వాలంటైన్స్ డే: ప్రేమికులు ప్రేమలో పడటానికి, వారిలో రొమాన్స్‌కు కారణం ఇదే

ఫొటో సోర్స్, Carol & Mike Werner/SPL
- రచయిత, మెలిస్సా హాగెన్‌బూమ్
- హోదా, బీబీసీ
మీ హృదయం కాస్త వేగంగా కొట్టుకుంటుంది, చిరు చెమట మొదలవుతుంది.. శరీర గ్రంథుల నుంచి హార్మోన్లు విడుదలవుతుంటాయి. లోలోపల సన్నగా వేడి పుడుతుంది. కోరిక లేదా ప్రేమకు సంబంధించిన ఆలోచనలు మదిలో పురుడు పోసుకుంటున్నవేళ జీవ ప్రక్రియలో చోటుచేసుకునే పరిణామాలే ఇవి.. మాటలకందని భావనలివి.
మానవ జాతి చుట్టూ అల్లుకున్న ఈ ప్రేమకు సంబంధించిన విజయ, విఫల గాథల ప్రస్తావనతో కళలు, సంస్కృతి అన్నీ నిండిపోయాయి. గ్రంథాలయాల్లోని అలమరాలూ ప్రణయ గాథలతో బరువెక్కి ఉంటాయి.
'ప్రేమంటే కాలం చేతిలో అపహాస్యమయ్యేది కాదు' అంటాడు షేక్‌స్పియర్..
'ప్రేమ కాలంతో మారిపోదు.. కాలాంతం వరకు నిలిచి ఉంటుంది' అంటాడు తన సానెట్ 116లో.
మానవ జాతి పుట్టుకకు ఎంతోకాలం ముందే జంతు సామ్రాజ్యంలోనే ఈ ప్రేమ ఉనికి ఉంది. బహుశా ఇది ఏదో ఒక కీడు లేదా నష్టం నుంచే జనించి ఉంటుందన్నది అధ్యయనకర్తల భావన.
ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్రేమ ప్రయాణం శృంగారం నుంచే మొదలైందన్నది మరో వాదన. ఒక జీవి జన్యువులను తరువాత తరాలకు అందించే మార్గంగా ఈ శృంగారం మొదలైంది.

ఫొటో సోర్స్, Rupa Panda/CC by 2.0
ప్రేమించడం కోసం తొలుత జీవికి ఉద్వేగాలతో వ్యవహరించే ఒక మెదడు అవసరమైంది. మానవ మస్తిష్కం తొలుత కేవలం కొద్దిపాటి కణాల సమూహంగానే ఉండేది.. మానవ జీవనం మొదలైన ఎన్నో ఏళ్లకు కానీ అది ఉనికిలోకి రాలేదు.
ఆరు కోట్ల సంవత్సరాల గతంలోకి వెళ్తే.. తొట్టతొలి మానవుల కాలం నుంచి మొదలై అలా లక్షల సంవత్సరాల పరిణామ క్రమంలో మనిషి మెదడు పరిమాణం పెరిగింది. ఆధునిక మానవుడికి వారే పూర్వీకులు.
మనిషి మెదడు పెరుగుతున్నకొద్దీ గర్భస్థ కాలమూ తగ్గుతూ వచ్చింది. గర్భస్థ దశలోనే మెదడు పరిమాణం పెద్దగా ఉండడం వల్ల తల పెద్దదై ప్రసవం కష్టం కాకుండా మానవ గర్భస్థ కాలం తగ్గుతూ వచ్చింది.
దీంతో తక్కువ గర్భస్థ కాలం తరువాత జనించి.. మనిషి, అలాగే గొరిల్లా, చింపాంజీల పిల్లలు తమకు తాము ఏమీ చేసుకోలేనిస్థితికి చేరడం.. శిశువులను సాకడానికే తల్లిదండ్రులు సమయమంతా వెచ్చించే పరిస్థితి వచ్చింది.
బాల్య దశ పెరిగిపోవడమనేది మానవ జీవితంలో కొత్త సమస్యగా పరిణమించింది.

