పాకిస్తాన్ బలం అమెరికా యుద్ధ విమానాలేనా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జుగల్ పురోహిత్
- హోదా, బీబీసీ
మహ్మద్ అలీ జిన్నా ఏప్రిల్ 13, 1948న రాయల్ పాకిస్తాన్ ఎయిర్‌ఫోర్స్‌ను తొలిసారి సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి జవాన్లతో మాట్లాడుతూ ''పాకిస్తాన్ తన వైమానిక దళ సామర్థ్యాన్ని సాధ్యమైనంత త్వరగా పెంచుకోవాలి'' అని సూచించారు. పాక్ రక్షణలో ఆర్మీ, నేవీకి సమాంతరంగా వైమానిక దళం ఎదగాలని కోరారు.
జిన్నా మాట్లాడిన 71 ఏళ్ల తర్వాత ఇప్పుడు పాక్ ఎయిర్ ఫోర్స్ మరోసారి వార్తల్లోకి వచ్చింది. అయితే, ఇప్పుడు పరిస్థితులు అంత సాధారాణంగా ఏమీ లేవు.
భారత వైమానిక దళం పాక్ లోని బాలాకోట్‌పై దాడులు చేయడంతో ఇరు దేశాల వైమానిక దళాల ప్రస్తావన వస్తోంది. ఇరుదేశాల సైనిక సంపత్తిని గమనిస్తే 20 ఏళ్ల కిందటే రెండు దేశాలు అణ్వాయుధ దేశాలయ్యాయి.

ఫొటో సోర్స్, Getty Images
31 ఫైటర్ స్వ్కాడ్రన్స్ ( ఒక స్వ్కాడ్రన్‌లో 17-18 జెట్స్ ఉంటాయి), 11 స్క్వాడ్రన్ షార్ట్స్‌లతో భారత వైమానిక దళం ప్రపంచంలో నాలుగో స్థానంలో ఉంది. ఇక పాక్ తమ దగ్గర 20 ఫైటర్ స్వ్కాడ్రన్స్ ఉన్నట్లు చెప్పుకుంటుంది.
అయితే, ఇలా ఇరు దేశాల సైనిక బలగాలు ఎంతెంత అని చెప్పడంతో మొత్తం చరిత్ర చెప్పినట్లు కాదు. గత ఉదంతాలు కూడా చెప్పాలి.
పాక్ ఒక స్వతంత్ర దేశంగా ఏర్పడ్డాక ఆ దేశానికి చెందిన రాయల్ ఏయిర్ ఫోర్స్‌కు తొలినాళ్లలో కొన్ని చేదు జ్ఞాపకాలున్నాయి.
'' బ్రిటన్ .. పాక్‌కు కేటాయించిన ఏయిర్ క్రాఫ్ట్ర్, ఆయుధాలు, ఇతర మందుగుండు సామగ్రి ఇవ్వడానికి భారత్ మొదట నిరాకరించింది. ఆ తర్వాత అంగీకరించింది. భారత్ తమకు ఇచ్చిన ఆయుధాలు చాలా వరకు ఏ మాత్రం పనికిరానివే'' అని ఆ దేశ వైమానిక దళం పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images
పాక్ వైమానిక దళ ప్రస్థానం
1947-48 జరిగిన వివాదాల్లో కశ్మీర్‌లో పాకిస్తాన్ ప్రయత్నాలకు సహాయంగా ఆ దేశ విమానాలు తొలిసారి గాలిలోకి ఎగిరాయి.
1965, 1971 యుద్ధాల సమయంలో పీఏఎఫ్, ఐఏఎఫ్ బలగాలు భారీగానే తలపడ్డాయి. ఈ ఆపరేషన్స్ వల్ల వైమానిక దళ శౌర్య పరాక్రమాలను రెండు దేశాలు గుర్తించాయి.
ప్రస్తుతం ప్రాథమికంగా రెండు అమెరికా తయారీ ఎఫ్-16 ఏయిర్ క్రాఫ్ట్స్‌తో పీఏఎఫ్ బలంగా ఉంది.
సినో-పాక్ ఒప్పందం మేరకు చైనా నుంచి జేఎఫ్- 17 థండర్ ఏయిర్ క్రాఫ్ట్స్ కూడా ఇటీవల వచ్చి చేరాయి. ఎఫ్-16 అనేది నాలుగో తరానికి చెందిన సింగిల్ ఇంజిన్ ఏయిర్ క్రాఫ్ట్.
