ఫేస్‌బుక్: ప్రైవసీకి ప్రాధాన్యమిచ్చే వేదికగా మార్చేస్తామంటున్న మార్క్ జుకర్‌బర్గ్

ఫొటో సోర్స్, AFP/GETTY IMAGES
ఇతర బహిరంగ వేదికలకన్నా సురక్షితమైన, ప్రైవేట్ మెసేజింగ్ వేదికలు మరింత ప్రజాదరణ పొందుతాయని తాను విశ్వసిస్తున్నట్లు ఫేస్‌బుక్ బాస్ మార్క్ జుకర్‌బర్గ్ చెప్పారు.
ఫేస్‌బుక్‌ను గోప్యతకు ప్రాధాన్యమిచ్చే వేదికగా మలచటానికి తన ప్రణాళికలను జుకర్‌బర్గ్ ఒక బ్లాగ్‌లో వివరించారు.
ప్రస్తుతం మెసెంజర్, వాట్సాప్‌లు ఫేస్‌బుక్ సొంతం. కానీ టార్గెటెడ్ వాణిజ్య ప్రకటనల ద్వారా ఆదాయం పొందటం కోసం మెసేజ్ ఎన్‌స్క్రిప్షన్ సామర్థ్యం పరిమితమైంది.
కొంతకాలంగా గోప్యతకు సంబంధించి వరుస కుంభకోణాలు బయటపడటంతో సోషల్ మీడియా దిగ్గజ సంస్థ ఫేస్‌బుక్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంది.
2018లో దాదాపు ఐదు కోట్ల మంది యూజర్ల సమాచారం క్రోడీకరించి ఒక రాజకీయ కన్సల్టెన్సీకి అందజేసినట్లు వెలుగుచూసింది.

ఫొటో సోర్స్, facebook
జుకర్‌బర్గ్ ఏం చెప్పారు?
''జనం తమ స్నేహితులతో, సమాజాలతో, అభిరుచులతో అనుసంధానం అవటానికి.. పట్టణ కూడలి వంటి డిజిటల్ వేదికలైన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లు దోహదపడ్డాయి'' అని ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు, బిలియనీర్ జుకర్‌బర్గ్ అన్నారు.
''అయితే, లివింగ్ రూమ్ తరహా డిజిటల్ వేదికల మీద గోప్యంగా అనుసంధానం కావాలన్న ఆకాంక్ష కూడా జనంలో పెరుగుతోంది'' అని చెప్పారు.
ఇందుకోసం గోప్యత ప్రధానంగా తమ సోషల్ మీడియా నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేయాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు. సమాచారం శాశ్వతంగా ఉండిపోవటాన్ని తగ్గించటంతో పాటు.. డాటా స్టోరీజీ మరింత సురక్షితంగా ఉండేలా చేయాలన్నది ప్రణాళికగా చెప్పారు.
గోప్యతకు సంబంధించిన తన లక్ష్యాలలో భాగంగా.. ''గోప్యత, భావప్రకటనా స్వేచ్ఛ వంటి మానవ హక్కులు బలహీనంగా ఉన్న దేశాలలో సున్నితమైన సమాచారాన్ని ఫేస్‌బుక్ స్టోర్ చేయబోద''ని వెల్లడించారు.
''ఈ సూత్రాన్ని పాటించటమంటే.. కొన్ని దేశాల్లో మా సర్వీసులను బ్లాక్ చేస్తారు. లేదంటే మరికొన్ని దేశాల్లోకి ఇప్పట్లో ప్రవేశించలేం. ఈ త్యాగానికి మేం సంసిద్ధంగా ఉన్నాం'' అని పేర్కొన్నారు.
ఎన్‌స్క్రిప్టెడ్ మెసేజింగ్ వల్ల.. ప్రత్యేకించి ఆన్‌లైన్ చెల్లింపులు, వాణిజ్యంలో కొత్త బిజినెస్ టూల్స్‌కు అవకాశం ఏర్పడుతుందని చెప్పారు.
అయితే, ఈ కొత్త ప్రణాళిక ఎప్పటి నుంచి అమలులోకి వస్తుందనేది జుకర్‌బర్గ్ వెల్లడించలేదు. ఈ మార్పులు ''రాబోయే కొన్ని సంవత్సరాల్లో'' జరుగుతాయన్నారు.
''జనం ప్రైవేటుగా మాట్లాడుకోవటానికి, తమ సమాచారాన్ని తాము కోరుకున్న వాళ్లు మాత్రమే చూడగలరని, ఆ సమాచారం శాశ్వతంగా అంటుకుపోయి ఉండబోదని భరోసాగా ఉండగల ప్రపంచం కోసం మనం పనిచేయాలన్నది నా విశ్వాసం'' అని మార్క్ వ్యాఖ్యానించారు.


