న్యూజీలాండ్ కాల్పుల్లో హైదరాబాదీ మృతి: “ఇంటికి రమ్మని ఆ ముందు రోజే అడిగాను. కానీ అంతలోనే..”

- రచయిత, సంగీతం ప్రభాకర్
- హోదా, బీబీసీ ప్రతినిధి
న్యూజీలాండ్ మసీదులో జరిగిన కాల్పుల్లో గాయపడిన భారతీయుడు ఫరాజ్ అషన్ మృతి చెందారు. ఆ విషయాన్ని అషన్ సోదరుడు కాషిఫ్ అషన్ బీబీసీకి ధ్రువీకరించారు. శనివారం సాయంత్రం 7.30 గంటలకు తమకు అధికారుల నుంచి సమాచారం అందిందని ఆయన చెప్పారు. తమ కుటుంబం న్యూజీలాండ్ వెళ్లే విషయంలో నిర్ణయం తీసుకోనుందని తెలియజేశారు.
అంతకుముందు అషన్ కుటుంబ సభ్యులు బీబీసీ ప్రతినిధి సంగీతం ప్రభాకర్‌తో మాట్లాడారు.
‘మొన్న మా అబ్బాయితో మాట్లాడుతూ... చాలా రోజులవుతుంది కదా, వీలు చూసుకొని ఒకసారి రమ్మని చెప్పా. మరుసటి రోజే ఈ దుర్ఘటన జరిగింది. రెండేళ్లకోసారి మావాడు న్యూజీలాండ్ నుంచి ఇక్కడికి వస్తుంటాడు’ అని న్యూజీలాండ్‌లో మసీదు కాల్పుల్లో చిక్కుకున్న ఫరాజ్ అషన్ అనే కుర్రాడి తండ్రి సయీదుద్దీన్ అంటున్నారు.
న్యూజీలాండ్‌లో క్రైస్ట్‌చర్చ్ నగరంలోని అల్ నూర్ మసీదు, లిన్‌వుడ్ శివారులోని మరో మసీదుపై శుక్రవారం జరిగిన కాల్పుల్లో 49 మంది చనిపోయారు. మరెంతోమంది గాయపడ్డారు. ఆ కాల్పుల బాధితుల్లో హైదరాబాద్‌కు చెందిన ఫరాజ్ అషన్ ఒకరు.
హైదరాబాద్‌లో ఉంటున్న అతడి కుటుంబాన్ని కలవడానికి వెళ్లిన బీబీసీ ప్రతినిధి మాటల్లో...
కాల్పుల గురించి మాకు అందిన సమాచారం ప్రకారం భారత సంతతికి చెందిన వారు అక్కడ తొమ్మిది మంది ఉన్నట్లు తెలిసింది. కానీ దాన్ని అధికారికంగా ధ్రువీకరించలేదు. అది మానవాళిపై జరిగిన పెద్ద దాడిగా న్యూజీలాండ్‌లోని భారత హైకమిషనర్ సంజీవ్ శర్మ ట్విటర్లో తెలిపారు.
మా దగ్గరున్న సమాచారం ప్రకారం హైదరాబాద్‌లో ఉంటున్న అషన్ కుటుంబాన్ని కలవడానికి వెళ్లాను.
అతడి ఇంటికి వెళ్లినప్పుడు కుటుంబాన్ని ఓదార్చడానికి వచ్చిన చాలామంది బంధువులు, స్నేహితులు కనిపించారు. కానీ, ఇల్లంతా నిశ్శబ్దం అలముకొంది. మధ్యమధ్యలో చిన్నపిల్లల గొంతులు, ఫ్యాన్ చప్పుడు తప్ప మరేమీ వినిపించలేదు.
ఆ మౌనాన్ని వీడి అషన్ తండ్రి నాతో మాట్లాడారు.

నా కొడుకు వస్తాడని నమ్ముతున్నా: సయీదుద్దీన్
‘నాకు నలుగురు పిల్లలు. అషన్ అందిరికన్నా చిన్నవాడు. 10 సంవత్సరాల క్రితం ఉన్నత చదువుల కోసం న్యూజీలాండ్ వెళ్లి అక్కడి పౌరసత్వం పొందాడు. ప్రస్తుతం సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. మొదట ఆక్లాండ్‌లో ఉండేవాడు. ఆరేళ్లుగా క్రైస్ట్ చర్చిలో ఉద్యోగం చేస్తున్నాడు.
నాలుగేళ్ల క్రితమే వాడికి పెళ్లయింది. మూడు సంవత్సరాల పాప ఆరు నెలల బాబు ఉన్నారు. శుక్రవారంనాడు తన ఇంటి దగ్గరే ఉన్న అన్నూర్ మసీదుకు ప్రార్థనల కోసం వెళ్లాడు. అక్కడ కాల్పుల గురించి తెలియగానే నేను నా కొడుకుతో మాట్లాడటానికి ప్రయత్నించాను. ఫోన్ రింగవుతూనే ఉంది కానీ సమాధానం లేదు. దాంతో మా కుటుంబం విషాదంలో మునిగిపోయింది. నా భార్య అప్పట్నుంచీ కోలుకోలేకుండా ఉంది.

నా కోడలు ఇతరుల సహాయంతో అక్కడి అధికారులను సంప్రదించింది. ఇంకా అందరి సమాచారం లేదని, త్వరలోనే వివరాలు వెల్లడిస్తామని అధికారులు చెప్పారట.
మేము అషన్ ఆచూకీ తెలుసుకోవడానికి చాలా ప్రయత్నించాం. క్రైస్ట్ చర్చి అధికారులను ఈ మెయిల్ ద్వారా సంప్రదించడానికి ప్రయత్నించాం. అసదుద్దీన్ ఒవైసీ మాకు చాలా సహకరించారు.
మా అషన్ తిరిగొస్తాడని మాకు నమ్మకముంది’ అంటూ తన కొడుకు గురించి సయీదుద్దీన్ వివరించారు.

