యుద్ధం వస్తే వెంటనే తెరపైకి అణు బాంబులు వస్తాయి : అభిప్రాయం

ఫొటో సోర్స్, Getty Images
భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న తాజా పరిస్థితులపై విదేశాంగ శాఖలో పనిచేసిన మాజీ దౌత్యవేత్త మోహన గురుస్వామితో బీబీసీ మాట్లాడింది. కశ్మీర్ సమస్య, యుద్ధం అవకాశాలు, దాడి-ప్రతిదాడులపై ఆయన తన విశ్లేషణ అందించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
దాడులపై విదేశీ స్పందనల ప్రభావం
వాళ్లు దాడి చేశారు. మనం మరో పెద్ద దాడి చేశాం. తరువాత వారు చిన్న దాడి చేశారు. ఇప్పుడు బాల్ మన చేతిలో ఉంది.
తరువాత ఏం చేస్తాం? నువ్వో దెబ్బ, నేనో దెబ్బ అంటూ ఇది ఇలా కొనసాగుతుందా? లేదా అనే నిర్ణయం భారత ప్రభుత్వం తీసుకుంటుంది.
ఈ విషయంలో ఇతర దేశాల ప్రమేయం ఎక్కువగా ఉంటుందని అనుకోలేం. ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాన్‌కి పెద్ద దేశాల మద్దతు ఏమాత్రం లేదు. చైనా కూడా మద్దతు ఇవ్వడం లేదు. చైనాలో కూడా ఇస్లామిక్ తీవ్రవాదం ఉంది. దానిని నియంత్రించేందుకు పాకిస్తాన్‌లో చైనా రాజకీయంగా డబ్బు ఖర్చు పెడుతోంది. వారి పరిధులు వారికున్నాయి. రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్.. ఎవరూ మద్దతివ్వలేదు. తీవ్రవాదులపై చర్యలు తీసుకోవాల్సిందే అని అమెరికా కూడా పాకిస్తాన్‌కి చెప్పింది.
ఒక్క ఇస్లామిక్ దేశాల సంస్థ మాత్రమే ఖండించింది. ఆ విషయం ఊహించిందే. ముస్లిం దేశాలకు ముందు నుంచీ ఐకమత్యం ఉంది. ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోపరేషన్ ఎప్పుడూ భారత్‌ను ఖండిస్తూ వస్తోంది. కానీ ఈ పరిణామాలు, ముస్లిం దేశాలతో జరిగే ఆర్థిక వ్యవహారాలపై పడవు. ఆయిల్ వారు ఊరికే ఇవ్వడం లేదు కదా.
రాజకీయ కోణం
పాకిస్తాన్ కయ్యానికి వస్తే తగిన జవాబిస్తానన్నారు మోదీ. కానీ నాలుగేళ్లలో ఏమీ చేయలేదు. పుల్వామా దాడి దేశంలో ఆగ్రహాన్ని పెంచడం, ఎన్నికలు దగ్గర పడడంతో ఈ చర్య జరిగింది. రాజకీయ అనివార్యత.
ఉడీలో దాడి జరిగింది, ఏం చేయలేదు. ఏదో సరిహద్దు దాటి కొద్దిగా రైడ్ చేశాం. కానీ ఈసారి పాకిస్తాన్‌ని నిందించడం లేదు. తీవ్రవాద శిబిరాలపై దాడి చేశారు. దాడికి సాక్ష్యాలు ఎవరూ ఇవ్వరు. ఒకవేళ భారత్ దాడి చేసి ఉండకపోతే, పాక్ స్పందించి ఉండేది కాదు కదా!

ఫొటో సోర్స్, Getty Images
యుద్ధమా? శాంతా?
గతంలో ఇంతకంటే ఘోరమైన విషయాలు చూశాం. కానీ ఇప్పుడు మొదటిసారి భారత్ స్ట్రైక్ బ్యాక్ చేసింది. ఉద్రిక్తత పెరిగింది (ఎస్కలేషన్). పాకిస్తాన్ ఇవాళ చేసిన పనులు చిన్న ఎస్కలేషన్.