ఫొటో సోర్స్, Steve Bloom Images/Alamy
చాలా క్షీరదాలలో తన సంరక్షణ అవసరమైన చిన్న పిల్లలున్న ఆడ జీవి సంభోగానికి సిద్ధంగా ఉండదు. దీంతో ఆ మగ జీవి ఆ పిల్లలను ఆటంకంగా భావించి వాటిని చంపే పరిస్థితులున్నాయి. ఇలాంటి ఉద్దేశపూర్వక శిశుహత్యలు గొరిల్లాలు, కోతులు, డాల్ఫిన్ల వంటి జీవజాతుల్లో జరుగుతాయి.
బ్రిటన్‌లోని లండన్ కాలేజ్ ఆఫ్ యూనివర్సిటీకి చెందిన కిట్ ఓపీ దీనిపై అధ్యయనం చేశారు. క్షీరదాలలో మూడో వంతు జాతులు ఒకే భాగస్వామితో దాంపత్య సంబంధంలో ఉంటాయి. ఈ కారణం వల్ల ఈ జీవజాతుల్లో శిశుహత్యలు జరగవు. మిగతా జీవ జాతుల్లో మాత్రం ఈ సమస్య ఉంది.
జీవ పరిణామ క్రమంలో భాగంగా సంభోగ రీతులు, పిల్లల పెంపకం రీతులు ఎలా మారాయన్నది కిట్ ఓపీ బృందం అధ్యయనం చేసింది. ఈ శిశు హత్యా నివారణకే ఈ జీవులు ఒకే భాగస్వామితో కలిసి ఉంటాయని.. 2 కోట్ల సంవత్సరాలుగా ఇది ఆచరణలో ఉందని.. పరిణామ క్రమంలో మానవ జాతిలో ఎక్కువగా ఆచరణలోకి వచ్చిందని వీరు సూత్రీకరించారు.
మరికొన్ని జీవజాతుల్లో శిశుసంరక్షణలో మగ జీవి సహకారం ఉండడం వల్ల జంట మధ్య బంధం దృఢంగా ఉంటుంది.

ఫొటో సోర్స్, Martin Harvey/Alamy
ఇవన్నీ మెదడులో భారీ మార్పులకు దారితీశాయని బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన అధ్యయనకర్త 'రాబిన్ డంబార్' అంటారు. ఇలాంటి ఒకే భాగస్వామితో సాంగత్యం వల్ల జీవితాంతం బంధం ఏర్పరుచుకోవడానికి ప్రాధాన్యాలు మొదలయ్యాయని, ఆ క్రమంలో పోటీదారులతో శత్రుత్వాలు ఏర్పడడమూ మొదలైందన్నది ఆయన సూత్రీకరణ.
పరిణామ క్రమంలో మనిషి మెదడు పరిమాణం పెరుగుతున్నకొద్దీ సమూహాల పరిమాణం, అందులో ఉన్నవారి మధ్య సహకారం రెండూ పెరగనారంభించాయి.
ఇది 20 లక్షల సంవత్సరాల కిందటి మానవ జాతి అయిన హోమో ఎరక్టస్ కాలంలోనే చూడొచ్చు.
అయితే, మానవ పరిణామ క్రమంలో భాగంగా కొన్నేళ్లుగా మెదడులో కనిపిస్తున్న కొన్ని భాగాలు ప్రేమకు కారకాలవుతున్నాయట.

ఫొటో సోర్స్, John R. Foster/SPL
అమెరికాలోని ఇల్లినాయిస్‌లో ఉన్న షికాగో యూనివర్సిటీకి చెందిన స్టెఫానీ కాసియాపో ఒక అధ్యయనం చేశారు. మెదడులో ప్రేమ కారక భాగాలను ఎఫ్ఎంఆర్‌ఐ బ్రెయిన్ ఇమేజింగ్ పద్ధతుల్లో ఆమె పరిశీలించి విశ్లేషించారు.
ప్రేమలోని అత్యంత తీవ్రమైన, అమూర్తమైన దశలు మెదడులోని 'యాంగ్యులర్ జైరస్' అనే ఒక భాగంపై ఆధారపడి ఉంటాయని ఆమె తేల్చారు.
రూపాలంకారాలు వంటి భాషా ప్రయోగాలకూ ఇదే కీలకం. పదునైన, పసందైన భాష వాడకపోతే ఉద్వేగాలను వ్యక్తీకరించలేం.
దీన్నిబట్టి షేక్‌స్పియర్ ప్రేమ కవిత్వం రాసిన కాలంలో ఆయన మెదడులోని 'యాంగ్యులర్ జైరస్' బాగా యాక్టివ్‌గా ఉందని గ్రహించాలి అంటారామె.
ఈ యాంగ్యులర్ జైరస్ అనే మస్తిష్క భాగం కేవలం పెద్ద కోతి జాతులు, మానవుల్లో మాత్రమే ఉంది.
అయితే, కోతుల్లో ఉద్వేగాల విషయంలో ఇది ఎలాంటి పాత్ర పోషిస్తుందో మనకు తెలియదని స్టెఫానీ చెబుతున్నారు.
అయితే... మనుషుల్లో ప్రేమ భావనలు పెంపొందడానికి ఈ మస్తిష్క భాగం ఉనికిలోకి రావడానికి కారణమైన మెదడు పరిమాణం పెరుగుదలే కారణమనడానికి స్టెఫానీ అధ్యయనం బలం చేకూరుస్తోంది.
అయితే... క్షీరదాల్లో శిశు హత్యలే ఈ పరిణామమంతటికీ మూలమని కిట్ ఓపీ అధ్యయనం చెబుతోంది.
మరోవైపు 2014లో జరిపిన ఓ అధ్యయనం ప్రకారం.. భాగస్వామిని కాపాడుకునే వ్యూహాలే ఏకభాగస్వామి జీవనానికి దారితీశాయని తేలింది. ఒక మగ జీవి తాను బంధం కొనసాగిస్తున్న ఆడ జీవితో ఉంటూ ఇంకే మగా ఆమెతో శృంగారం జరపకుండా చూస్తుంది.

