''గూగుల్ నా కుమార్తె మరణాన్ని సొమ్ము చేసుకుంటోంది''

- రచయిత, క్లారీ విలియమ్స్
- హోదా, విక్టోరియా డెర్బీషైర్ ప్రోగ్రామ్
అమెరికా జర్నలిస్ట్ అలిసన్ పార్కర్ 2015లో ఒక టీవీ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం నిర్వహిస్తున్నపుడు ఆమెను కాల్చిచంపారు. ఆమెతో పాటు ఆమె కెమెరామన్ కూడా ఆ కాల్పుల్లో చనిపోయాడు.
ఆమెను హత్యచేసిన హంతకుడు ఆ దృశ్యాన్ని ఆన్‌లైన్‌లో పోస్ట్ చేశాడు. సోషల్ మీడియా హోస్ట్ చేస్తున్న ఆ దృశ్యాలకు సదరు సంస్థలను బాధ్యులను చేయటం కోసం అలిసన్ తండ్రి ఆండీ ఉద్యమిస్తున్నారు. ఆ ఉద్యమం గురించి ఆయన విక్టోరియా డెర్బీషైర్ కార్యక్రమానికి వివరించారు.
వర్జీనియాలోని మోనెటా పట్టణంలో పర్యాటకం గురించి ఆ ఉదయం టీవీ ఇంటర్వ్యూ ప్రత్యక్ష ప్రసారం ప్రారంభించారు. అకస్మాత్తుగా తుపాకీ కాల్పుల శబ్దం ఆ కార్యక్రమానికి అంతరాయం కలిగించింది.
ఆ ఇంటర్వ్యూ చేస్తున్న టీవీ జర్నలిస్ట్ అలిసన్ (24 సంవత్సరాలు), చిత్రీకరిస్తున్న కెమెరామన్ ఆడమ్ వార్డ్ (27 సంవత్సరాలు) ఇద్దరూ చనిపోయారు. ఆ ఇంటర్వ్యూ ఇస్తున్న వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డారు.
అలిసన్, ఆడమ్ ఇరువురూ కేబుల్ చానల్ డబ్ల్యూబీజీ ఉద్యోగులు. వారిపై కాల్పులు జరిపిన దుండగుడు అదే సంస్థకు చెందిన మాజీ ఉద్యోగి వెస్టర్ లీ ఫ్లనాగన్. వారిద్దరి ఆఖరి క్షణాలను అతడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ దృశ్యాలు ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేశాయి. హంతకుడు తర్వాత తనను తాను తుపాకీతో కాల్చుకుని చనిపోయాడు.
ఆ దృశ్యాలను ఎన్నడూ చూడబోనని అలిసన్ తండ్రి ఆండీ నిర్ణయించుకున్నారు.
''నిజం... ‘ఆ వీడియో నువ్వు చూశావా, చూస్తావా...’ అని జనం నన్ను తరచుగా అడుగుతుంటారు. మొన్నొక రోజు ఒక వ్యక్తి ఆ వీడియో గురించి నాకు చెప్పబోయారు. జనానికి అసలు ఆలోచనే లేదు. చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు'' అంటారాయన.

ఫొటో సోర్స్, facebook
అయితే.. ఆ దృశ్యాల వీడియోలను ఇంటర్నెట్ నుంచి తొలగించేలా చేయాలంటే ప్రతి వీడియో గురించీ ఆయన తమకు ఫిర్యాదు చేయాల్సి ఉంటుందని సెర్చ్ ఇంజన్ గూగుల్.. ఆండీకి చెప్పింది.
''నీ కూతురు హత్యా దృశ్యాల వీడియోను నువ్వు చూసి.. దానిని మేం ఎందుకు తొలగించాలో చెప్పాలి' అని ఒక మనిషి మరొక మనిషితో చెప్పగలరేమో ఊహించండి. ఐసిస్ వంటి వారు తప్ప మరెవరైనా చెప్పగలరా? కానీ గూగుల్ అదే మాట చెప్తోంది'' అని ఆండీ పేర్కొన్నారు.
అంతకన్నా దారుణం ఏమిటంటే.. తుపాకీ హింసను తుదముట్టించాలంటూ ఆండీ చేస్తున్న ఉద్యమం వల్ల.. ఆయన ఆన్‌లైన్ వేధింపులకు ఒక లక్ష్యంగా మారారు.
