‘భారత్ ఎకో టెర్రరిజానికి పాల్పడిందని ఐరాసలో ఫిర్యాదు చేయనున్న పాక్’

భారత యుద్ధవిమానాలు వేసిన పేలుడు పదార్థం పడిన ప్రదేశం అంటూ పాక్ సైన్యం విడుదల చేసిన చిత్రం

ఫొటో సోర్స్, Twitter

ఫొటో క్యాప్షన్, భారత యుద్ధవిమానాలు వేసిన పేలుడు పదార్థం పడిన ప్రదేశం అంటూ పాక్ సైన్యం విడుదల చేసిన చిత్రం

భారత్ తమ దేశంపై పర్యావరణ ఉగ్రవాదానికి(ఎకో టెర్రరిజం) పాల్పడిందని ఐక్యరాజ్యసమితికి ఫిర్యాదు చేసేందుకు పాక్ సిద్ధమవుతోంది.

ఈ మేరకు పాకిస్తాన్ మంత్రి ఒకరు శుక్రవారం వెల్లడించినట్లుగా రాయిటర్స్ వార్తాసంస్థ వెల్లడించింది.

భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రంగా ఉన్న ప్రస్తుత తరుణంలో పరిస్థితులను చల్లబరిచేందుకు అమెరికా సహా పలు దేశాలు మధ్యవర్తిత్వం వహించాయి.

భారత యుద్ధ విమానాలు మంగళవారం పాక్ భూభాగంలోకి వెళ్లి అక్కడి బాలాకోట్ ప్రాంతంలో బాంబు దాడి చేశాయి. అక్కడున్న మిలిటెంట్ల స్థావరంపై తాము దాడిచేశామని, ఆ దాడిలో వందలాది మంది మిలిటెంట్లు మరణించారని భారత ప్రభుత్వం కూడా ప్రకటించింది.

మిరాజ్ యుద్ధ విమానం

అయితే, పాక్ మాత్రం దీన్ని ఖండించింది. భారత్ చెబుతున్నట్లుగా బాలాకోట్ ప్రాంతంలో మిలిటెంట్ల స్థావరాలు ఏమీ లేవని చెబుతూనే.. భారత్ దాడిలో ఒక గ్రామస్థుడు గాయపడ్డాడని చెప్పింది.

మరోవైపు పాకిస్తాన్ క్లైమేట్ చేంజ్ మినిస్టర్ మాలిక్ అమీన్ అస్లాం దీనిపై మాట్లాడుతూ భారత యుద్ధ విమానాలు తమ రిజర్వ్ ఫారెస్ట్‌పై బాంబుల వర్షం కురిపించాయని, అది పర్యావరణంపై ఎలాంటి ప్రభావం చూపిందో తమ ప్రభుత్వం అంచనా వేస్తోందని చెప్పారు.

తమ దేశ అటవీ సంపదకు, పర్యావరణానికి నష్టం కలిగించినందున ఐరాసకు ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు.

''పదుల సంఖ్యలో పైన్ వృక్షాలు నేలకూలాయి. పర్యావరణాన్ని తీవ్రంగా ధ్వంసం చేశారు. ఇది 'ఎన్విరానమెంటల్ టెర్రరిజం'' అని ఆయన చెప్పినట్లుగా రాయిటర్స్ వార్తాసంస్థ వెల్లడించింది.

ఐరాస సర్వసభ్య సమావేశ తీర్మానం 47/37 ప్రకారం ''సైనిక అవసరాల ప్రకారం తప్పనిసరి కాకపోయినా, ఉద్దేశపూర్వకంగానే పర్యావరణ వినాశనానికి పాల్పడితే అది అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధం''.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)