"మా అమ్మను ఎందుకు చంపారు... ఎంతోకాలంగా వాళ్లను అడగాలనుకున్న ప్రశ్న ఇది"

సారా, ఆమె తల్లి హలీలా

ఫొటో సోర్స్, Iwan Setiawan

ఫొటో క్యాప్షన్, సారా, ఆమె తల్లి హలీలా
    • రచయిత, రెబెక్కా హెన్ష్‌కే, ఎండాంగ్ నుర్డిన్
    • హోదా, జకార్తా నుంచి బీబీసీ ప్రతినిధులు

ఎవరైనా తన తల్లిని చంపిన హంతకులను కలిస్తే వారిని ఏం అడుగుతారు, వారికి ఏం చెబుతారు? ఆ హంతకులను క్షమించగలరా?

17 ఏళ్ల సారా సాల్సబిలాకు ఇదే పరిస్థితి ఎదురైంది, నిరుడు అక్టోబర్లో ఒక రోజు, ఇండోనేషియాలోని ఓ జైల్లో.

ఇవాన్ సెటియావన్ 2004 సెప్టెంబరు 9న ఇండోనేషియాలోని జకార్తాలో ఆస్ట్రేలియా రాయబార కార్యాలయం మీదుగా బైక్‌పై వెళ్తున్నారు. గర్భంతో ఉన్న భార్య ఆయన వెనక కూర్చొని ఉన్నారు.

అడ్డగీత
News image
అడ్డగీత

కొన్ని వారాల్లో రెండో శిశువుకు జన్మనివ్వనున్న హలీలా గురించే ఇవాన్ ఆలోచిస్తున్నారు. వాళ్లు అప్పుడు వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి వెళ్తున్నారు.

"అప్పుడు హఠాత్తుగా భారీ శబ్దం వెలువడింది.. బైక్‌పై నుంచి మేం గాల్లోకి ఎగిరి పడ్డాం" అంటూ నాటి ఘటనను ఇవాన్ గుర్తుచేసుకున్నారు.

అదో ఆత్మాహుతి దాడి అని ఘటన జరిగిన తర్వాత చాలాసేపటికిగాని ఆయనకు తెలియలేదు. 'జెమ్మా ఇస్లామియా' అనే స్థానిక మిలిటెంట్ గ్రూప్ ఈ దాడికి పాల్పడింది.

సారా
ఫొటో క్యాప్షన్, సారా

ఈ గ్రూప్‌కు అల్‌ఖైదాతో సంబంధాలున్నాయి. ఇండోనేషియాలో ఇది అనేక దాడులకు పాల్పడింది. 2002లో బాలిలో జరిగిన బాంబింగ్ వీటిలో ఒకటి. నాటి దాడిలో వివిధ దేశాలకు చెందిన 202 మంది చనిపోయారు.

"దాడి జరిగిన చోటు రక్తసిక్తమైంది. లోహపు ముక్క ఎగిరొచ్చి నా కంట్లోకి చొచ్చుకుపోయింది. కన్ను పోయింది" అని ఇవాన్ చెప్పారు.

ఆయన భార్య ఆయనకు కొన్ని మీటర్ల దూరంలో పడ్డారు. వారిద్దరినీ ఆస్పత్రికి తరలించారు. తీవ్ర గాయాలైన ఇవాన్ భార్య హలీలా సెరోజా దావులే, తర్వాత ప్రసవించారు.

"నొప్పులు రావడంతో తనను ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లారు. అల్లా దయ వల్ల, ఆ రోజు రాత్రి అలాంటి పరిస్థితుల్లోనూ తను సహజ కాన్పులో శిశువుకు జన్మనివ్వగలిగింది" అని ఇవాన్ చెప్పారు.

ఆ మగశిశువుకు రిజ్క్వీ అని పేరు పెట్టారు. రిజ్క్వీ అంటే 'ఆశీర్వాదం' అని అర్థం.

"మా అమ్మ తన ఎముకలు విరిగినా, నా సోదరుడికి సహజ కాన్పులో జన్మనివ్వగిలింది. మా అమ్మ చాలా శక్తిమంతురాలు" అని ఇవాన్, హలీలా దంపతుల మొదటి సంతానమైన సారా సాల్సబిలా కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్పింది.

