అంతర్జాతీయ మహిళా దినోత్సవం : ‘పిల్లలకు అన్నం పెట్టేందుకు నా జుట్టు అమ్ముకున్నా’

- రచయిత, స్వామినాథన్ నటరాజన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
తమిళనాడులోని సేలం జిల్లాకు చెందిన ప్రేమ సెల్వంకు 31 ఏళ్లు. రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం ఆమెది.
జనవరి 3న ప్రేమ ఇంట్లో సరుకులు నిండుకున్నాయి.
‘నా ఏడేళ్ల కొడుకు కాలియప్పన్ బడి నుంచి ఇంటికివచ్చాడు. అన్నం పెట్టమన్నాడు. ఆకలంటూ ఏడ్పు మొదలుపెట్టాడు’ అంటూ ఆ రోజును ప్రేమ గుర్తుచేసుకున్నారు.


‘‘వాడికి పెట్టడానికి నా దగ్గరేమీ లేదు. నా గుండె పగిలింది. కన్న పిల్లల ఆకలి తీర్చలేనప్పుడు, ఇంక నేను బతికి ఉండి ఉపయోగమేంటి అని అనిపించింది’’ అని ప్రేమ బీబీసీతో చెప్పారు.
ప్రేమకు ఆస్తులు లేవు. తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకోవడానికి నగలు, వంటపాత్రలు కూడా లేవు.
కొన్ని ప్లాస్టిక్ బకెట్లు తప్పితే, ఇంట్లో పది రూపాయాలు కూడా లేవని చెప్పారామె.
అయితే, అప్పుడే ఆమెకు డబ్బులు వచ్చే మార్గం ఒకటి తట్టింది.
‘‘తలవెంట్రుకలు కొనే ఓ దుకాణం గుర్తొచ్చింది. అక్కడికి వెళ్లి, నా జుట్టంతా అమ్మేశా. రూ.150 వచ్చాయి’’ అని చెప్పారు ప్రేమ.
తలవెంట్రుకలను అత్యధికంగా ఎగుమతి చేసే దేశాల జాబితాలో భారత్‌తే మొదటి స్థానం. విగ్గులు, సవరాలు తయారీలో వాటిని ఉపయోగిస్తారు.

ప్రేమ ఉండే ఊళ్లో 20 రూపాయలకు అన్నం పొట్లం దొరుకుతుంది. జుట్టు అమ్మగా వచ్చిన డబ్బుతో, తన ముగ్గురు పిల్లల కోసం మూడు ప్యాకెట్లు కొన్నారామె.
ఆ పూటకు పిల్లల ఆకలి తీర్చగలిగారు ప్రేమ. ఇంకో పూటకు ఏం చేయాలన్నది ఆమెకు తోచలేదు.
ఇటుకుల బట్టీలో ప్రేమ తన భర్తతో పాటు పనిచేస్తుండేవారు. వాళ్లిద్దరి కష్టంతో వచ్చిన డబ్బులతో వారి కుటుంబం గడిచిపోయేది.
సొంతంగా ఇటుకల బట్టీ పెట్టేందుకు ప్రేమ భర్త అప్పు చేశారు. కానీ, వాళ్ల వ్యాపారం అనుకున్నట్లు సాగలేదు.
చేతిలో డబ్బులేక ఆయన ఏడు నెలల క్రితం ఆత్మహత్య చేసుకున్నారు.
పిల్లలకు అన్నం తినిపించేందుకు జుట్టు అమ్ముకోవాల్సి వచ్చిన తర్వాత, ప్రేమకు కూడా తనకు ఆత్మహత్యే శరణ్యమన్న భావన కలిగింది.
రెండు సార్లు ప్రాణాలు తీసుకునేందుకు ఆమె ప్రయత్నించారు కూడా. ఓసారి ఓ దుకాణ యజమాని, ఇంకోసారి ప్రేమ చెల్లెలు ఆమెను అడ్డుకున్నారు.
భర్త చేసిన అప్పులను తీర్చలేకే ఆత్మహత్య చేసుకోవాలన్న నిర్ణయానికి వచ్చానని ప్రేమ చెప్పారు.

‘‘ఇటుకల బట్టీలో రోజూ రూ.200 కూలీ ఇచ్చేవారు. నా కుటుంబం గడవడానికి అది సరిపోతుంది’’ అని ప్రేమ అన్నారు.
ప్రేమ ఇద్దరు కొడుకులకు ఇంకా బడికి వెళ్లే వయసు రాలేదు. దీంతో ఆమె తన వెంటే వాళ్లను ఇటుకల బట్టీ వద్దకు తీసుకువెళ్లేవారు.
అయితే, ఒక మూడు నెలలు ఆమె ఆరోగ్యం తరచూ పాడవుతూ వచ్చింది. కుటుంబ పోషణకు సరిపడా సంపాదన లేదు.
‘‘ఇటుకలు ఎక్కువగా మోయలేకపోయేదాన్ని. జ్వరం వల్ల చాలా రోజులు ఇంట్లోనే ఉండిపోయా’’ అని ఆమె చెప్పారు.
ఈ పరిస్థితికి తోడు అప్పుల వాళ్ల నుంచి ఒత్తిడి పెరిగింది.
పిల్లలకు అన్నం పెట్టేందుకు గత్యంతరం లేక ఆమె జుట్టు అమ్ముకున్నారు. ఆ తర్వాత ఆత్మహత్యకు కూడా ప్రయత్నించారు.

