పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఖురేషి: "మూడు ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశామన్నారు? ఎక్కడున్నాయవి? 350 మందిని చంపేశామన్నారు... వాళ్ళ శవాలు ఏవి?"

షా మహమ్మద్ ఖురేషి

ఫొటో సోర్స్, Getty Images

''భారత్ తగిన సాక్ష్యాలు అందజేస్తే జైషే మహమ్మద్ కమాండర్లపై చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి తాము సిద్ధం'' అని, పాక్ విదేశాంగ మంత్రి షా మహమ్మద్ ఖురేషి బీబీసీతో అన్నారు.

బీబీసీ ప్రతినిధి సికందర్ కిర్మానీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వూలో మాట్లాడుతూ ఆయన పాక్ భూభాగంలో భారత వైమానిక దళాలు జైషే స్థావరాలను ధ్వంసం చేశాయన్న వాదనలను కొట్టిపారేశారు. భారత్ దాడిలో 350 మంది జైషే ఉగ్రవాదులు చనిపోయారన్న ప్రచారంలో కూడా ఏ మాత్రం నిజం లేదన్నారు.

తమది కొత్త ప్రభుత్వమని, తమ విధానం కూడా సరికొత్తగానే ఉంటుందని చెబుతున్న ఖురేషి పూర్తి ఇంటర్వ్యూను ఈ వీడియోలో చూడండి. చదవడానికి కిందకు స్క్రోల్ చేయండి.

వీడియో క్యాప్షన్, వీడియో: ‘మేం చెప్పినట్లు విని ఉంటే ఇలా జరిగుండేది కాదు..’

ఖురేషి: నేను ఇలాంటి సంఘర్షణను ఎప్పుడూ కోరుకోలేదు. పాకిస్తాన్ చెబుతున్నదేంటో భారత్ శ్రద్ధగా వినడానికి ప్రయత్నించి ఉంటే, ఇలా జరగకపోయేది.

సాక్ష్యాలు అందజేయండని భారత్‌ను మేం కోరాం. సహకారం అందించడానికి సిద్ధమని, కూర్చుని మాట్లాడుకుందామని చెప్పాం. అదొక్కటే సరైన మార్గం.

అణ్వాయుధాలు కలిగి ఉన్న రెండు ఇరుగు పొరుగు దేశాలు యుద్ధానికి తలపడడం సరైనదేనా? అలా చేస్తే అది ఆత్మహత్యా సదృశం.

రిపోర్టర్: పాకిస్తాన్ కేంద్రంగా పని చేసే జైషే మహమ్మద్ అనే మిలిటెంట్ గ్రూపు భారతీయ భూభూగంపై చేసిన ఆత్మాహుతి దాడితో ఈ సంక్షోభం మొదలైంది. మరి... (ఖురేషి మధ్యలో కల్పించుకుంటూ..)

ఖురేషి: ఆ విషయం కచ్చితంగా తెలియదు.

రిపోర్టర్: జైషే మహమ్మద్ పాకిస్తాన్‌ కేంద్రంగా లేదంటారా?

ఖురేషి: లేదు... లేదు.

రిపోర్టర్: ఈ దాడికి బాధ్యత తమదేనంటూ జైషే మహమ్మద్ అధికారికంగానే ప్రకటించింది కదా. అందుకే జైషే మహమ్మద్ స్థావరాలను లక్ష్యంగా చేసుకొని తాము వైమానిక దాడి చేశామని భారత్ ప్రకటించడం నిజం కాదా?

ఖురేషి: భారత్ ఏం చెప్పింది? మూడు ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశామని చెప్పారు. ఎక్కడున్నాయవి? 350 మంది ఉగ్రవాదులను చంపేశామని చెప్పారు. వాళ్ల శవాలు ఏవి?

రిపోర్టర్: కానీ జైషే మహమ్మద్ సొంత పత్రికలో ప్రచురించిన ఓ వ్యాసంలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. పాకిస్తాన్‌ అధికారికంగా నిషేధించినప్పటికీ ఈ సంస్థ కార్యకలాపాలను మీరు అనుమతిస్తున్నారు కదా?

ఖురేషి: నేను ఈ ప్రభుత్వం తరపున మాత్రమే మాట్లాడగలను. ఇది కొత్త ప్రభుత్వం. కొత్త ఆలోచనా ధోరణితో, కొత్త వైఖరులతో పని చేస్తున్న ప్రభుత్వం. మా విధానం చాలా స్పష్టం.

ఏ ఉగ్రవాద సంస్థనూ పాకిస్తాన్ భూభూగాన్ని ఉపయోగించుకొని, భారత్ సహా ఏ దేశంపైనా దాడులు చేయడాన్ని మేం అనుమతించం.

రిపోర్టర్: అంటే గత ప్రభుత్వాల హయాంలో తప్పులు జరిగాయంటారా?

ఖురేషి: నేను గతంలోకి వెళ్లదల్చుకోలేదు. ఎందుకంటే, గతాన్ని తవ్వుకుంటే రెండువైపులా వేలెత్తి చూపాల్సి వస్తుంది.

రిపోర్టర్: జైషే మహమ్మద్ వ్యవస్థాపకుడు మసూద్ అజహర్ ఇక్కడే పాకిస్తాన్‌లో ఉన్నారు కదా. ఇప్పుడు అతడిపై ఏదైనా విచారణ జరుగుతోందా? అతణ్ని గృహనిర్బంధంలో ఉంచారా?

ఖురేషి: ఈ దేశంలో కోర్టులున్నాయి. కోర్టులు స్వతంత్రంగా పని చేస్తాయి. మీ దగ్గర ఏవైనా సాక్ష్యాలుంటే మాకివ్వండని భారత్‌కు చెబుతూ వస్తున్నాం. మీరు సాక్ష్యాలు అందజేస్తే మేం కోర్టులో కేసు వేస్తాం.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)