ఆయన రాసిన వ్యాసాలకు కామెంట్లలో ''ఆమె తనను తాను కాపాడుకోవటానికి ఓ గన్ ఉండి ఉంటే...'' వంటి వ్యాఖ్యలు కనిపిస్తుంటాయి. కొందరు కుట్ర సిద్ధాంతకర్తలు అలిసన్ జీవితానికి సంబంధించిన ఒక వార్తా కథనాన్ని యూట్యూబ్‌లో పోస్ట్ చేసి.. ఆమె హత్య 'బూటకం' అని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. ఆండీని చంపేస్తామంటూ బెదిరింపులు కూడా వచ్చాయి.
గూగుల్‌లో అలిసన్ పేరు సెర్చ్ చేస్తే.. అలిసన్ ప్లాస్టిక్ సర్జరీ చేసుకుని ఇజ్రాయెల్‌లో రహస్యంగా జీవిస్తోందని చెప్పే వీడియోలు సహా ఇలాంటి కుట్ర సిద్ధాంతకర్తలు పోస్టు చేసిన అనేక వీడియోలు కనిపిస్తాయి.
తనను ట్రోల్ చేసే వారితో మాట్లాడటానికి ఆండీ నిరాకరిస్తున్నారు. ''కీబోర్డు వీరులతో మనం ఏమీ చేయలేం. వారి ఆలోచనలను మనం మార్చలేం'' అని ఆయన వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, COURTESY OF THE PARKER FAMILY
అయితే.. వారు ఆ వీడియోలను షేర్ చేయటానికి అనుమతిస్తున్నందుకు గూగుల్, సోషల్ మీడియా వేదికలను ఆయన నిందిస్తున్నారు. అమెరికాలో వార్తలు అందించే సంస్థలపై ఉన్న నియంత్రణలు ఫేస్‌బుక్, గూగుల్, ట్విటర్లకు కూడా వర్తింపచేయాలని ఆయన అంటున్నారు.
''ఆ వీడియోల మీద అడ్వర్టైజ్‌మెంట్లు, ఆటోప్లే ఉంటాయి. వాణిజ్య ప్రకటనలను తీసివేసినా కూడా.. క్లిక్ చేసిన ప్రతిసారీ గూగుల్‌కు డబ్బులు వస్తుంటాయి. దానిని క్లిక్ చేస్తూ ఉండాలని వారు కోరుకుంటారు. మన సమాచారంతో వాళ్లు డబ్బు చేసుకుంటారు'' అని వివరించారు ఆడమ్.
''నా కూతురు మరణం నుంచి గూగుల్ లాభాలు పొందుతోంది. దానికి నేను ఒప్పుకోను. వాళ్లు (నన్ను) ఏం చేయగలరు? నాకు ఎంతో విలువైనదంతా నేను కోల్పోయాను. వారికి నేను భయపడను'' అని ఆయన స్పష్టంచేశారు.
''గూగుల్ మీద సమ్మెట దెబ్బ కొట్టటం'' కోసం, వారి వేదికలను తగినవిధంగా పరిశీలిస్తూ ఉండాలని కోరటం కోసం.. ప్రస్తుతం జార్జ్‌టౌన్ యూనివర్సిటీ సివిల్ రైట్స్ క్లినిక్‌తో కలిసి పనిచేస్తున్నారు ఆండీ.
ఒకవేళ గూగుల్ అందుకు నిరాకరిస్తే.. కాంగ్రెస్ (అమెరికా పార్లమెంటు) సభ్యులు రంగంలోకి దిగి ఆ సంస్థకు హితబోధ చేయాలని ఆయన అంటున్నారు.
''మీరు మాతో కలిసి ఈ దృశ్యాలను తొలగించండి లేదంటే మిమ్మల్ని కోర్టుకు తీసుకెళ్లటానికీ మేం వెనుకాడం అని చెప్తాం'' అని తెలిపారు.
''ఎవరూ ఈ పని చేయలేదు. వారిని బాధ్యులుగా నిలబెడతాం. సెనెటర్లు కూడా దీనికి మద్దతు ఇస్తున్నారు'' అని వివరించారు.

ఫొటో సోర్స్, COURTESY OF THE PARKER FAMILY
మానసికంగా అస్థిరంగా ఉండే వారి చేతుల్లో తుపాకులు లేకుండా చూడటానికి వీలుగా.. తుపాకీ చట్టాలకు హేతుబద్ధమైన సంస్కరణలు చేయాలని కూడా ఆండీ ఉద్యమిస్తున్నారు.
''బ్రిటన్, ఆస్ట్రేలియాల్లో ఉన్న తుపాకీ నియంత్రణ చట్టాలను అమెరికా కూడా అనుసరిస్తే చాలా బాగుండు'' అని ఆయన అభిప్రాయపడ్డారు.
