మహా శివరాత్రి: మానవాకారంలో శివుడు ఎక్కడ ఉన్నాడు?

ఫొటో సోర్స్, Rajesh
శివుడు నిరాకారుడు అని హిందూ మతం చెబుతోంది. కానీ, ఆ నిరాకారుడు భక్తుల పూజలు అందుకోవడానికి శివలింగం రూపంలో ఆలయాల్లో కొలువై ఉన్నాడని భావిస్తారు. అయితే, శివుడు మనిషి రూపంలో ఉండటం ఎప్పుడైనా చూశారా?
మానవాకారంలో గర్భగుడిలో భక్తుల పూజలు అందుకుంటున్న శివుడి విగ్రహం ఆంధ్రప్రదేశ్‌లో రెండు చోట్ల కన్పిస్తుంది. చిత్తూరు జిల్లాలోని గుడిమల్లం, అనంతపురం జిల్లాలోని ఆలయాల్లో శివుడు మానవ రూపంలో కనిపిస్తాడు.
మానవ రూపంలోని శైవ విగ్రహం గురించి బీబీసీ ప్రత్యేక కథనం..
గుడిమల్లం దేవాలయం
పురుషుడి అంగాన్ని పోలి, ఏడు అడుగుడుల ఎత్తున ఉండే శిల్పంపై హిందువుల ఆరాధ్య దైవం శివుడు.. మానవ రూపంలో ఉన్నాడు. ఈ ఆలయం చాలా పురాతనమైంది.
ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో, తిరుపతికి 20కి.మీ. దూరంలో ఉన్న గుడిమల్లం గ్రామం ఉంది. ఈ గ్రామంలోని దేవాలయంలో శివుడు మానవాకారంలో కనిపిస్తాడు.
ఈ శివలింగం క్రీస్తు పూర్వం ఒకటో శతాబ్ద కాలం నాటిదని పురావస్తు శాఖ గుర్తించినట్లు ఆలయ చైర్మన్ బచ్చల గిరిబాబు నాయుడు బీబీసీకి వివరించారు.
2009 వరకు ఆలయంలో పూజలు జరిగేవి కావని, గ్రామస్తులు, తిరుపతిలో ఉండే రాస్ అనే స్వచ్ఛంద సంస్థ చేసిన పోరాట ఫలితంగా కేంద్ర ప్రభుత్వం పూజలకు అవకాశం కల్పించిందని అన్నారు.
1911లోనే గోపీనాథరావు అనే పురావస్తు శాస్త్రవేత్త ఈ ఆలయాన్ని వెలికి తీసినప్పటికీ, గత దశాబ్ద కాలంగానే మూలవిరాట్ పూజలు అందుకుంటున్నారని ఆలయ చైర్మన్ తెలిపారు.

ఫొటో సోర్స్, Rajesh
1954 నుంచి ఈ ఆలయం పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఉంది. సమాచార హక్కు చట్టం ద్వారా ఆ శాఖ ఆలయాన్ని నిర్లక్ష్యం చేసిన విషయాన్ని స్వచ్ఛంద సంస్థతో కలిసి తాను బయటపెట్టగలిగానని చెప్పారు.
దేవాలయానికి సంబంధించిన సాహిత్యం కూడా పురావస్తు శాఖ వద్ద లేదనే విషయాన్ని వెలుగులోకి తీసుకురాగలిగనట్లు గిరిబాబు నాయుడు తెలిపారు.
''చోళులు, పల్లవులు పాలించే సమయంలో నిత్య పూజలతో ఈ ఆలయం తేజోవంతంగా ఉండేది. అలాంటి దేవాలయం ఏ దుస్థితిలో ఉందో గ్రామస్తులకు వివరించేలా మా బృందం పనిచేయగలిగింది'' అని వివరించారు.
2009 నుంచి ఈ శివాలయం నిత్య పూజలతో కళకళలాడుతోందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.

