కరోనావైరస్ పుట్టుకపై కట్టుకథలు ఆపండి... డబ్యూహెచ్ఓ హెచ్చరిక

ఫొటో సోర్స్, Getty Images
కరోనావైరస్‌తో ఓ వైపు చైనా అల్లాడిపోతుంటే... ఆ వైరస్ వ్యాప్తి వెనుక అమెరికా కుట్ర ఉందంటూ ఇంటర్నెట్‌లో జరుగుతున్న ప్రచారం ప్రకంపనలు సృష్టిస్తోంది. రష్యా టీవీ ఛానెళ్లయితే ఏకంగా ప్రైం టైం న్యూస్‌లోనే ఈ తరహా ప్రసారాలు చేస్తున్నాయి. యూరోపియన్ వర్గాలు ముఖ్యంగా అమెరికానే లక్ష్యంగా చేసుకుంటున్నాయి.



ఫొటో సోర్స్, CHANNEL ONE
కరోనావైరస్ విషయంలో కుట్ర సిద్ధాంతాలు
రష్యాలోని ప్రధాన జాతీయ చానెల్లో ఒకటైన 'చానెల్ వన్' అయితే సాయంత్రం వేళల్లో ఏకంగా ఓ స్లాట్‌ను కేటాయించి 'వ్రెమ్య' అంటే 'టైమ్' అన్న కార్యక్రమంలో భాగంగా ఈ కరోనా కుట్ర సిద్ధాంతాలను ప్రసారం చేస్తోంది.
అనుమానాస్పదన రిపోర్టింగ్ చేస్తూ రకరకాల సిద్ధాంతాలను తవ్వి తీసి చివరకు ఏదో ఉండవచ్చన్న భావనలో ప్రేక్షకుల్ని విడిచిపెడుతోంది. అంతేకాదు, కరోనా అంటే లాటిన్ , రష్యా భాషల్లో క్రౌన్ అంటే కిరీటం అని అర్థం. అంటే ఓ రకంగా ఆధిపత్యం అని చెప్పొచ్చు. అంటే, కరోనావైరస్ అన్న పదాన్ని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు ఉద్ధేశిస్తూ కథనాలను ప్రసారం చేసింది.
నిజానికి వైరస్ కిరీటం ఆకారంలో ఉండటంతో వైద్య శాస్త్రవేత్తలు ఆ వైరస్‌కు కరోనావైరస్ అని పేరు పెట్టారు. కానీ, వ్రెమ్యా ప్రెజెంటర్ మాత్రం ఆ వాదనతో పూర్తిగా విభేదించే ప్రయత్నం చేశారు.

ఫొటో సోర్స్, CHANNEL ONE
కరోనావైరస్ పుట్టుక వెనుక అమెరికా ఉందంటూ కథనాలు
ఇక ఈ క్రౌన్ థియరీ అన్నది ఓ కట్టు కథ అంటూ మరి కన్ని వీడియోలు కూడా ప్రచారంలోకొచ్చాయి. చైనీస్ కరోనావైరస్‌ను కృత్రిమంగా తయారు చేశారని, బహుశా అమెరికా ఇంటిలిజెన్స్ వర్గాలు కానీ లేదా అమెరికన్ ఫార్మా కంపెనీలు దీని వెనుక ఉండవచ్చని ఆ వీడియోల్లో పేర్కొంటున్నాయి.
జార్జియాలో అమెరికా మనుషులపై జీవాయుధాలను పరీక్షించిందంటూ గతంలో క్రెమ్లిన్ మీడియా ప్రసారం చేసిన తప్పుడు కథనాలను కూడా ఆ రిపోర్ట్‌లో చూపిస్తున్నాయి.
'ఛానెల్ వన్'కి చెందిన పొలిటికల్ టాక్ షో 'టైం విల్ టెల్' అనే కార్యక్రమంలో కూడా ఈ తరహా కథనాలే ప్రసారమవుతున్నాయి. ఈ వైరస్ కుట్ర వెనుక పశ్చిమ దేశాలకు చెందిన నటీ నటులు , ఫార్మాసూటికల్ కంపెనీలు, అమెరికా లేదా వారి ఏజెన్సీలు ఉండొచ్చని అందులో చెబుతున్నారు.
ఈ వైరస్‌ను పుట్టించడంలోనూ అలాగే సర్వత్రా వ్యాప్తి చేసి ఆందోళనకర పరిస్థితులను సృష్టించడంలోనూ వారి పాత్ర ఉందన్న రీతిలో వారి కథనాలు ఉంటున్నాయి.
కరోనా వైరస్‌కు వ్యాక్సిన్‌ను తయారు చేసే నెపంతో భారీ ఎత్తున లాభాలు సంపాదించేందుకు ఫార్మా కంపెనీల చేసిన కుట్ర అని ఓ వైపు... చైనా ఎకానమీని దెబ్బ తీసేందుకు అమెరికా చేస్తున్న ప్రయత్నం అని మరోవైపు ఇలా రక రకాల సిద్ధాంతాలను ఆపాదిస్తూ ప్రసారం చేస్తోంది చానెల్ వన్.

