ఫేక్ న్యూస్‌ను తొలగించబోమన్న ఫేస్‌బుక్

ఫొటో సోర్స్, Reuters
తమ నిబంధనలకు విరుద్ధంగా లేని ఫేక్ న్యూస్‌ను వెబ్‌సైట్ నుంచి తొలగించబోమని, అలా చేస్తే తమ ప్రమాణాలను ఉల్లంఘించినట్లు అవుతుందని ఫేస్‌బుక్ ప్రకటించింది.
ఫేస్‌బుక్‌లో ఉంచే పోస్టులపై పబ్లిషర్లు చాలా సందర్భాల్లో వేర్వేరు దృక్కోణాలను కలిగి ఉంటారని, అందువల్ల బూటకపు పోస్టులుగా అనిపించే పోస్టులను తొలగించడం భావ ప్రకటనా స్వేచ్ఛ మౌలిక సూత్రాలకు విరుద్ధమని ఫేస్‌బుక్ వ్యాఖ్యానించింది. నకిలీ పోస్టులనిపించే పోస్టులను తొలగించే బదులు న్యూస్ ఫీడ్‌లో వాటికి ప్రాధాన్యాన్ని తగ్గించి వేస్తామని తెలిపింది.
ఫేక్ న్యూస్ వ్యాప్తిలో ఫేస్‌బుక్ పాత్రపై అంతటా చర్చ జరుగుతోంది. 'ఫేక్ న్యూస్ ఈజ్ నాట్ అవర్ ఫ్రెండ్' అంటూ ఫేస్‌బుక్ ప్రస్తుతం బ్రిటన్‌లో ఒక ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.
2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా ఫేస్‌బుక్‌ను వాడుకొని, అమెరికా ఓటర్లను ప్రభావితం చేసేందుకు యత్నించిందనే ఆరోపణలు గతంలో వచ్చాయి. వీటికి ఆధారాలు లభించిన తర్వాత ఫేక్ న్యూస్ వ్యాప్తి చెందడంలో ఫేస్‌బుక్ పాత్రపై దృష్టి కేంద్రీకృతమవుతోంది.

ఫొటో సోర్స్, Reuters
ఈ నేపథ్యంలో ఈ అంశంపై బుధవారం అమెరికాలోని న్యూయార్క్‌లో ఫేస్‌బుక్ ఒక కార్యక్రమాన్ని నిర్వహించింది. ఫేక్ న్యూస్ సమస్యను పరిష్కరించేందుకు తాము కృషి చేస్తున్నామనే సందేశాన్ని జర్నలిస్టులకు ఇచ్చేందుకు గట్టిగా ప్రయత్నించింది.
తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే మీడియా సంస్థ 'ఇన్‌ఫోవార్స్' పేజీని తమ వెబ్‌సైట్‌పై అనుమతిస్తూ, తప్పుడు సమాచారంపై తాము పోరాడుతున్నామని ఫేస్‌బుక్ ఎలా చెప్పగలదని ఫేస్‌బుక్ ప్రతినిధులను ఈ సందర్భంగా సీఎన్‌ఎన్ ప్రతినిధి ఒలీవర్ డార్సీ ప్రశ్నించారు.
ఫేస్‌బుక్‌లో ఇన్‌ఫోవార్స్ పేజీకి తొమ్మిది లక్షల మందికి పైగా ఫాలోయర్లు ఉన్నారు. ఈ సంస్థ లైవ్‌టాక్ షోలు అందిస్తుంటుంది. ఈ సంస్థకు చెందిన ప్రధాన హోస్ట్ అయిన అలెక్స్ జోన్స్‌కు యూట్యూబ్‌లో 24 లక్షల మందికి పైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారు.
'ఇన్‌ఫోవార్స్' తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తోంది. 2012 డిసెంబరులో అమెరికాలోని కనెక్టికట్‌లో శాండీహుక్ పాఠశాలపై ఓ దుండగుడు తుపాకీతో జరిపి 20 మంది పిల్లలను, ఆరుగురు పెద్దవారిని చంపేశాడు. అయితే 'ఇన్‌ఫోవార్స్' అసలు దాడే జరగలేదని, దాడి జరిగిందన్నది అమెరికా ప్రభుత్వ కుట్ర మాత్రమేనని తప్పుడు ప్రచారం చేసింది. ఇలాంటి బూటకపు సమాచారాన్ని చాలా సందర్భాల్లో వ్యాప్తి చేసింది.

ఫొటో సోర్స్, Getty Images
'వాటిని టాప్‌లో చూపబోం'
బుధవారం ఇన్‌ఫోవార్స్‌కు సంబంధించి సీఎన్‌ఎన్ ప్రతినిధి అడిగిన ప్రశ్నకు ఫేస్‌బుక్‌కు చెందిన జాన్ హెగెమ్యాన్ బదులిస్తూ- ''అందరూ తమ అభిప్రాయాలను వ్యక్తపరిచే వేదికగా మేం ఫేస్‌బుక్‌ను రూపొందించాం'' అన్నారు.
తమ నిబంధనలను ఉల్లంఘించని ఫేక్ న్యూస్‌ను తొలగించబోమని, తప్పుడు సమాచారంగా మార్క్ చేసిన కంటెంట్‌ను న్యూస్ ఫీడ్‌లో టాప్‌లో చూపించబోమని ఫేస్‌బుక్ తెలిపింది. తప్పుడు సమాచారాన్ని వ్యక్తులు వ్యక్తంచేసే విషయంగా తమ వెబ్‌సైట్‌పై అనుమతిస్తామని, కానీ న్యూస్ ఫీడ్‌లో టాప్‌లో అనుమతించబోమని ఫేస్‌బుక్ అధికార ప్రతినిధి సీఎన్‌ఎన్‌తో చెప్పారు.
బూటకపు వార్తలు, కుట్రలు జరిగాయనే నిరాధార కథనాలు సమస్యాత్మకమైనవని, ఇవి తమను కూడా ఇబ్బందిపెడుతున్నాయని ఫేస్‌బుక్‌కు చెందిన సారా సు బుధవారం మీడియాతో వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి:
- ఎడిటర్స్ కామెంట్: కత్తి మహేశ్
- #YouTubeStars: చెముడు హర్ష.. వైవా హర్షగా ఎలా మారారు?
- ఇంటర్నెట్ ప్రకటనలు: ఎలా ఇబ్బంది పెడుతున్నాయి? ఇకపై ఏమవుతాయి?
- జుకర్‌బర్గ్: ‘భారత్ ఎన్నికల్లో మోసాలకు తావు లేకుండా చూస్తాం’
- మీ వ్యక్తిగత సమాచారాన్ని ఇంటర్నెట్ నుంచి ఇలా తొలగించండి
- BBC Special: బోనాల్లో 'రంగం' చెప్పే మాతంగి స్వర్ణలత ఎవరు?
- అభిప్రాయం: 'కేసులతో మీడియా గొంతు నొక్కాలనుకుంటున్నారు'
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









