మసూద్ అజర్‌‌ మీద ఐక్యరాజ్యసమితి చర్యలను మళ్లీ అడ్డుకున్న చైనా

మౌనాలా మసూద్ అజర్‌

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మౌనాలా మసూద్ అజర్‌

కశ్మీర్‌లోని పుల్వామాలో భారత పారమిలటరీ బలగాలపై ఆత్మాహుతి దాడి చేసింది తామేనని ప్రకటించిన తీవ్రవాద సంస్థ జైషే మొహమ్మద్ అధ్యక్షుడు మౌలానా మసూద్ అజార్‌ను ఉగ్రవాదిగా ప్రకటించకుండా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి కమిటీని చైనా అడ్డుకున్నట్లు 'రాయిటర్స్' వార్తా సంస్థ చెప్పింది.

ఫిబ్రవరి 14వ తేదీన జరిగిన ఆ దాడిలో 40 మంది భారత భద్రతా బలగాల సిబ్బంది చనిపోయారు. ఆ ఘటనతో పాకిస్తాన్ - భారత్‌ల మధ్య ఉద్రిక్తత పెరిగిపోయింది. పాక్ భూభాగంలోని బాలాకోట్‌లో భారత్ వైమానిక దాడులు చేయటం, ఆ మరుసటి రోజు ఇరు దేశాలు పరస్పరం యుద్ధ విమానాలను కూల్చివేశామని ప్రకటించటంతో ఉద్రిక్తతలు మరింత ముదిరాయి.

మసూద్ అజార్‌ను బ్లాక్‌లిస్ట్‌లో చేర్చటం ద్వారా.. అతడు ఆయుధాల వినియోగించటం మీద నిషేధం, ప్రయాణ నిషేధం, ఆస్తుల ప్రతిష్టంభన ఆంక్షలు విధించాలని అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్‌లు.. భద్రతా మండలికి చెందిన ఇస్లామిక్ స్టేట్ అండ్ అల్‌ఖైదా ఆంక్షల కమిటీని కోరాయి.

మౌనాలా మసూద్ అజర్‌

ఫొటో సోర్స్, Getty Images

మొత్తం 15 మంది సభ్యులున్న ఈ ఆంక్షల కమిటీ ఏకాభిప్రాయం ప్రాతిపదిక మీద పనిచేస్తుంది.

ఈ నేపథ్యంలో.. మసూద్ మీద ఆంక్షలు విధించాలన్న వినతిని చైనా 'సాంకేతిక నిలిపివేత' ద్వారా అడ్డుకుందని.. కమిటీకి చైనా ఇచ్చిన సంబంధిత నోట్‌ను తాము చూశామని 'రాయిటర్స్' సంస్థ పేర్కొంది. ఇలా నిలిపివేయటానికి చైనా ఎటువంటి కారణం చూపలేదని తెలిపింది.

చైనా చర్య ఫలితంగా మసూద్‌పై చర్యలు చేపట్టాలన్న అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్‌ల వినతి ఇక ముందుకు కదలదు. ఇంతకుముందు 2016, 2017 లోనూ మసూద్ మీద ఐరాస ఆంక్షల కమిటీ చర్యలు చేపట్టకుండా చైనా అడ్డుకుంది.

అయితే.. ''ఈ అంశం మీద ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి, దాని అనుబంధ సంస్థల నియమాలు, విధానాల ప్రకారం చర్చలు నిర్వహించి తీరాలి'' అని చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ లు కాంగ్ బుధవారం పేర్కొన్నారు.

అజర్ మసూద్

ఫొటో సోర్స్, Getty Images

ఐక్యరాజ్యసమితి భద్రతామండలి దౌత్యాధికారి తన వివరాలు వెల్లడించరాదన్న షరతు మీద మాట్లాడుతూ.. ''మసూద్ అజర్‌ను (ఉగ్రవాదిగా) ప్రకటించకుండా చైనా అడ్డుకోవటం కొనసాగిస్తుంటే మండలిలోని ఇతర సభ్యులు భద్రతామండలిలో వేరే చర్యలు చేపట్టక తప్పనిసరి పరిస్థితి వస్తుంది'' అని వ్యాఖ్యానించారు.

''అల్‌ఖైదా అనుబంధ సంస్థగా ఐక్యరాజ్యసమితి ఇప్పటికే గుర్తించిన ఒక సంస్థ నాయకుడు మసూద్ అజర్‌ను ఉగ్రవాది అని ప్రకటించాలన్న వాదన వ్యతిరేకించలేనిది'' అని ఆయన చెప్పారు.

అజర్‌ను బ్లాక్‌లిస్ట్‌లో చేర్చటానికి మరో మార్గం.. భధ్రతామండలిలో తీర్మానం ఆమోదించటం. భద్రతా మండలిలో తీర్మానం ఆమోదం పొందాలంటే దానికి అనుకూలంగా కనీసం తొమ్మిది ఓట్లు రావటంతో పాటు.. రష్యా, చైనా, అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్‌లలో ఏ దేశమూ వీటో చేయకుండా ఉండాలి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)