కరోనావైరస్: అందర్నీ వణికిస్తున్న వైరస్ ఎన్నో ప్రాణులను కాపాడుతోంది

కరోనావైరస్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, నవీన్ సింగ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

కరోనా వైరస్ వల్ల ఇప్పటివరకూ ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

చైనాలోని వుహాన్ నగరంలో సముద్ర జీవులను అమ్మే మార్కెట్ నుంచి ఈ వైరస్ వ్యాపించిందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

ఈ మార్కెట్లో పాములు, రకూన్, ముళ్లపంది లాంటి అడవి జంతువులను అక్రమంగా అమ్మడంపై కూడా చర్చ జరుగుతోంది.

అడ్డగీత
News image
అడ్డగీత

ఇక్కడ వన్యప్రాణులను బోనుల్లో ఉంచుతున్నారు. వాటిని తినడానికి, ఔషధాల్లో ఉపయోగించడానికి కొనుగోలు చేస్తున్నారు.

కానీ హుబే ప్రాంతంలో నిషేధం తర్వాత ఈ మార్కెట్‌ను కూడా నిషేధించారు.

చైనాలో ప్రపంచంలో అత్యధికంగా వన్యప్రాణుల క్రయవిక్రయాలు జరుగుతుంటాయి. ఈ వ్యాపారం ఇక్కడ అక్రమంగా కూడా జరుగుతుంటుంది.

కరోనావైరస్

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, చైనాలో 'డాగ్ మీట్ ఫెస్టివల్‌'కు ముందు బోనుల్లో కుక్కలు

నిషేధం విధించిన చైనా

కరోనావైరస్‌కు ప్రాథమిక కారణం గబ్బిలాలు కావచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ భావిస్తోంది.

మనుషులకు రాకముందు ఈ వైరస్ ఏదైనా వేరే జంతువులోకి చేరి ఉంటుందని, దానిని ఇంకా గుర్తించలేకపోయారని చెబుతున్నారు.

చైనాలో కొన్ని జంతువులను వాటి రుచి కోసం తింటారు. కొన్ని జంతువులను సంప్రదాయ ఔషధాల కోసం ఉపయోగిస్తారు.

చైనాలోని వివిధ ప్రాంతాల్లో 'గబ్బిలం సూప్ వడ్డించే రెస్టారెంట్లు ఎన్నో ఉన్నాయి. ఆ సూప్ కప్పుల్లో ఒక పూర్తి గబ్బిలం ఉంటుంది. పులి వృషణాలు, పునుగుపిల్లి శరీర అవయవాలు, ఇంకా చాలా జంతువులతో చాలా రకాల సూపులు చేస్తారు.

కొన్ని ఖరీదైన రెస్టారెంట్లలో కోబ్రా వేపుడు, వేయించిన ఎలుగుబంటి అరి చేతులు, పులి ఎముకలతో తయారైన మద్యం లాంటివి కనిపిస్తుంటాయి.

జంతువులను అమ్మే కొన్ని మార్కెట్లలో ఎలుకలు, పిల్లులు, పాములతోపాటు అత్యంత అరుదైన పక్షి జాతులను కూడా విక్రయిస్తుంటారు.

చైనాలో 'యెవే' (చైనా భాషలో అడవి రుచులు అని అర్థం) అనే మాట అన్ని ఇళ్లలో వినిపిస్తుంటుంది. వాటిని తినడాన్ని ఆ దేశ సంస్కృతి ప్రకారం సాహసంగా, పరిశోధనాత్మక ప్రవృత్తిగా, ఒక ప్రత్యేక హక్కుగా చూస్తారని జంతువుల వ్యాపారంపై పరిశోధనలు చేసే ఒక అంతర్జాతీయ సంస్థలోని పరిశోధకుడు చెప్పారు.

జంతువుల అవయవాలతో తయారైన సంప్రదాయ ఔషధాలకు నపుంసకత్వం, ఆర్థరైటిస్ లాంటి వ్యాధులను దూరం చేసే సామర్థ్యం ఉంటుందని భావిస్తారు.

కరోనావైరస్

ఫొటో సోర్స్, LIU JIN

ఫొటో క్యాప్షన్, చైనా మార్కెట్లో నెమళ్ల విక్రయం

అంతరించిపోయే ప్రమాదం

చైనాలో పంగోలిన్ కవచానికి కూడా చాలా డిమాండ్ ఉండడంతో, అక్కడ ఈ జీవి దాదాపు అంతరించే స్థితికి చేరుకుంది. ప్రపంచంలోని మిగతా దేశాల్లో కూడా అత్యధికంగా వేటాడే జంతువు ఇదే.

