కరోనావైరస్: "మేం రేపటి సూర్యోదయాన్ని చూస్తామో లేదో" - రోగులకు వైద్యం చేస్తున్న ఓ మహిళ కథ

యావ్

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, ‘కనీసం టాయిలెట్‌కు వెళ్లడానికి కూడా సమయం ఉండట్లేదు’ - యావ్

చైనాలో కరోనావైరస్ కారణంగా ఇప్పటిదాకా 600మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఒకపక్క వైరస్ బాధితుల సంఖ్య పెరుగుతూ ఉంటే, మరోపక్క చైనా లోపల ఏం జరుగుతోందన్న విషయాలను మాత్రం ఆ దేశం బయటకు పొక్కనీయట్లేదు.

మొదట్లో దేశంలోని మీడియా సంస్థలు వైరస్ గురించి విపులంగా రిపోర్ట్ చేసేవి. కానీ, ఇటీవలి కాలంలో అక్కడి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ రాసిన కొన్ని కథనాలను ఇంటర్నెట్ నుంచి తొలగించారు.

కరోనావైరస్ గురించి హెచ్చరించడానికి ప్రయత్నించిన ఓ వైద్యుడిని కూడా మొదట్లో పోలీసులు బెదిరించారు.

అడ్డగీత
News image
అడ్డగీత

ఈ పరిస్థితుల్లో బీబీసీ అతి కష్టం మీద హూబే ప్రావిన్సులో ఒక వైద్య సేవకురాలితో మాట్లాడింది. కరోనావైరస్ ప్రాణం పోసుకుంది ఈ ప్రావిన్సులోనే.

ఆమె తన గుర్తింపును గోప్యంగా ఉంచడానికి తనను 'యావ్' అని పిలవమని చెప్పారు.

హూబేలోని ఓ ఆస్పత్రిలో కరోనావైరస్ సోకిందో లేదో నిర్థరించే ఫీవర్ విభాగంలో ఆమె పనిచేస్తున్నారు.

కరోనా

వైరస్ ప్రబలడానికి ముందు ఆమె చైనీస్ కొత్త సంవత్సర సంబరాలను చాలా ఘనంగా ప్లాన్ చేసుకున్నారు. ఆమె తల్లి, కూతురు తాము వేడుకలు జరుపుకోవాలని నిర్ణయించుకున్న ప్రదేశానికి ముందుగానే వెళ్లిపోయారు. కానీ, రోగులకు సేవలు అందించడానికి తాను హూబేలో ఉండిపోవాలని యావ్ నిర్ణయించుకున్నారు.

"అందరికీ ఒక్కటే జీవితం ఉంటుంది. అందుకే నగరం విడిచి వచ్చేయమని చాలామంది అన్నారు. కానీ, నా అంతరాత్మ దానికి ఒప్పుకోలేదు. నన్ను నేను బాగా సంరక్షించుకుంటూ అన్నిటికీ సన్నద్ధమవ్వాలని నిర్ణయించుకున్నా. రక్షణాత్మక సూట్ దొరక్కపోయినా రెయిన్ కోట్ వేసుకొని పనిచేయాలని నిర్ణయించుకున్నా. మాస్కులు దొరక్కపోయినా చైనా నలుమూలల్లో నా స్నేహితుల్లో ఎవరో ఒకరిని అడిగితే పంపిస్తారు కదా అనుకున్నా. అలా నాకు ఏమైనా సరే హూబేలో ఉంటూ రోగులకు సేవలందించాలని నిర్ణయించుకున్నా" అని యావ్ చెప్పారు.

తాను పని చేసే ఆస్పత్రిలో ఊహించిన దానికంటే ఎక్కువ వనరులే అందుబాటులోకి వచ్చాయని, ప్రైవేటు సంస్థలు కూడా అనేక పరికరాలను విరాళంగా ఇచ్చాయని చెప్పారు.

