మసూద్ అజర్‌ను టెర్రరిస్టుగా ప్రకటించాలనే భారత్ డిమాండ్‌ను చైనా ఎందుకు వ్యతిరేకిస్తోంది?

ఫొటో సోర్స్, Getty Images
మౌలానా మసూద్ అజర్. పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లు వెళ్తున్న బస్సుపై ఆత్మాహుతి దాడికి కారణమైన జైష్-ఎ-మొహమ్మద్ మిలిటెంట్ సంస్థ వ్యవస్థాపకుడు.
ఇతడిని ఐక్యరాజ్యసమితి ద్వారా అంతర్జాతీయ టెర్రరిస్టుగా ప్రకటించేందుకు భారత్ చేస్తున్న ప్రయత్నాలను చైనా అడ్డుకుంటూ వస్తోంది.
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలోని 15 సభ్యదేశాల్లో మసూద్ అజర్‌ను ఉగ్రవాది ప్రకటించాలన్న భారత్ అభ్యర్థనను వ్యతిరేకిస్తున్న ఏకైక దేశం చైనా మాత్రమే.
మసూద్ అజర్‌ను టెర్రరిస్టుగా ప్రకటించాలని భారత్ చేస్తున్న అభ్యర్థనను చైనా భద్రతా మండలిలో రెండు సార్లు వ్యతిరేకించింది. మొదట ఆర్నెల్లపాటు అడ్డుకున్న చైనా, రెండోసారి మూడు నెలల పాటు భారత ప్రయత్నాలను నీరుగార్చింది.
అందుకే, పాకిస్తాన్‌లో ఉన్న మసూద్ అజర్‌ను ఐక్యరాజ్యసమితి టెర్రరిస్టుల జాబితాలో చేర్చాలని ఇప్పుడు భారత్ కొత్తగా మరోసారి కోరాల్సి ఉంటుంది.
చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి హువా చున్యింగ్ 2017 అక్టోబర్ 30న ఒక ప్రెస్ కాన్ఫరెన్సులో "భద్రతా మండలిలో భారత్ దరఖాస్తు గురించి చైనా వైఖరి ఎలా ఉంటుంది అనేది మేం ఇప్పటికే చాలాసార్లు వివరంగా చెప్పాం" అన్నారు.

ఫొటో సోర్స్, TWITTER/@NARENDRAMODI
"భద్రతా మండలిలోని 1267 కమిటీలో టెర్రరిస్టు సంస్థలు లేదా ఏవరైనా వ్యక్తిని చేర్చే ప్రమాణాలకు సంబంధించిన నిబంధనలు చాలా స్పష్టంగా ఉన్నాయి".
లిస్టింగ్ విషయంలో 1267 కమిటీ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, సిద్ధాంతాలను పాటించాలని, తగిన ఆధారాలతో, మిగతా సభ్యుల ఏకాభిప్రాయంతో ఒక నిర్ణయం తీసుకోవాలని చైనా ఎప్పుడూ చెబుతూ వస్తోంది.
"లిస్టింగ్‌లో మసూద్ అజర్ కోసం భారత్ దరఖాస్తు విషయానికి వస్తే 1267 కమిటీలో దీని గురించి బేదాభిప్రాయాలు ఉన్నాయి. కమిటీ దీనిపై ఆలోచించడానికి, అన్ని పక్షాలకు దీని గురించి సలహాలు ఇవ్వడానికి తగినంత సమయం లభించాలనే మేం దీన్ని అడ్డుకున్నాం. అయితే ఇప్పటివరకూ దీనిపై ఏకాభిప్రాయం సాధించలేకపోయాం".

ఫొటో సోర్స్, Getty Images
అయితే భారత్ దరఖాస్తును చైనా మాత్రమే ఎందుకు వ్యతిరేకిస్తోంది, ఏదైనా వ్యక్తిగత కారణాలతోనే చైనా ఇలా చేస్తోందా అని ఆయన్ను ప్రశ్నించినపుడు.
"చైనా తీవ్రవాదానికి సంబంధించి అంశాలలో ఎప్పుడూ స్పష్టమైన వైఖరితో ఉంటుంది, తీవ్రవాదానికి వ్యతిరేకంగా ముందుకెళ్తుంది. మేం ఏ అంశాలపై అయినా సాక్ష్యాల ఆధారంగానే నిర్ణయాలు తీసుకుంటాం".