1982లో ఇది పాక్ వైమానిక దళంలో చేరింది. దీనితో పోల్చితే జేఎఫ్- 17 కాస్త మెరుగైంది. ఇది తేలికైన ఏయిర్ క్రాఫ్ట్.
అన్ని వాతావరణ పరిస్థితులు, రాత్రి, పగలు కూడా ఇది దాడి చేయగలదు. దీన్ని పాకిస్తాన్ ఏరోనాటికల్ కాంప్లెక్స్, కమ్రా అండ్ చెంగ్డూ ఏయిర్ క్రాఫ్ట్ ఇండస్ట్రీ కార్పొరేషన్ (సీఏసీ) కలిపి అభివృద్ధి చేశాయి. కొన్నాళ్లలో
పాక్ వైమానిక దళంలో ఇవే ప్రధానంగా ఉండనున్నాయి. ఇదే క్రమంలో ఇవి పాతతరం ఫ్రెంచ్ మిరాజ్ ఏయిర్ క్రాఫ్ట్‌లను భర్తీ చేస్తాయి.

ఫొటో సోర్స్, Getty Images
భవిష్యత్తులో సొంతంగా విమానాల తయారీ కోసం పాక్ ప్రయత్నాలు చేస్తోంది.
జేఎఫ్-17 అడ్వాన్సడ్ వర్షెన్, ఐదో తరం ఫైటర్ జెట్‌లను అభివృద్ధి చేయాలని చూస్తోంది. ఈ వైపు పాక్ కొద్ది దూరం వెళ్లినట్లుగా కనిపిస్తుంది.
పెషావర్, లాహోర్, కరాచీలలో పీఏఎఫ్‌కు కమాండ్ సెంటర్లు ఉన్నాయి. అలాగే, రావల్పిండిలో ఏయిర్ డిఫెన్స్ కమాండ్, ఇస్లామాబాద్‌లో స్ట్రాటజిక్ కమాండ్ సెంటర్ ఉంది.
2011లో పాక్‌లోని అబోటాబాద్‌లో లాడెన్‌ను అమెరికా నేవీ సీల్స్ మట్టుబెట్టిన తర్వాత ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి.
కాలిఫోర్నియాకు చెందిన మేధోసంస్థ రాండ్ కార్పొరేషన్ పీఏఎఫ్ గురించి వ్యాఖ్యానిస్తూ ''పీఏఎఫ్‌కు సంబంధించిన విధాన నిర్ణయాలను చీఫ్ ఆఫ్ ఏయిర్ స్టాఫ్ అందించిన సమాచారం, మార్గదర్శకాల ఆధారంగా చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ తీసుకుంటారు. దీన్ని బట్టి పీఏఎఫ్‌కు సంబంధించి నిర్ణయాత్మక పాత్ర పోషించేది చీఫ్ ఆఫ్ ఏయిర్ స్టాఫ్ కాదని, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ అని తెలుస్తుంది'' అని పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images
‘మూడు దశల్లో ఎదిగింది’
రచయిత, మాజీ డైరెక్టర్ ఆఫ్ ఏయిర్ ఆపరేషన్ (పీఏఎఫ్) కైసర్ తుఫెల్ మాట్లాడుతూ, ''ప్రపంచంలోని ఏ వైమానిక దళం తాను అనుకున్నవన్ని పొందలేదు. బడ్జెట్‌లో తగిన కేటాయింపులు ఉండవు. అయితే, పాక్ విషయంలో నేను ఈ వ్యాఖ్యలతో ఏకీభవించను'' అని ఆయన పేర్కొన్నారు.
పీఏఎఫ్ పరిణామక్రమాన్ని ఆయన వివరిస్తూ, ''నా వరకు పీఏఎఫ్ ఎదుగుదలలో మూడు దశలున్నాయని అనుకుంటున్నా. మొదటిది పాక్ ఒక స్వతంత్ర దేశంగా మారడం. ఆ సమయంలో సెకండ్ హ్యాండ్ వైమానిక సంపత్తిని వాడాల్సి వచ్చింది. రెండో దశలో సెంటో ( సెంట్రల్ ట్రీటీ ఆర్గనైజేషన్), సీటో (సౌత్ ఈస్ట్ ఏసియా ట్రీటీ ఆర్గనైజేషన్) లో పాక్ చేరడం. మూడోది 1965లో యుద్ధం తర్వాత పాక్‌పై ఆంక్షలు విధించాక వైమానిక దళ అభివృద్ధికి తీసుకున్న నిర్ణయాలు'' అని ఆయన చెప్పారు.
