న్యూజీలాండ్‌లో రెండు మసీదులపై 'ఉగ్రవాద దాడి': 49 మంది మృతి, వీరిలో ఒకరు హైదరాబాదీ

మసీదు

ఫొటో సోర్స్, Reuters

న్యూజీలాండ్‌లోని క్రైస్ట్‌చర్చ్ నగరంలో స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం రెండు మసీదులపై జరిగిన కాల్పుల్లో 49 మంది చనిపోయారు. 20 మంది గాయపడ్డారు. ఇది ఉగ్రవాద దాడేనని న్యూజీలాండ్ ప్రధానమంత్రి జసిండా ఆర్‌డెర్న్ ప్రకటించారు. న్యూజీలాండ్ చీకటి రోజుల్లో ఈ రోజు ఒకటని వ్యాఖ్యానించారు.

మృతుల్లో నలుగురు భారతీయులు కూడా ఉన్నారని సమాచారం. వీరిలో ఒకరు హైదరాబాదీ.

వీడియో క్యాప్షన్, న్యూజీలాండ్‌లో ఉగ్రదాడిలో గాయపడిన హైదరాబాదీ సోదరుడు ఖుర్షీద్

కాల్పుల కేసులో ముగ్గురు మగవారిని, ఒక మహిళను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు మీడియాకు చెప్పారు. 20ల్లో ఉన్న ఒక యువకుడిపై హత్యాభియోగం నమోదు చేశారు. అతడిని శనివారం ఉదయం న్యాయస్థానంలో ప్రవేశపెట్టనున్నారు. మరొకరికి ఈ కాల్పులతో సంబంధం లేదని నిర్ధరించుకున్నారు.

మిగతా ఇద్దరికి ఇందులో ఏమైనా ప్రమేయం ఉందా అన్నది గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసు కమిషనర్ మైక్ బుష్ మీడియా సమావేశంలో చెప్పారు. కాల్పులు జరిగిన రెండు ప్రాంతాల్లో చాలా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వివిధ వాహనాలకు అమర్చిన అనేక పేలుడు పదార్థాలను నిర్వీర్యం చేశామని వివరించారు.

న్యూజీలాండ్ అధికారులు అరెస్టు చేసినవారిలో ఒకరు తమ దేశ పౌరుడని ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ తెలిపారు. అతడిని ''తీవ్రమైన మితవాద ఉగ్రవాది''గా ఆయన అభివర్ణించారు.

న్యూజీలాండ్ చీకటి రోజుల్లో ఈ రోజు ఒకటని న్యూజీలాండ్ ప్రధాని జసిండా ఆర్‌డెర్న్ వెల్లింగ్టన్‌లో చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, న్యూజీలాండ్ చీకటి రోజుల్లో ఈ రోజు ఒకటని ప్రధాని జసిండా ఆర్‌డెర్న్ వెల్లింగ్టన్‌లో చెప్పారు.

మసీదులను మూసి ఉంచాలన్న పోలీసులు

క్రైస్ట్‌చర్చ్ సౌత్ ఐలాండ్ ద్వీపంలో ఉంది. నగరంలోని డీన్స్ అవెన్యూలో ఉండే అల్‌నూర్ మసీదు, లిన్‌వుడ్ అవెన్యూలో ఉండే మరో మసీదుపై ఈ కాల్పులు జరిగాయి.

క్రైస్ట్‌చర్చ్ మధ్య ప్రాంతంలోని అల్ నూర్ మసీదు వెలుపల రక్తం కారుతున్న బాధితులు కనిపించారని ప్రత్యక్ష సాక్షులు స్థానిక మీడియాకు తెలిపారు.

తదుపరి సమాచారం ఇచ్చే వరకు నగరంలోని మసీదులన్నీ మూసి ఉంచాలని పోలీసులు నిర్దేశించారు.

కాల్పులు జరిగిన మసీదుల్లో ఒకటైన అల్ నూర్ మసీదులో శుక్రవారం ప్రార్థనలు చేసేందుకు బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు సభ్యులు వెళ్లారు. కాల్పులు జరుగుతున్నప్పుడు వారు అక్కడే ఉన్నారని, అయితే వారంతా క్షేమంగానే ఉన్నారని న్యూజీలాండ్ క్రికెట్ ట్విటర్‌లో తెలిపింది.

బంగ్లాదేశ్ టెస్ట్ క్రికెట్ జట్టు కెప్టెన్ ముష్ఫికర్ రహీమ్ కూడా ట్విటర్‌లో స్పందిస్తూ- ''క్రైస్ట్‌చర్చ్‌లోని మసీదులో కాల్పుల నుంచి అల్లా మమ్మల్ని కాపాడాడు. మేం చాలా అదృష్టవంతులం. మళ్లీ ఇలాంటివి చూడాలనుకోవట్లేదు. మా కోసం ప్రార్థించండి'' అన్నారు.