నాటి దాడి గాయాల నుంచి హలీలా ఎన్నటికీ కోలుకోలేకపోయారు. రెండేళ్ల తర్వాత సారా ఐదో పుట్టిన రోజున ఆమె ప్రాణం విడిచారు.

"నేను నా బెస్ట్ ఫ్రెండ్‌ను, నా సోల్‌మేట్‌ను, నా జీవితాన్ని పరిపూర్ణం చేసిన మనిషిని కోల్పోయాను.. నాకు మాటలు రావడం లేదు" అంటూ ఇవాన్ కన్నీటి పర్యంతమయ్యారు.

తన భార్య మరణానికి కారణమైనవారిపై ఆయన మొదట్లో ప్రతీకారేచ్ఛతో రగిలిపోయేవారు.

ఇవాన్, రిజ్క్వీ

ఫొటో సోర్స్, Iwan Setiawan

ఫొటో క్యాప్షన్, ఇవాన్, రిజ్క్వీ

"నాటి దాడికి బాధ్యులైన బాంబర్లు అందరూ చావాలని కోరుకొన్నా. కానీ వాళ్లు త్వరగా చనిపోవాలని కోరుకోలేదు. వాళ్లను మొదట చిత్రహింసలు పెట్టాలని, తర్వాత వాళ్ల చర్మాన్ని కోసి, గాయాలకు ఉప్పు రాయాలని కోరుకొన్నా. అలా చేస్తే వాళ్ల బాంబింగ్ వల్ల బాధితులు శారీరకంగా, మానసికంగా ఎంత బాధను అనుభవించారో వాళ్లకు కొంతైనా తెలిసి వస్తుందని అనుకొన్నా. హలీలా లేకుండా బతకడం నా పిల్లలకు, నాకు భరించలేనంత కష్టం అయ్యింది" అని ఇవాన్ చెప్పారు.

అడ్డగీత

ఆస్ట్రేలియా రాయబార కార్యాలయం వెలుపల బాంబింగ్ జరిగి గత ఏడాదికి 15 ఏళ్లు అయ్యింది. హలీలా చనిపోయి 13 ఏళ్లు అయ్యింది.

రిజ్క్వీ ప్రస్తుతం జూనియర్ హైస్కూల్లో చదువుతున్నాడు. సారా పాఠశాల విద్య దాదాపు పూర్తయ్యింది.

ఇవాన్‌, రిజ్క్వీ, సారాలతో కలిసి మేం బోటులో ఓ ఇరుకైన జలసంధిని దాటుకుంటూ నుసకంబంగన్ దీవికి వెళ్లాం. అడవులతో నిండిన ఈ దీవిలోనే ఇండోనేషియాలోకెల్లా అత్యంత పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లున్న రెండు జైళ్లు ఉన్నాయి. అవే బాటు జైలు, పెర్మిసన్ జైలు.

మరణశిక్ష పడ్డ ఇద్దరిని కలుసుకొనేందుకు మేం ఈ జైళ్లకు వెళ్లాం. ఇవాన్‌కు భార్యను, ఇద్దరు పిల్లలకు తల్లిని దూరం చేసిన దాడి కేసులో వారిద్దరు దోషులు.

బోటు ప్రయాణంలో సారా, ఆమె తండ్రి ఇవాన్
ఫొటో క్యాప్షన్, బోటు ప్రయాణంలో సారా, ఆమె తండ్రి ఇవాన్

"నా గుండె వేగంగా కొట్టుకొంటోంది. చాలా ఉద్వేగంగా ఉంది. ఇప్పుడు నా ఆలోచనలు ఎలా సాగుతున్నాయో వివరించడానికి మాటలు దొరకడం లేదు" అని రేవుకు చేరుకున్న తర్వాత ఇవాన్ మాతో అన్నారు. అప్పుడు చిన్నగా వర్షం పడుతోంది.

ఆ బాంబర్లు వారి మనసులో ఏముందో చెబుతారని ఆశిస్తున్నానని ఇవాన్ అన్నారు.

