నన్ను పాకిస్తాన్ సైన్యం బాగా చూసుకుంటోంది: పాక్ అదుపులో ఉన్న పైలట్

ఫొటో సోర్స్, TWITTER
భారత్, పాకిస్తాన్‌ల మధ్య బుధవారం చోటుచేసుకున్న పరిణామాల్లో ఓ మిగ్ విమానంతో పాటు ఓ పైలట్ కూడా గల్లంతైనట్లు భారత్ ధ్రువీకరించింది.
అంతకుముందే, తమ అదుపులో ఇద్దరు భారత పైలట్లున్నారని, వారిలో ఒకరు తీవ్రంగా గాయపడి ఉన్నారని, రెండో వ్యక్తిని తాము అరెస్టు చేశామని పాకిస్తాన్ ప్రకటించింది.
అరెస్టైన వ్యక్తికి సంబంధించి ఓ వీడియోను కూడా విడుదల చేసింది.
ఆ వీడియోలో ఉన్న వ్యక్తి "నా పేరు వింగ్ కమాండర్ అభినందన్. నా సర్వీస్ నెంబర్ 27981. నేనో పైలట్‌ను, నా మతం హిందూ" అని చెప్పడం కనిపించింది.
చుట్టూ ఉన్నవారు మరికొన్ని ప్రశ్నలు వేయగా... క్షమించండి, అంతవరకూ చెప్పడానికి మాత్రమే నాకు అనుమతి ఉంది అని ఆ వ్యక్తి సమాధానం ఇచ్చారు.
"నేనొక చిన్న సమాచారం తెలుసుకోవచ్చా, నేనిప్పుడు పాకిస్తాన్ సైన్యంతో ఉన్నానా?" అని ఆ వ్యక్తి అడగడంతో ఆ వీడియో ముగిసింది.
ఈ వీడియోలో ఉన్నది భారత పైలట్ అభినందన్ అని పాకిస్తాన్ అంటుండగా, భారత ప్రభుత్వం మాత్రం దీన్ని ఇంకా ధ్రువీకరించలేదు.

ఫొటో సోర్స్, dgispr
ఈ వ్యక్తి భారత పైలటేనా?
"నేను ఈ మాటలను అధికారికంగానే చెబుతున్నా. ఒకవేళ నేను తిరిగి నా దేశానికి వెళ్లినా నా మాటల్లో మార్పు ఉండదు.
పాకిస్తాన్ సైనిక అధికారులు నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు.
వారు చాలా హుందాగా ప్రవర్తించారు. నాపై ఓ మూక దాడిచేయబోతే సైన్యం నన్ను రక్షించింది.
నాకు పెళ్లైంది. నేను దక్షిణ ప్రాంతానికి చెందినవాడిని.
ఇంతకు మించి నేను ఏమీ చెప్పలేను." అని భారత పైలట్‌గా పాకిస్తాన్ చెబుతున్న వ్యక్తి మాట్లాడిన వీడియోను పాకిస్తాన్ ఆర్మీ మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ ట్విటర్లో విడుదల చేశారు.
తమ అదుపులో ఇద్దరు భారత పైలట్లు ఉన్నారని చెబుతూ వచ్చిన పాకిస్తాన్ తాజా ట్వీట్‌లో మాత్రం... తమ అదుపులో ఒకే భారత పైలట్ ఉన్నారని, ఆయన వింగ్ కమాండర్ అభినందర్ వర్థమాన్ అనీ, ఆయనను మిలిటరీ నియమ నిబంధనల ప్రకారం చూసుకుంటున్నామని ట్విటర్లో వెల్లడించారు.
ఇవి కూడా చదవండి.
- ఓ విమానాన్ని కూల్చేశాం.. మరో విమానాన్ని కోల్పోయాం, పైలెట్ అచూకీ తెలియడం లేదు - భారత్
- కశ్మీర్లో కూలిన భారత యుద్ధవిమానం: రెండు భారత విమానాలను కూల్చేశామన్న పాక్
- కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి ఇచ్చిన 'ఆర్టికల్ 370' రద్దు సాధ్యమేనా?
- కార్గిల్‌కు ముందు... ఆ తరువాత కశ్మీర్లో భారత్-పాక్‌ల దాడుల చరిత్ర
- అమెరికా లాడెన్‌ని చంపినట్లు మసూద్ అజర్‌ను ఇంట్లోకి వెళ్లి చంపగలం: అరుణ్ జైట్లీ
- బాలాకోట్‌లో వైమానిక దాడులతో పెద్దసంఖ్యలో ఉగ్రవాదులను హతమార్చాం- భారత్; బదులిచ్చే హక్కు మాకుంది- పాకిస్తాన్
- భారత్ మిరాజ్ యుద్ధ విమానాలనే ఎందుకు ఉపయోగించింది... బాలాకోట్ ఎక్కడుంది...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








