ఇమ్రాన్ ఖాన్ ఉద్దేశం మంచిదే... కానీ, మోదీ ఎలా ఉన్నారంటే...' - పర్వేజ్ ముషారఫ్‌తో బీబీసీ ఇంటర్వ్యూ

ఫొటో సోర్స్, Getty Images
భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతున్నాయి. పుల్వామా దాడి గురించి భారత వైమానిక దళం వింగ్ కమాండర్ అభినందన్ విడుదల, ఆ తర్వాత రోజూ సరిహద్దుల వెంబడి జరుగుతున్న కాల్పులతో ఉద్రిక్తతలకు ఇప్పుడప్పుడే తెరపడేలా కనిపించడం లేదు.
దీనికి ఎవరు బాధ్యులు?
ఈ ప్రశ్నకు చాలా సమాధానాలు ఉండచ్చు. కానీ పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు జనరల్ పర్వేజ్ ముషారఫ్ మాత్రం ప్రస్తుత ఉద్రిక్తతలకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, భారత రాజకీయ పార్టీల నేతలు, ఆర్మీ చీఫ్ బాధ్యులని భావిస్తున్నారు.
అయితే, జైషే మహమ్మద్ మిలిటెంట్ సంస్థే అని ఆయన అంగీకరిస్తున్నారు. పాకిస్తాన్ ప్రస్తుత ప్రధాని ఇమ్రాన్ ఖాన్... జైష్‌కు వ్యతిరేకంగా తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయమని కూడా అన్నారు. కానీ, లష్కరే తోయిబా కశ్మీరీల హక్కుల కోసం పనిచేస్తున్న సంస్థ అని పర్వేజ్ ముషారఫ్ చెబుతున్నారు.
బీబీసీ ప్రతినిధి భూమికా రాయ్ పర్వేజ్ ముషారఫ్‌తో టెలిఫోన్‌లో వివరంగా మాట్లాడారు.
పాకిస్తాన్ నిఘా విభాగం జైషే మహమ్మద్‌ను ఉపయోగిస్తుందని మీరు అన్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇందులో నిజమెంత?
మా నిఘా విభాగం జైషే మహమ్మద్‌ను సపోర్ట్ చేస్తుందని నేనెప్పుడూ అనలేదు. ఆ... మా దేశంలో, బెలూచిస్తాన్‌లో టెర్రరిస్టులకు రా ఎలా సపోర్ట్ చేస్తుందో, అలాగే మేం కూడా మీ దేశంలో చేస్తాం అని మాత్రం అన్నాను. ఆ.. కానీ రెండూ ఆగిపోవాలి. అది నేను ఎప్పుడూ చెబుతూన్నా. అది రెండు వైపులా ఉంది.
మా నిఘా విభాగం ఇలా చేస్తోందని, అలా చేసి అది మంచి పని చేసిందనే మాటను నేను పాకిస్తాన్ కోసమనే ఎప్పుడూ అనలేదు.

ఫొటో సోర్స్, AFP
పుల్వామా దాడి తర్వాత భారత్ ఎయిర్ స్ట్రైక్స్ అంటే వైమానిక దాడులు చేసింది. దీనిపై మీరేమంటారు?
భారత్ కచ్చితంగా తప్పు చేసింది. నేను దీన్ని సరైనదని ఎప్పుడూ అనను. అది చాలా తప్పు. వారు మా దేశంపై ఎలా అటాక్ చేయగలరు. మేం అలా జరగనివ్వం. మేం ఎదురుదాడులు చేస్తాం. మీరు చూశారు, అదే జరిగింది. విషయం మరింత పెద్దదైంది. తర్వాత యుద్ధ సన్నాహాలు కూడా మొదలయ్యాయి.
నియంత్రణ రేఖను దాటి రావడం లేదా అంతర్జాతీయ సరిహద్దులను దాటి రావడానికి పాకిస్తాన్ ఎట్టి పరిస్థితుల్లో అనుమతించదు.
మీరు జైషే మహమ్మద్‌ను మిలిటెంట్ సంస్థ అంటున్నారు, కానీ లష్కరే తోయిబాను కాదంటున్నారు. ఎందుకు?
అది నిజమే, ఎందుకంటే వాళ్లు( జైషే మహమ్మద్) పాకిస్తాన్‌లో నాపై కూడా దాడి చేశారు. వాళ్లు తీవ్రవాదులే. వారు సాధారణ పౌరులపై కూడా దాడులు చేస్తారు. తమ దేశంలోనే దాడులు చేయడం అనేది తీవ్రవాదమే. ఇక లష్కర్ విషయానికి వస్తే, అది కేవలం కశ్మీర్ కేంద్రంగా ఉంది. అందుకే, నేను దాన్ని తీవ్రవాద సంస్థగా భావించడం లేదు.
అది ముజాహిదీన్ యాక్టివిటీ. అది ప్రారంభమై సుమారు 20 ఏళ్లైంది. అది వేరే, ఇది వేరే.. ఈ రెండింటినీ కలపకూడదు.

