లోక్‌సభ ఎన్నికలు 2019: మహిళలపై లైంగిక హింసను అరికట్టే చర్యలు ఫలిస్తున్నాయా? :Reality Check

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సరోజ్ సింగ్
- హోదా, బీబీసీ రియాలిటీ చెక్
దిల్లీలో ఆరేళ్ల క్రితం నిర్భయపై కదిలే బస్సులో అత్యాచారం జరగింది. కొన్ని రోజుల తర్వాత ఆమె మరణించింది. మరి ఆ తర్వాత భారత్‌లో మహిళలు లైంగిక దాడుల బారి నుంచి సురక్షితంగా ఉన్నారా?
2012లో జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా ఎన్నో తీవ్ర నిరసనలకు కారణమైంది. దీంతో లైంగిక దాడుల అంశం రాజకీయ అజెండాగా మారిపోయింది.
రెండేళ్ల తర్వాత అధికారం చేపట్టిన బీజేపీ... లైంగిక దాడుల నిరోధానికి కఠిన చట్టాలను రూపొందించినట్లు ప్రకటించింది. కానీ, ప్రస్తుతం దేశంలోని మహిళలు ఎప్పుడూ లేనంత ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నారని ప్రతిపక్ష కాంగ్రెస్ విమర్శిస్తోంది.
లైంగిక వేధింపులపై మాట్లాడేందుకు చాలామంది మహిళలు ఇప్పుడు ధైర్యంగా ముందుకు వస్తున్నారు. కొన్ని అత్యాచార నేరాలకు కఠిన శిక్షలు కూడా విధించారు.
కానీ ఇప్పటికీ మహిళలు తమపై వేధింపుల గురించి మాట్లాడేందుకు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు, బాధితులకు న్యాయం జరగడంలో కూడా ఎన్నో అడ్డంకులు ఎదురవుతున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
పెరుగుతున్న కేసులు
ఎన్సీఆర్బీలో 2016 వరకూ నమోదైన సమాచారం ప్రకారం పోలీసుల వరకూ చేరిన అత్యాచారం కేసుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. 2012లో దిల్లీలో నిర్భయ ఘటన తర్వాత ఈ సంఖ్య భారీగా పెరిగింది.
మహిళల్లో చైతన్యం పెరగడం కూడా ఈ కేసుల సంఖ్య పెరగడానికి ఓ కారణంగా భావించవచ్చు.
మహిళా పోలీసు అధికారుల సంఖ్య గణనీయంగా పెరగడం, మహిళా పోలీసులే నిర్వహించే స్టేషన్ల ఏర్పాటు వంటివి కూడా దీనికి దోహదం చేశాయి. (ఆధారం: http://barrett.dyson.cornell.edu/NEUDC/paper_32.pdf)
సమాజం నుంచి వచ్చిన తీవ్ర ఒత్తిడి కారణంగా 2012 తర్వాత చట్టాల్లో కొన్ని మార్పులు జరిగాయి.
శరీరంలో ఏ భాగంపై లైంగికంగా దాడి చేసినా అది అత్యాచారం కిందకే వస్తుందంటూ అత్యాచార నిర్వచనాన్ని మారుస్తూ చట్టాన్ని సవరించారు. (ఆధారం: http://www.lawyersclubindia.com/articles/New-definition-of-rape-after-the-criminal-law-amendment-act-2013-9000.asp)
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
12ఏళ్లలోపు పిల్లలపై అత్యాచారానికి పాల్పడినవారికి ఉరిశిక్ష విధించవచ్చని, 16 ఏళ్లలోపు వారిపై అత్యాచారానికి పాల్పడేవారికి విధించే శిక్షల స్థాయిని పెంచుతూ గత సంవత్సరం నిర్ణయం తీసుకుంది.
ఎన్ని చేసినా, భారత్‌లో ఇప్పటికీ బయటపడే లైంగిక వేధింపుల కేసులు తక్కువగానే ఉంటున్నాయనేది వాస్తవం.
