భారత్-పాకిస్తాన్ : మా అదుపులో ఉన్నది ఒకే పైలట్ .. మాట మార్చిన పాక్; గాయపడిన వ్యక్తిని అసభ్యంగా చూపించారని ఆక్షేపించిన భారత్

ఫొటో సోర్స్, iSpr
పాకిస్తాన్ అదుపులో ప్రస్తుతం ఉన్నది ఒకే ఒక పైలట్ అని .. అతను వింగ్ కమాండర్ అభినందన్ అని పాక్ సైన్యం పేర్కొంది.
ఈ మేరకు పాకిస్తాన్ సైనిక డీజీ మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ కొద్ది సేపటి కిందట ట్వీట్ చేశారు.
అభినందన్‌ను సైనిక నియమాల ప్రకారం చూసుకుంటున్నామని వివరించారు.
అంతకు ముందు తమ అధీనంలో ఇద్దరు భారత పైలట్లు ఉన్నారని గఫూర్, ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, dgispr
గాయపడిన వ్యక్తిని అసభ్యంగా చూపించారని ఆక్షేపించిన భారత్
పాకిస్తాన్ సైన్యం భారత వైమానిక దళ పైలెట్ అంటూ ఓ వీడియో విడుదల చేసింది. ఇందులో ఉన్న వ్యక్తి భారత్ వైమానిక దళం పైలెట్ అభినందన్ అని పేర్కొంది.
దీనిపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. భారత వైమానిక దళానికి చెందిన గాయపడిన వ్యక్తిని అసభ్యంగా చూపించారని ఆక్షేపించింది. ఇది అంతర్జాతీయ మానవతా చట్టాలు, జెనీవా ఒప్పందానికి వ్యతిరేకం అని పేర్కొంది.
పాకిస్తాన్ తమ అధీనంలో ఉన్న భారత పైలట్‌కు ఎలాంటి హాని కలిగించకుండా చూసుకోవాలని కోరింది.
పాక్ అధీనంలో ఉన్న భారత పైలట్ సురక్షితంగా వెంటనే భారత్‌కు తిరిగి వస్తారని ఆశిస్తున్నామని విదేశీ వ్యవహారాల శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.
భారత్‌లో విపక్షాల ప్రశంసలు
భారత వైమానిక దళానికి చెందిన జవాన్ల సాహసాలను విపక్షాలు ప్రశంశించాయి. అయితే అధికార పార్టీ నేతలు మన సైనిక చర్యలను రాజకీయాలకు ఉపయోగించుకోవడం తగదని చెప్పాయి.
దేశ భద్రత రాజకీయాలను మించినది. పుల్వామా దాడి తర్వాత ప్రధాని అఖిలపక్ష సమావేశం నిర్వహించకపోవడం విచారకరం. అలా చేయడం ప్రజాస్వామ్య విరుద్ధం అని విమర్శించాయి.
బుధవారం దిల్లీలో 21 పార్టీల నేతృత్వంలో అఖిలపక్ష భేటీ జరిగింది. ఇందులో ప్రస్తుత పరిస్థితులపై తీవ్ర ఆందోళన వ్యక్తమైంది.
అనంతరం కాంగ్రెస్ నేత రణదీప్ సుర్జేవాలా మాట్లాడారు. పాకిస్తాన్ వైమానిక దాడులను అఖిలపక్ష భేటీలో నేతలందరూ ఖండించారని తెలిపారు. భారత పైలెట్ భద్రత గురించి ఆందోళన వ్యక్తం చేశారు.
భారత దేశ సౌర్వభౌమాధికారాన్ని పరిరక్షించేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు.
అంతకు ముందు..
భారత యుద్ధ విమానాలను కూల్చామన్న పాక్ వాదనల నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ మీడియా సమావేశం ఏర్పాటు చేసింది.
విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ ఇప్పుడు విలేఖర్లతో మాట్లాడుతున్నారు ఆ వివరాలు..
భారత్ నిన్న జైషే ఉగ్రవాద శిబిరాలపై దాడి చేసింది. దానికి ప్రతిగా పాకిస్తాన్ ఇవాళ భారత సైనిక స్థావరాలపై దాడికి ప్రయత్నించింది.
అయితే, అన్నింటికీ సిద్ధంగా ఉన్న భారత వైమానిక దళం తక్షణం స్పందించింది. ఇందులో భాగంగా ఒక పాకిస్తాన్ యుద్ధ విమానాన్ని మిగ్ 21 కూల్చేసింది.
ఆ విమానం పాకిస్తాన్ భూభాగంలో కూలిపోయింది. అదే సమయంలో భారత్ ఒక మిగ్ 21 విమానాన్ని కోల్పోయింది. ఆ పైలట్ ఆచూకీ తెలియడం లేదు.
అయితే ఆ పైలట్ తమ అదుపులో ఉన్నట్టుగా పాకిస్తాన్ చెబుతోంది.