చైనాలో తయారయ్యే ఔషధాల్లో ఖడ్గమృగం కొమ్మును ఎక్కువగా ఉపయోగిస్తారు. దాంతో, ఖడ్గమృగం కూడా ఇప్పుడు అంతరించిపోయే ప్రమాదం ఉన్న జంతువుగా మారింది.

70 శాతం కొత్త వైరస్‌లు జంతువుల వల్ల, ముఖ్యంగా వన్యప్రాణుల వల్ల వస్తున్నాయని తెలిసి కూడా చైనీయులు వీటిని ఉపయోగిస్తూనే ఉన్నారు.

చైనాలో విచక్షణారహితంగా జరుగుతున్న వన్యప్రాణుల వ్యాపారాన్ని కరోనావైరస్ మరోసారి బట్టబయలు చేసింది.

వన్యప్రాణుల సంరక్షణ సంస్థలు దీనిని తీవ్రంగా విమర్శిస్తున్నాయి. చైనాలో ఈ వ్యాపారం వల్ల ఎన్నో జంతు జాతులు అంతరించిపోయే స్థితికి చేరుకున్నాయని ఆరోపిస్తున్నాయి.

కరోనావైరస్ వ్యాపించిన తర్వాత, దానిని అడ్డుకునేందుకు చైనా ప్రభుత్వం వన్యప్రాణుల వ్యాపారంపై తక్షణ నిషేధం విధించింది. కానీ వన్యప్రాణుల సంరక్షణ సంస్థలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఆ వ్యాపారాన్ని పూర్తిగా అడ్డుకునే ప్రయత్నంలో ఉన్నాయి.

కరోనావైరస్

ఫొటో సోర్స్, SOUTH CHINA MORNING POST

ఫొటో క్యాప్షన్, చైనాలో మార్కెట్‌లో వన్యప్రాణుల అమ్మకాలు

వన్యప్రాణి సంరక్షణ సంస్థల మాట చైనా వింటుందా?

కరోనావైరస్ వ్యాపించిన చైనాలో వన్యప్రాణుల అక్రమ వ్యాపారాన్ని అడ్డుకోవాలనుకుంటున్న ప్రపంచ సంస్థల ప్రయత్నాలకు అండ లభిస్తుందా? వాటి నుంచి ప్రజారోగ్యానికి వస్తున్న ముప్పును అడ్డుకోగలరా?

అది చాలా సవాలుతో కూడినదని నిపుణులు చెబుతున్నారు. అలా జరగడం దాదాపు అసాధ్యం అంటున్నారు.

ప్రమాదకరమైన సార్స్, మర్స్ వైరస్‌లు కూడా గబ్బిలాల నుంచి వచ్చినవేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది.

కానీ అవి కూడా మనుషులకు వ్యాపించే ముందు పునుగు పిల్లి, ఒంటెలకు సోకాయి.

"మనకు అసలు ఎలాంటి సంబంధం లేని జంతువులకు దగ్గరగా, వాటి నివాస ప్రాంతాల్లోకి మనం వెళ్తున్నాం. అందుకే మనకు ఇంతకు ముందెప్పుడూ తెలీని, కొత్త వ్యాధులను కూడా చూడాల్సి వస్తోంది. మనకు తెలిసిన వైరస్, బాక్టీరియా, పరాన్నజీవుల్లో కూడా ఇలాంటి వ్యాధులు కనిపించలేదు" అని డబ్ల్యుహెచ్ఓ న్యూట్రిషన్ అండ్ ఫుడ్ సేఫ్టీ విభాగం డాక్టర్ బెన్ ఇమబారెక్ బీబీసీతో అన్నారు.

ఇటీవల జరిగిన ఒక అధ్యయనంలో "భూమిపై ఉన్న మొత్తం 32 వేల సకశేరుకాల జాతుల్లో 20 శాతం ప్రాణులను అంతర్జాతీయ మార్కెట్లో చట్టబద్ధంగా, అక్రమంగా అమ్ముతున్నారు" ని చెప్పారు.

వీటితోపాటు క్షీరదాలు, పక్షులు, సరీసృపాలు, ఉభయచరాల్లో 5,500కు పైగా జాతుల క్రయవిక్రయాలు కూడా కొనసాగుతున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా చట్టవిరుద్ధంగా సాగే వన్యప్రాణుల వ్యాపారం విలువ 20 బిలియన్ల డాలర్లు. మాదక ద్రవ్యాలు, మానవ అక్రమ రవాణా, నకిలీ వస్తువుల తర్వాత ఇది నాలుగో స్థానంలో ఉంది.