ఈ జైళ్లలో ఉన్న ఇద్దరిలో ఒకరిని ఇవాన్ లోగడ కలిశారు. మిలిటెంట్లతో వారి బాధితులు సమావేశమయ్యే ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా ఆయన అతడిని కలిశారు. ఉగ్రవాద నియంత్రణ చర్యల్లో భాగంగా ఇండోనేషియా ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. తమ తల్లిని పొట్టనబెట్టుకున్న బాంబర్లను ఇవాన్ పిల్లలు కలవడం ఇదే తొలిసారి.

మీరు నిజంగా ఆ మిలిటెంట్లను కలవాలనుకొంటున్నారా అని ఇవాన్‌ను మేం అడిగాం.

అడ్డగీత

మా ప్రశ్నకు ఇవాన్ అవునని సమాధానమిచ్చారు. ఈ అవకాశం తన పిల్లలకు చాలా ముఖ్యమన్నారు.

కోపం ఉండకూడదని పిల్లలకు చెబుతూ వచ్చానని ఇవాన్ తెలిపారు. "ఇంత దారుణానికి పాల్పడిన వ్యక్తులు ఎలా ఉంటారో వాళ్లు తెలుసుకోవాలనుకొంటున్నారు" అని చెప్పారు.

నల్లటి హిజాబ్‌, చారల చొక్కా, పొడవాటి ట్రౌజర్స్‌తో సారా వస్త్రధారణ స్టైలిష్‌గా ఉంది. మా ప్రయాణమంతా తను సెల్ఫీలు తీసుకొంటూనే ఉంది. చాలా మంది టీనేజర్ల మాదిరే సారా కూడా ఫోన్‌కు అతుక్కుపోయింది.

జైళ్లలోని ఆ ఇద్దరిని తాను ఎందుకు కలుస్తున్నానో చెప్పేటప్పుడు సారా కళ్లలో నిశ్చయత్వం కనిపించింది.

"ఈ సమావేశంతోనైనా ఆ ఉగ్రవాదుల్లో ఆలోచన కలుగుతుందని, అల్లాను క్షమాపణ అడుగుతారని ఆశిస్తున్నా. చేసిన పనికి వాళ్లు నిజంగా పశ్చాత్తాప పడితే ఆ ప్రభావం ఇతరులపై ఉంటుంది, అప్పుడు ఇలాంటి దాడులు ఎప్పటికీ జరగవనే ఆశ ఉంది" అని సారా చెప్పింది.

సంవత్సరాలుగా వాళ్లను ఆమె అడగాలనుకొంటున్న ప్రశ్న ఒకటుంది.

"వాళ్లెందుకు ఈ పని చేశారు? నేను తెలుసుకోవాలనుకొంటున్నది అదే" అని ఆమె చెప్పింది.

అడ్డగీత

ఇవాన్ కుటుంబం కలవడానికి వెళ్లినవారిలో ఒకడైన ఇవాన్ డార్మవన్ ముంటో అలియాస్ రోయిస్.. బాటు జైల్లో ఓ చిన్న సమావేశ గదిలో కూర్చుని ఉన్నాడు. అతడు నారింజ రంగు జంప్‌సూట్లో ఉన్నాడు. చక్రాల కుర్చీలో బలహీనంగా కనిపించాడు. రోయిస్‌కు ఇటీవలే గుండెపోటు వచ్చింది. అయినప్పటికీ జైలు సిబ్బంది అతడి చేతులకు బేడీలు, కాళ్లకు సంకెళ్లు వేశారు.

లోగడ విచారణలో రోయిస్‌ను దోషిగా ప్రకటించినప్పుడు అతడు నిలబడి, పిడికిలి బిగించి చేతిని ఊపుతూ- "నాకు మరణశిక్ష విధించినందుకు కృతజ్ఞుడను, ఎందుకంటే నేను అమరవీరుడిని అవుతాను" అని అరిచాడు. ఇరాక్ యుద్ధంలో అమెరికాతో జట్టు కట్టినందుకే ఆస్ట్రేలియా రాయబార కార్యాలయాన్ని మిలిటెంట్లు లక్ష్యంగా చేసుకొన్నారని భావిస్తారు.

