బడ్జెట్ 2020: కొత్త ఆదాయపన్ను శ్లాబులు.. నిజంగానే పన్ను ఆదా చేస్తాయా

నిర్మలా సీతారామన్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, నిధి రాయ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రిగా తన రెండో బడ్జెట్ ప్రవేశపెడుతూ... ప్రస్తుతం ఉన్న 100 మినహాయింపుల్లో 70 మినహాయింపులను పన్ను చెల్లింపుదారులు వదులుకుంటే కొత్త ఆదాయపన్న శ్లాబుల ప్రకారం పన్ను చెల్లించవచ్చని అన్నారు.

కొత్త శ్లాబుల ప్రకారం చూస్తే... సంవత్సరానికి రూ.5 లక్షల నుంచి రూ.7.5 లక్షల మధ్య ఆదాయం ఉన్నవారు పదిశాతం పన్ను చెల్లించాలి. ప్రస్తుతం ఇది 20శాతంగా ఉంది. రూ.7.5 లక్షల నుంచి రూ.10 లక్షల మధ్య ఆదాయం ఉన్నవారు ప్రస్తుతం ఉన్న 20 శాతానికి బదులు 15శాతం పన్ను చెల్లిస్తే సరిపోతుంది. రూ.10 లక్షల నుంచి రూ.12.5 లక్షల మధ్య ఉన్నవారు ప్రస్తుత విధానం ప్రకారం 30శాతం పన్ను చెల్లించాల్సి ఉండగా, కొత్త శ్లాబుల ప్రకారం 20శాతం చెల్లించాలి. రూ.15 లక్షల కన్నా ఎక్కువ ఆదాయం ఉన్నవారి పన్ను శ్లాబు 30శాతంలో ఎలాంటి మార్పూ లేదు.

కేంద్ర బడ్జెట్

ఫొటో సోర్స్, Getty Images

రూ.5 లక్షల లోపు ఆదాయం ఉన్నవారికి టాక్స్ శ్లాబుల్లో ఎలాంటి మార్పూ లేదు. అంటే వారు ఎలాంటి పన్నూ చెల్లించనవసరం లేదు.

టాక్స్ విధానాన్ని సామాన్యులకు సైతం అర్థమయ్యేలా సులభతరం చేసేందుకే ఈ మార్పులు తీసుకొస్తున్నామని, దీనివల్ల ఐటీ రిటర్నులు దాఖలు చేసే సమయంలో నిపుణుల సహాయం అవసరం లేకుండానే పూర్తిచేయవచ్చని తన బడ్జెట్ ప్రసంగ సమయంలో నిర్మల తెలిపారు.

రెండున్నర గంటల సుదీర్ఘ సమయం పాటు సాగిన బడ్జెట్ ప్రసంగంలో టాక్స్ అనే పదాన్ని నిర్మల 132 సార్లు పలికారు.

Presentational grey line
News image
Presentational grey line

కొత్త పన్ను విధానం కేవలం ఐచ్ఛికం. అంటే పన్ను చెల్లింపుదారులు తమ ఇష్టానుసారం మినహాయింపులు తీసుకుంటూ పాత విధానంలో ఉండొచ్చు లేదంటే మినహాయింపులు వదులుకుని తక్కువు పన్ను శ్లాబులున్న కొత్త విధానానికి మారవచ్చు.

ఈ రెండు శ్లాబులను పోల్చి చూస్తే దీర్ఘ కాలంలో పాత పన్నువిధానమే ఉపయోగకరంగా ఉంటుందని ఐటీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కొత్త విధానం చాలా సంక్లిష్టంగా ఉందని, దీనివల్ల ప్రజల చేతిలో ఎలాంటి సొమ్మూ ఉండే అవకాశం లేదని వారంటున్నారు.

కొత్త పన్ను విధానం యువత భవిష్యత్ కోసం డబ్బును పొదుపు చేసేందుకు ప్రోత్సహించేలా లేదు అని ఎంకే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీస్ మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణకుమార్ కార్వా తెలిపారు.

సామాజిక భద్రత తక్కువగా ఉన్న యువత ఎక్కువగా ఉన్న భారత్ లాంటి దేశంలో వారు సాధ్యమైనంత డబ్బు పొదుపు చేసేటట్లు ప్రోత్సహించేలా, సొంత ఇల్లు నిర్మించుకునేందుకు ఉపకరించేలా విధానాలు ఉండాలి అని ఆయన అన్నారు.

