బడ్జెట్ 2020-21: 2022లోగా రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. ఈ లక్ష్యం సాకారమయ్యేనా?

నిర్మల

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

దేశంలో 2022లోగా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలనే లక్ష్యానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు.

"2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి ప్రయత్నిస్తాం" అని 2016లో ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ఆయన ఈ వ్యాఖ్య చేసిన మరుసటి రోజు బడ్జెట్ సమావేశాల్లో అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడుతూ.. రానున్న ఐదేళ్లలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామనే హామీకి కట్టుబడి ఉన్నట్లు చెప్పారు.

ప్రస్తుత ఆర్థిక మంత్రి నిర్మల కూడా శనివారం బడ్జెట్ సమర్పణలో వ్యవసాయం గురించి మాట్లాడేటప్పుడు ప్రారంభంలోనే ఈ మాట అన్నారు.

అడ్డగీత
News image
అడ్డగీత

2020-21 బడ్జెట్‌లో వ్యవసాయం, సాగునీరు, సంబంధిత కార్యకలాపాలకు లక్షా 60 వేల కోట్ల రూపాయలు, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌లకు లక్షా 23 వేల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు మంత్రి చెప్పారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రుణ వితరణ లక్ష్యాన్ని 15 లక్షల కోట్ల రూపాయలుగా పెట్టుకున్నట్లు తెలిపారు.

వ్యవసాయంలో పోటీతత్వాన్ని పెంచడం ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచవచ్చని నిర్మల చెప్పారు. ఇందుకోసం వ్యవసాయ మార్కెట్లను సరళీకృతం చేయాల్సి ఉందన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు, లాజిస్టిక్స్, వ్యవసాయ సర్వీసుల విషయంలో పెద్దయెత్తున పెట్టుబడులు అవసరమని తెలిపారు.

మరి 2022లోగా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం సాధ్యమేనా? ఈ దిశగా ప్రభుత్వ చర్యలు ఉన్నాయా?

జనవరిలో బెంగళూరులో సైన్స్ కాంగ్రెస్‌లో భాగంగా తొలిసారిగా రైతు సైన్స్ కాంగ్రెస్ నిర్వహిస్తున్న నేపథ్యంలో వ్యవసాయ రంగ నిపుణుడు డాక్టర్ కె.పూర్ణచంద్రరావు బీబీసీతో పంచుకున్న విషయాలను ఈ సందర్భంలో చెప్పుకోవచ్చు.

'రైతుల ఆదాయం రెట్టింపు' అనే మాటను ప్రభుత్వమే అపహాస్యం చేసిందని ఇక్రిశాట్‌, భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్)లలో ప్రిన్సిపల్ సైంటిస్ట్‌గా సేవలందించిన పూర్ణచంద్రరావు చెప్పారు.

'35 ఏళ్లు పడుతుంది'

రైతుల ఆదాయాన్ని రెండింతలు చేస్తామని చాన్నాళ్లుగా చెబుతున్నారని, అది సాకారమయ్యే పరిస్థితులు లేవని, ఈ దిశగా చర్యలే లేవని ఆయన చెప్పారు. వారి ఆదాయంలో వార్షిక పెరుగుదల రెండు శాతం కూడా లేదని, ఈ నామమాత్రపు పెరుగుదలతో ఆదాయం రెండింతలు కావాలంటే 35 ఏళ్లు పడుతుందని అంచనా వేశారు.

రైతు

ఫొటో సోర్స్, Getty Images

పెరగాలంటే ఏం చేయాలి?

రైతుల ఆదాయం గణనీయంగా పెరగాలంటే వ్యవసాయ ఖర్చులు తగ్గాలని, ఉత్పాదకత పెరగాలని, గిట్టుబాటు ధరలు ఉండాలని, ఇందుకు ప్రభుత్వం నిర్దిష్టమైన చర్యలు చేపట్టాలని పూర్ణచంద్రరావు చెప్పారు.

కనీస మద్దతుధరలను పేరుకు ప్రకటిస్తున్నా పూర్తిస్థాయిలో అమలు చేయడం లేదని, ఫలితంగా పప్పు ధాన్యాలు లాంటి పంటలు పండించే రైతులకు ప్రయోజనం దక్కడం లేదని ఆయనన్నారు. ప్రభుత్వ విధానాల్లో వ్యవసాయానికి ప్రాధాన్యం ఇవ్వడం లేదని, వ్యవసాయమంటే చిన్నచూపు ఉందని, దేశంలో ఆహార ధాన్యాల కొరత లేనంత కాలం వ్యవసాయ సంక్షోభం గురించి పాలకులు పట్టించుకోరని విచారం వ్యక్తంచేశారు.