ఫొటో సోర్స్, Reuters
పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రసంగం
పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ కూడా దీనిపై స్పందించారు. భారత్‌కు చెందిన రెండు మిగ్ ఫైటర్ జెట్‌లను కూల్చేశామని ఆయన చెప్పారు.
మేం కూడా భారత్‌పై దాడులు చేయగలమని చెప్పేందుకే విమానం కూల్చామని అన్నారు. పైలట్లు తమ దగ్గరే ఉన్నారని ఇమ్రాన్ ఖాన్ తెలిపారు.
భారత్, పాకిస్తాన్ యుద్ధం మొదలుపెడితే అది ఎక్కడికో వెళ్లి ముగుస్తుందని అన్నారు. ఇరు దేశాలు బాధ్యతాయుతంగా ఉండాలని చెప్పారు.
భారత్‌పై పాకిస్తాన్ దాడులను ఇమ్రాన్ ఖాన్ సమర్థించుకున్నారు.
ఫిబ్రవరి 14 నాటి దాడి ఘటనపై భారత్ దర్యాప్తు చేసేందుకు సాయం చేసేందుకు పాకిస్తాన్ సిద్ధంగా ఉందని ఇమ్రాన్ ఖాన్ అన్నారు.
ఒకవేళ భారత్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటే, మేము స్పందించక తప్పదని గతంలోనే భారత్‌కి చెప్పామని పాకిస్తాన్ ప్రధాని అన్నారు.
రెండు అణ్వాయుధ దేశాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన సూచించారు.
పాకిస్తాన్ విమానాన్ని కూల్చేశామన్న భారత ప్రకటనను ఆ దేశం ఖండించింది.

ఫొటో సోర్స్, flight radar
అంతకు ముందు..
భారత విమానాలను కూల్చామని చెబుతున్న పాకిస్తాన్ దీనిపై మీడియా సమావేశం ఏర్పాటు చేసింది.
ఈ సమావేశంలో మాట్లాడిన పాక్ ఆర్మీ ప్రతినిధి మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ ఆత్మరక్షణ చేసుకునే హక్కు , సామర్థ్యం తమకు ఉందని చూపించడానికే భారత విమానాలు కూల్చాం అని చెప్పారు.
మేజర్ జనరల్ అసిఫ్ గఫూర్ ప్రకటన:
"పాక్ యుద్ధం కోరుకోవడం లేదు. రెండు దేశాల మధ్య శాంతి కోరుకుంటున్నాం.
ఉదయం నుంచీ లైనాఫ్ కంట్రోల్ దగ్గర కొన్ని యాక్టివిటీస్ జరిగాయి. నియంత్రణ రేఖ దాటి వచ్చిన ఆరు టార్గెట్లను పాక్ సైన్యం ఎంగేజ్ చేసింది.
భారత్ మనపై దాడి చేశామని చెప్పింది. సరిహద్దు దాటి వచ్చి టెర్రరిస్ట్ స్థావరాలను ధ్వంసం చేశామని, 350 మందిని చంపామని చెప్పింది.
పాకిస్తాన్ ఆర్మీకి, ఎయిర్ ఫోర్స్‌కు దానికి సమాధానం ఇవ్వడం తప్ప వేరే దారి లేకుండాపోయింది. వాళ్లలాగే బదులివ్వాలా, లేక ఒక బాధ్యతాయుతమైన దేశంలా జవాబు ఇవ్వాలా అని ఆలోచించాం.
ఆత్మరక్షణ చేసుకునేందుకు పాక్ సైన్యానికి తగిన సామర్థ్యం ఉంది. మాకు ప్రజల మద్దతు కూడా ఉంది. ఒక బాధ్యతాయుతమైన దేశంగా మేం శాంతి కోరుకుంటున్నాం.