ఫొటో సోర్స్, Getty Images
ఇది పూర్తి బాధ్యతారాహిత్యం: ప్రపంచ ఆరోగ్య సంస్థ
మరోవైపు మీడియాలో ప్రసారమవుతున్న ఈ తరహా కథనాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్రంగా స్పందించింది. తప్పుడు సమాచారాన్ని ప్రసారం చేయడం వారి బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని వ్యాఖ్యానించింది.
ప్రజలకు కచ్చితమైన వార్తలు అందుబాటులో ఉండాలని అప్పుడే తమతో సహా ఇతరుల్ని కూడా కాపాడుకోగల్గుతారని డైరక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ చెప్పారు. తప్పుడు వార్తలు ప్రజల్లో అనుమానాల్ని, భయాన్ని పుట్టిస్తున్నాయని అన్నారు. కేవలం వైరస్‌తో మాత్రమే కాదు.. బాధ్యతా రహితంగా ప్రసారం చేస్తున్న ఇలాంటి కుట్ర సిద్ధాంతాలతోనూ డబ్యూహెచ్ఓ పోరాడుతోందని ఆయన వ్యాఖ్యానించారు.
కరోనావైరస్‌పై వస్తున్న తప్పుడు సమాచారమే అత్యంత ప్రమాదకరమైన అంటువ్యాధి అంటూ గార్డియన్ పత్రిక తన హెడ్‌లైన్స్‌లో పేర్కొంది.
తాజా గణాంకాల ప్రకారం కరోనావైరసర్ మరణాలు సార్స్ మహమ్మారి వల్ల సంభవించిన మరణాలను కూడా మించిపోయాయి. కేవలం చైనాలోని హుబీ ప్రావిన్స్‌లోనే 780 మంది ప్రాణాలు కోల్పోయారని స్థానిక వైద్య శాఖ అంచనా. చైనా, హాంకాంగ్ దేశాల్లో కలిపి మొత్తం 803 మంది మరణించారు. 2003లో వచ్చిన సార్స్ కారణంగా మొత్తం డజనుకుపైగా దేశాల్లో కలిసి కేవంల 774 మరణాలు మాత్రమే నమోదయ్యాయి.

ఇవి కూడా చదవండి.
- థాయ్‌లాండ్ షాపింగ్ సెంటర్లో సైనికుడి కాల్పులు... 20 మంది మృతి
- "మేం రేపటి సూర్యోదయాన్ని చూస్తామో లేదో" - కరోనా రోగులకు వైద్యం చేస్తున్న ఓ మహిళ కథ
- "నాకు కరోనావైరస్ సోకలేదు.. నన్ను భారత్‌కు తీసుకెళ్లండి"- చైనాలో చిక్కుకుపోయిన తెలుగు యువతి
- అమెరికా సాయం చేయాల్సిందిపోయి భయాన్ని పెంచుతోంది: చైనా
- కరోనావైరస్ బాధితుల కోసం 8 రోజుల్లో 1000 పడకల ఆస్పత్రి నిర్మించిన చైనా.. ఇదెలా సాధ్యమైంది?
- కరోనావైరస్: వుహాన్ వాసులకు భోజనం ఎలా అందుతోంది
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