కానీ, ఇతర ఆస్పత్రుల్లో ఇప్పటికీ మాస్కుల కొరత తీవ్రంగా ఉంది. వైద్య సిబ్బంది అందరికీ సరిపడే స్థాయిలో సంరక్షణా పరికరాలు అందుబాటులో లేవు.

కరోనా

ఫొటో సోర్స్, Reuters

"ఒకప్పటితో పోలిస్తే చాలా కఠినమైన భయంకరమైన పరిస్థితుల్లో పనిచేస్తున్నాం. ఇది చాలా బాధకర సమయం. పరిస్థితులను తలచుకుంటే గుండె బరువెక్కుతోంది. నిజానికి మా వ్యక్తిగత భద్రత గురించి ఆలోచించేంత సమయం కూడా ఉండట్లేదు. క్షణం తీరికలేకుండా పనిచేయాల్సి వస్తోంది" అన్నారు యావ్.

"ఒక పక్క ఒత్తిడికి గురవుతూనే, చాలా జాగ్రత్తగా రోగులకు చికిత్స చేయాల్సి వస్తోంది. వాళ్లు అప్పటికే చాలా భయంతో ఉంటారు. కొందరు తమ పరిస్థితి తలచుకొని కుప్పకూలిపోతుంటారు.

చాలామంది రోజుకు 10గంటలు పైనే పనిచేస్తున్నాం. పని మధ్యలో తినడానికి, టీ తాగడానికి, విరామం తీసుకోవడానికే కాదు.. కనీసం టాయిలెట్‌కు వెళ్లడానికి కూడా సమయం ఉండట్లేదు.

షిఫ్ట్ పూర్తయ్యాక సూట్లను తొలగించి చూస్తే బట్టలన్నీ చెమటతో తడిసిపోయి ఉంటున్నాయి. ముక్కు, మెడ, ముఖం చుట్టూ బిగుతుగా ఉండే మాస్కుల కారణంగా బలమైన మచ్చలు పడుతున్నాయి. కొన్నిసార్లు గాయాలు కూడా అవుతున్నాయి. షిఫ్ట్ పూర్తయ్యాక నడిచే ఓపిక కూడా లేక చాలామంది ఎక్కడపడితే అక్కడే నిద్రపోతున్నాం" అని యావ్ తమ పరిస్థితులను వివరించారు.

జాగ్రత్తలు

కానీ, అదృష్టవశాత్తూ తమ ఆస్పత్రి సిబ్బందిలో ఎవరికీ ఇప్పటిదాకా వైరస్ సోకలేదని ఆమె తెలిపారు. ప్రజలు తమను బాగా గౌరవిస్తున్నారని, కొందరు ఆహారం, ఇతర రోజువారీ వస్తువులను పంపిస్తున్నారని చెప్పారు.

"ఒక వైరస్ మా అందరి మనసులనూ దగ్గర చేసింది" అన్నారు యావ్.

చైనా ప్రభుత్వం వైరస్ విషయంలో చాలా వేగంగా చర్యలు తీసుకుందని, వేరే ఈ దేశమైనా ఇలా స్పందిస్తుందని తాను అనుకోవట్లేదని చెప్పారామె.

"పశ్చిమ దేశాల్లో స్వేచ్ఛ, మానవహక్కుల గురించి ఎక్కువగా మాట్లాడతారు. కానీ, చైనాలో మాత్రం ఇప్పుడు చర్చంతా చావు బతుకుల గురించే.

రేపటి సూర్యోదయాన్ని చూస్తామా లేదా అన్న విషయం గురించే మాట్లాడుకుంటున్నాం. కాబట్టి ప్రజలు చేయగలిగిందల్లా ప్రభుత్వానికి, వైద్య సిబ్బందికీ సహకరిస్తూ ముందుకెళ్లడమే" అన్నది ఆమె మాట.

స్పోర్ట్స్ ఉమెన్

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)