బాలాకోట్‌లో 292మంది మిలిటెంట్లు చనిపోయారా: FactCheck

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఫ్యాక్ట్ చెక్ బృందం
- హోదా, బీబీసీ న్యూస్
పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లో భారత వైమానిక దళం జరిపిన దాడిలో 292 మంది తీవ్రవాదులు చనిపోయారంటూ వాట్సాప్ సంభాషణ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి, అందులో వాస్తవమెంత?
కశ్మీర్‌లోని పుల్వామా దాడికి బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించిన జైషే మొహమ్మద్ మిలిటెంట్ సంస్థకు చెందిన శిక్షణా శిబిరాలే లక్ష్యంగా భారత్ వైమానిక దాడి చేసింది.
ఆ దాడి గురించి భారత్‌కు చెందిన ఓ వ్యక్తికి, డాక్టర్ ఇజాజ్ అనే పాకిస్తాన్ వ్యక్తికి మధ్య వాట్సాప్‌లో సంభాషణ జరిగినట్లుగా చూపుతున్న స్క్రీన్‌షాట్లు సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి.
డాక్టర్ ఇజాజ్ అనే వ్యక్తి బాలాకోట్‌లోని వైద్య విశ్వవిద్యాలయానికి చెందిన వైద్యుడని, భారత యుద్ధ విమానాలు దాడులు చేసినప్పుడు ఆయన ఘటనా స్థలానికి సమీపంలోనే ఉన్నారని అందుకే, ఆ దాడిలో ఎంత మంది చనిపోయారో ఈ వాట్సాప్ చాటింగ్‌లో ఆయన నిర్ధారించారని పేర్కొంటున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ఈ స్క్రీన్ షాట్‌లో ఏముంది?
మొదటి వ్యక్తి: ఏంటిది... భారత్ నిజంగానే వైమానిక దాడి జరిపిందా? లేక అది కేవలం మీడియా అబద్ధపు ప్రచారమా?
రెండో వ్యక్తి: భారత వైమానిక దళం బాలాకోట్‌తో పాటు, పరిసర ప్రాంతాల్లోకి ప్రవేశించింది.. కానీ, నియంత్రణ రేఖను దాటడం తప్పు.
మొదటి వ్యక్తి: నిజమే, 12 విమానాలు నియంత్రణ రేఖను దాటాయి. కానీ, పాకిస్తాన్‌కు చెందిన జైషే మొహమ్మద్ దాడులు చేస్తే, భారత్ కూడా సమాధానం చెబుతుంది. భారత దాడిలో ఎంతమంది చనిపోయారో మీకు తెలుసా?
రెండో వ్యక్తి: సోదరా... స్థానికులెవరూ చనిపోలేదు, మిలిటెంట్లే చనిపోయారు. వాళ్లు మమ్మల్ని కూడా ఇబ్బంది పెడుతున్నారు.
ఈ 'సంభాషణ' సోషల్ మీడియాలో పెద్దఎత్తున షేర్ అవుతోంది.
వైమానిక దాడిలో ఎంతమంది మిలిటెంట్లు చనిపోయారో చూపుతున్న మరో స్క్రీన్ షాట్‌ను కూడా దానికి జత చేశారు.
ఇందులో పేర్కొన్న మృతుల సంఖ్య దాదాపు అధికారికంగా ధ్రువీకరించుకోకుండానే భారత మీడియా చానళ్లు చెప్పిన సంఖ్యకు దగ్గరగానే ఉంది.
బాలాకోట్ వైమానిక దాడిలో 250 మంది తీవ్రవాదులు హతమయ్యారని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా చెప్పారు.
అయితే, భారత వైమానిక దళం చీఫ్ బీఎస్ ధనోవా మాత్రం "ఎంతమంది చనిపోయారో లెక్కించడం వైమానిక దళం పనికాదు" అని అన్నారు.
ఈ దాడిలో ఎంతమంది చనిపోయారన్న విషయంపై భారత ప్రభుత్వం కూడా అధికారికంగా ఎలాంటి ప్రకటనా విడుదల చేయలేదు.