శాంతికి అవకాశం ఉంది. ఇద్దరూ చెరో దెబ్బా కొట్టుకున్నారు. ఇప్పుడు శాంతికి అవకాశం ఇవ్వడం ఇద్దరు చేతుల్లో లేదు. కాదని ఘటనలు జరుగుతూ వెళితే అది మరింత పెరుగుతూ పోతుంది.
రెండు దేశాలకూ పూర్థి స్థాయి యుద్ధ సన్నద్ధత లేదు. యుద్ధం వస్తే వెంటనే అణు బాంబులు వస్తాయి. ప్రపంచం ఒప్పుకోదు. అమెరికా, రష్యా, చైనాలు ఆపమంటాయి. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానం పంపవచ్చు కూడా.
అసలు యుద్ధమనే మాట వస్తే, పాకిస్తాన్‌లో ఆ అధికారం ప్రభుత్వం చేతిలో లేదు. ప్రభుత్వేతర శక్తులు అక్కడ నిర్ణయం తీసుకుంటాయి. వారిని కంట్రోల్ చేయగలిగితే యుద్ధం ఉండదు.
కానీ సమస్య ఏంటంటే అసలు అధికారం ప్రధాని చేతుల్లో లేదు. అక్కడి వారు ఒత్తిడి చేస్తే ఒక ఎటాక్ చేశారు. పాకిస్తాన్ ప్రధాన మంత్రి కంటే ఆర్మీ ఛీఫ్ దగ్గర అసలు పవర్ ఉంది.
ప్రస్తుత ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వాటిని నియంత్రించడానికి ప్రయత్నిస్తారు అనుకుంటున్నాను. ఆయన సెన్సిబుల్, చదువుకున్నవారు, కొత్త తరం రాజకీయ నాయకుడు కాబట్టి ఓపిగ్గా ప్రయత్నిస్తారనుకుంటున్నాను. ఈలోపు ఇది జరిగింది.
మరో విషయం, ఆయనకి భారత్‌తో మంచి సంబంధాలు ఉన్నాయి. స్నేహితులున్నారు, వచ్చిపోతుంటారు. అదే సమయంలో ఇమ్రాన్ ఖాన్‌కి జనాకర్షణ ఉంది. బాగా మాట్లాడతారు. జైషే క్యాంపులు బందు చేయడం ద్వారా కొన్ని చర్యలు చేపట్టారు.
నేను చెప్పేదొక్కటే, వీటిని ఇక్కడితో ఆపాలి. శాశ్వత పరిష్కారంగా కశ్మీర్‌పై దృష్టి పెట్టాలి.

కశ్మీర్ సమస్య
కశ్మీర్ లోయలో ముస్లిం మెజారిటీ ప్రాంతంలో సమస్య ఉంది. అక్కడి యువతకు భారత దేశంపై మంచి అభిప్రాయం లేదు. ప్రభుత్వం బాగా నడవ లేదు. ప్రభుత్వం కంట్రోల్ చేయలేదు. మానసికంగా ఎటువంటి చర్యలూ చేపట్టలేదు. అసంతృప్తి ఉంది.
కానీ లడక్, జమ్మూ, రాజౌరీ వంటి ప్రాంతాల్లో భారత్‌కు మద్దతుంది. లోయ 80x40 కి.మీ. విస్తీర్ణం ఉన్న చిన్న ప్రాంతం. వారితో ఎలా వ్యవహరించాలనే దానిపై ఓ విధానం ఉండాలి.
కశ్మీర్ సమస్య వల్ల భారత్‌పై ఆర్థిక భారం ఏమీ పడడం లేదు. కానీ, నిరంతరం టెన్షన్ ఉంటుంది... బాంబులు పేలతాయనీ తీవ్రవాద దాడులు అవుతాయనీ. ఆ చిన్న ప్రాంతంలో ఎన్నో చానళ్లు ఉన్నాయి. అక్కడ ఉన్న న్యూస్ చానళ్లను తీసేస్తే రెండు నెలల్లో అంతా మర్చిపోతారు.