పరిశోధనలకు ప్రాధాన్యమేదీ?

వ్యవసాయ రంగ పరిశోధనలపైనా ప్రభుత్వాలకు ఏ మాత్రం శ్రద్ధ లేదని పూర్ణచంద్రరావు విమర్శించారు. వ్యవసాయ స్థూల దేశీయోత్పత్తి (వ్యవసాయ జీడీపీ)లో కనీసం రెండు శాతం ఈ రంగంలో పరిశోధనల కోసం వెచ్చించాలని చాలా కాలంగా ప్రభుత్వం చెబుతోందని, ఆచరణకు వచ్చేసరికి కేటాయింపులు 0.6 శాతం దాటడం లేదని చెప్పారు.

దేశ జీడీపీలో కనీసం రెండు శాతం నిధులను అన్ని రంగాల్లో పరిశోధనలు-అభివృద్ధి (ఆర్ అండ్ డీ)కి కేటాయించాలని ప్రభుత్వం చెబుతూ వస్తోందని, కానీ కేటాయింపులు ఒక్క శాతంలోపే ఉంటున్నాయని ఆయన తెలిపారు. అమెరికా, ఐరోపాలోని అభివృద్ధి చెందిన దేశాల్లో పరిశోధనలకు జీడీపీలో రెండు నుంచి ఐదు శాతం వరకు నిధులను కేటాయిస్తున్నారని ప్రస్తావించారు.

2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి ప్రయత్నిస్తామని 2016లో ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు.

ఫొటో సోర్స్, FB/narendramodi

ఫొటో క్యాప్షన్, 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి ప్రయత్నిస్తామని 2016లో ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు.

ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా

రైతుల ఆదాయం ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉంది.

రైతులకు తక్కువ ఆదాయం ఉన్న బిహార్, ఝార్ఖండ్, ఒడిశా లాంటి రాష్ట్రాలతో పోలిస్తే ఎక్కువ ఆదాయమున్న కేరళ, పంజాబ్, హరియాణా లాంటి రాష్ట్రాల్లో వారి ఆదాయాన్ని పెంచడం అంత సులువు కాదని కేంద్ర వ్యవసాయశాఖ మాజీ కార్యదర్శి సిరాజ్ హుసేన్ గతంలో బీబీసీకి రాసిన వ్యాసంలో చెప్పారు. కనీసం పేద రాష్ట్రాల్లో రైతుల ఆదాయన్ని పెంచగలిగినా ఈ లక్ష్యం కొంత వరకు నెరవేరినట్లేనని అభిప్రాయపడ్డారు.

వ్యవసాయంతో పాటు ఇతర రంగాలు కూడా అభివృద్ధి చెందితేనే వ్యవసాయంపై ఆధారపడ్డవారు తమ ఆదాయాన్ని పెంచుకునే అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ, హార్టికల్చర్, మత్స్య పరిశ్రమ తదితర రంగాల వైపు వెళ్లడం ద్వారా రైతులు ఆదాయాన్ని మెరుగుపరచుకోవచ్చని చెప్పారు.

రైతు

రైతులకు అండగా ఉంటాం: మంత్రి నిర్మల

పశుపోషణ, తేనెటీగల పెంపకం, చేపల పెంపకం లాంటి వ్యవసాయ సంబంధ కార్యకలాపాల్లో రైతులకు ప్రభుత్వం అండగా ఉండాల్సిన అవసరముందని మంత్రి నిర్మల 2020-21 బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. వ్యవసాయోత్పత్తుల నిల్వ, ఆర్థిక చేయూత, ప్రాసెసింగ్, మార్కెటింగ్ లాంటి విషయాల్లో సమగ్ర పరిష్కారాలు కావాలని రైతులు కోరుకొంటున్నారని చెప్పారు. వ్యవసాయాభివృద్ధికి తమ ప్రణాళికలో మెరుగైన పంటల విధానం, మరింతగా సాంకేతిక పరిజ్ఞానం వినియోగం ఉన్నాయని తెలిపారు.

16 చర్యలను ప్రస్తావిస్తూ, వ్యవసాయాభివృద్ధిపై తాము ఎంతగా దృష్టి కేంద్రీకరిస్తున్నామో ఇవి సూచిస్తున్నాయని ఆమె చెప్పారు.