ఫొటో సోర్స్, Getty Images
కానీ లష్కరే తోయిబా కూడా హింసాత్మక ఘటనలకు పాల్పడుతోంది. అయినా, మీరు స్వయంగా లష్కరే చీఫ్ హఫీజ్ సయీద్ అభిమాని అని చెప్పారు. హఫీజ్ సయీద్ పేరు ముంబయిలో జరిగిన 26/11 దాడిలో కూడా ఉంది?
మొదటి విషయం ఏంటంటే, భారత్‌లో జరిగిన దాడిలో హఫీజ్ సయీద్ పేరును ఇరికించడం పూర్తిగా తప్పు. ముంబై దాడుల్లో లష్కర్, లేదా హఫీజ్ సయీద్ ప్రమేయం ఉందనడం సరికాదు.
ఐక్యరాజ్యసమితి కూడా లష్కరేను తీవ్రవాద సంస్థగా ప్రకటించింది. మీరు లష్కరేను ఎందుకు వెనకేసుకొస్తున్నారు?
ప్లీజ్.. నాకు యుఎన్ గురించి చెప్పకండి. అక్కడ పాస్ అయ్యే రిజల్యూషన్స్ ఎలా పాస్ అవుతాయో నాకు తెలుసు. అవి న్యాయబద్ధంగా జరగవు. అవి ప్రభావం వల్ల జరుగుతాయి. మేం కశ్మీర్ సమస్యను పరిష్కరించాలని భావిస్తున్నాం. అప్పుడే కొనసాగుతున్న ఈ పరంపరకు తెరపడుతుంది. మనం దీనిని పరిష్కరించకపోతే ఇది కొనసాగుతూనే ఉంటుంది.
అంటే, జరుగుతున్న తీవ్రవాద దాడులు ఆగిపోతాయని కాదు. ఇవి మరింత పెరుగుతాయి. కశ్మీర్ అంశం పరిష్కారం జరగనంతవరకూ ఇలాంటి దాడులు జరుగుతూనే ఉంటాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఈరోజు మీరు లష్కరేను తీవ్రవాద సంస్థగా ఒప్పుకోవడం లేదు. కానీ ఒక అధ్యక్షుడుగా మీరు దానిపై నిషేధం ఎందుకు విధించారు?
అవును, నేను విధించాను. కానీ ఆ సమయంలో నాకు లష్కరే గురించి పూర్తి సమాచారం లేదు. అందుకే అలాంటి నిర్ణయం తీసుకున్నాను. వారిలో టాప్‌లో ఉన్న కేడర్ అందరూ మతపరమైన యువకులే. లష్కరే వారిని ప్రజల సంక్షేమం కోసం నియమించింది.
ఈ పిల్లలను ఆ పనుల్లో నియమించకపోతే, వారిని గోడవైపు మళ్లించి, శిక్షలు వేస్తే, ఇదే పిల్లలు రేపు ముందుకు వెళ్లి తాలిబాన్ మిలిటెంట్లుగా మారుతారు. వారు ఆయుధాలు పడతారు. అందుకే వారు ఎవరు అని మనం లష్కరేలోని పాజిటివ్ అంశాలను కూడా చూడాలని అంటాను.
కానీ, మతం పేరుతో ఈ పిల్లల చేతుల్లోకి ఆయుధాలు ఇవ్వడం సబబే అని మీరెలా అంటారు?
వారికి ఎవరూ బ్రెయిన్ వాష్ చేయలేదు. వాళ్లు తమకు తాముగా ఇక్కడున్నారు. కశ్మీర్లో తమ సోదరసోదరీమణుల కోసం ప్రాణత్యాగానికి కూడా తెగిస్తున్నారు. వాళ్లు తమ వైపు నుంచి కశ్మీరీలకు సాయం చేస్తున్నారు. పాకిస్తాన్ ప్రభుత్వం వారిని ఏరకంగానూ రెచ్చగొట్టడం లేదు. వారి భర్తీ ప్రక్రియే అలా ఉంటుంది.
లష్కరేలో ఎప్పుడు చేరుదామా అని వేల మంది వెయిటింగ్ లిస్టులో ఉన్నారు. దానిని పాకిస్తాన్ ప్రభుత్వం ఎలా అడ్డుకోగలదు. వారికి ఆపడం కూడా సాధ్యం కాదు, ఎందుకంటే జనం వారి వెంట ఉన్నారు.

నియంతృత్వం సమయంలోనే పాకిస్తాన్ మెరుగ్గా ఉందని మీరు భావిస్తున్నారా? అలాంటప్పుడు ఇమ్రాన్ ఖాన్ పాలనను మీరు ఏ విధంగా చూస్తున్నారు?
ఏ వ్యవస్థ అయినా ప్రజలు సుఖశాంతులతో ఉండడం, దేశం అభివృద్ధి చెందడమే దాని లక్ష్యం అని నేను అనుకుంటున్నాను. అవును. నేను మా దేశంలో ఎప్పుడు మిలిట్రీ మ్యాన్ వచ్చినా వారు పాకిస్తాన్‌ను అభివృద్ధి చేశారనే చెప్పాను. ఇందులో దాచిపెట్టాల్సిన విషయమేం లేదు.