బాటు జైల్లో రోయిస్
ఫొటో క్యాప్షన్, బాటు జైల్లో రోయిస్

బాటు జైల్లో సమావేశ గదిలో, మాస్కులు పెట్టుకున్న ఇద్దరు సాయుధ గార్డులు రోయిస్ పక్కన నిలబడ్డారు. అక్కడ వాతావరణం ఉత్కంఠభరితంగా ఉంది. రోయిస్ అనుకోనిది ఏమైనా చేస్తే వెంటనే పక్కకు వెళ్లాలని వాళ్లు మమ్మల్ని హెచ్చరించారు.

ఇవాన్, సారా, రిజ్క్వీ- రోయిస్‌ను పలకరించి, అక్కడున్న ప్లాస్టిక్ కుర్చీల్లో కూర్చున్నారు. మొదట ఇవాన్ మాట్లాడారు.

"తమకు తల్లి దూరం కావడానికి, తమ తండ్రికి కన్ను పోవడానికి కారణమైన వ్యక్తులను కలవాలని నా పిల్లలు ఎదురుచూస్తున్నారు" అని ఆయన అన్నారు.

బాంబింగ్ జరిగినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారని ఇవాన్‌ను రోయిస్ అడిగాడు.

రోయిస్‌ను కలుసుకొన్న సారా, రిజ్క్వీ
ఫొటో క్యాప్షన్, రోయిస్‌ను కలుసుకొన్న సారా, రిజ్క్వీ

బాంబింగ్ జరిగిన రోజు రాత్రే తన భార్య రెండో సంతానానికి జన్మ నిచ్చిందంటూ ఇవాన్... రోయిస్‌కు వివరించారు. "ఆ రోజు పుట్టింది వీడే" అంటూ రిజ్క్వీని చూపించారు. అప్పుడు రిజ్క్వీ తన చూపులను చేతులపై నిలిపాడు.

రోయిస్ స్పందిస్తూ- "నాకూ ఒక బిడ్డ ఉన్నారు. నా భార్యను, సంతానాన్ని చూసి సంవత్సరాలైంది. వాళ్లను చాలా మిస్ అవుతున్నా. నా పరిస్థితి మీ కంటే దారుణం. మీరు మీ పిల్లలతోనైనా ఉన్నారు. నా బిడ్డకు నేనెవరో కూడా తెలియదు" అన్నాడు.

రోయిస్.. సారా, రిజ్క్వీల వైపు చూశాడు. వాళ్లిద్దరూ తమ చేతుల్లోకే చూసుకొన్నారు. అతడి కళ్లలోకి చూడలేదు.

ఇంతలో మా అందరి దృష్టీ సారా వైపు మళ్లింది. ఎందుకంటే ఆమె ఏదో అడగాలనుకొంటోందని మాకు తెలుసు కదా!

సారా ఒక్కసారిగా ఏడ్చేసింది. తండ్రి ఆమె తల పట్టుకొని, ఆమెను దగ్గరకు తీసుకొని ఓదార్చే ప్రయత్నం చేశారు. సారా తేరుకొని, "ఎందుకీ పని చేశావ్" అని రోయిస్‌ను ప్రశ్నించింది.

రోయిస్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, శిక్ష ప్రకటించినప్పుడు మరణశిక్షతో అమరవీరుడిని అవుతానన్న రోయిస్

"వాళ్లు నాకు ఆపాదించిన పని నేను చెయ్యలేదు. మరి చేసినట్లు నేనెందుకు అంగీకరించాను? నా కంట్లోకి చూస్తే సమాధానం మీకే తెలుస్తుంది" అంటూ దెబ్బతిన్న తన కంటిని రోయిస్ చూపించాడు.

"మీకు వయసు పెరిగాక ఈ విషయం అర్థం కావొచ్చు. ముస్లింలు బాధితులయ్యే దాడులను నేను సమర్థించను. అది సరికాదు. ముస్లింలను చంపకూడదు. ఒక ముస్లింను బాధపెట్టడం కూడా సరికాదు" అని అతడు అన్నాడు.

ఇంతలో మేం కల్పించుకొని, "బాధితులు ముస్లింలు కాకపోతే" అని అడిగాం.

అలాంటి దాడులనూ తాను సమర్థించనని అతడు వెంటనే బదులిచ్చాడు.