ఫొటో సోర్స్, Juliana Coutinho/CC by 2.0
అయితే.. 2015లో వచ్చిన మరో అధ్యయనంలో 'లెమూర్' అనే ఒక రకం జీవుల్లో ఆడ జంతువు ఇతర ఆడ జంతువుల వల్ల తనకు పోటీ రాకుండా ఉండేందుకు తన మగ భాగస్వామిని కాపాడుకుంటూ వస్తుందని.. ఇది ఆ జీవుల్లో ఒకే భాగస్వామితో బంధాలకు దారితీసేలా చేసిందని గుర్తించింది.
అయితే.. కిట్ ఓపీ మాత్రం ఈ అధ్యయన ఫలితాలతో విభేదిస్తున్నారు. అన్ని క్షీరదాలలోనూ తల్లీపిల్లల బంధమే దృఢమైనదని.. దానికి విఘాతం కలగకుండా మోనోగామీ మొదలైందని విశ్లేషిస్తున్నారు.
అంతేకాదు.. తల్లీపిల్లల బంధంలోని ప్రేమ వెనుక ఉన్న బ్రెయిన్ ప్రాసెస్ వంటిదే రొమాంటిక్ లవ్‌లో ఉండే బ్రెయిన్ ప్రాసెస్ అంటారాయన.
ఓపీ వాదన నిజమనడానికి తగిన న్యూరో సైన్స్ ఆధారాలున్నాయి.

ఫొటో సోర్స్, Barn Images/CC by 2.0
న్యూరో సైన్స్ ప్రకారం జంటల మధ్య ప్రేమలో వివిధ దశలున్నాయి.
మొదటి దశ వాంఛ:
అపోజిట్ సెక్స్‌కు చెందిన వ్యక్తిని చూసి ఆకర్షితులైనప్పుడు.. వారిని తాకినప్పుడు శరీరంలో కొన్ని రసాయనాలు విడుదలై వారితోనే ఉండాలనిపించేలా చేస్తాయి.
మెదడులోని సెరిబ్రమ్ దిగువన ఉండే లింబిక్ వ్యవస్థలోని 'ఇన్సులా' అత్యంత తీవ్రమైన ఉద్వేగాలకు సూత్రధారి.
ఆకర్షణీయమైన ముఖం కనిపించగానే ఏమవుతుంది:
మనకు ఆకర్షణీయమైన ముఖం కనిపించగానే కోరిక కలుగుతుంది. ఈ వాంఛ తరువాత దశకు చేరి రొమాంటిక్ లవ్‌లో ప్రవేశిస్తే అక్కడా ఈ లింబిక్ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుంది.
ఆ సమయంలో సానుకూల అనుభూతులను కలిగించే డోపామైన్ అనే రసాయనాన్ని, ఆక్సీటోసిన్ హార్మోన్‌లను ఈ లింబిక్ వ్యవస్థ వెలువరిస్తుంది. ఈ రెండూ మనుషుల మధ్య బంధాలను పెంపొందిస్తాయి.
లైంగిక వాంఛ వల్ల కలిగే అమితానందం నేరుగా ప్రేమను కలిగిస్తుందని ఈ ప్రక్రియంతా సూచిస్తోందని స్టెఫానీ చెబుతారు.
'ప్రేమ వాంఛ నుంచి జనిస్తుంది.. ఎన్నడూ కోరుకోని వ్యక్తిని అమితంగా ప్రేమించలేవు' అంటారామె.