ఫొటో సోర్స్, youtube
మేం భారత్ విమానాలను కూల్చాలని నిర్ణయించుకున్నప్పుడు పౌరులకు, వేరే ఎలాంటి నష్టం జరగకూడదని భావించాం.
పరిధి లోపల ఆరు టార్గెట్లు సెలక్ట్ చేసి, లాక్ చేశాం. తర్వాత కాసేపట్లోనే బహిరంగ ప్రాంతాల్లో స్ట్రయిక్స్ చేశాం. మా సామర్థ్యం చూపించడానికే ఈ దాడులు చేశాం.
పాకిస్తాన్ దగ్గర సామర్థ్యం ఉంది. కానీ మేం బాధ్యతాయుతంగా ఉండాలని భావిస్తున్నాం. మేం యుద్దం, ఉద్రిక్త పరిస్థితులు కోరుకోవడం లేదు. మా ప్రధాని శాంతి కోరుకుంటున్నారు. మేం పరిస్థితులను యుద్ధం వైపు తీసుకెళ్లకూడదని భావిస్తున్నాం.
వీడియోను కూడా కాసేపట్లో షేర్ చేస్తాం. (ఆ వీడియోను పాక్ సైన్యం విడుదల చేసింది. అయితే, ఆ తరువాత కాసేపటికి దాన్ని తొలగించింది.)

ఫొటో సోర్స్, DGISPROFFICIAL/YOUTUBE
రెండు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానాలు లైనాఫ్ కంట్రోల్ దాటి పాకిస్తాన్‌లోకి వచ్చాయి. వాటిని పాక్ ఎయిర్ ఫోర్స్ టేకాన్ చేశాయి. రెండింటినీ షూట్ డౌన్ చేశాయి అని పాక్ ఆర్మీ ప్రతినిధి ఆసిఫ్ గఫూర్ కూడా చెప్పారు.
ఒకటి పాకిస్తాన్ రేంజ్‌లో, ఇంకొకటి భారత్ రేంజ్‌లో పడ్డాయి.
పైలెట్లు ఇద్దరినీ మా సైన్యం అరెస్ట్ చేసింది. వారితో ఒక దేశం ఎలా ప్రవర్తిస్తుందో అలాగే ప్రవర్తించాం. తీవ్రంగా గాయపడ్డ ఒక పైలెట్‌ను సీఎంఎస్‌లో చేర్పించాం. ఇంకొకరు మా అదుపులో ఉన్నారు.
తర్వాత పాకిస్తాన్ సైన్యం విడుదల చేసిన వీడియోలో ఉన్న వ్యక్తి భారత్ వైమానిక దళం పైలెట్ అని పాక్ చెప్పింది.
అతడిని పాక్ సరిహద్దుల లోపల అదుపులోకి తీసుకున్నాం అని తెలిపింది.

ఫొటో సోర్స్, INFORMATION MINISTRY @TWITTER
వీడియోలో భారత వైమానిక దళం యూనిఫాం వేసుకున్న వ్యక్తి కళ్లకు గంతలు ఉన్నాయి. తనను వింగ్ కమాండర్ అని చెప్పిన అతడు 'నా పేరు అభినందన్' అని చెప్పారు.
ఆయన యూనిఫాంపై ఇంగ్లిష్‌లో పేరు కూడా ఉంది. ఆయన తన సర్వీస్ నంబర్ కూడా చెప్పారు.
ఈ వీడియోలో వ్యక్తిని మీరు పాక్ సైన్యం అదుపులో ఉన్నారా? అని ప్రశ్నించారు.