ఇతర ఖైదీలపై రోయిస్ ప్రభావం చూపగలడనే ఆందోళనతో తాము అతడిని సెల్లో ఒంటరిగా ఉంచామని గార్డులు మాతో చెప్పారు.

గతంలో రోయిస్, ఛాందసవాద మత బోధకుడు అమన్ అబ్దుర్‌రెహ్మాన్‌ ఒకే సెల్లో ఉండేవారు. ఇస్లామిక్ స్టేట్ సంస్థకు తాను విధేయుడినని అబ్దుర్‌రెహ్మాన్ చెప్పాడు. వీళ్లిద్దరూ కలిసి జైల్లోంచే 2016లో జకార్తాలో బాంబు దాడికి కుట్ర పన్నారనే అనుమానాలు ఉన్నాయి.

సమావేశం తర్వాత ఇవాన్ బయల్దేరడానికి ముందు, అతడి కోసం తాను ప్రార్థిస్తానని రోయిస్ అన్నాడు. "మనుషులందరూ పొరపాట్లు చేస్తారు. నీ పట్ల నేనేమైనా తప్పు చేసుంటే నన్ను క్షమించు. నాకు బాధ కలుగుతోంది, నిజంగా" అని చెప్పాడు.

కన్నీళ్లను ఆపుకొంటున్న ఇవాన్
ఫొటో క్యాప్షన్, కన్నీళ్లను ఆపుకొంటున్న ఇవాన్

బయటకొచ్చాక ఇవాన్‌ను చూస్తే చలించిపోయినట్లు కనిపించారు.

"తను చేసిన పని సరైనదేనని రోయిస్ ఇప్పటికీ అనుకొంటున్నాడు. అతడికి అవకాశం వస్తే మళ్లీ ఆ పని చేస్తాడని అనిపిస్తోంది" అని ఇవాన్ ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకొంటూ చెప్పారు.

"అతడు తాను చేసిన పనితో మాకు చాలా బాధ కలిగించాడు. కానీ దానిని అతడు అంగీకరించడం లేదు. ఇది నాకు అసంతృప్తి కలిగిస్తోంది. ఇక నేనేం చేయగలను" అని నిస్సహాయత వ్యక్తంచేశారు.

అడ్డగీత

దీవిలో ఒక సైనిక బస్సులో మమ్మల్ని అధికారులు ఈ రెండు జైళ్ల వద్దకు తీసుకెళ్లారు.

బాటు జైల్లో రోయిస్‌ను కలిసిన తర్వాత పెర్మిసన్ జైల్లో ఉన్న అహ్మద్ హసన్‌ను కలిసేందుకు ఇవాన్ కుటుంబం బయల్దేరింది. అతడు సారా, రిజ్క్వీ తల్లి చనిపోయిన దాడి కేసులో మరణ శిక్ష ఎదుర్కొంటున్న రెండో దోషి.

శిక్ష పడ్డప్పుడు హసన్ కనిపించిన తీరుకు, ఇప్పుడు జైల్లో కనిపించిన తీరుకు మధ్య చాలా వ్యత్యాసం ఉంది.

గతంలో కోర్టు నుంచి వెళ్తూ ధిక్కార స్వరం వినిపిస్తున్న హసన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, గతంలో కోర్టు నుంచి వెళ్తూ ధిక్కార స్వరం వినిపిస్తున్న హసన్

శిక్ష పడ్డ తర్వాత కోర్టు నుంచి వెళ్లేటప్పుడు హసన్ పిడికిలిని ఎత్తి ధిక్కార స్వరం వినిపిస్తున్నట్లు, కెమెరా వైపు ఆగ్రహంగా చూస్తున్నట్లు అప్పటి ఫొటోలను బట్టి తెలుస్తోంది.

మేం కలిసిన రోజు అతడు అందుకు భిన్నంగా కనిపించాడు.

అతడు పొడవాటి ఇస్లామిక్ రోబ్, ప్రార్థన చేసేటప్పుడు పెట్టుకొనే టోపీ ధరించి ఉన్నాడు. ఒకింత ఆందోళనగా కనిపించాడు. మృదువుగా మాట్లాడాడు.