ఫొటో సోర్స్, Vinoth Chandar/CC by 2.0
చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోవడం:
ఇదే సమయంలో మెదడులోని మరికొన్ని భాగాలు అణచివేతకు గురవుతాయి. ముఖ్యంగా ప్రీఫ్రంటల్ కార్టెక్స్ స్తబ్దుగా మారుతుంది. హేతుబద్ధమైన నిర్ణయాలు తీసుకునేందుకు ఈ భాగమే తోడ్పడుతుంది. కానీ, ఇది స్తబ్దుగా మారడంతో పిచ్చి ప్రేమ మొదలవుతుంది.
ఇలాంటి దశలో ఉన్న ప్రేమికులు చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మరిచిపోతారని అమెరికాలోని కాలిఫోర్నియా యూనివర్సిటీ ప్రొఫెసర్ థామస్ లూయిస్ చెబుతున్నారు.
మనిషిని నెమ్మదిగా ఉంచే సెరోటోనిన్ కూడా స్తబ్దుగా మారి ప్రపంచాన్ని పట్టించుకోకుండా, భయం, బిడియం ఏమీ లేని స్థితికి వస్తారు.
అయితే, ఒకసారి శారీరక సంబంధం ఏర్పడ్డాక జంటలో మునుపటి ప్రేమ తీవ్రత ఉండకపోవచ్చు. కానీ, కొద్దికాలం తరువాత వారి మధ్య సాహచర్య స్థితి మొదలవుతుంది.
అప్పుడు సెరోటోనిన్, డోపామైన్‌లు మళ్లీ సాధారణ స్థాయికి వస్తాయి. అయినా, అప్పటికీ వారి మధ్య సాన్నిహిత్యం కొనసాగుతుంది. అందుకు కారణం ఆక్సీటోసిన్.
''జంటలను కలిపి ఉంచే అన్ని బంధాలూ డోపామైన్ ప్రేరేపితం కావు' అంటారు థామస్ లూయిస్.
ఇది మళ్లీ తల్లీబిడ్డల మధ్య ప్రేమలో ఉండే బ్రెయిన్ ప్రాసెస్ తీరుగానే జంటల మధ్య ప్రేమలోని బ్రెయిన్ ప్రాసెస్ కూడా ఉంటుందన్న వాదనకు తీసుకొస్తుంది. ఈ ప్రేమలోనూ అదే తరహా హార్మోన్ల ప్రక్రియ ఉంటుందని ఆంత్రపాలజిస్ట్ రాబర్ట్ సుస్మాన్ సూచిస్తున్నారు.

ఫొటో సోర్స్, Baona/iStock
జంతువుల్లో అయినా మనుషుల్లో అయినా ప్రేమించినవారు దూరమైతే ఒకే రకమైన బాధ కలుగుతుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి.
దీనివల్ల వియోగం వల్ల కలిగే బాధను తప్పించుకోవడానికి కలిసి ఉండడం అవసరం అనే భావన బలపడుతుంది.
ఈ భావనలన్నిటి మూలాలూ జీవ పరిణామ క్రమంలోనే ఉన్నాయి.
ప్రేమలో మనకు తెలిసిన అన్ని దశల్లోనూ లింబిక్ వ్యవస్థే కీలక పాత్ర పోషిస్తుంది. చాలా జాతుల క్షీరదాలు, కొన్ని సరీసృపాల్లో ఈ లింబిక్ వ్యవస్థ ఉంటుంది. మొదటి తరం క్షీరదాల ఉనికికి ముందునుంచే ఈ లింబిక్ వ్యవస్థ ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
''మెదడులో మొదటి తరాల నుంచి ఉన్న భాగాలు బంధాల ఏర్పాటులో కీలక పాత్ర పోషిస్తాయి. అనేక జీవజాతుల్లో ఇవి చేతనంగా ఉన్నాయి'' అని స్టెఫానీ చెబుతున్నారు.
మొత్తానికి మెదడు పరిమాణం పెద్దగా ఉండడమో.. మాతాశిశు బంధమో.. శిశుహత్యా నివారణోపాయమో.. ఏదైనా కానీ స్త్రీపురుషులను దగ్గర చేసే ప్రేమ అనే అనుభూతిని పొందే జీవజాతిగా ఉన్నందుకు మనుషులంతా పరిణామ క్రమానికి ధన్యవాదాలు చెప్పుకోవాల్సిందే.
ఇవి కూడా చదవండి:
- కాందహార్ హైజాక్: కాళ్ల పారాణి ఆరకముందే ఆమె భర్తను హైజాకర్లు చంపేశారు
- మైనస్ 60 డిగ్రీల చలిలో ప్రజలు ఎలా జీవిస్తారో తెలుసా!!
- భారత నోట్లను నేపాల్ ఎందుకు నిషేధించింది?
- భారత్‌లో పెరుగుతున్న పోర్న్ వీక్షణ
- సోహ్రబుద్దీన్ ఎన్కౌంటర్: 13 ఏళ్లు గడిచినా ఇంకా కేసు చిక్కు ముడి వీడలేదు
- కేసీఆర్ ప్రధాని అవుతారా?
- టీఆర్ఎస్ ప్రస్థానం: పోరు నుంచి పాలన వరకు కారు జోరు
- తుపాను వచ్చినపుడు ఏం చేయొచ్చు? ఏం చేయకూడదు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