కరోనావైరస్

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, హాంకాంగ్ మార్కెట్‌లో షార్క్ ఫిన్ అమ్మకాలు

ఇది ప్రమాద ఘంటికా?

అంతరించిపోయే జంతువులను పెంచుకోవడం, వాటి అవయవాలను తినడానికి, ఔషదాలకు ఉపయోగించడం లాంటి వాటిన అడ్డుకోడానికి ఈ ఆరోగ్య సంక్షోభాన్ని ఒక ప్రమాద ఘంటికలా తీసుకోవాల్సి ఉంటుంది.

అయితే, వన్యప్రాణుల క్రయవిక్రయాలపై విధించిన ఈ నిషేధం తాత్కాలికమే అని చైనా ప్రభుత్వం స్పష్ట చేసింది.

"జాతీయ విపత్తు స్థితి ముగిసేవరకూ అన్నిరకాల జాతుల వన్యప్రాణులను పెంచుకోడం, ఒక చోటు నుంచి మరో చోటుకు తరలించడం, క్రయవిక్రయాలపై నిషేధం కొనసాగుతుంది" అని చైనాలోని మూడు ప్రభుత్వ సంస్థలు తమ సంయుక్త ప్రకటనలో చెప్పాయి.

2002లో సార్స్ వైరస్ వ్యాపించినపుడు కూడా చైనా ఇలాంటి నిషేధం విధించింది.

కానీ, ఈ నిషేధం తర్వాత కొన్ని నెలలకే చైనాలో వన్యప్రాణుల వ్యాపారం మళ్లీ కొనసాగిందని వన్యప్రాణి సంరక్షకులు చెబుతున్నారు.

కరోనావైరస్

ఫొటో సోర్స్, BEN DAVIES

ప్రపంచమంతా నిషేధించాలి

2020 సెప్టెంబర్ నెలలో చైనాలో జీవవైవిధ్య సదస్సు పేరుతో ఒక ప్రపంచస్థాయి సమావేశం జరగబోతోంది. ఇందులో సహజ, జీవ వనరులపై చర్చించనున్నారు.

గత ఏడాది జారీ చేసిన ఒక ప్రభుత్వ అంతర్గత నివేదిక ప్రకారం మానవ చరిత్రలో మొదటిసారి పది లక్షల ప్రజాతులు అంతరించిపోయే ప్రమాదంలో పడ్డాయి.

కరోనా వైరస్ వ్యాపించిన తర్వాత చైనా ప్రభుత్వ మీడియాలో ముద్రించిన ఒక ఎడిటోరియల్‌లో జంతువులు, వాటి అవయవాలపై జరుగుతున్న అదుపులేని వ్యాపారాన్ని ఖండిస్తున్నట్లు కనిపించింది.

"వీళ్లు దీనిని ఒక అవకాశంలా చూస్తున్నారు. అందుకే వన్యప్రాణుల పెంపకం, వాటి పునరుత్పత్తి, మాంసం కోసం, ఔషధ గుణాల కోసం జంతువులను పెంచుకోవడం లాంటివి పూర్తిగా నిషేధించాలి" అని చైనాలో వన్యప్రాణుల వ్యాపారంపై పరిశోధనలు చేసిన ఎన్విరాన్‌మెంట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ పరిశోధకుడు డెబీ బాక్స్ చెప్పారు.

ఏవిఎన్ ఇన్‌ఫ్లుయెంజా, బర్డ్ ఫ్లూ వల్ల అడవుల్లో ఎన్నో పక్షి ప్రజాతుల సంరక్షణకు మద్దతు లభించిందని నిపుణులు భావిస్తున్నారు.

ఏనుగులు అంతరించిపోకుండా అంతర్జాతీయ ఒత్తిళ్లు ఉండడంతో చైనా కూడా ఏనుగుల దంతాలపై నిషేధం విధించడాన్ని వీరు ఒక విజయంలాచూస్తున్నారు.

వన్యప్రాణులు, వాటి శరీర అవయవాలకు చైనా అతిపెద్ద మార్కెట్. అలాంటప్పుడు వారు వాటిపై నిషేధం విధించి ఈ మిషన్‌ను ముందుకు తీసుకు వెళ్లవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

కానీ, వన్యప్రాణులకు సంబంధించిన ఉత్పత్తులపై నియంత్రణ, పరిమితులు కేవలం చైనాలోనే కాకుండా ప్రపంచమంతా విధించాల్సిన అవసరం ఉందని వారు చెబుతున్నారు.

స్పోర్ట్స్ ఉమెన్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)