''రెండు దశాబ్దాల కాలంలో తొలి తుపాకీ నియంత్రణ చర్యను ఈ వారమే ఆమోదించారు. మధ్యంతర ఎన్నికల్లో అత్యంత ప్రధానమైన అంశాల్లో తుపాకీ నియంత్రణ అనేది రెండు లేదా మూడో అంశం. నేను జీవించివున్నపుడే సంస్కరణలు అమలవుతాయని నమ్ముతున్నా'' అని ఆండీ ఆశాభావం వ్యక్తంచేశారు.
తన కుమార్తె చాలా అందమైన వ్యక్తి అని, ఆమెది దయార్ద్ర హృదయమని ఆండీ అభివర్ణించారు. ఆమె రోజూ 60,000 మంది ప్రేక్షకులకు తన ప్రసారాలు చేసేవారు. అవార్డులు గెలుచుకున్న డాక్యుమెంటరీలను రూపొందించారు. ఉత్తమ ప్రత్యక్ష కథనానికి గాను ఆమెకు మరణానంతరం ఎమ్మీ అవార్డు లభించింది.
''ఈ ప్రపంచానికి కొందరు చాలా ప్రకాశవంతమైన వెలుగును తీసుకొస్తారు. వారు వెళ్లిపోయిన తర్వాత కూడా ఆ వెలుగు నిలిచే ఉంటుంది' అనే మాటను నేను ఈ మధ్య చూశాను. అలిసన్ చాలా మందిని ప్రభావితం చేసింది. చాలా మందికి స్ఫూర్తినిచ్చింది. చాలా మంది జీవితాలను స్పృసించింది. ఆ వెలుగు ప్రజ్వలిస్తూనే ఉండేలా చూడాలని నేను కోరుకుంటున్నాను. మేం ఎప్పుడూ ఆమె గురించే ఆలోచిస్తుంటాం. ఆమెతో రోజూ మాట్లాడుతూనే ఉంటాను'' అని ఆండీ వివరించారు.
ఒళ్లు గగుర్పొడిచే హింస, నగ్నత్వం, అక్రమ కార్యకలాపాలు, విద్వేష ప్రసంగాలతో కూడిన కంటెంట్‌ను తమ మార్గదర్శకాలు నిషేధిస్తున్నాయని యూట్యూబ్ చెప్తోంది. ఏదైనా కంటెంట్ జుగుప్సాకరంగా ఉన్నట్లయితే.. యూజర్లు సైన్-ఇన్ చేసే విధంగా ఆంక్షలు ఉంటాయని పేర్కొంది.
యూట్యూబ్ మాతృసంస్థ గూగుల్. ''బాధితురాలు, ఆమె కుటుంబం పట్ల మాకు సానుభూతి ఉంది. సమాజానికి భద్రత కల్పించటానికి.. ఎటువంటి పోస్టులు చేయటానికి అంగీకరించమో వివరించే స్పష్టమైన విధానాలు యూట్యూబ్‌కు ఉన్నాయి. ఈ విధానాలను ఉల్లంఘించే వీడియోల గురించి మమ్మల్ని అప్రమత్తం చేసినపుడు వాటిని మేం తొలగిస్తాం'' అని యూట్యూబ్ అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు.
''కొన్ని ఉదంతాల్లో.. ఇలా మా దృష్టికి తీసుకువచ్చిన కంటెంట్ ఈ మార్గదర్శకాలను ఉల్లంఘించనట్లయితే, తక్కువ వయసు యూజర్లు వీక్షించటానికి తగినవి కాకపోతే.. వాటిపై వయసు పరిమితులు విధిస్తాం'' అని పేర్కొన్నారు.
- ఇడుపులపాయ: గసగసాలు సాగు చేశారు.. పోలీసులు జైల్లో పెట్టారు
- జైషే మహమ్మద్ క్యాంప్‌పై దాడి శాటిలైట్ చిత్రాల్లో వాస్తవం ఎంత: Fact Check
- నా గర్ల్‌ఫ్రెండ్ నన్ను ఎలా చిత్రహింసలు పెట్టిందంటే..
- తలలోకి పేలు ఎలా వస్తాయి? ఎందుకు వస్తాయి?
- అందరికీ మరుగుదొడ్లు కల్పిస్తామన్న మోదీ హామీ నెరవేరిందా...
- మోదీ హయాంలో రహదారుల నిర్మాణం ఎన్ని రెట్లు పెరిగింది?
- 292 మంది మిలిటెంట్లు చనిపోయారా: FactCheck
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








