'ఎయిర్‌ఫోర్స్‌ ఉన్నతాధికారి నన్ను రేప్ చేశాడు' - అమెరికా సెనెటర్ మార్తా మెక్‌శాలీ

సెనెటర్ మెక్‌శాలీ

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, సెనెటర్ మార్తా మెక్‌శాలీ: "అవమానానికి, అయోమయానికి గురయ్యాను. నా దైర్యమంతా పోయి బలహీనంగా మిగిలిపోయాననే భావన కలిగింది"

అమెరికా వైమానిక దళంలో ఉన్నపుడు తన మీద ఓ ఉన్నతాధికారి దాడికి పాల్పడి అత్యాచారం చేశాడని అమెరికా సెనెటర్ మార్తా మెక్‌శాలీ తన సహచర సెనెటర్లకు వెల్లడించారు.

యుద్ధంలో అమెరికా యుద్ధ విమానం నడిపిన మొట్టమొదటి మహిళా పైలట్ అయిన మార్తా, సైన్యంలో లైంగిక దాడుల మీద జరుగుతున్న విచారణలో మాట్లాడారు.

ఆమె ఆరిజోనా నుంచి రిపబ్లికన్ పార్టీ తరఫున సెనేట్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తనపై జరిగిన అత్యాచారం వల్ల తాను సిగ్గుతో కుంగిపోయానని, వ్యవస్థ మీద నమ్మకం లేకపోవటంతో ఎవరికీ ఫిర్యాదు చేయలేదని తెలిపారు.

అమెరికా సైన్యంలో లైంగిక దాడుల ఫిర్యాదులు 2017లో పది శాతం మేర పెరిగాయి.

‘‘నేను చాలా ఏళ్ల పాటు మౌనంగా ఉన్నాను. కానీ నా కెరీర్ తర్వాతి కాలంలో సైన్యంలో ఈ కుంభకోణాలు పెరిగిపోవటం.. వాటిపట్ల నిర్లక్ష్యపూరిత ధోరణి వల్ల.. నేను కూడా బాధితురాలినేనని కొందరికి తెలియజేయాల్సిన అవసరముందని భావించాను’’ అని సాయుధ సర్వీసులపై సెనేట్ ఉపసంఘానికి మార్తా చెప్పారు.

‘‘నాకు ఎదురైన పరిస్థితిని వెల్లడించటానికి నేను చేసిన ప్రయత్నాన్ని అడ్డుకున్న తీరు చూసి నేను తీవ్ర భయభ్రాంతులకు లోనయ్యాను. పద్దెనిమిదేళ్ల సర్వీసులో నేను తీవ్రంగా కుంగిపోయాను. ఎయిర్ ఫోర్స్ నుంచి దాదాపుగా వేరయ్యాను. ఈ వ్యవస్థ నన్ను మళ్లీ రేప్ చేస్తున్నట్లు నాకు అనిపించింది’’ అని వివరించారు.

మార్తా మెక్‌శాలీ (ఎడమ), జోనీ ఎర్నెస్ట్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సెనెటర్లు మార్తా మెక్‌శాలీ (ఎడమ), జోనీ ఎర్నెస్ట్ తాము లైంగిక వేధింపులు, దాడులకు గురయ్యామని వెల్లడించారు

మార్తా ‘‘సాక్ష్యం నాపై తీవ్ర ప్రభావం చూపింది’’ అని ఆ కమిటీలో సీనియర్ సెనెటర్ క్రిస్టెన్ గిలిబ్రాండ్ పేర్కొన్నారు. న్యూయార్క్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న క్రిస్టెన్ ఈ ఉపసంఘంలో ఉన్నతస్థాయి డెమొక్రట్ సభ్యురాలు.

మార్తా అమెరికా వైమానిక దళంలో 26 సంవత్సరాలు పనిచేశారు. కల్నల్ ర్యాంకు వరకూ ఎదిగారు. 2010లో పదవీ విరమణ చేశారు.

ఆమె గత ఏడాది సెనేట్‌కు ఎన్నికయ్యారు. అంతకుముందు ప్రతినిధుల సభకు రెండుసార్లు ప్రాతినిధ్యం వహించారు.

తాను కూడా లైంగిక దాడి బాధితురాలినని మార్తా చెప్పటం ఇది మొదటిసారి కాదు.

ఆమె గత ఏడాది సెనేట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నపుడు వాల్ స్ట్రీట్ జర్నల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనకు 17 ఏళ్ల వయసు ఉన్నపుడు తన హైస్కూల్ అథ్లెటిక్ కోచ్ తనను అతడితో బలవంతంగా సెక్స్‌లో పాల్గొనేలా ఒత్తిడి చేశాడని చెప్పారు.

సైన్యంలో ఉన్నపుడు తనను లైంగికంగా వేధించారని ఆమె గతంలో పేర్కొన్నారు.

మరో సీనియర్ సెనేట్ సభ్యురాలు జోనీ ఎర్నెస్ట్ కూడా.. సైన్యంలో తనపై అత్యాచారం చేశారని జనవరిలో చెప్పారు.

అయోవా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రిపబ్లికన్ సెనెటర్ జోనీ. ఆమె బ్లూమ్‌బర్గ్ సంస్థతో మాట్లాడుతూ.. అయోవా స్టేట్ యూనివర్సిటీలో చదువుకుంటున్నపుడు తనను వేధించే బాయ్‌ఫ్రెండ్ తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని కూడా తెలిపారు.

అయితే, తాను ఈ ఘటన గురించి పోలీసులకు ఫిర్యాదు చేయలేదన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)