పాకిస్తాన్ కూడా తీవ్రవాద బాధిత దేశమే. టెర్రరిజం దూరం చేయడానికి, ప్రాంతీయంగా, అంతర్జాతీయంగా శాంతిభద్రతలు ఏర్పడడానికి అన్నిదేశాల సహాయ సహకారాలు అవసరం అని చైనా వాదిస్తోంది,
‘‘భద్రతా మండలిలోని 1267 కమిటీ తీవ్రవాద సంస్థలు లేదా వ్యక్తులను జాబితాలో చేర్చేందుకు నిర్ధరిత ప్రమాణాలను పాటిస్తుంది. మసూద్ అజర్‌ను టెర్రరిస్టుగా ప్రకటించాలన్న భారత్ దరఖాస్తుపై కమిటీ ఏకాభిప్రాయానికి రాలేకపోయింది. మేం ఇక ముందు కూడా అన్ని పక్షాతో మా చర్చలు కొనసాగిస్తాం.’’

ఫొటో సోర్స్, AFP
మసూద్ అజర్ ఎవరు?
మౌలానా మసూద్ అజర్ 1968లో తూర్పు పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో పుట్టారు.
కరాచీలోని బినోరీ పట్టణంలోని మతపరమైన జామియా ఉలూమ్-ఇ-ఇస్లామీ యూనివర్సిటీలో చదివారు. తర్వాత అక్కడే టీచర్ అయ్యారు.
కరాచీలో ఉన్నప్పుడు అప్ఘానిస్తాన్‌లో జీహాద్ ట్రైనింగ్ కోర్స్ తీసుకోమని తనకు సూచించారని ఆయన పుస్తకం 'ది విర్చూస్ ఆఫ్ జీహాద్' అనే పుస్తకంలో చెప్పినట్లు కొన్ని పత్రికల్లో కథనాలు వచ్చాయి.
1994లో అప్పట్లో లీడింగ్ మిలిటెంట్ గ్రూప్ అయిన హర్కతుల్ ముజాహిదీన్ కోసం శ్రీనగర్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారనే ఆరోపణలతో భారత అధికారులు మసూద్ అజర్‌ను అరెస్ట్ చేశారు.
కానీ 1999లో ఐసీ-184 విమానాన్ని హైజాక్ చేశాక దానిని అప్ఘానిస్తాన్‌లోని కాందహార్ తీసుకెళ్లిన సమయంలో బంధీలను విడిపించడానికి బదులు మసూద్, మరో ఇద్దరిని జైలు నుంచి విడుదల చేసినపుడు అతడి పేరు పతాక శీర్షికల్లో వచ్చింది.
1999లో తిరిగి పాకిస్తాన్ చేరుకోగానే మసూద్ అజర్ జైష్-ఎ-మొహమ్మద్ సంస్థను స్థాపించారు.
ఐక్యరాజ్యసమితి 2002లో 'జైష్-ఎ-మొహమ్మద్'ను టెర్రరిస్ట్ సంస్థల జాబితాలో చేర్చడంతో పాకిస్తాన్ దానిని నిషేదించింది.
కానీ జైష్-ఎ-మొహమ్మద్‌పై నిషేదం విధించినా మసూద్ అజర్‌ను మాత్రం అరెస్ట్ చేయలేదు. అతడిని జేఈఎంకు బలమైన పట్టు ఉన్న దక్షిణ పంజాబ్‌లోని స్వేచ్ఛగా జీవించేలా వదిలేశారని పాకిస్తాన్ వార్తాపత్రిక డాన్ 2014 ఫిబ్రవరి 2న కథనం ప్రచురించింది.
మోస్ట్ వాంటెడ్ టాప్ 20 లిస్టులో ఉన్న మసూద్ అజర్‌ను తమకు అప్పగించాలని పాకిస్తాన్‌ను భారత్ కోరింది.
2008లో ముంబయి దాడులకు లష్కరే తోయిబా కారణమని ఆరోపించిన భారత్ మసూద్ అజర్‌తోపాటు తమ జాబితాలో ఉన్న అందరినీ అప్పగించాలని పాకిస్తాన్‌ను కోరింది. కానీ పాక్ వారిని ఇప్పటికీ అప్పగించలేదు.
2016లో పఠాన్‌కోట్ ఎయిర్ బేస్‌పై దాడి తర్వాత పాక్ అధికారులు మసూద్ అజర్‌ను 'ప్రొటెక్టివ్ కస్టడీ'లోకి తీసుకున్నారు. కానీ అతడిపై ఈ దాడి అభియోగాలు మోపలేదు.
మసూద్ అజర్‌ను అంతర్జాతీయ టెర్రరిస్టుగా ప్రకటించాలని 2016లో భారత్ ఐక్యరాజ్యసమితికి ప్రతిపాదనలు పంపింది.
