'మిలిటెంట్లను అదుపుచేయడానికి వాడుకోమంటే.. భారత్‌పై ప్రయోగించారా?' - ఎఫ్-16ల విషయంలో పాక్‌ను ప్రశ్నించిన అమెరికా

ఫొటో సోర్స్, Getty Images
పాకిస్తాన్ ఆయుధ కొనుగోళ్ల ఒప్పందాలను ఉల్లంఘిస్తూ తన వద్ద ఉన్న ఎఫ్-16లను దుర్వినియోగం చేసిందన్న అనుమానాలను అమెరికా వ్యక్తంచేసిందని పీటీఐ వార్తా సంస్థ ఒక కథనంలో పేర్కొంది.
పీటీఐ విలేకరి లలిత్ కె ఝా శనివారం వాషింగ్టన్ నుంచి ఈ కథనాన్ని రిపోర్ట్ చేశారు.
తాము సరఫరా చేసిన ఎఫ్-16 యుద్ధ విమానాల ఎండ్ యూజర్ అగ్రిమెంట్‌ను ఉల్లంఘించి భారత్‌పై ప్రయోగించడానికి పాకిస్తాన్ వాడుకుందా అనే కోణంలో ఆ దేశాన్ని అమెరికా సమాచారం అడిగినట్లు పీటీఐ వెల్లడించింది.
బాలాకోట్‌లోని మిలిటెంట్ల స్థావరాలపై భారత్ వైమానిక దాడి జరిపిన తరువాత పాకిస్తాన్ కశ్మీర్‌లోని భారత సైనిక స్థావరాలు లక్ష్యంగా ఎఫ్-16లను వాడిందని భారత్ ఆరోపించింది.
అందుకు ఆధారంగా ఎఫ్-16 నుంచి ప్రయోగించిన 'అడ్వాన్స్‌డ్ మీడియం రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్'(ఏఎంఆర్‌ఏఏఎం) శకలాలను భాగాలను భారత వాయుసేన గురువారం చూపించింది. ఈ రకం క్షిపణులను ఎఫ్-16ల నుంచి ప్రయోగిస్తారు.
దీని శకలాలు భారత భూభాగంలో పడ్డాయంటే పాక్ తమపై ఎఫ్-16లను వాడినట్లేనని భారత్ అంటోంది.
ఎఫ్-16 విమానాలను పాకిస్తాన్‌కు సరఫరా చేసినప్పుడే వాటిని భారత్‌పై ప్రయోగించరాదన్న షరతును అమెరికా విధించింది. కానీ, ఇప్పుడు వాటిని వాడినట్లు భారత్ ఆధారాలు చూపడంతో అమెరికా పాక్‌ను దీనిపై వివరణ అడిగింది.

పాక్ మాత్రం ఎఫ్-16లను తాము వాడలేదని.. భారత్ తమ ఎఫ్-16 విమానాన్ని కూల్చనూ లేదని చెప్పుకొంటోంది.
దీంతో అమెరికా ఈ అంశంలో జోక్యం చేసుకుంది. ''మాకు అంతా తెలుసు. దీనిపై మరిన్ని వివరాలు కావాలి'' అని అమెరికా విదేశీ వ్యవహారాల శాఖకు చెందిన అధికారి ఒకరు పీటీఐ వార్తాసంస్థతో చెప్పారు.
''విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ విక్రయ ఒప్పందాల్లో బయటపెట్టరాని అంశాల కారణంగా ఎండ్‌యూజర్ అగ్రిమెంట్‌లోని కొన్ని అంశాలపై మాట్లాడలేం' అని అమెరికా రక్షణ శాఖ అధికార ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ కోన్ ఫాల్కనర్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే తీవ్ర చర్యలు
ప్రపంచంలో అత్యాధునిక రక్షణ పరికరాలను విక్రయించే అమెరికా ఎండ్‌యూజర్ మోనిటరింగ్ అగ్రిమెంట్ల విషయంలో పక్కాగా వ్యవహరిస్తుంది. ఆ దేశ సంబంధాలను అనుసరించి అందులో నిబంధనలను పొందుపరుస్తుంది.
ఆయుధాలు కొనుగోలు చేసిన దేశాలు అమెరికా ప్రయోజనాలు, అంతర్జాతీయ సంబంధాలను దెబ్బతీసేలా ఎండ్‌యూజర్ అగ్రిమెంట్లకు తూట్లు పొడుతూ రక్షణ పరికరాలను దుర్వినియోగం చేస్తే తీవ్రమైన చర్యలకూ వెనుకాడదు.
ఆ క్రమంలోనే ఇప్పుడు పాకిస్తాన్‌ను ఎఫ్-16ల వినియోగంపై వివరాలు అడుగుతోంది. పబ్లిక్ డొమైన్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఎఫ్-16ల విషయంలో అమెరికా పాకిస్తాన్‌కు 12 నిబంధనలు విధించింది.