అతడిని కలిసేందుకు ఇవాన్ ఇంతకుముందు ఓసారి ఈ జైలుకు వచ్చారు.

"నిన్ను కలిసేందుకు నా పిల్లల్ని తీసుకొచ్చాను" అని హసన్‌ మోకాలిపై చేయి పెట్టి ఇవాన్ చెప్పారు.

"వీళ్ల అమ్మ చనిపోవడానికి, నా కన్ను పోవడానికి కారణమైన బాంబు దాడికి నువ్వెందుకు పాల్పడ్డావో వీళ్లు కూడా తెలుసుకోవాలని అనుకొంటున్నారు" అని అతడితో అన్నారు.

బాటు, పెర్మిసన్ జైళ్లు, పెర్మిసన్ బీచ్
ఫొటో క్యాప్షన్, మ్యాపులో బాటు, పెర్మిసన్ జైళ్లు, పెర్మిసన్ బీచ్

హసన్ హుందాగా తలూపాడు.

"వాళ్లకు తెలియాల్సి ఉంది. వాళ్లకు చిన్న వయసులోనే తల్లి దూరమైంది" అని అతడు స్పందించాడు. "నేను మీ నాన్నకు ఇంతకుముందే చెప్పాను, ఇప్పుడు అల్లా దయ వల్ల మీతో చెప్పే అవకాశం దక్కింది" అన్నాడు.

"మీ నాన్నను బాధ పెట్టాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఆ రోజు దాడి జరిగిన ప్రదేశం గుండా ఆయన వెళ్తున్నారంతే.. బాంబులతో ఉన్న నా స్నేహితుడు సరిగ్గా అదే సమయంలో వాటిని పేల్చాడు. ఇవాన్ పిల్లలైన మీరు నన్ను క్షమించగలరని ఆశిస్తున్నా" అని హసన్ చెప్పాడు.

"నేనో తప్పుడు మనిషిని, చాలా పొరపాట్లు చేశాను" అని అతడు గద్గద స్వరంతో అన్నాడు.

సారా అతడి వైపు చూస్తూ- "ఆ దాడికి ఎలా పాల్పడ్డావు, కారణం ఏమిటి" అని సూటిగా అడిగింది.

"నాకు, నా స్నేహితులకు తప్పుడు విద్య, బోధన అందాయి. మేం ఏం చేస్తున్నామో అర్థం చేసుకుని.. ఆ పని చేసుండాల్సింది కాదు" అని హసన్ బదులిచ్చాడు.

తన ఐదో పుట్టినరోజున నాలుగు గంటలకు వేడుక చేసుకొందామనుకొని తాము ప్రణాళిక వేసుకొంటే, అదే రోజు తన తల్లి చనిపోవడం, సంతోషం తీరని విషాదంగా మారిపోవడం సారా అతడికి వివరించింది.

"చిన్నప్పుడు అమ్మ ఎక్కడని నాన్నను ఎప్పుడూ అడిగేదాన్ని. అమ్మ అల్లా ఇంట్లో ఉందని నాన్న చెప్పేవాడు. ఆ ఇల్లు ఎక్కడని నేను అడిగితే, మసీదే ఆ ఇల్లని నాన్న చెప్పేవాడు. నేను మసీదు వద్దకు పరుగెత్తేదాన్ని. మా అవ్వ నా కోసం వెతుకుతూ ఉండేది. నేను తనకు కనిపిస్తే, అమ్మ కోసం ఎదురుచూస్తున్నానని చెప్పేదాన్ని. కానీ అమ్మ ఎప్పుడూ రాలేదు" అంటూ సారా తన బాధను వ్యక్తంచేసింది.

హసన్
ఫొటో క్యాప్షన్, క్షమాపణ కోరుతూ ప్రార్థన చేస్తున్న హసన్

తర్వాత హసన్, అల్లాను క్షమాపణ కోరుతూ ప్రార్థన చేశాడు.

"నేను మిమ్మల్ని కలుసుకోవాలని, మీకు అంతా వివరించాలని అల్లా అనుకొన్నాడు. కానీ నీకు వివరించలేకపోతున్నానమ్మా, సారీ" అని అతడు బదులిచ్చాడు.