అయితే, పాకిస్తాన్ మిత్రదేశం చైనా భారత ప్రయత్నాలను 'సాంకేతిక కారణాల' సాకుతో అడ్డుకుంది. 2016లో భారత్ ప్రతిపాదనను వీటో అధికారం ఉపయోగించి బ్లాక్ చేసింది,
2017లో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ మసూద్ అజర్‌కు వ్యతిరేకంగా పెట్టిన అదే ప్రతిపాదనను కూడా చైనా మరోసారి అడ్డుకుంది.
మసూద్ అజర్ ప్రాణాపాయ పరిస్థితిలో మంచానికే పరిమితమైనట్టు భారత నిఘా వర్గాల ద్వారా తెలిసిందని 2018లో హిందుస్తాన్ టైమ్స్ ఒక కథనం ప్రచురించింది.

ఫొటో సోర్స్, Getty Images
1267 కౌంటర్ టెర్రరిజం కమిటీ ఏం చేస్తుంది?
- టెర్రరిస్ట్ సంస్థలపై ఆంక్షలు, చర్యల అమలును ఇది పర్యవేక్షిస్తుంది
- తీర్మానాల జాబితాలో ఉన్న నిబంధనల ప్రకారం తగిన వ్యక్తులు, సంస్థలను సూచిస్తుంది
- ఐఎస్ఐస్, అల్-ఖైదా (ఈ రెండు సంస్థలకు సంబంధం ఉందని తేలినప్పుడు) ఆంక్షల జాబితా నుంచి పేర్లను చేర్చడం, తొలగించడం గురించి వచ్చే అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకుని, వాటిపై నిర్ణయం తీసుకుంటుంది
- ఐఎస్ఐఎస్, అల్-ఖైదా ఆంక్షల జాబితాలో చేర్చే వ్యక్తులు, సంస్థల గురించి ప్రత్యేక సమీక్షలను నిర్వహిస్తుంది
- ఆయా సంస్థలు, వ్యక్తులపై పర్యవేక్షణ బృందం సమర్పించిన నివేదికలను పరిశీలిస్తుంది
- ఆంక్షలు అమలు చేయడం గురించి ఏటా భద్రతా మండలికి నివేదిక ఇస్తుంది
1267 కమిటీ ఆంక్షల రకాలు
- ఈ జాబితాలో ఉన్న సంస్థలు, వ్యక్తులు ఆయుధాలను వినియోగించటంపై నిరోధం ఉంటుంది
- వారి ప్రయాణాలపై నిషేదం ఉంటుంది
- ఆయా సంస్థలు, వ్యక్తుల ఆస్తుల స్వాధీనం చేసుకుంటుంది
- ఈ చర్యలకు తుదిగడువు ఏదీ ఉండదు
- ఈ ఆంక్షలు, చర్యలను 18 నెలలకొకసారి సమీక్షిస్తారు
జాబితాలో ఎంతమంది ఉన్నారు?
భద్రతా మండలి 1267 కౌంటర్ టెర్రరిజం కమిటీలో ఇప్పటివరకూ 257 మంది వ్యక్తులు, 81 సంస్థలను నమోదు చేశారు.
జాబితాలో నమోదుకు పాటించే ప్రమాణాలు
ఒక వ్యక్తి లేదా సంస్థకు ఐఎస్ఐఎస్ లేదా అల్-ఖైదాతో సంబంధం ఉన్నట్టు సూచించే ఏవైనా చర్యలు, లేదా కార్యకలాపాలకు పాల్పడితే వారు ఐఎస్ఐస్, అల్-ఖైదా ఆంక్షల జాబితాలో చేర్చడానికి అర్హులు అవుతారు.
ఐఎస్ లేదా అల్-ఖైదా తరఫున పనిచేయడం, లేదా వారికి సహకరించడం, వారికి, లేదా సంబంధిత విభాగాలకు ఆయుధాల సరఫరా, అమ్మకం, బదిలీ చేసినా, వారి కోసం పెట్టుబడులు పెట్టినా, ప్రణాళికలు రూపొందించినా ఈ జాబితాలో చేరుస్తారు. ఆ సంస్థల కోసం లేదా వాటి అనుబంధ సంస్థల కోసం ఎవరినైనా రిక్రూట్ చేసుకున్నా వారిని జాబితాలో చేరుస్తారు.
కమిటీ జాబితాను ఎలా నిర్ణయిస్తుంది?
1267 కౌంటర్ టెర్రరిజం కమిటీ ఏకాభిప్రాయం ద్వారా నిర్ణయాలు తీసుకుంటుంది. ఒక ప్రత్యేక అంశంపై ఏకాభిప్రాయం సాధించలేకపోతే, కమిటీ అధ్యక్షుడు ఏకాభిప్రాయం కోసం ప్రయత్నించవచ్చు. అప్పటికీ ఏకాభిప్రాయానికి రాలేకపోతే, ఆ అంశాన్ని భద్రతా మండలికి సమర్పించవచ్చు.