దానికితోడు హిందూ-ముస్లిం, ఇండియా-పాకిస్తాన్ అంశాలు కూడా ఉన్నాయి. నాగాలాండ్, మణిపూర్‌లలో దాడులు జరగడం లేదా? అవెందుకు బయటకు రావంటే అక్కడ మీడియా లేదు. కశ్మీర్ విషయంలో భారత్ మీడియాను మేనేజ్ చేయాలి.
సైకలాజికల్ ఆపరేషన్స్ చేయాలేదన్న అన్‌హ్యాపీ. లడక్, జమ్మూ, రాజౌరీ... అన్ని ప్రాంతాల్లో మనకు ఫుల్ సపోర్టుంది. ఎలా 80x40 కి.మీ. ప్రాంతంలో ఎలా మాట్లాడాలో ఓ పాలసీ ఉండాలి.
ఈ సమస్య శాశ్వత పరిష్కారం భారతే చేయాలి. పాక్ పాత్ర ఏమీ లేదు. కశ్మీర్‌లో కొంత భూభాగం వారు తీసేసుకున్నారు. ఇక భారత్ తన పరిధిలో ఉన్న కశ్మీర్ విషయాన్ని పరిష్కరించాలి.
కశ్మీర్ భారత్‌లో కలిసేప్పుడు భారత్ భరోసా ఇచ్చింది.. స్వయం ప్రతిపత్తి. అది లేకపోతే కశ్మీర్ కలవడమే అసంపూర్ణం అవుతుంది. దాన్ని రద్దు చేయడానికి అవకాశం లేదు. అగ్రిమెంట్ రాశారు. సంతకం పెట్టారు. రాజ్యాంగంలో ప్రొవిజన్ ఉంది. ఇప్పుడు వెనక్కు వెళ్లే వీల్లేదు.

తీవ్రవాదాన్ని పెంచితే తిరిగి కాటేస్తుంది
పాకిస్తాన్ ప్రభుత్వానికి ఆ దేశ సైన్యంపై పట్టు లేదు. పాక్ సైన్యానికి అక్కడి తీవ్రవాద సంస్థలపై పూర్తి పట్టు లేదు.
తీవ్రవాద సంస్థలు ఒక స్థాయికి వచ్చాక వారి ఆలోచన మారిపోతుంది.
భారత్ కొంతకాలం ఎల్టీటీఈకి మద్దతిచ్చింది. కానీ ఏం జరిగింది? తిరిగి భారత ప్రధానినే చంపేశారు.
టెర్రరిస్టులను పెంచడం ప్రమాదం. హిల్లరీ క్లింటన్ అన్నట్టు మన వెనకాలే పాములను పెంచుకుంటూ, అవి కాటు వేయకూడదు అంటే ఎలా? ఇప్పుడు పాకిస్తాన్ తీవ్రవాద సంస్థలను పూర్తిగా కంట్రోల్ చేయలేని పరిస్థితుల్లో ఉంది.
ఇవి కూడా చదవండి.
- ఆర్టికల్ 35-A: కశ్మీర్ అమ్మాయిలు ఇతర రాష్ర్టాల వారిని పెళ్లాడితే హక్కులు కోల్పోతారు, ఎందుకిలా?
- కశ్మీర్ యువత మిలిటెన్సీ బాట ఎందుకు పడుతోంది?
- వింగ్ కమాండర్ అభినందన్‌ను పాకిస్తాన్ నుంచి భారత్ ఎలా తీసుకురావచ్చు
- నన్ను పాకిస్తాన్ సైన్యం బాగా చూసుకుంటోంది: పాక్ అదుపులో ఉన్న పైలట్
- కార్గిల్‌కు ముందు... ఆ తరువాత కశ్మీర్‌లో భారత్-పాక్‌ల దాడుల చరిత్ర
- క్రికెట్: 2019 ప్రపంచ కప్‌లో భారత్-పాక్ మ్యాచ్ ఉంటుందా, ఉండదా...
- BBC Special: విశాఖ రైల్వే జోన్ వస్తుందా, రాదా? వస్తే కలిగే ప్రయోజనాలు ఏమిటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