అయితే, ఇప్పటికీ పాకిస్తాన్ తూర్పు సరిహద్దులో పీఏఎఫ్ ఉనికి లేదని ఐఏఎఫ్ భావిస్తోంది.
ఏయిర్ మార్షల్ (రిటైర్) ఎస్.బీ. డియో మాట్లాడుతూ, ''మనల్ని అందుకోవాలని పీఏఎఫ్ ప్రయత్నిస్తోంది. వారి పైలట్‌లు మరీ అంత నైపుణ్యం లేనివారు కాదు. కానీ, నిధుల కొరత వారిని వేధిస్తోంది. వారికి కూడా ఏడబ్ల్యూఏసీఎస్ (ఏయిర్‌బోర్న్ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్) ఉన్నాయి. మనతో పోల్చితే వారి విస్తీర్ణం చిన్నది కాబట్టి వారి సామర్థ్యం మేరకు వారి రక్షణ వ్యవస్థ ఉంది. చైనాతో అనుబంధం వల్ల వారి ఆయుధ సంపత్తి బాగా పెరుగుతోంది'' అని విశ్లేషించారు.

ఫొటో సోర్స్, Getty Images
పీఏఎఫ్‌ను భారత వైమానిక దళం తక్కువగా అంచనా వేస్తుందా?
అలాంటిదేమీ లేదని మిలటరీ చరిత్రకారుడు, రిటైర్ ఏయిర్ వైస్ మార్షల్ సుబ్రమణియమ్ అన్నారు. ''బాలాకోట్ వైమానిక దాడులను ఆధారంగా చేసుకొని పాక్ వైమానిక దళ సామర్థ్యాన్ని అంచనా వేయడం సరికాదు. చక్కని సమన్వయంతో భారత వైమానిక బలగాలు లక్ష్యంపైనే దాడికి దిగాయి. ఇదే సమయంలో పాక్ వైమానిక రక్షణ సామర్థ్యాన్ని అనుమానించక్కర్లేదు. నా అంచనా ప్రకారం వారి ఎఫ్ -16 ఏయిర్ క్రాఫ్ట్‌లో సమస్యలు ఉండొచ్చు. ఇక వారి వద్దనున్న జేఎఫ్ -17లు కదనరంగంలో ఇంకా కాలు పెట్టలేదు'' అని వ్యాఖ్యానించారు.
చైనాతో పీఏఎఫ్‌కు ఉన్న సంబంధాలపై తుఫెల్ మాట్లాడుతూ ''జేఎఫ్ 12 థండర్ ఏయిర్ క్రాఫ్ట్ర్ కావొచ్చు లేదా ఐదో తరం ఏయిర్ క్రాఫ్ట్ర్‌లకు సంబంధించిన కార్యక్రమం కావొచ్చు. మేం మొత్తం చైనాతోనే కలిసి వెళ్లడం లేదు. మేం సరైన దారిలోనే ఉన్నాం. మా ఆయుధ సంపత్తిని సొంతంగా వేగంగా అభివృద్ధి చేసుకుంటున్నాం'' అని తెలిపారు.
ఇవి కూడా చదవండి
- కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి ఇచ్చిన 'ఆర్టికల్ 370' రద్దు సాధ్యమేనా?
- పాకిస్తాన్‌పై 'నీటి సర్జికల్ స్ట్రైక్స్' వెనుక అసలు నిజం
- కొండవీడు రైతు కోటయ్య మృతి... సమాధానాల్లేని ప్రశ్నలు
- #WhyModi: మళ్లీ ప్రధానిగా మోదీనే ఎందుకు?
- ‘పుల్వామా ఉగ్రదాడి తర్వాత భారత సైన్యం చేతిలో మరణించిన మిలిటెంట్ల ఫొటో నిజమేనా’
- వర్జినిటీ ట్రీ: ఆ చెట్టుకు కండోమ్స్ కట్టి పూజలు చేస్తారు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