మా తమ్ముడు కోలుకుంటున్నాడు: ఖుర్షీద్ జహంగీర్
న్యూజీలాండ్ మసీదు కాల్పుల్లో అహ్మద్ ఇక్బాల్ జహంగీర్ అనే మరో వ్యక్తి కూడా గాయపడ్డారు. ఆయన సోదరుడు ఖుర్షీద్ జహంగీర్ బీబీసీతో మాట్లాడారు.
‘మేము తొమ్మిది మంది అన్నదమ్ములం. మా తమ్ముడు ఇక్బాల్ అందరికన్నా చిన్నోడు. పదిహేనేళ్ల క్రితం న్యూజీలాండ్ వెళ్లి అక్కడే భార్య ఇద్దరు పిల్లలతో స్థిరపడ్డాడు.
చాలా ఉద్యోగాలు చేసి ఆరు నెలల క్రితమే తన సొంత రెస్టారెంట్ పెట్టాడు. మసీదులో జరిగిన కాల్పుల్లో మా తమ్ముడికి చాలా గాయాలయ్యాయని, ఆపరేషన్ చేసి తనకు తగిలిన బులెట్ తీసిన తర్వాత కోలుకుంటున్నాడని తెలిసింది.

ఉదయాన్నే మా అమ్మతో మాట్లాడాడు. మా అమ్మకి 80 సంవత్సరాలు. ఈ కాల్పుల విషయం తెలిస్తే గాబరాపడుతుందని మొదట చెప్పలేదు. కానీ ఇప్పుడు తెలియగానే చాలా దిగులుగా ఉంది.
నా తమ్ముడి పరిస్థితి బాలేదు. ఇద్దరు పిల్లలతో మా మరదలు ఒంటరిగా అన్ని పనులూ చూసుకోలేక చాలా ఇబ్బంది పడుతోంది. మేం అక్కడికి వెళ్లడానికి అనుమతి కోసం చూస్తున్నాము’ అన్నారు ఖుర్షీద్.
ప్రశాంత వాతావరణంలో అలజడి: శ్రీలత
తన కుటుంబ సభ్యులను కలవడానికి న్యూజీలాండ్ నుంచి భారత్‌కు వచ్చిన శ్రీలతతో అక్కడి పరిస్థితుల గురించి మాట్లాడాను.
‘న్యూజీలాండ్‌కి మేము పదహారేళ్ళ క్రితం వెళ్ళాము. ఆక్లాండ్‌లో ఉంటున్నాము. తెలుగు రాష్ట్రాలనుంచి వచ్చి అక్కడ చాలామంది స్థిరపడ్డారు. న్యూజీలాండ్‌లో చాలా ప్రశాంత వాతావరణం ఉంటుంది. అక్కడో చిన్న యాక్సిడెంట్ జరిగితేనే పెద్ద విషయంలా చర్చిస్తారు. అలాంటిది ఒకేసారి ఇంత పెద్ద ఘటన జరగడంతో మేం షాకయ్యాం.

2011లో క్రైస్ట్ చర్చిలో వచ్చిన భూకంపం తర్వాత కొత్తగా నిర్మాణాలు చేపట్టడంతో ఉద్యోగ అవకాశాలు బాగా పెరిగాయి. దాంతో అక్కడ తెలుగు వాళ్ళు కూడా చాలామంది వ్యాపారాలు, ఉద్యోగాలు చేస్తున్నారు.
మేముండే ఆక్లాండ్ కన్నా క్రైస్ట్ చర్చి చాలా ప్రశాంతమైన ప్రాంతం. కానీ, ఇప్పుడు అక్కడ ఒకేసారి అలజడి చెలరేగింది.
ఈ సంఘటన జరిగిన తర్వాత నేను అక్కడ మా స్నేహితులతో మాట్లాడాను. క్రైస్ట్ చర్చి ప్రాంతమంతా ఇప్పుడు పోలీసుల ఆధీనంలో ఉందని, ఇప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయని చెప్పారు.’
ఇవి కూడా చదవండి:
- జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోభాల్: ‘ఒకప్పుడు పాకిస్తాన్లో ముస్లిం’ ఎందుకయ్యారు?
- 'ఇమ్రాన్ ఖాన్ ఉద్దేశం మంచిదే... కానీ, మోదీ ఎలా ఉన్నారంటే...' - పర్వేజ్ ముషారఫ్‌తో బీబీసీ ఇంటర్వ్యూ
- అవినీతిలేని స్వచ్ఛమైన పాలన అందిస్తా: 'సమర శంఖారావం'లో జగన్
- సిత్రాలు సూడరో: ఐదేళ్లలో నాలుగు కండువాలు మార్చేశారు
- తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు: మాల్కాజిగిరి నుంచి రేవంత్... చేవెళ్ల నుంచి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి
- ఆర్మ్ రెజ్లింగ్: బలవంతులైన అబ్బాయిలు కూడా ఈ చేతులతో తలపడటానికి భయపడతారు
- పల్లెపల్లెకూ బ్రాడ్‌బ్యాండ్: మోదీ ప్రభుత్వం ఏంచెప్పింది? ఏం సాధించింది?
- హోలీకి ముందే Surf Excel వెంటపడుతున్న జనం
- మీ కంప్యూటర్‌పై కేంద్రం కన్నేస్తోందా? ఇందులో నిజమెంత?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