సహాయ చర్యల్లో సిబ్బంది

ఫొటో సోర్స్, Reuters

వీడియోను తొలగించిన ఫేస్‌బుక్

ఒక షూటర్ మసీదులో తాను కాల్పులు జరుపుతున్నప్పుడు తీసుకున్నట్లుగా చెబుతున్న వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. అతడు తలకు కెమెరా ఏర్పాటు చేసుకొని, ఫేస్‌బుక్‌లో తన కాల్పులను లైవ్‌ స్ట్రీమింగ్ చేశాడనే సమాచారం ఉంది.

బాధాకరమైన ఈ వీడియోను ఎవరూ షేర్ చేయొద్దని ప్రజలను పోలీసులు కోరారు. ఈ వీడియోను ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగ్రామ్‌ల నుంచి తొలగించినట్లు ఫేస్‌బుక్ తెలిపింది. ఈ వీడియో నకళ్లు ఉన్నా గుర్తించి తొలగించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పింది.

''వలసల వ్యతిరేకి''

కాల్పుల ఘటన క్రమం గురించి స్పష్టమైన సమాచారం అందడం లేదు. ప్రత్యక్ష సాక్షులు స్థానిక మీడియాకు చెప్పిన వివరాల ఆధారంగానే వార్తలు వెలువడుతున్నాయి.

కాల్పులు ఎంత మంది జరిపారనేది ఇంకా తెలియలేదు. ఒక షూటర్ తన ఉద్దేశాలను వివరిస్తూ ఒక మ్యానిఫెస్టో రాసుకున్నాడని న్యూజీలాండ్ హెరాల్డ్ పత్రిక తెలిపింది. అందులో వలస వ్యతిరేక విధానానికి, ఫార్-రైట్ విధానానికి అతడు మద్దతు పలికాడు.

న్యూజీలాండ్ పోలీసులు

ఫొటో సోర్స్, FB/New Zealand Police

ఫొటో క్యాప్షన్, తదుపరి సమాచారం ఇచ్చే వరకు నగరంలోని మసీదులన్నీ మూసివేయాలని పోలీసులు నిర్దేశించారు.

''తుపాకీతో ఛాతీపై కాల్చడం నేను చూశా''

దుండగుడు తుపాకీతో ఒక వ్యక్తిని ఛాతీపై కాల్చడం తాను చూశానని టీవీ న్యూజీలాండ్‌తో ఒక ప్రత్యక్ష సాక్షి చెప్పారు. కాల్పులు దాదాపు 20 నిమిషాలపాటు కొనసాగాయని, 60 మంది వరకు గాయపడి ఉండొచ్చని అంచనా వేశారు.

దుండగుడు మొదట మగవారు ప్రార్థనలు చేసే గదిని లక్ష్యంగా చేసుకున్నాడని, తర్వాత మహిళలు ప్రార్థన చేసే గదికి వెళ్లాడని స్థానిక మీడియా పేర్కొంది.

ఒక దుండుగుడు ఓ వ్యక్తి తలపై కాల్చడం తాను చూశానని పాలస్తీనాకు చెందిన ప్రత్యక్ష సాక్షి ఏఎఫ్‌పీ వార్తాసంస్థతో చెప్పారు. అతడు వాడిన ఆయుధం ఆటోమేటిక్ గన్ అయ్యండొచ్చని అభిప్రాయపడ్డారు.

కాల్పులు జరిగినప్పుడు ప్రాణభయంతో పరుగులు తీశామని అల్ నూర్ మసీదు వద్ద ఉన్న ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

''మా స్నేహితులకు ఏం జరిగిందో...''

కాల్పులు జరిగినప్పుడు అల్ నూర్ మసీదు ప్రాంతంలో ఉన్న మొహాన్ ఇబ్రహీం అనే వ్యక్తి ‘న్యూజీలాండ్ హెరాల్డ్’ పత్రికతో మాట్లాడుతూ- ‘‘మొదట మేం కరెంటు షాక్ అనుకున్నాం. తర్వాత అందరూ పరుగు తీశారు. కొంత మంది స్నేహితులు ఇంకా లోపలే(మసీదులో) ఉన్నారు. నా స్నేహితులకు ఫోన్లు చేస్తున్నారు. కానీ వారిలో చాలా మంది నుంచి స్పందన రావడం లేదు. నా స్నేహితులకు ఏం జరిగిందోనని భయమేస్తోంది’’ అని ఆందోళన వ్యక్తంచేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)