కరోనావైరస్ నాకు సోకలేదు.. నన్ను భారత్‌కు తీసుకెళ్లండి: చైనాలో చిక్కుకుపోయిన కర్నూలు యువతి

ఫొటో సోర్స్, Giri
- రచయిత, హృదయ విహారి బండి
- హోదా, బీబీసీ కోసం
''మాకు కరోనావైరస్ సోకిందనిగాని, లేదనిగాని చైనా వాళ్లు కచ్చితంగా చెప్పడంలేదు. మాకు ఎలాంటి అనారోగ్య లక్షణాలు లేవు. అలసట, భయం, ఒత్తిడి వల్ల శరీర ఉష్ణోగ్రత కాస్త పెరిగిందంతే. ఎలాంటి వైద్య పరీక్షలకైనా మేం సిద్ధం. మమ్మల్ని తిరిగి భారత్‌కు చేర్చాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం'' అంటూ చైనాలో చిక్కుకుపోయిన కర్నూలు జిల్లా యువతి జ్యోతి ఒక వీడియోలో చెప్పారు.
ఆమె స్వస్థలం కర్నూలు జిల్లా కోయిలకుంట్ల మండలం బిజినవేముల గ్రామం.
జ్యోతి సెల్ఫీ వీడియో నేపథ్యంలో బీబీసీ తెలుగు ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడింది.


శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో 2019లో జ్యోతి బీటెక్ పూర్తిచేశారు. 2019 ఏప్రిల్‌లో ప్రాంగణ నియామకాల్లో టీసీఎల్‌లో ఉద్యోగం సంపాదించారు.
2019 ఆగస్టు చివరి వారంలో శిక్షణ నిమిత్తం జ్యోతిని, కొందరు భారత ఉద్యోగులను ఆ సంస్థ చైనాలోని వుహాన్ నగరానికి తీసుకెళ్లినట్లు జ్యోతి తల్లి ప్రమీలా దేవి బీబీసీకి తెలిపారు.
''ఉద్యోగమొచ్చిందని ఆనందపడినాం. చైనాలో మూడు నెలలు ట్రైనింగ్ అన్నారు. తర్వాత ఆరు నెలలు అన్నారు. చైనా వెళ్లక ముందే జ్యోతికి మేనమామ కొడుకు అమర్‌నాథ్ రెడ్డితో పెళ్లి కుదిరింది. నిశ్చితార్థం కూడా అయ్యింది. మార్చిలో పెళ్లి జరగాల్సి ఉంది. ట్రైనింగ్ పూర్తయి ఈ నెల మొదటి వారంలో నా కూతురు ఇండియాకు రావలసి ఉంది. ఇలా అక్కడే చిక్కుకుపోతుందని అనుకోలేదు" అని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు.
కొత్త దేశం, కొత్త వాతావరణం
''కొత్త దేశం, కొత్త వాతావరణం. అక్కడి వంటలు ఒంటికి పడలేదు. ఒకపక్క తిండి సరిగా లేదు, ఇంకోపక్క ట్రైనింగ్. అలసటతో పాపకు కొంచెం సుస్తీ చేసింది. అంతేకానీ తనకు వైరస్ లక్షణాలు లేవు. అనవసరంగా జ్యోతిని అక్కడే ఆపేసినారు'' అని ప్రమీల చెప్పారు.
వుహాన్‌కు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక విమానం పంపుతోందని తెలిసి చాలా ఆనందపడ్డామని, కానీ ఇలా జరుగుతుందనుకోలేదని అమర్‌నాథ్ రెడ్డి బీబీసీతో చెప్పారు.

ఫొటో సోర్స్, Giri
''తిండి సరిగాలేదు. పని ఒత్తిడి కారణంగా తను కొంచెం అలసిపోయింది. విమానాశ్రయంలో జ్యోతిని రెండుసార్లు పరీక్షించారంట. అంతమందిలో ఈ అమ్మాయిని ప్రత్యేకంగా రెండుసార్లు పరీక్షించడంతో మరింత భయపడిపోయింది. అట్ల పరీక్ష చేసి, శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉందని చెప్పి, విమానంలోకి పంపలేదు. ఒళ్లు వేడిగా ఉందన్నారు గానీ, కరోనావైరస్ సోకిందని ఎక్కడా చెప్పలేదు'' అని అమర్ వివరించారు.
జ్యోతి ఎప్పటికప్పుడు తమతో ఫోన్‌లో మాట్లాడుతోందని ఆమె తల్లి తెలిపారు.
జ్యోతితోపాటు మరొక భారతీయుడిని కూడా విమానం ఎక్కడానికి అధికారులు అనుమతించకపోవడంతో వారి కంపెనీ ఏర్పాటుచేసిన వసతి భవనాలకు ఇద్దరూ తిరిగి వెళ్లారు.
మహిళలకు, పురుషులకు వేర్వేరుగా వసతి ఏర్పాట్లు చేశారు.