సాధారణంగా, ఏ అభ్యంతరాలూ లేనట్లయితే ఐదు రోజుల్లో నిర్ణయాలు తీసుకోవచ్చు. పేర్ల నమోదుకు, తీసివేయడానికి నో అబ్జక్షన్ ప్రక్రియ పది రోజుల వరకూ పడుతుంది.
ప్రతిపాదిత నిర్ణయాన్ని ఎలాంటి కాల పరిమితి లేకుండా సభ్యులు హోల్డులో ఉంచవచ్చు. అయితే పెండింగులో ఉన్న అంశాన్ని పరిష్కరించడానికి మూడు నెలల తర్వాత అప్ డేట్స్ అందించాలని అభ్యర్థించవచ్చు.

ఫొటో సోర్స్, AFP
ఐక్యరాజ్యసమితి దృష్టిలో మసూద్ అజర్
పాకిస్తాన్‌కు చెందిన మిలిటెంట్ గ్రూప్ జైష్-ఎ-మొహమ్మద్(జేఈఎం)కు మసూద్ అజర్ చీఫ్.
ఒసామా బిన్ లాడెన్, తాలిబన్, ఇతర తీవ్రవాద సంస్థల సాయంతో మసూద్ అజర్ జైష్-ఎ-మొహమ్మద్ సంస్థను స్థాపించాడు.
1999లో ఇండియన్ ఎయిర్ లైన్స్ విమానాన్ని హైజాక్ చేసి కాందహార్ తీసుకెళ్లినపుడు వారి చేతిలో బంధీలుగా ఉన్న 155 మంది ప్రయాణికులను విడిపించేందుకు భారత్ అతడిని జైలు నుంచి విడుదల చేసింది.
అంతకు ముందు అతడిని విడిపించడానికి రెండుసార్లు ప్రయత్నాలు జరిగాయి. 1994లో న్యూదిల్లీలో హర్కతుల్ ముజాహిదీన్ అమెరికా, బ్రిటిష్ దేశస్థులను కిడ్నాప్ చేసింది.
జులై 1995లో కశ్మీర్‌లో ఇద్దరు పర్యాటకులను కిడ్నాప్ చేసి అజర్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
2001 అక్టోబర్ 1న జేఈఎం శ్రీనగర్‌లో ఉన్న జమ్ము-కశ్మీర్ అసెంబ్లీపై జరిగిన ఆత్మాహుతి దాడికి తామే బాధ్యులమని ప్రకటించింది. ఆ దాడిలో 31 మంది మృతి చెందారు.
కానీ కొంతకాలం తర్వాత అది తమ పని కాదని చెప్పింది.
జేఈఎం, లష్కరే తోయిబా మిలిటెంట్లు 2001 డిసెంబర్ 13న భారత పార్లమెంటుపై దాడి చేశారు. ఈ దాడిలో 9 మంది మృతి చెందగా, 18 గాయపడ్డారు.
ఇవి కూడా చదవండి:
- ఉగ్రవాద వ్యతిరేక తొలి భారతీయ మహిళా దళం
- ఆ రోజు ఈ ఫొటో తీసింది ఎవరు? కసబ్ గురించి ఆ ఫొటో జర్నలిస్టు ఏమంటున్నారు?
- ఇండోనేషియాలో ఇస్లామిక్ స్టేట్ ఎలా బలపడుతోంది?
- ఐఎస్ తీవ్రవాదులు ఇప్పుడేం చేస్తున్నారు?
- పాఠశాలలు, ఆటస్థలాల్లో ముస్లిం పిల్లలకు వేధింపులు
- పాకిస్తాన్ 'దుర్మార్గమైన అజెండా': చర్చల రద్దుకు దారి తీసిన ఈ స్టాంపులపై ఏముంది?
- ప్రేమంటే ఏమిటి? మీరిప్పుడు ప్రేమలో ఉన్నారా?
- 26/11 ముంబయి దాడులు: ‘ఆ మారణకాండ నుంచి నేనెలా బైటపడ్డానంటే..’
- 26/11 ముంబయి దాడులకు పదేళ్లు: ‘ఆ రోజు ఓ సైన్యమే యుద్ధానికి దిగినట్టు అనిపించింది’
- ప్రేమికులు ప్రేమలో పడటానికి, వారిలో రొమాన్స్‌కు కారణం ఇదే
- సరిగ్గా ఎనిమిదేళ్ల కిందట.. వేలంటైన్స్‌డే ముందు రోజు..
- తెలుగు సంస్కృతి దారిలో బ్రిటన్: నెలసరి మొదలైందా... చలో పార్టీ చేసుకుందాం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