అది అయూబ్ ఖాన్ పాలన అయినా, నా పాలన అయినా పాకిస్తాన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఆరోగ్యం, విద్య అన్ని రంగాల్లో మంచి అభివృద్ధి సాధించింది. ఇప్పుడు ఎవరూ వినడానికి సిద్ధంగా లేకపోతే ఏం చేయాలి. డెమాక్రసీ-డెమాక్రసీ. డెమాక్రసీతో మనం ఏం చేయాలి. ప్రజల కోసం పనిచేయని డెమాక్రసీ ఉండి ఏం లాభం?.
ప్రస్తుత పాకిస్తాన్‌ను మీరు మారిన పాకిస్తాన్‌గా చూస్తున్నారా?
కచ్చితంగా, పాకిస్తాన్ గత పదేళ్లను నేను డెకేడ్ ఆఫ్ డిజాస్టర్స్( వినాశనాల దశాబ్దం) అనే చెబుతాను. ఆ సమయంలో అందరూ డెమాక్రసీనే నడిపించారు. కానీ ప్రజలు నరకం చూశారు. నీళ్లు లేవు, తినడానికి తిండి లేదు. అలాంటప్పుడు డెమాక్రసీ ఉండి ఏం లాభం. ఇప్పుడు ఏ ఇమ్రాన్ ఖాన్ వచ్చారో, ఆయన మార్పు కోసం ప్రయత్నిస్తున్నారు. తన ఉద్దేశం మంచిదే. ఇమ్రాన్ చాలా బాగా నడిపిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
కానీ పాకిస్తాన్ ప్రధాని ఎవరైనా, అధికారం సైన్యం చేతిలోనే ఉంటుందని చెబుతుంటారు. దాని గురించి మీరేమంటారు?
అలాంటి ప్రాపగాండాను వ్యాప్తి చేస్తున్నారు. ఆర్మీ ఏం చేయదు. ఇదంతా మాటలు మాత్రమే. మీరు పాకిస్తాన్‌ను తిట్టాలనే అనుకంటారు. ఇక్కడ ఈ ఇమ్రాన్ ఖాన్ బాగా చేస్తున్నారు. కానీ మీరు మాత్రం ఆయన్ను తిడుతూనే ఉంటారు.
ఆయన పాకిస్తాన్‌కు బాగా చేస్తున్నారు కాబట్టి, మీరు ఇమ్రాన్‌ను తిడుతారు. మాకు భారతదేశానికి మంచి నేత అక్కర్లేదు. మాకు పాకిస్తాన్ కోసం మంచి నేత కావాలి.
అంటే ఇమ్రాన్ ఖాన్ ఆలోచనల వల్ల భారత్-పాకిస్తాన్ మధ్య సమస్యలు తొలగిపోయాని మీకు అనిపిస్తోందా?
మీరు ఇమ్రాన్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు. మోదీ వైపు నుంచి ఈ సమస్యలు పరిష్కారం కావు. ఇమ్రాన్ ఖాన్ దానికి పూర్తిగా ప్రయత్నిస్తున్నారు. కానీ, మీ ప్రధాన మంత్రి, మిగతా రాజకీయ పార్టీల నేతలు, టీవీ చానళ్లు ఎలా మాట్లాడుతున్నాయో చూడండి. వారి వల్ల ఈ సమస్యలు తొలగిపోతాయని మీకు అనిపిస్తోందా?
ఈ టీవీ చానళ్ల వల్ల జనాల్లో ద్వేషం మరింత పెరిగింది. మేం సర్జికల్ స్ట్రైక్స్ చేస్తాం, అది చేస్తాం.. అరే.. ఎలా చేస్తారు. పాకిస్తాన్ ఒక బలమైన దేశం అని, దానిని తేలిగ్గా తీసుకోకూడదనే విషయం భారత్ తెలుసుకోవాలి. ప్రతి దేశానికి తమ సౌర్వభౌమాధికారం ఉంటుంది. దానిని గౌరవించాలి.
ఇవి కూడా చదవండి:
- రామ జన్మభూమి-బాబ్రీ మసీదు కేసు పరిష్కరించనున్న మధ్యవర్తులు వీరే..
- ఒక అమ్మాయికి ముగ్గురు బాయ్‌ఫ్రెండ్స్... ఆ ముగ్గురితో ప్రేమ సాధ్యమేనా?
- భారత్‌లో మహిళలు సురక్షితంగానే ఉన్నారా...
- జైషే మహమ్మద్ క్యాంప్‌పై దాడి శాటిలైట్ చిత్రాల్లో వాస్తవం ఎంత: Fact Check
- పుల్వామాలో ఆత్మాహుతి దాడి చేసిన ఆదిల్ దార్ ఇంటి దగ్గర ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది...
- బ్రసెల్స్ మ్యూజియం హత్యలు: 'అతడే మొదటి ఐరోపా జిహాదీ'
- మొబైల్ డేటా రేట్లు ప్రపంచంలోకెల్లా భారత్‌లోనే అత్యంత తక్కువ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