నిర్మల చెప్పిన విషయాలు ఆమె మాటల్లోనే...

"కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే తెచ్చిన మూడు నమూనా చట్టాలను అమలు చేసే రాష్ట్ర ప్రభుత్వాలను ప్రోత్సహిస్తాం. ఆ మూడు చట్టాలు: (ఏ) మోడల్ అగ్రికల్చరల్ ల్యాండ్ లీజింగ్ యాక్ట్-2016; (బీ) మోడల్ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ అండ్ లైవ్‌స్టాక్ మార్కెటింగ్ (ప్రమోషన్ అండ్ ఫెలిసిటేషన్) యాక్ట్- 2017; (సీ) మోడల్ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ అండ్ లైవ్‌స్టాక్ కాంట్రాక్ట్ ఫార్మింగ్ అండ్ సర్వీసెస్ (ప్రమోషన్ అండ్ ఫెలిసిటేషన్) యాక్ట్- 2017.

నీటి కొరత ఎక్కువగా ఉన్న వంద జిల్లాల్లో సమగ్ర చర్యలు చేపడతాం.

నిర్మల

ఫొటో సోర్స్, Twitter/PIB

ప్రధానమంత్రి కిసాన్ ఉర్జ సురక్ష ఉత్థాన్ మహాభియాన్ (పీఎం కుసుమ్) పథకం కింద మరో 20 లక్షల మంది రైతులకు సౌర విద్యుత్ పంపుల ఏర్పాటుకు తోడ్పాటు అందిస్తాం. గ్రిడ్‌కు అనుసంధానించిన పంపు సెట్ల స్థానంలో సోలార్ పంపు సెట్ల ఏర్పాటుకు మరో 15 లక్షల మందికి సహాయం చేస్తాం.

సంప్రదాయ ఎరువులు, ఇతర వినూత్న ఎరువులు, రసాయన ఎరువులు సహా అన్ని ఎరువులను సమతౌల్యంతో వాడటాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. ప్రస్తుత విధానం రసాయన ఎరువులను అతిగా వాడేలా ప్రోత్సహిస్తోంది. ఈ విధానాన్ని మార్చేందుకు ఎరువులను సమతౌల్యంతో వాడటాన్ని ప్రోత్సహించడం అవసరం.

స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీల) ఆధ్వర్యంలో గ్రామీణ నిల్వ పథకం ప్రవేశపెడతాం.

తక్కువ సమయం నిల్వ ఉండే పాలు, మాంసం, చేపలు, ఇతర ఆహార పదార్థాల రవాణా కోసం దేశవ్యాప్త సరఫరా వ్యవస్థ ఏర్పాటు చేస్తాం. ఇందుకోసం ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య(పీపీపీ) విధానంలో రైల్వేశాఖ 'కిసాన్ రైలు'ను ఏర్పాటు చేస్తుంది. ఎక్స్‌ప్రెస్, రవాణా రైళ్లలోనూ రిఫ్రిజిరేటెడ్ కోచ్‌లు ఉంటాయి. ఇలాంటి ఆహార పదార్థాల సత్వర రవాణా కోసం జాతీయ, అంతర్జాతీయ మార్గాల్లో పౌరవిమానయానశాఖ ఆధ్వర్యంలో 'కృషి ఉడాన్' పథకం కింద విమాన సేవలు అందిస్తాం.

దేశంలో పాలశుద్ధి సామర్థ్యం ప్రస్తుతం 53.5 మిలియన్ మెట్రిక్ టన్నులుగా ఉంది. దీనిని 2025 నాటికి 108 మిలియన్ మెట్రిక్ టన్నులకు పెంచుతాం.

2022-23లోగా మత్స్య ఉత్పత్తిని రెండు కోట్ల టన్నులకు పెంచుతాం. ఆల్గే, సీవీడ్ పెంపకాన్ని, కేజ్ కల్చర్‌ను ప్రోత్సహిస్తాం. 2024-25 నాటికి మత్స్య ఎగుమతులను లక్ష కోట్లకు చేర్చాలని ఆశిస్తున్నాం."

ఈ చర్యలకు నిధులను వ్యవసాయం, సాగునీరు, సంబంధిత కార్యకలాపాలు; గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌లకు కలిపి కేటాయించిన 2.83 లక్షల కోట్ల కేటాయింపుల నుంచి ఏర్పాటు చేస్తామని నిర్మల వివరించారు.

స్పోర్ట్స్ ఉమెన్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)