ప్రేమ చదువుకోలేదు. ప్రభుత్వ పథకాల గురించి కూడా ఆమెకేమీ తెలియదు.
కానీ, ఆమె పరిస్థితి గురించి బాల మురుగన్ అనే యువకుడికి తెలిసింది.
ఆయన కూడా ఒకప్పుడు కడు పేదరికం అనుభవించినవారే.
బాల మురుగన్‌కు 10 ఏళ్లు ఉన్నప్పుడు, ఆయన కుటుంబం కూడా ఇంట్లో అన్నం లేని పరిస్థితి వచ్చింది.
అప్పుడు ఇంట్లోని పాత పుస్తకాలు, దినపత్రికలు అమ్మి.. వాళ్ల అమ్మ వారికి తిండి పెట్టారు. ఆ సమయంలో బాల తల్లి కూడా నిస్పృహకు గురయ్యారు. పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించారు.
చివరి నిమిషంలో ఆమె మనసు మారింది. పిల్లలను తీసుకుని వెంటనే డాక్టర్ వద్దకు వెళ్లారు. వాళ్ల ప్రాణాలు దక్కాయి.
ఇప్పుడు బాల మురుగన్‌ది పూర్తిగా భిన్నమైన జీవితం. కొన్నేళ్లపాటు కష్టపడి పేదరికం నుంచి ఆయన బయటపడ్డారు. ఓ కంప్యూటర్ గ్రాఫిక్స్ సెంటర్‌ను నడిపిస్తున్నారు.

ఫొటో సోర్స్, BBC
ప్రేమకు బాల మురుగన్ తన కథను చెప్పి, ఆమెలో ధైర్యం నూరిపోశారు.
తన స్నేహితుడి ప్రభుతో కలిసి, తిండి కోసం ఆమెకు కొంత నగదు సాయం చేశారు.
ఆ తర్వాత జరిగిన విషయాన్ని ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
‘‘ఒక్క రోజులోనే రూ.1.2 లక్షల విరాళాలు వచ్చాయి. ప్రేమకు ఈ విషయం చెప్పినప్పుడు చాలా సంతోషించారు. ఈ మొత్తంతో తమ అప్పు చాలా వరకూ తీరిపోతుందని అన్నారు’’ అని బాలమురుగన్ వివరించారు.

అయితే, విరాళాల సేకరణను ప్రేమ ఆపేయించారు. మిగతా మొత్తాన్ని తానే సొంత కష్టంతో కడతానని ఆమె బాల మురుగన్‌కు చెప్పారు.
ఇప్పుడు అప్పుల వాళ్లకు ప్రేమ నెలా నెలా రూ.700 చెల్లించాల్సి ఉంది.
జిల్లా అధికారులు కూడా ప్రేమకు పాల విక్రయ కేంద్రం పెట్టుకునేందుకు సాయం చేస్తామని హామీ ఇచ్చారు.
తన సహకారం ఇకపైనా ఉంటుందని ప్రేమకు బాల మురుగన్ కూడా భరోసా ఇచ్చారు.
ఆత్మహత్య ప్రయత్నం తప్పని తనకు ఇప్పుడు అర్థమైందని, మిగతా అప్పును సొంతంగా చెల్లించగలనన్న నమ్మకంతో ఉన్నానని ప్రేమ చెప్పారు.

ఇవి కూడా చదవండి.
- కశ్మీరీలపై ద్వేషంతోనే జైపూర్‌లో బాసిత్‌ను కొట్టి చంపారా... పోలీసులు ఏమంటున్నారు? - గ్రౌండ్ రిపోర్ట్
- "అమ్మను చూడగానే కన్నీళ్లొచ్చాయి" - పన్నెండేళ్ళ తర్వాత కన్నతల్లిని కలుసుకున్న భవానీ
- కరోనా వైరస్: ఈ ప్రపంచాన్ని నాశనం చేసే మహమ్మారి ఇదేనా
- మగవాళ్ళకు గర్భ నిరోధక మందును కనిపెట్టిన భారత్
- కరోనావైరస్ లక్షణాలను మొదట ఈ వైద్యుడు గుర్తించారు.. అసత్య ప్రచారం ఆపాలంటూ పోలీసులు బెదిరించారు
- మరణశయ్యపై బీరు తాగుతూ, పిల్లాపాపలతో సంతోషంగా ఉన్న వృద్ధుడి ఫొటో ఏం నేర్పుతోంది
- అమరావతి గజెట్: కేంద్ర హోంశాఖ ఏం చెప్పింది? మూడు రాజధానులపై రాష్ట్ర ప్రభుత్వం ఏమంటోంది?
- మా అమ్మకు వరుడు కావలెను
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