ఫొటో సోర్స్, DGISPROFFICIAL/YOUTUBE
మాకు పైలెట్ల దగ్గర నుంచి కొన్ని డాక్యుమెంట్లు కూడా లభించాయని పాక్ ఆర్మీ చెప్పింది.
అటు భారత్ పాకిస్తాన్‌కు చెందిన ఎఫ్-16 విమానాలను కూల్చాం అని చెబుతోంది. కానీ మేం వాటిని అసలు ఉపయోగించలేదు. పాక్ విమానం కూలినట్లు కూడా మాకు ఎలాంటి సమాచారం రాలేదు."
ఇక ముందు ఏం చేయబోతున్నారు...
మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్, "పాక్ ప్రభుత్వం, పాక్ సైన్యం, పాక్ ప్రజలు అందరూ ఎప్పటికీ శాంతి సందేశమే పంపాలని కోరుకుంటున్నారు. ఈ అంశాన్ని చర్చల ద్వారానే పరిష్కరించాలని భావిస్తున్నాం" అన్నారు.
"యుద్ధం వల్ల ఏం సాధించలేం అని రెండు దేశాలూ తెలుసుకోవాలి. మా ప్రధాని చెప్పినట్లు యుద్ధం ప్రారంభించడం సులభమే. కానీ, దానిని ముగించడం కష్టం.
ఇప్పటికీ మేం మా సామర్థ్యం చూపించగలం. కానీ మేం ఈ ఉద్రిక్త పరిస్థితిని ఇంకా పెంచాలనుకోవడం లేదు. రెండు దేశాల మధ్య శాంతి పెంచడానికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.
రెండు దేశాల్లో ఉపాధి, ఆరోగ్యం అందించే అంశాలపై కూర్చుని చర్చించుకుందాం. యుద్ధంతో ఏదీ పరిష్కారం కాదు. మా ఆఫర్‌ను భారత్ అందుకోవాలి. కూల్‌గా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.
రెండు దేశాల మధ్య శాంతి స్థాపనకు అంతర్జాతీయ సమాజం కూడా కృషి చేయాలి. రెండు దేశాల మధ్య వాతావరణం కుదుటపడేలా చూడాలి. ఇది శాంతికి ప్రమాదం,
మేం దీన్ని విజయంగా భావించడం లేదు. అలా చేస్తే మానవత్వం ఓడిపోతుంది. పాక్ మీడియాకు కూడా అబ్జెక్టివ్ రిపోర్టింగ్ చేయాలని చెప్పాం. శాంతి కోసం రిపోర్టింగ్ చేయాలని కోరాం. రెండు దేశాల మధ్య శాంతి స్థాపన దిశగా మీడియా కూడా ప్రయత్నించాలి.
ఇవి కూడా చదవండి:
- '39 మంది భారతీయులను ఐసిస్ తీవ్రవాదులు చంపేశారు'
- సనాతన్ సంస్థ 'హిందుత్వ తీవ్రవాద' శిక్షణ కేంద్రమా?
- "కులాంతర వివాహం చేసుకుంటే తీవ్రవాదులేనా?" - అభిప్రాయం
- పాకిస్తాన్‌పై ‘ట్రంప్ కార్డ్’తో భారత్‌కు మేలెంత?
- 'సర్జికల్ స్ట్రయిక్స్'కు రెండేళ్ళు: కశ్మీర్లో హింస ఏమైనా తగ్గిందా?
- ‘కశ్మీర్‌పై భారత్‌కు ఇజ్రాయెల్ దారి చూపిస్తోందా?’
- సర్జికల్ స్ట్రైక్స్ చేశాక ప్రాణాలతో బయటపడడం చాలా కష్టం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