"ఈ డిడక్షన్లను ఉపయోగించుకోవాలనుకునేవారు తాము ఎక్కువ పన్ను కట్టాల్సి ఉంటుందని అర్థం చేసుకుంటారు. అందువల్ల కొత్త శ్లాబులను వాళ్లు ఎంచుకునే అవకాశం లేదు" అని మనీఎడ్యుస్కూల్ ఫౌండర్, టాక్స్ నిపుణుడు అర్ణవ్ పాండ్యా అభిప్రాయపడ్డారు.

ఉదాహరణకు, మీ ఆదాయం రూ.8 లక్షలనుకుంటే, పాత విధానంలో మినహాయింపులన్నీ ఉపయోగించుకుంటే మీరు రూ.39000 పన్ను చెల్సించాల్సి ఉంటుంది. ఒకవేళ కొత్త విధానానికి మారితే రూ.46000 టాక్స్ చెల్లించాల్సి వస్తుంది. అంటే రూ.7000 అదనంగా చెల్లించాలి.

మీ ఆదాయం రూ.15 లక్షలైతే, అప్పుడు పాత విధానం ప్రకారం రూ.1,56,000 పన్ను చెల్లించాలి. కొత్త విధానం ప్రకారం చూస్తే, రూ.1,95,000 పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అంటే కొత్త విధానంలో రూ.39000 అదనంగా పన్ను కట్టాల్సి ఉంటుంది.

బడ్జెట్ ప్రసంగాన్ని టీవీలో చూస్తున్న ప్రజలు

ఫొటో సోర్స్, Getty Images

కొత్త విధానానికి రావాలంటే వదులుకోవాల్సిన మినహాయింపులు

  • సెక్షన్ 80సీ - పీఎఫ్, ఎన్‌పీఎస్-నేషనల్ పెన్షన్ సిస్టమ్, జీవిత బీమా ప్రీమియం
  • సెక్షన్ 80డీ - వైద్య బీమా ప్రీమియం, ఇంటి అద్దె అలవెన్సు, గృహరుణంపై చెల్లించే వడ్డీ
  • సెక్షన్ 80ఈ - విద్యారుణంపై చెల్లించే వడ్డీ
  • లీవ్ ట్రావెల్ అలవెన్స్ (ఇది ఉద్యోగస్తులకు నాలుగేళ్ల కాలానికి రెండుసార్లు లభిస్తుంది)
  • సెక్షన్ 80జీ - స్వచ్ఛంద సంస్థలకు ఇచ్చే డొనేషన్లు
  • వైకల్యం ఉన్నవారి వైద్య ఖర్చులు
  • ఉద్యోగస్తులకు ప్రస్తుతమున్న రూ.50000 స్టాండర్డ్ డిడక్షన్
  • సెక్షన్ 16లో పేర్కొన్న ఎంటర్‌టైన్మెంట్ అలవెన్స్, ఎంప్లాయ్‌మెంట్ లేదా ప్రొఫెషనల్ టాక్స్ డిడక్షన్
  • కుటుంబ పెన్షన్ కింద వచ్చే రూ.15000 డిడక్షన్
ప్రజలు

ఫొటో సోర్స్, Getty Images

అందువల్ల, కొత్త శ్లాబుల విధానం నిజంగానే ఎక్కువ మంది పన్నుదారులకు లాభదాయకంగా ఉంటుందా అనేది అస్పష్టమే. పైగా కొన్ని ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. ప్రస్తుతం అమల్లో ఉన్న పన్ను విధానం కొన్ని పొదుపు, మదుపు పథకాల్లో పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహిస్తుంది. ప్రావిడెంట్ ఫండ్, వైద్య బీమా, పెన్షన్ పథకాలలో మదుపు చేస్తే పన్ను మినహాయింపులు ఉంటాయి. కానీ కొత్త విధానంలో అలాంటి అవకాశం లేదు.

కానీ, సెక్షన్ 80సీసీడీ సబ్ సెక్షన్ (2) (ఎన్‌పీఎస్), సెక్షన్ 80జేజేఏఏ (కొత్త ఎంప్లాయిమెంట్) ప్రకారం వచ్చే డిడక్షన్లను పొందవచ్చు.