ఫొటో సోర్స్, Reuters
ఫేస్‌బుక్ సరికొత్త దిశానిర్దేశం: జో క్లీన్‌మన్, బీబీసీ టెక్నాలజీ రిపోర్టర్
ఇది ఫేస్‌బుక్‌కి సరికొత్త దిశానిర్దేశం కావచ్చు. ఫేస్‌బుక్ తన సొంత ఆలోచనలను అమలులోకి తెచ్చి దానిపై వచ్చిపడే ఫీడ్‌బ్యాక్‌కు స్పందించటానికి బదులుగా.. యూజర్లు ఏం కోరుకుంటున్నారు అనే దానిని ఎట్టకేలకు వినిపించుకుంటోందని, మారుతున్న వారి అలవాట్లకు అనుగుణంగా ప్రతిస్పందిస్తోందని చెప్పొచ్చు.
సాంకేతిక రంగంలో అనుమతి కోరటం కన్నా క్షమాపణ కోరటం అరుదైన విషయమేమీ కాదు.
అలాగే, ప్రపంచ వ్యాప్తంగా వివిధ ప్రభుత్వాలు సిద్ధం చేస్తున్న సోషల్ నెట్‌వర్క్ నియంత్రణ నిబంధనల ముప్పు నుంచి గట్టెక్కటానికి.. యూజర్ల డేటాను తాము స్టోర్ చేయబోమని, ఆ సమాచారాన్ని తాము సైతం చూడబోమని చెప్తున్న ఈ కొత్త విధానం సాయపడుతుందని కూడా వాదించవచ్చు.
అయితే.. గోప్యత విషయంలో ఫేస్‌బుక్ ఇటీవలి ట్రాక్ రికార్డును పరిష్కరించటానికి రూపొందించిన డిజైన్ ఈ సరికొత్త గోప్యతా విధానం అనటంలో సందేహం లేదు.

ఈ పరిణామం నేపథ్యం ఏమిటి?
యూజర్లకు గోప్యత లోపించటం మీద, మనోభావాలను దెబ్బతీసే కంటెంట్, ఫేక్ న్యూస్ వ్యాప్తి విషయంలో ఫేస్‌బుక్ ఇటీవల తీవ్ర విమర్శల పాలైంది.
గత ఏడాది మార్చిలో కేంబ్రిడ్జ్ ఎనలిటికా కుంభకోణం వల్ల కొన్ని రోజుల్లోనే ఫేస్‌బుక్ షేర్ విలువ దాదాపు 80 బిలియన్ డాలర్లు తుడిచిపెట్టుకుపోయింది.
బ్రిటన్ కేంద్రంగా పనిచేస్తున్న సదరు కన్సల్టెన్సీ లక్షలాది మంది అమెరికా యూజర్ల డాటాను దుర్వినియోగం చేస్తోందన్న ఆరోపణలు ఎదుర్కొంది.
2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌కు సాయపడటానికి ఈ సమాచారాన్ని ఉపయోగించారన్న ఆరోపణను కేంబ్రిడ్జ్ ఎనలిటికా తిరస్కరించింది. ఫేస్‌బుక్ విధానాలకు అనుగుణంగా తాము సమాచారాన్ని డిలీట్ చేశామని చెప్పింది.
అయితే.. మరిన్ని ఆరోపణలు రావటంతో కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌ను సస్పెండ్ చేశారు.
మరోవైపు.. ఈ కుంభకోణం వెలుగుచూసి యూజర్ల సమాచార గోప్యత మీద ప్రకంపనలు సృష్టించినప్పటికీ.. తమ యూజర్ల సంఖ్య పెరుగుతూనే ఉందని ఫేస్‌బుక్ చెప్తోంది.
కనీసం నెలకు ఒకసారైనా ఫేస్‌బుక్‌లో లాగిన్ అయ్యే యూజర్ల సంఖ్య గత ఏడాది 9 శాతం పెరిగి 2.32 బిలియన్లకు చేరిందని వెల్లడించింది.
అయితే.. ఫేస్‌బుక్ రెండో అతిపెద్ద మార్కెట్ అయిన అమెరికాలో యూజర్ల సంఖ్య 2017 నుంచి 1.5 కోట్లు పడిపోయిందని మార్కెట్ రీసెర్చ్ సంస్థ ఎడిసన్ రీసెర్చ్ చెప్తోంది.
ఇవి కూడా చదవండి:
- ఫేస్‌బుక్ ప్రాభవం తగ్గుతోందా? ఈ 8 సంకేతాలు ఏం చెబుతున్నాయి?
- మోదీ ప్రధాని అయ్యేందుకు ఫేస్‌బుక్ సహకరించిందా?
- బిజెపి, కాంగ్రెస్‌లు మీ ఫేస్‌బుక్ డేటా వాడుకుంటున్నాయా!
- ఫేస్‌బుక్: ‘భద్రతాలోపం.. హ్యాకింగ్ బారిన 5 కోట్ల మంది యూజర్ల ఖాతాలు’
- వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, మెసెంజర్లను ఏకం చేస్తున్న ఫేస్‌బుక్
- ఫేస్‌బుక్ మోడరేటర్: చూడలేనివెన్నో అక్కడ చూడాల్సి ఉంటుంది!
- 15 రాత్రుల్లో 121 మంది మహిళలతో...: ప్రాచీన చైనా చక్రవర్తుల జీవితాన్ని గణితశాస్త్రం ఎలా ప్రభావతం చేసింది?
- పాకిస్తాన్లో భారత టీవీ షోలు, సినిమాలను నిషేధిస్తే ఎవరికి లాభం...
- 'ఎయిర్‌ఫోర్స్‌లో నా పై అధికారి నన్ను రేప్ చేశాడు' - అమెరికా సెనెటర్ మార్తా మెక్‌శాలీ
- మహిళల్లో సున్తీ (ఖత్నా) అంటే ఏమిటి... ఐక్యరాజ్య సమితి దీన్ని ఎందుకు నిషేధించాలంటోంది... #EndFGM
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