2015-16లో అధికారికంగా నమోదైన నేరాల వివరాలను, లైంగిక హింస అనుభవాల గురించి జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో మహిళలు చెప్పిన సమాచారంతో పోల్చి ఓ వార్తాపత్రిక పరిశీలించింది.
ఈ వివరాలను పరిశీలిస్తే.. నమోదు కాని ఎన్నో వేధింపుల కేసులున్నాయనే విషయం తెలుస్తుంది. చాలా సందర్భాల్లో ఈ నేరాలకు పాల్పడే వ్యక్తి భర్తేనని ఆ సమాచారం ద్వారా వెల్లడైంది.

ఫొటో సోర్స్, AFP
న్యాయ వ్యవస్థలో లోపాలు
లైంగిక నేరాలపై మహిళలు పోరాడాలంటే ఇప్పటికీ ఎన్నో అడ్డంకులున్నాయి. చాలామంది ఇదో సామాజిక అవమానంగా భావిస్తారు.
పోలీస్ స్టేషన్లు, ఆస్పత్రుల్లో సైతం బాలికలు, మహిళలు అవమానాలకు గురవుతున్నారని, వారికి అన్ని సందర్భాల్లో సరైన వైద్య, న్యాయ సహాయం అందడం లేదని హ్యూమన్ రైట్స్ వాచ్ నివేదిక వెల్లడించింది.
మద్యం తాగినందుకు, కండోమ్‌లను తన గదిలో ఉంచుకుందని ఓ అత్యాచార బాధిత మహిళను వ్యభిచారి అని 2017లో ఓ కోర్టు తన ఆదేశాల్లో పేర్కొనడం విమర్శలకు దారి తీసింది.
ఏదైనా అత్యాచారం కేసు నమోదైనప్పుడు, మహిళలకు న్యాయం జరగడానికి అవకాశాలేమైనా ఉన్నాయా?
2009-14 మధ్య కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కాలంలో 24-28% రేప్ కేసుల్లో నేరాలు రుజువయ్యాయని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. ప్రస్తుత బీజేపీ అధికారంలో ఉన్న మొదటి మూడేళ్లలో సైతం పెద్దగా మార్పేమీ లేదు.
ఈ నేర నిరూపణ శాతం ముగింపు చేరే కేసులకు సంబంధించినదేనని గమనించాలి అని 2018లో వెల్లడైన ఓ పరిశోధనా పత్రంలో పేర్కొన్నారు.
"గత దశాబ్ద కాలంగా నమోదైన రేప్ కేసుల్లో కేవలం 12-20శాతం కేసుల్లో మాత్రమే తదుపరి విచారణలు జరిగాయి" అని ఆ పరిశోధనలో స్పష్టమైంది.
పెరుగుతున్న రేప్ కేసులతో పోలిస్తే నేరాలు రుజువయ్యే కేసుల సంఖ్య చాలా తక్కువ ఉండటంపై ఆందోళగా ఉందని ఈ పరిశోధనా పత్రం రచయిత అనితా రాజ్ బీబీసీకి చెప్పారు.
పేరుకుపోయిన రేప్ కేసుల పరిష్కారానికి 1000కి పైగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయనున్నామని ప్రభుత్వం గత సంవత్సరం తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
ప్రపంచవ్యాప్తంగా పరిస్థితి ఎలా ఉంది?
మహిళలకు అఫ్ఘానిస్తాన్, సిరియా, సౌదీ అరేబియాల కన్నా భారత్ అత్యంత ప్రమాదకర దేశం అని థాంప్సన్ రాయిటర్స్ ఫౌండేషన్ గత జూన్‌లో నిర్వహించిన ఓ సర్వేలో సూచించింది. (ఆధారం: http://poll2018.trust.org/)
దీనిపై భారత్‌లో ప్రభుత్వం నుంచే కాదు, కొందరు ప్రతిపక్ష సభ్యుల నుంచి కూడా తీవ్ర నిరసన వ్యక్తమైంది.