"కొత్త ఐటీ శ్లాబులు చూస్తే అన్ని రకాల మినహాయింపులు, తగ్గింపులను తొలగించడానికి రూపొందించిన విధానంలా ఉంది. పన్ను చెల్లించడం ద్వారా తమకొచ్చే ప్రయోజనాలను పూర్తిగా పొందాలనుకునే చెల్లింపుదారులకు ఈ విధానం ఇబ్బందిగానే ఉంటుంది. వాళ్లు ప్రస్తుతం ఉన్న పాత విధానంలోనే కొనసాగే అవకాశం ఉంటుంది. అయితే, కొత్త పన్ను విధానం పన్ను చెల్లింపుదారులకు సులభంగా ఉంటుంది. కానీ, పాత విధానంలోనే వారికి ప్రయోజనాలు గరిష్టంగా ఉంటాయి. మరో లోపం ఏంటంటే, ప్రభుత్వం కొత్త డిడక్షన్ల గురించి ఆలోచించి ఉండాల్సింది. పాతవిధానంలో అనవసరమైనవి చాలా ఉన్నాయి" అని క్లియర్ టాక్స్ సంస్థ ఫౌండర్, సీఈవో అర్చిత్ గుప్తా అన్నారు.

అనురాగ్ ఠాకూర్, నిర్మలా సీతారామన్

ఫొటో సోర్స్, Getty Images

80సీ ద్వారా చేసే పొదుపును పన్ను చెల్లింపుదారుల ఇష్టానికే వదిలేయడం వల్ల వారు పీపీఎప్, ఈపీఎఫ్ వంటి పథకాల్లో పెట్టుబడులకు ఆసక్తి చూపకపోవచ్చు. ఇది దీర్ఘకాలంలో ఆర్థిక వ్యవస్థకు నష్టం కలిగే అవకాశముంది.

పీపీఎఫ్‌పై పన్ను లేని వడ్డీని చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదని, పన్ను చెల్లింపు దారులందరినీ నేషనల్ పెన్షన్ స్కీమ్ వైపు మళ్లించాలనే యోచనతో ఉన్నట్లు స్పష్టమైన సంకేతాల్ని ఇది ఇస్తోంది.

ఫిబ్రవరి 1 శనివారం అయినప్పటికీ స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ జరిగింది. కానీ ఆర్థిక మంత్రి ప్రసంగం ప్రారంభమయ్యాక మార్కెట్ ఒడిదుడుకులకు లోనైంది. బీఎస్ఈ 2.43శాతం పతనమైంది. అంటే మార్కెట్లకు ఈ బడ్జెట్ రుచించలేదు.

ఎంతో ఆశగా ఎదురుచూసిన బడ్జెట్ నిరాశపరిచింది. ఇప్పుడు ప్రభుత్వం ప్రత్యామ్నాయాలను అన్వేషించాల్సి ఉంది.

స్టాక్ మార్కెట్లు

ఫొటో సోర్స్, Getty Images

డిపాజిటర్స్ ఇన్సూరెన్స్ పెంపు

బ్యాంకు డిపాజిటర్లకు ఇచ్చే డిపాజిట్ ఇన్సూరెన్స్‌నూ రూ.5 లక్షలకు పెంచారు.

పీఎంసీ బ్యాంక్ సంక్షోభం వెలుగు చూసిన తర్వాత తమ డిపాజిట్లపై ఖాతాదారుల్లో ఆందోళనలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఉన్న బీమా రూ.లక్ష చాలా చిన్న మొత్తమని నిపుణులు కూడా అభిప్రాయపడ్డారు.

అంటే, ఓ ఖాతాదారుడు తన బ్యాంక్ అకౌంట్లో రూ.95000 దాచుకుంటే, ఆ మొత్తాన్ని అతడు తిరిగి పొందవచ్చు. కానీ రూ.25 లక్షలు దాచుకున్న ఖాతాదారుడు బ్యాంకు సంక్షోభంలో పడితే ప్రస్తుతం పొందగలిగే మొత్తం గరిష్టంగా రూ.లక్ష మాత్రమే.

బ్యాంకుల్లో దాచిపెట్టుకున్ తమ సొమ్ము గురించి సాధారణ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆర్థిక మంత్రి నిర్మల తన బడ్జెట్ ప్రసంగంలో మరోసారి స్పష్టం చేశారు.

స్పోర్ట్స్ ఉమెన్

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)