ఫొటో సోర్స్, Rajesh
'ఒకే విగ్రహంలో త్రిమూర్తులు'
ఆలయానికి సంబంధించిన కొన్ని శాసనాలు, కొన్ని ఆధారాలు తవ్వకాల్లో బయటపడినట్లు దేవాలయ ఛైర్మన్ తెలిపారు.
అయితే, మూల విరాట్‌కు సంబంధించి ఎటువంటి వివరాలు లభించలేదని, దాన్ని బట్టి ఆలయం కంటే మూలవిరాట్ అత్యంత పురాతనమైనదని పురావస్తు శాఖ భావిస్తోందన్నారు. ముఖమండపం కంటే గర్భాలయం లోతులో ఉండటం ఈ అంశాన్ని ధ్రువీకరిస్తుందన్నారు.
'ఉజ్జయినిలో దొరికిన పురాతన నాణేలపై ఈ విగ్రహ నమూనా'
పురావస్తు ఆధ్వర్యంలో ఉజ్జయినిలో జరిపిన తవ్వకాల్లో క్రీ.పూ మూడో శతాబ్ద కాలంనాటి నాణేలు లభ్యమయ్యాయని, వాటిపై ఈ విగ్రహాన్ని పోలిన ముద్ర ఉందని గిరిబాబు నాయుడు తెలిపారు. అంటే ఆలయంకన్నా విగ్రహమే రెండు శతాబ్దాల ముందు కొలువైనట్లు భావించాలని అన్నారు.

ఫొటో సోర్స్, Rajesh
''ప్రధానంగా మూల విరాట్‌లో చాలా ప్రత్యేకతలున్నాయి. ఒకే శిలలో త్రిమూర్తులు కొలువై ఉండటం బహుశా.. దేశంలోనే ఎక్కడా కనిపించదు. బ్రహ్మా యక్షుడి రూపంలో, విష్ణుమూర్తి పరుశురాముని రూపంలో, పరమేశ్వరుడు పురాణలింగాకాలరంలో కొలువై ఉన్నారు'' అని ఆలయ చైర్మన్ వివరించారు.
ఈ శివలింగంపై శివుడు మానవ రూపంలో మహావీరుడైన వేటగాడిలా ఉంటాడని, లింగం ముందువైపు ఉబ్బెత్తుగా ఉండేలా శివుడి రూపం చెక్కినట్లు గిరిబాబు వివరించారు.
''ఈ ఆలయంలోని విగ్రహం సృష్టికి మూలంగా భావిస్తారు. అందుకే సంతానం లేనివారు రాహుకాలంలో పూజలు చేసి, స్వామి అనుగ్రహం పొందుతారు'' అన్నారు.
ఆలయ ప్రాంగణంలోనే ఆరుముఖాలతో కొలువైన షణ్ముఖ స్వామి, సూర్వనారాయణుని వంటి ఉప దేవాలయాలు కూడా కొలువైనట్లు తెలిపారు.
దేవాలయ గోడలపై బాణ చోళరాజులు, పల్లవులు, వారి సామంత రాజులైన గంగ పల్లవులు, యాదవ దేవరాయల కాలానికు చెందిన శాసనాలు ఉన్నట్లు తెలిపారు. దేవాలయ ప్రాంగణంలోనే యాదవ దేవరాయల కాలంలో అభిషేక జలాల కోసం నిర్మించి బావి కూడా ఉందని వివరించారు.

ఫొటో సోర్స్, Ramanjaneyulu
‘హైమావతి హేమావతిగా మారింది’
అనంతపురం జిల్లా అమరాపురం మండలంలో ఈ హేమావతి గ్రామం ఉంది. నొలంబ రాజులు 7వ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయంలో శివుడు సిద్ధాసనంలో కూర్చుని ఉండటం ఇక్కడి ప్రత్యేకత అని, ఇలాంటి ప్రత్యేకత మరెక్కడా కనిపించదని ఆలయ ప్రధాన అర్చకుడు శివకుమార్ బీబీసీతో అన్నారు.
ప్రస్తుతం ఈ దేవాలయం కేంద్ర పురావస్తు శాఖ ఆధీనంలో ఉంది. రాష్ట్ర దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఇక్కడ పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈఓ రామాంజనేయులు బీబీసీకి తెలిపారు.
లింగాకారంలోకాక, మానవ రూపంలో శివుడు.. సిద్ధాసనంలో కూర్చుని ఉండటం ఇక్కడి ప్రత్యేకత. శివరాత్రి రోజు నుంచి ఈ దేవాలయంలో 8రోజులపాటు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.