మహిళలకు సంబంధించిన అంశాలపై ప్రపంచవ్యాప్తంగా 500 మంది నిపుణుల అభిప్రాయాల ఆధారంగా ఈ సర్వే నిర్వహించారు.
ఈ సర్వే నివేదిక వాస్తవ సమాచారం ఆధారంగా లేదని, అశాస్త్రీయంగా ఉందంటూ భారత్‌లోని కొందరు నిపుణులు ఈ సర్వే నిర్వహించిన విధానాన్ని ప్రశ్నించారు.
లైంగిక దాడులు ఏ స్థాయిలో ఉన్నాయనే దాన్ని కచ్చితంగా లెక్కించడం కష్టమే, కానీ సమస్య తీవ్రతను ఈ సర్వే నొక్కి చెప్పింది.

ఫొటో సోర్స్, Getty Images
మహిళలకు తమపై జరిగిన లైంగిక అకృత్యాలపై ఫిర్యాదు చేసే విధానాన్ని సులభతరం చేయడం వల్ల ఎన్నో కేసులు నమోదవుతున్నాయని ప్రభుత్వం వెల్లడించింది. భారత్‌లో అత్యాచార కేసుల నిష్పత్తి ప్రతి 1000 మందికి 0.03 కాగా అమెరికాలో ఇది ప్రతి 1000 మందికి 1.2గా ఉందని తెలిపింది. (ఆధారం: http://wcd.nic.in/sites/default/files/Reuters_poll_PR.pdf)
ఈ అంకెలను చూస్తే 2016లో నమోదైన రేప్ కేసుల సంఖ్యను భారత జనాభా (2011 లెక్కల ప్రకారం)తో భాగించగా వచ్చినట్లుగా కనిపిస్తోంది. కానీ అమెరికా గణాంకాలు 2016లో 12 ఏళ్ల లోపువారిపై లైంగిక వేధింపులు లేదా అత్యాచారం అనే అంశంపై నిర్వహించిన జాతీయ నేర సర్వే ద్వారా వెల్లడైన వివరాలు.
చట్టం ప్రకారం రేప్ అంటే అమెరికాలో ఉన్న నిర్వచనం వేరు, భారత్‌లో ఉన్న నిర్వచనం వేరు. అమెరికాలో చాలా రకాల నేరాలు రేప్ కిందకే వస్తాయి.
రేప్ కేసుల్లో బాధితులు పురుషులు, మహిళలు ఎవరైనా కావచ్చు, సంసారంలో అత్యాచారం కూడా దీనికిందకే వస్తుంది.
భారత చట్టాల ప్రకారం ప్రస్తుతం మహిళలు మాత్రమే అత్యాచార బాధితులు కాగలరు. భార్య వయసు 16 ఏళ్లలోపు ఉన్న సందర్భంలో తప్ప భర్త ఆమెను రేప్ చేయలేడు.
ఈ అంశం కూడా రానున్న సాధారణ ఎన్నికల సందర్భంగా విస్తృత చర్చకు రావచ్చు.


ఇవి కూడా చదవండి.
- అందరికీ మరుగుదొడ్లు కల్పిస్తామన్న మోదీ హామీ నెరవేరిందా...
- గంగానది ప్రక్షాళన పూర్తయిందా?
- ప్రధాని మోదీ మాట నిజమేనా? మిగతా వారికన్నా ఎక్కువ విమానాశ్రయాలు కట్టించారా?
- #MeToo: ఏది వేధింపు? ఏది కాదు?
- ఇలా చేస్తే మీ భాగస్వామిని మోసం చేయడమా? కాదా?
- ''గూగుల్ నా కుమార్తె మరణాన్ని సొమ్ము చేసుకుంటోంది''
- జైషే మహమ్మద్ క్యాంప్‌పై దాడి శాటిలైట్ చిత్రాల్లో వాస్తవం ఎంత: Fact Check
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








