భారత్‌లో ప్రతి 20 మంది చిన్నారుల్లో ఒకరు అయిదేళ్లలోపే చనిపోతున్నారు...

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, షాదాబ్ నజ్మీ
- హోదా, బీబీసీ ప్రతినిధి
గుజరాత్‌లోని అహ్మదాబాద్, రాజ్‌కోట్ ఆస్పత్రుల్లో ఒక్క 2019 డిసెంబర్ నెలలోనే 200 మంది నవజాత శిశువులు ప్రాణాలు కోల్పోవడం అందరికీ ఆందోళన కలిగించింది. అదే నెలలో రాజస్థాన్‌లోని కోటాలోనూ ఒక ఆస్పత్రిలో వంద మందికి పైగా చిన్నారులు చనిపోయారని అధికారులు వెల్లడించారు.
2018తో పోలిస్తే కోటా పట్టణంలోని జేకే లోన్ ఆస్పత్రిలో 2019లో శిశు మరణాలు తగ్గాయని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అన్నారు.
ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం, జేకే లోన్ ఆస్పత్రిలో 2015లో 1,260 మంది, 2016లో 1,193 మంది, 2018లో 1,005 మంది, 2019లో 963 మంది చిన్నారులు చనిపోయారు.
గతంలో బీజేపీ అధికారంలో ఉన్నప్పటి కంటే, ఇప్పుడు శిశు మరణాల రేటు తగ్గిందని అశోక్ గెహ్లాట్ అన్నారు. అయితే, చిన్నారుల మరణాలు సహజమే అన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడుతోందంటూ విమర్శలు వ్యక్తం అయ్యాయి.
గుజరాత్ అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సమాధానాల ప్రకారం 2019 డిసెంబర్‌లో రాజ్‌కోట్ సివిల్ ఆస్పత్రిలో ఎప్పుడూ లేనంత అత్యధికంగా 131 మంది శిశువులు చనిపోయారు. ఇదే నెలలో అహ్మదాబాద్ సివిల్ ఆస్పత్రిలో 83 మంది చిన్నారులు మృతి చెందినట్లు నమోదైంది.
అంతకు ముందు 2019 జూన్‌లో అక్యూట్ ఎన్సెఫలైటిస్ బారిన పడి బిహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాలో 150 మందికి పైగా చిన్నారులు చనిపోయారు.
దేశంలో శిశు మరణాలు
జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (2015-16) ప్రకారం, దేశవ్యాప్తంగా చూస్తే సగటున ప్రతి 1,000 మంది శిశువుల్లో 30 మంది పుట్టిన తర్వాత నెలలోపే చనిపోతున్నారు. అంటే, ప్రతి 33 మందిలో ఒకరు నెల లోపే ప్రాణాలు కోల్పోతున్నారు.
ప్రతి 1000 మందిలో 41 మంది పుట్టిన సంవత్సరం లోపే చనిపోతున్నారు.
అయిదేళ్ల లోపు వయసులో ప్రతి 1,000 మంది చిన్నారుల్లో 50 మంది చనిపోతున్నారని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. అంటే, ప్రతి 20 మందిలో ఒకరు అయిదో పుట్టినరోజు జరుపుకునేలోపే ప్రాణాలు కోల్పోతున్నారు.
ఇందులోనూ 80 శాతానికి పైగా మరణాలు పసి వయసులోనే సంభవిస్తున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
బాలికలు ఎక్కువ
ప్రభుత్వం విడుదల చేసిన మరో నివేదిక శాంపిల్ రిజిస్ట్రేషన్ రిపోర్ట్ (ఎస్‌ఆర్‌ఎస్)- 2016 ప్రకారం, దేశవ్యాప్తంగా అయిదేళ్ల లోపు చనిపోతున్న చిన్నారుల్లో బాలుర కంటే బాలికల సంఖ్య ఎక్కువగా ఉంది.
ప్రతి 1,000 మంది బాలికలకు మరణాల రేటు 41గా ఉంటే, ప్రతి 1,000 మంది బాలురకు 37గా ఉంది. బిహార్ రాష్ట్రంలో ఈ వ్యత్యాసం అత్యధికంగా ఉంది.

ఫొటో సోర్స్, AFP
5 నుంచి 14 ఏళ్లలోపు మరణాల రేటు
దేశంలో 5 నుంచి 14 ఏళ్ల లోపు మరణాల రేటు 0.6గా ఉందని శాంపిల్ రిజిస్ట్రేషన్ రిపోర్ట్ అంచనా వేసింది. ఈ మరణాల రేటు కేరళలో అత్యల్పంగా (0.2), అత్యధికంగా ఝార్ఖండ్‌లో (1.4)గా ఉంది.
జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 1 (1992-93) సమయంలో ప్రతి 1000 మందిలో 49 మంది నెలలోపే చనిపోయేవారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 4 (2015-16) నాటికి ఆ రేటు 30కి తగ్గింది.
అయితే, 1992-93 నుంచి 2015-16 నాటికి నవజాత శిశు మరణాల రేటులో తగ్గుదల (48 శాతం) నమోదవ్వగా, అయిదేళ్ల లోపు వయసులో మరణాల రేటు (54 శాతం) తగ్గింది.
ఇవి కూడా చదవండి:
- 'జన్యు-సవరణ శిశువులు' సృష్టించిన శాస్త్రవేత్తకు జైలు శిక్ష
- 'పర్యటకులు మమ్మల్ని అసభ్యంగా తాకారు': థీమ్ పార్కు డిస్నీ పాత్రల ఫిర్యాదు
- భారత్లోకి దిగుమతి అవుతున్న 66 శాతం బొమ్మలతో పిల్లలకు ప్రమాదం
- రాకాసి ఆకలి: తిండి దొరక్కపోతే తమని తామే తినేస్తారు
- ‘ఈ ఆసుపత్రిలో చేరిన చిన్నారులెవరూ ప్రాణాలతో వెనక్కి వెళ్లట్లేదు’
- ఆంధ్రప్రదేశ్: ఈ గవర్నమెంటు స్కూల్లో సీట్లు లేవు
- సిలికాన్ వాలీ తల్లిదండ్రులు తమ పిల్లలను టెక్నాలజీకి దూరంగా ఉంచుతున్నారు.. ఎందుకు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








