లోక్‌సభ ఎన్నికలు 2019: భారత నగరాలు స్మార్ట్‌గా మారుతున్నాయా? - Reality Check

- రచయిత, వినీత్ ఖరే
- హోదా, బీబీసీ రియాలిటీ చెక్
హామీ: "రానున్న ఐదేళ్లలో 100 స్మార్ట్ నగరాలను నిర్మించాలి" అని 2015లో ప్రభుత్వం నిర్ణయించుకుంది.
వాస్తవం: అన్ని నగరాలనూ ఒకేసారి ఎంపిక చేయకపోవడం, కేటాయించిన నిధుల్లో కొద్ది మొత్తమే ఖర్చు చేయడం వంటి అంశాల కారణంగా ఈ ప్రాజెక్టు ఆలస్యం అవుతూ వస్తోంది.
ఏప్రిల్ 11 నుంచి లోక్‌సభ ఎన్నికలు ప్రారంభం కానున్న నేపథ్యంలో స్మార్ట్ సిటీల ప్రాజెక్టుపై రాజకీయ పార్టీల ప్రకటనలు, వాటిలోని వాస్తవాలను బీబీసీ రియాలిటీ చెక్ బృందం పరిశీలించింది.

2014 ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన ఈ స్మార్ట్ సిటీ ప్రాజెక్టును ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సంవత్సరంలో ప్రారంభించారు.
ఇదో మార్కెటింగ్ జిమ్మిక్కు అని, దీనివల్ల ఎలాంటి ఫలితాలూ ఉండవని ప్రతిపక్షం కొట్టిపారేసింది.
భారత్‌లో పట్టణ జనాభా వేగంగా పెరుగుతోంది. వచ్చే దశాబ్దం నాటికి ఇది 60 కోట్లకు చేరుతుందని అంచనా. కానీ ఇక్కడి నగరాలు మాత్రం అసౌకర్యాలు, మౌలిక సౌకర్యాల లేమితో ఇబ్బందులు పడుతున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
స్మార్ట్ సిటీ అంటే?
స్మార్ట్ సిటీ అంటే ప్రభుత్వం ఓ ప్రత్యేక నిర్వచనం ఏమీ ఇవ్వలేదు. కానీ ఎంపిక చేసిన 100 పట్టణాల్లోని ప్రజల జీవన ప్రమాణాల స్థాయిని ఆధునిక సాంకేతికత సాయంతో మెరుగుపరిచేందుకు ప్రత్యేక నిధులను కేటాయించడమే ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం.
ఈ నగరాల్లో తక్కువ విద్యుత్తుతో నివసించగలిగే ఇళ్ల నిర్మాణమే కాదు, నీరు, గృహవ్యర్థాలు, ట్రాఫిక్ నిర్వహణ వంటి అనేక అంశాల్లో ఆధునిక టెక్నాలజీని ఉపయోగిస్తారు.
ప్రభుత్వ 'స్మార్ట్ సిటీస్ మిషన్' (స్మార్ట్ నగరాల అభివృద్ధి కార్యక్రమం) 100 నగరాలను ఈ ప్రాజెక్టు కోసం ఎంపిక చేసింది. వీటిలో కొన్నింటిని 2018 చివర్లో విడుదల చేసిన జాబితాలో ప్రకటించారు.
ఈ ఆలస్యం కారణంగా నిర్దిష్ట గడువునాటికి ప్రాజెక్టు పూర్తికాలేదు. తాజాగా 2023 వరకూ గడువును పొడిగించారు.
ఈ పథకం కింద... రాష్ట్రాల నుంచి, స్థానిక సంస్థల సహకారం తీసుకోవడంతోపాటు కేంద్రం కూడా ప్రతి సంవత్సరం ప్రతి స్మార్ట్ నగరాభివృద్ధికీ నిధులను కేటాయిస్తుంది.
ప్రాజెక్టు లక్ష్యం నెరవేరిందా?
2018 డిసెంబరు నాటికి, స్మార్ట్ సిటీస్ మిషన్‌లో భాగంగా 2 లక్షల కోట్ల రూపాయల విలువైన 5151 ప్రాజెక్టులకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. (ఆధారం: http://164.100.47.190/loksabhaquestions/annex/16/AS9.pdf)
వీటిలో 39% ప్రాజెక్టులు పూర్తికావడం గానీ, కొంత వరకూ పూర్తైగానీ ఉన్నాయని 2019 జనవరిలో స్మార్ట్ సిటీస్ మిషన్ ప్రకటించింది. ఇంతకు మించి మరే వివరాలూ వెల్లడించలేదు. (ఆధారం: http://164.100.47.190/loksabhaquestions/annex/17/AS134.pdf)
ఈ పథకానికి నిధుల లేమి సమస్యగా మారిందని అధికారిక సమాచారం స్పష్టం చేస్తోంది. 2015-19 మధ్య కాలంలో స్మార్ట్ సిటీస్ మిషన్‌కు 16600 కోట్ల రూపాయలు కేటాయించారు.
కానీ, 3560 కోట్ల రూపాయల నిధులే ఖర్చు అయినట్లు ఈ సంవత్సరం జనవరిలో ప్రభుత్వం అంగీకరించింది. అంటే కేవలం 21శాతం మాత్రమే ఖర్చు చేశారు. (ఆధారం: http://164.100.47.190/loksabhaquestions/annex/16/AS296.pdf)
ఈ నిధులను ఖర్చుచేసిన విధానంపై కూడా విమర్శలున్నాయి. ఇప్పటివరకూ అనుమతి లభించిన ప్రాజెక్టులపై ఖర్చు చేసిన 80శాతం నిధులను నగరం మొత్తానికి కాకుండా నగరంలోని కొన్ని ప్రాంతాల అభివృద్ధికే వెచ్చించారు.
"ఇది స్మార్ట్ సిటీస్ మిషన్ (స్మార్ట్ నగరాల అభివృద్ధి కార్యక్రమం) కాదు, స్మార్ట్ ఎన్‌క్లేవ్ మిషన్ (స్మార్ట్ ప్రాంతాల అభివృద్ధి కార్యక్రమం)" అని ది హౌసింగ్ అండ్ ల్యాండ్ రైట్స్ నెట్‌వర్క్ అనే ఎన్జీఓ విమర్శించింది. (ఆధారం: http://hlrn.org.in/documents/Smart_Cities_Report_2018.pdf)
ఈ కార్యక్రమం కొత్త ప్రాజెక్టులపైనే దృష్టిపెడుతోంది తప్ప పట్టణ ప్రాంతాల్లోని స్థానిక సంస్థల సామర్థ్యాన్ని పెంపొందించేందుకు కృషి చేయడం లేదని కొందరు విశ్లేషకులు విమర్శిస్తున్నారు. సైకిల్ షేరింగ్ సౌకర్యాలు, పార్కుల నిర్మాణం చేసేస్తే సరిపోదు, వాటిని నగర అభివృద్ధి ప్రణాళికలో భాగం చేయాల్సి ఉంటుందని వారంటున్నారు.
ఈ ప్రాజెక్టు ద్వారా ఆశించిన ఫలితాలు ప్రజలకు కనిపించకపోవడానికి ప్రణాళికలను అమలు చేసే ఏజెన్సీల మధ్య సమన్వయ లోపం కూడా మరో ప్రధాన కారణం అని పార్లమెంటరీ కమిటీ నివేదిక స్పష్టం చేసింది. (ఆధారం: http://164.100.47.193/lsscommittee/Urban%20Development/16_Urban_Development_23.pdf)
ప్రస్తుతం ఉన్న స్థానిక సంస్థల సామర్థ్యాన్ని పెంపొందించడానికి తగిన శిక్షణనిస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. కానీ అది ఎంతవరకూ ఉపయుక్తంగా ఉందనేది అనుమానమే.