"నా కన్నీళ్లను ఆపుకోలేకపోతున్నా. సారా నా సొంత కూతురు లాంటిది. దయచేసి నన్ను క్షమించు, ఇది నీ చేతుల్లోనే ఉంది" అని హసన్ ప్రార్థించాడు.

అప్పుడు ఆ చిన్న గదిలో ప్రతి ఒక్కరూ ఏడుస్తూ కనిపించారు.

గదిలోంచి బయటకు వచ్చాక ఇవాన్ స్పందిస్తూ- "హసన్ ఏడుస్తున్నప్పుడు చూసి అతడు మంచివాడని తెలుసుకున్నా. ఇతరుల బాధను అతడు సహానుభూతి చెందగలడు. తప్పుడు ఆలోచనలున్న తప్పుడు మనుషుల ప్రభావంతో అతడు గతంలో తప్పు చేసి ఉండొచ్చు. ఇప్పుడు అతడు మనసు విప్పి మాట్లాడాడు" అని చెప్పారు.

జైలు గదిలో సమావేశం ముగిశాక, ఇవాన్ కుటుంబం, హసన్ అంతా కలిసి ఫొటోలు దిగారు. ఒకరి చేతులు మరొకరు పట్టుకొన్నారు. ఈ గదిలో కనిపించిన క్షమాగుణం మాకు ఆశ్చర్యం కలిగించింది.

హసన్‌తో ఫొటోలు దిగిన ఇవాన్ కుటుంబం
ఫొటో క్యాప్షన్, హసన్‌తో ఫొటోలు దిగిన ఇవాన్ కుటుంబం

"హలీలా మృతికి కారణమైన ఈ ఇద్దరికి మరణ శిక్ష సరిపోదని, మేం అనుభవించిన బాధ వాళ్లకు తెలిసేలా చిత్రహింసలు పెట్టాలని నేను ఎప్పుడూ అనేవాణ్ని. కానీ క్షమించగలవారినే అల్లా ఎక్కువ ప్రేమిస్తాడు" అని ఇవాన్ చెప్పారు.

ముఖంపై కన్నీళ్లను తుడుచుకుంటూ మేం గదిలోంచి బయటకు వచ్చి, సైన్యం బస్సు ఎక్కాం.

ఈ నుసకంబంగన్ దీవిలో ఈ రెండు జైళ్ల వెనుక ఒక ప్రముఖ బీచ్ ఉంది. ఖైదీలు దీనిని ఎప్పుడూ చూడలేరు. ఈ బీచ్ పేరు పెర్మిసన్ బీచ్ (వైట్ బీచ్). ఇండోనేషియా ప్రత్యేక బలగాలకు ఇక్కడే శిక్షణ అందిస్తారు.

బీచ్ చూద్దామని సారా, రిజ్క్వీ, ఇవాన్ అడిగారు.

బీచ్‌లో పరుగు తీస్తున్న ఇవాన్ కుటుంబం

వీరు ముగ్గురూ చేతులు పట్టుకొని ఇసుకలో పరుగు పెట్టారు. సారా ముఖంలో చిరునవ్వు. సారా ఇంతలా నవ్వడం మేం ఎప్పుడూ చూడలేదు.

"ఈ రోజు ఈ ఇద్దరు ఖైదీలతో సమావేశాలు నాకు చాలా నేర్పాయి" అని సారా మాతో అంది.

"హసన్ క్షమాపణ కోరాడు. చేసిన పనికి పశ్చాత్తాపం వ్యక్తంచేశాడు. చాలా పెద్ద తప్పు చేసిన వ్యక్తులు కూడా పరివర్తన చెందగలరని నేను ఈ రోజు తెలుసుకొన్నా. నేను అతడిని క్షమిస్తున్నా" అని ఆమె చెప్పింది.

"నేను ఎంతో కాలంగా తెలుసుకోవాలనుకొన్నది తెలుసుకొన్నాను. ఎంతోకాలంగా అడగాలనుకొన్న ప్రశ్న అడిగేశాను. సమాధానం దొరికింది. అందుకే ఈ నవ్వు" అని సారా వివరించింది.

"నాకెంతో ఊరట కలిగింది" అని ఆమె చెప్పింది.

స్పోర్ట్స్ ఉమెన్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)