ఫొటో సోర్స్, Giri
వుహాన్ తాళాలేసిన నగరమని, వసతి భవనంలో జ్యోతి ఒంటరిగా ఉంటోందని, క్యాంటీన్‌లో దొరికింది తిని ప్రాణాలు కాపాడుకుంటోందని అమర్ బీబీసీతో చెప్పారు.
ఆమెకు కనీసం తలనొప్పి వచ్చినా, చెప్పుకోవడానికి ఎవ్వరూ లేరని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు.
''జ్యోతి ఉన్న ప్రాంతం చాలా సున్నితమైన ప్రాంతం. పైగా ఇన్ఫెక్టెడ్ ఏరియా. అలాంటి ప్రాంతంలో ఉండటం చాలా ప్రమాదకరం. అక్కడే ఉంటే ఆరోగ్యంగా ఉన్న జ్యోతి పరిస్థితి ఏమవుతుంది? శరీర ఉష్ణోగ్రత పెరిగిందని విమానంలోకి పంపలేదు. అలాంటపుడు తనకు అక్కడే, రక్తపరీక్షలు చేయాలి కదా. లేకపోతే, ఆమె ఉంటున్న భవనంలోకి వైద్యులను పంపి కనీసం అక్కడైనా పరీక్షలు చేయొచ్చు. కానీ ఇప్పటివరకూ ఎలాంటి పరీక్షలూ చేయలేదు. దానర్థం ఏమిటి? ఇక జ్యోతి అక్కడే ఉండాల్నా" అని అమర్ ప్రశ్నించారు.
"ఏదైనా జరిగితే కనీసం తనను మేం చూడలేం కదా'' అని ఆయన ఉద్వేగంగా స్పందించారు.

ఫొటో సోర్స్, Giri
జ్యోతి తండ్రి 2015లో గుండెపోటుతో చనిపోయారు. ఆయన కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం(సీఐఎస్‌ఎఫ్)లో కానిస్టేబుల్‌గా పనిచేసేవారు.
జ్యోతిని సత్వరం సురక్షితంగా దేశానికి రప్పించాలంటూ ఆమె కుటుంబ సభ్యులు పాణ్యం వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డిని, కర్నూలు కలెక్టర్ వీరపాండ్యన్‌తోపాటు ఇతర అధికారులను కలిశారు.
అవకాశం ఇస్తే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని కలిసి తమ ఆందోళనను ఆయనకు వివరిస్తామని వారు బీబీసీతో చెప్పారు.

ఇవి కూడా చదవండి:
- అమెరికా సాయం చేయాల్సిందిపోయి భయాన్ని పెంచుతోంది: చైనా
- BBC Indian Sportswoman of the Year-2019: అవార్డ్ నామినీలు వీరే
- దక్షిణాఫ్రికాకు మూడు రాజధానులు ఎందుకున్నాయి?
- 2022లోగా రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న నిర్మల.. ఇది సాధ్యమేనా?
- సొమాలియాలో అత్యవసర పరిస్థితి ప్రకటించిన ప్రభుత్వం.. మిడతల దండయాత్రే కారణం
- ‘వీళ్లు అధికారంలో లేకపోతే ప్రపంచం మెరుగ్గా ఉండేది’.. ట్రంప్, జిన్‌పింగ్ పాలనపై జార్జ్ సోరస్ విమర్శలు
- బడ్జెట్ 2020: కొత్త ఆదాయపన్ను శ్లాబులు.. నిజంగానే పన్ను ఆదా చేస్తాయా
- ఎక్కడ ఉంటే ఎక్కువ ఆరోగ్యం? పల్లెల్లోనా, పట్టణాల్లోనా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