ఫొటో సోర్స్, Getty Images
వేగం పెరిగిందంటున్న ప్రభుత్వం
గత సంవత్సరంలో ఈ ప్రాజెక్టు అమలులో వేగం పెరిగిందని ప్రభుత్వం చెబుతోంది. (ఆధారం: http://164.100.47.190/loksabhaquestions/annex/16/AS9.pdf)
2017 అక్టోబరు నుంచి చూస్తే పూర్తైన ప్రాజెక్టులలో 479శాతం పెరుగుదల ఉందని ప్రభుత్వం డిసెంబరులో పార్లమెంటుకు తెలిపింది.
ఈ ప్రాజెక్టు అమలు కోసం 13 ఇంటిగ్రేటెడ్ కమాండ్, కంట్రోల్ సెంటర్లు ఇప్పటికే పని ప్రారంభించాయని గృహనిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పురి బీబీసీకి చెప్పారు. "2019 డిసెంబరు నాటికి 100 స్మార్ట్ సిటీల్లో 50నగరాలు పూర్తైతే... నా దృష్టిలో ప్రపంచంలోనే అత్యంత వేగంగా పూర్తైన ప్రాజెక్టు ఇదే అవుతుంది" అని ఆయనన్నారు.


ఇవి కూడా చదవండి
- తలపై జుట్టు లేకుండా.. 'పెళ్లి కూతురు' ఫొటోషూట్
- ఆవలింత ఎందుకు వస్తుంది, ఎవరైనా ఆవలిస్తే మీకూ ఆవలింత ఎందుకు వస్తుంది
- శివరాత్రి: మానవాకారంలో శివుడు ఎక్కడ ఉన్నాడు?
- పతన దశలో వెబ్... అందరం కలసి కాపాడుకోవాలి: బీబీసీతో టిమ్ బెర్నర్స్-లీ
- 15 రాత్రుల్లో 121 మంది మహిళలతో...: ప్రాచీన చైనా చక్రవర్తుల జీవితాన్ని గణితశాస్త్రం ఎలా ప్రభావతం చేసింది?
- ఎన్నికల్లో వందకు వంద శాతం పోలింగ్.. పోటీ చేసేవాళ్లంతా గెలుపు
- హోలీకి ముందే Surf Excel వెంటపడుతున్న జనం
- ఎన్నికల్లో వందకు వంద శాతం పోలింగ్.. పోటీ చేసేవాళ్లంతా గెలుపు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










