అభినందన్: 'కూలింగ్ డౌన్' ప్రక్రియలో వింగ్ కమాండర్.. కలిసి అభినందించిన రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్

అభినందన్‌తో నిర్మలా సీతారామన్

భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ ప్రస్తుతం 'కూలింగ్ డౌన్' ప్రక్రియలో ఉన్నారని అధికారులు తెలిపారు.

'కూలింగ్ డౌన్' ప్రక్రియలో భాగంగా ఆయనకు పలు రకాలైన వరుస వైద్య పరీక్షలు నిర్వహిస్తారని పీటీఐ వార్తా సంస్థ ఒక కథనంలో తెలిపింది.

శుక్రవారం రాత్రి వాఘా సరిహద్దు వద్ద అభినందన్‌ను పాకిస్తాన్ అధికారులు భారత్‌కు అప్పగించిన సంగతి తెలిసిందే.

అభినందన్‌ను తొలుత అమృత్‌సర్‌కు, అక్కడి నుంచి రాత్రి 11.45 గంటలకు ఢిల్లీకి తీసుకొచ్చారు. దిల్లీలో నేరుగా ఎయిర్ ఫోర్స్ సెంట్రల్ మెడికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ (ఏఎఫ్‌సీఎంఈ)కి తరలించారు.

అభినందన్‌ కుటుంబ సభ్యులతో నిర్మలా సీతారామన్
ఫొటో క్యాప్షన్, అభినందన్‌ కుటుంబ సభ్యులతో నిర్మలా సీతారామన్

భారత సైన్యంలోని వాయుసేన సిబ్బంది అందరికీ సమగ్రమైన, ప్రత్యేక వైద్య సేవలు అందించే కేంద్రం ఇది.

ఆదివారం వరకూ అభినందన్‌కు ఈ 'కూలింగ్ డౌన్' ప్రక్రియ కొనసాగుతుంది.

ఆయన ఆరోగ్య పరీక్షలు పూర్తయిన తర్వాత డీ బ్రీఫింగ్ మొదలవుతుందని అధికారులు వెల్లడించారని పీటీఐ వార్తా సంస్థ వెల్లడించింది.

పాకిస్తాన్ ఎఫ్ 16 విమానాలతో పోరులో భాగంగా ఫిబ్రవరి 27వ తేదీన అభినందన్ మిగ్ 21 యుద్ధ విమానం నడుపుతూ పాకిస్తాన్‌లోకి ప్రవేశించడం, ఈ విమానాన్ని పాక్ నేలకూల్చడం తెలిసిందే.

పాక్ భూభాగంపై దిగగానే కొందరు స్థానికులు అభినందన్‌పై దాడి చేశారు. దీంతో ఆయన కుడి కన్ను భాగం వాచింది.

అభినందన్‌తో నిర్మలా సీతారామన్

అభినందన్ వర్తమాన్‌ను కలిసిన రక్షణ మంత్రి

శనివారం తెల్లవారుజామున అభినందన్ తన కుటుంబ సభ్యులను, పలువురు వాయుసేన అధికారులను కలిశారు.

అలాగే, కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సైతం అభినందర్ వర్తమాన్‌ను కలిశారు. ఆయన ధైర్య సాహసాలపట్ల దేశం మొత్తం గర్వంగా ఉందని సీతారామన్ అభినందించారని వాయుసేన అధికారులు చెప్పారని పీటీఐ వార్తా సంస్థ తెలిపింది.

పాకిస్తాన్‌లో తాను గడిపిన 60 గంటల సమయంలో ఏం జరిగిందో సీతారామన్‌కు అభిమాన్ వివరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)