ఫొటో సోర్స్, Twitter
ఆ సంభాషణ నిజమైనదా? నకిలీదా?
ఈ వాట్సాప్ సందేశం ప్రకారం, 292 మంది తీవ్రవాదులు చనిపోయారని చెబుతున్నారు.
అయితే, ఈ సంభాషణ నిజమైనది కాదని అనిపిస్తోంది. ఎందుకంటే, పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లో వైద్య విశ్వవిద్యాలయం లేదని మా పరిశీలనలో తేలింది.
పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో మన్సెహరా జిల్లాలో బాలాకోట్ ఉంది. పాకిస్తాన్‌లో పర్యాటకంగా పేరున్న ఈ ప్రాంతం ఆ దేశ రాజధాని ఇస్లామాబాద్‌కు 160 కిలోమీటర్ల దూరంలో ఉంది.
కున్హర్ నది ఒడ్డున కొండ ప్రాంతాలతో బాలాకోట్ చాలా అందంగా కనిపిస్తుంది. సింధూ నాగరికతకు సంబంధించిన నాలుగు ముఖ్యమైన ప్రాంతాల్లో ఇదొకటి.

ఫొటో సోర్స్, Twitter
పాకిస్తాన్ మెడికల్ అండ్ డెంటల్ కౌన్సిల్ వివరాల ప్రకారం, బాలాకోట్ పట్టణ ప్రజలకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాల అబోట్టాబాద్‌లో ఉంది.
బాలాకోట్ ప్రాంతంలో వైద్య విశ్వవిద్యాలయం లేదని భారత వైమానిక దాడుల అనంతరం ప్రత్యక్ష సాక్ష్యులతో మాట్లాడిన బీబీసీ కంట్రిబ్యూటర్ మీర్జా ఔరంగజేబ్ జర్నాల్ చెప్పారు.
"బాలాకోట్‌లో వైద్య విశ్వవిద్యాలయం లేదు. అక్కడ ఓ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మాత్రమే ఉంది. అందులో ఒక వైద్యుడు, కొద్దిమంది సిబ్బంది ఉన్నారు. రోగులను అడ్మిట్ చేసే సదుపాయం కూడా అందులో లేదు" అని ఆయన వివరించారు.
వైమానిక దాడి జరిగిన తర్వాత బాలాకోట్, మన్సెహరా, గార్హి హబిబుల్లాహ్‌లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్లాం. కానీ, అక్కడ గాయపడిన వారు ఒక్కరు కూడా కనిపించలేదు. వైమానిక దాడి జరిగిన ప్రదేశం నుంచి అరగంట ప్రయాణిస్తే ఈ ఆరోగ్య కేంద్రాలు వస్తాయి" అని ఆయన తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- ‘భారత్ ఎకో టెర్రరిజానికి పాల్పడిందని ఐరాసలో ఫిర్యాదు చేయనున్న పాక్’
- బిన్ లాడెన్: ఒసామా కొడుకు హమ్జా సమాచారం ఇస్తే 10 లక్షల డాలర్ల రివార్డు
- భారత్ నిజంగానే జైషే మొహమ్మద్ శిబిరాలపై వైమానిక దాడులు చేసిందా... ప్రత్యక్ష సాక్షులు ఏమంటున్నారు...
- ఎఫ్-16లను భారత్‌పై ఎందుకు ప్రయోగించారు? - పాక్‌ను ప్రశ్నించిన అమెరికా
- ‘350 మందిని చంపేశామన్నారు, వాళ్ళ శవాలేవి...’ -బీబీసీతో పాక్ విదేశాంగ మంత్రి ఖురేషి
- పాకిస్తాన్ చెరలో మగ్గిపోతున్న 54 మంది యుద్ధ ఖైదీలు... 48 ఏళ్లుగా నిరీక్షణ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