ఫొటో సోర్స్, Ramanjaneyulu
శివరాత్రి సందర్భంగా ఈ ఆలయం గురించి ఆలయ అధికారులు, అర్చకులతో బీబీసీ మాట్లాడింది. హేమావతి ఆలయ ప్రత్యేకత వారి మాటల్లోనే..
''ఈ ఆలయాన్ని నొలంబ వంశానికి చెందిన రాజులు చిత్రశేఖర, సోమశేఖరులు 7వ శతాబ్దంలో నిర్మించారు. గర్భాలయంలోని శివుడి విగ్రహం, పీఠం నుంచి తల వరకు.. 5.5 అడుగుల ఎత్తు ఉంది'' అని ఆలయ అర్చకుడు శివకుమార్ అన్నారు.
ఈ ఆలయ ప్రాంతం ఒకప్పుడు శిల్పకళా కళాశాల అని శివకుమార్.. ఆ వివరాలు చెప్పుకొచ్చారు.
''ఈ శివుడిని దర్శించుకోవడానికి కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలనుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తారు. ఈ ఆలయం చుట్టుపక్కల 5-6ఎకరాల విస్తీర్ణంలో జరిపిన తవ్వకాల్లో శివలింగాలు, నంది విగ్రహాలు బయటపడతున్నాయి. ఒకప్పుడు ఈ ప్రాంతంలో శిల్పకళను నేర్పే కళాశాల ఉండేదని చరిత్ర చెబుతోంది'' అని హేమావతి ఆలయ చైర్మన్ ప్రకాశ్ బీబీసీకి వివరించారు.

ఫొటో సోర్స్, Prakash
''బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరిగే అగ్నిగుండం రోజున లక్షమంది వరకూ భక్తులు ఇక్కడకు వస్తారు. ఆరోజున తాము పొలంలో వేసిన పంట రకంలో కాస్త అగ్నిగుండానికి అర్పిస్తే, తమ పంటలకు ఎలాంటి రోగాలు సోకవని, పంటలు బాగా పండుతాయని ఇక్కడి రైతుల నమ్మకం'' అన్నారు.

ఫొటో సోర్స్, Ramanjaneyulu

ఫొటో సోర్స్, Alamy
''ఈ ప్రాంతంలో కొన్ని వందల ఏళ్ల కిందట శిల్పకళను నేర్పేవారు. అందుకే ఆలయం చుట్టూ జరిపిన తవ్వకాల్లో ఎన్నో విగ్రహాలు దొరికాయి. ఇంకా దొరుకుతూనే ఉన్నాయి. వాటిని భద్రపరచడానికి రెండు మ్యూజియంలు నిర్మించారు. అయినా వాటిని దాచడానికి చోటు చాలడం లేదు'' అని చైర్మన్ ప్రకాష్ తెలిపారు.
ఈ దేవాలయంలో శిల్పకళ అత్యంత అద్భుతంగా ఉంది. ఈమధ్యనే 40లక్షల రూపాయలతో దేవాలయ ప్రాకారం కోసం నిధులు విడుదల చేశారు. బ్రహ్మోత్సవాల తర్వాత పనులు ప్రారంభిస్తారు’’ అని ఆలయ ఈవో రామాంజనేయులు అన్నారు.
ఇవి కూడా చదవండి
- 1971లో భారత్‌పై పాకిస్తాన్ దాడి చేయబోతోందన్న విషయం RAW కి ముందే ఎలా తెలిసింది?
- నా గర్ల్‌ఫ్రెండ్ నన్ను ఎలా చిత్రహింసలు పెట్టిందంటే..
- "మా అమ్మను ఎందుకు చంపారు... ఎంతోకాలంగా వాళ్లను అడగాలనుకున్న ప్రశ్న ఇది"
- మూడుసార్లు ఉరికంబం వరకు తీసుకెళ్లినా ఆయన్ను ఉరి తీయలేకపోయారు
- పంటకు నష్టం చేసిన కలుపుమందు.. బేయర్ సంస్థకు రూ. 1,890 కోట్ల జరిమానా విధించిన కోర్టు
- బెంగాల్ మదరసాల్లో హిందూ విద్యార్థుల సంఖ్య ఎందుకు పెరుగుతోంది?
- ఒక 'బలవంతపు పెళ్లి' వేల మందిని కాపాడింది
- పురుషులు మూత్రం ఎలా పోస్తే మంచిది? నిలబడి పోయాలా? కూర్చుని పోయాలా?
- ఒక్క మిడత ‘మహమ్మారి'లా ఎలా మారుతుంది
- హిందూమతం అంటే ఏమిటి? చరిత్ర ఏం చెప్తోంది?
- వియత్నాం హిందువులు : ఒకప్పుడు రాజ్యాలు ఏలారు.. ఇప్పుడు కనుమరుగవుతున్నారు
- గుజరాత్: బ్రెజిల్‌కు ఆనాడు ఆవుల్ని, ఎద్దుల్ని ఇచ్చి.. ఇప్పుడు వీర్యం అడుగుతోంది
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








