న ట్రంప్
- మిథాలీరాజ్‌ను ఆడించకపోవడం వల్లే భారత జట్టు ఓడిందా?
- భూప్రళయం: డైనోసార్లు అంతమైన ప్రాంతం ఇదే
- శ్రీలంకలో శవాల దిబ్బ: మన్నార్ సమాధిలో 230 అస్థిపంజరాలు... అవి ఎవరివి? హంతకులెవరు?
- అమెరికా యాత్రికుడిని 'చంపిన అండమాన్ ఆదిమజాతి ప్రజలు'
- యెమెన్ సంక్షోభం: ఆహార లోపం వల్ల 85,000 మంది చిన్నారుల మృతి
- టీచర్లకు ఏ దేశంలో ఎక్కువ గౌరవం లభిస్తోంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