ఫొటో సోర్స్, Getty Images
భారత వాయుసేన ఏం చెప్పింది?
''ఫిబ్రవరి 27న భారత వైమానిక దళం భారత్‌లోకి వస్తున్న పాక్ విమానాలను గుర్తించింది. పాక్ ఎఫ్-16 విమానాలు రాజోరీ ప్రాంతంలో భారత గగనతలంలోకి వచ్చాయి.
పాక్ విమానాలు భారత సైనిక స్థావరాలపై దాడులకే వచ్చాయి. భారత వైమానిక దళం వాటిని తిప్పికొట్టింది.
ఆ సమయంలో ఒక పాకిస్తాన్ ఎఫ్-16 విమానాన్ని మిగ్ 21 బైసన్ ఫైటర్‌తో కూల్చేశాం. అది పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో కూలిపోయింది.
ఈ పోరాటంలో భారత వైమానిక దళానికి చెందిన ఒక మిగ్ 21 ఫైటర్‌ను కూడా కోల్పోయాం. అందులోని పైలట్ ప్యారాచూట్ సాయంతో తప్పించుకున్నా గాలి వీస్తుండడంతో సరిహద్దుకు అవతల పడిపోయారు.
పాకిస్తాన్ ఎఫ్-16 విమానాలు ఉపయోగించలేదని చెబుతోంది. తమకు ఏ నష్టం జరగలేదంటోంది. కానీ వారి విమానాలు దాడులకు దిగాయి.
వాటిలో ఒకదాన్ని భారత వైమానిక దళం కూల్చేసింది. పాకిస్తాన్ ఉపయోగించే ఎఫ్-16లో మాత్రమే ఉపయోగించే ఒక భాగం రాజోరీ సెక్టార్‌లో పడింది'' అని ఎయిర్ వైస్ మార్షల్ ఆర్‌జీకే కపూర్ గురువారం(ఫిబ్రవరి 28న) వెల్లడించారు.
ఇవి కూడా చదవండి
- భారత యుద్ధ విమానాలను పాక్ ఎందుకు అడ్డుకోలేకపోయింది
- భారత సైనిక స్థావరాలపై దాడికి పాకిస్తాన్ ప్రయత్నించింది: త్రివిధ దళాధికారులు
- కొందరు భారత్, పాకిస్తాన్ జర్నలిస్టుల్లో 'యుద్ధోన్మాదం' ఎందుకు? - జర్నలిస్టుల సమాధానం ఇదీ
- యుద్ధం వస్తే తెరపైకి అణు బాంబులు వస్తాయి : అభిప్రాయం
- గంగానది ప్రక్షాళన పూర్తయిందా?
- నరేంద్ర మోదీ వర్సెస్ ఇమ్రాన్ ఖాన్: ఇంతకీ ఈ ప్రచార యుద్ధంలో గెలిచిందెవరు...
- ‘350 మందిని చంపేశామన్నారు, వాళ్ళ శవాలేవి...’ -బీబీసీతో పాక్ విదేశాంగ మంత్రి ఖురేషి
- పాకిస్తాన్ చెరలో మగ్గిపోతున్న 54 మంది యుద్ధ ఖైదీలు... 48 ఏళ్లుగా నిరీక్షణ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








