భారత్‌లోకి దిగుమతి అవుతున్న 66 శాతం బొమ్మలతో పిల్లలకు ప్రమాదం

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, కమలేష్
- హోదా, బీబీసీ ప్రతినిధి
"నా పిల్లలకు ఏ బొమ్మలు ఇష్టమో, వాటినే కొంటుంటా. దానిమీద పెద్దగా దృష్టి పెట్టను. బొమ్మల వల్ల ఏదో ప్రమాదం ఉంటుందని నాకు అనిపించడం లేదు. జెల్లీ లాంటివి అయితే, దానితో ఆడుకోగానే చేతులు కడుక్కోమని చెబుతాను".
దిల్లీలో ఉంటున్న షీబాలాగే చాలా మంది తల్లిదండ్రులు బొమ్మల వల్ల పిల్లలకు ఏం ప్రమాదం ఉంటుందిలే అనుకుంటూ ఉంటారు. వాళ్లు పిల్లల ఇష్టం, బొమ్మల క్వాలిటీ చూసి వాటిని కొంటుంటారు. వాళ్ల దగ్గర వాటిని పరిశీలించడానికి వేరే పద్ధతులేవీ ఉండవు.
కానీ భారత నాణ్యతా కౌన్సిల్( క్యూసీఐ) ఒక రిపోర్ట్ ప్రకారం... భారత్‌లో దిగుమతి అవుతున్న 66.90 శాతం బొమ్మలు పిల్లలకు ప్రమాదకరం అని చెప్పింది.

దిగుమతి అయిన వాటిలో చాలా బొమ్మలు మెకానికల్, కెమికల్, మిగతా పరిశోధనల్లో విఫలమైనట్లు క్యూసీఐ సర్‌ప్రైజ్ పద్ధతిలో చేసిన ఒక అధ్యయనంలో తేలింది.
క్యూసీఐ వివరాల ప్రకారం ఈ బొమ్మల్లో రసాయనాలు నిర్ధారిత మోతాదు కంటే ఎక్కువగా ఉన్నాయి. దానివల్ల పిల్లలకు చాలా రకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.
కానీ, సామాన్యులకు దాని గురించి పెద్దగా తెలీదు. దిల్లీలో బొమ్మలమ్మే ఒక షాపు యజమాని... చిన్న పిల్లల బొమ్మల్లో కొన్నింటిపై టాక్సిక్, నాన్ టాక్సిక్ అని రాసుంటుందని, కానీ అందరికీ వాటి గురించి సరిగా తెలీదని చెప్పారు.
"జనం ఎక్కువగా తమకు నచ్చిన బొమ్మలే కొంటుంటారు. దాని ధర, ఆ బొమ్మను ఎలా ఉపయోగించాలి అనేది తప్ప వాళ్లు వేరే ఏం ఆలోచించరు" అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
పరిశోధనలు ఎలా చేశారు
ఈ అధ్యయనం గురించి క్యూసీఐ సెక్రటరీ జనరల్ డాక్టర్ ఆర్పీ సింగ్ బీబీసీకి వివరించారు.
"మేం భారత్‌లోకి వచ్చే చాలా బొమ్మలపై ఒక శాంపిల్ ఆధారంగా పరిశోధనలు చేస్తుండడం చూశాం. దానికి ఎలాంటి చెల్లుబాటు వ్యవధి ఉండదు. ఆ టెస్ట్ రిపోర్టు వల్ల దేశంలోకి వచ్చే బొమ్మల సరుకుపై పరిశోధనలు జరిగాయా, లేదా అనేది తెలీడం లేదు. దాని గురించి చాలా చర్చ జరిగింది. తర్వాత క్యూసీఐకు మార్కెట్లో ఉన్న బొమ్మలపై పరిశోధన చేయాలని చెప్పారు" అన్నారు.
"క్యూసీఐ ఈ పరిశోధనల కోసం దిల్లీ, ఎన్‌సీఆర్ నుంచి బొమ్మలు తీసుకుంది. ఈ బొమ్మలను మిస్టరీ షాపింగ్ (ఏదో ఒక షాపు నుంచి ఏదో ఒక బొమ్మ తీసుకోవడం) ద్వారా శాంపిల్ ఎంచుకున్నారు. ఎన్ఏబీఎల్ ప్రమాణాలు ఉన్న ల్యాబ్‌లో వాటిపై పరిశోధనలు చేశారు.
వేరు వేరు కేటగిరీల్లో మొత్తం 121 రకాల బొమ్మలపై పరిశోధనలు చేశారు.
ఏ కేటగిరీ బొమ్మలను ఎంచుకున్నారు:
- ప్లాస్టిక్‌తో చేసిన బొమ్మలు
- సాఫ్ట్ టాయ్స్/స్టఫ్డ్ టాయ్స్
- కొయ్యతో చేసిన బొమ్మలు
- మెటల్‌తో చేసిన బొమ్మలు
- ఎలక్ట్రిక్ బొమ్మలు
- పిల్లలు లోపలికి వెళ్లి ఆడుకోగలిగే బొమ్మలు (టాయ్ టెంట్ లాంటివి)
- కాస్ట్యూమ్స్
పరిశోధన ఫలితాల్లో ఈ బొమ్మల్లో హానికారక రసాయనాల మోతాదు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. చాలా బొమ్మలు భద్రతా ప్రమాణాలు అందుకోవడంలో విఫలం అయ్యాయి. వాటివల్ల పిల్లలు గాయపడవచ్చు, చర్మ సంబంధ వ్యాధులకు కూడా అవి కారణం కావచ్చు.

ఫలితాలు ఎలా ఉన్నాయి:
- 41.3 శాతం శాంపిల్ బొమ్మలు మెకానికల్ పరిశోధనలో విఫలం
- 3.3 శాతం శాంపిల్ బొమ్మలు ఫైలాయిట్ కెమికల్ పరిశోధనలో విఫలం
- 12.4 శాతం శాంపిల్ బొమ్మలు మెకానికల్, ఫైలాయిట్ పరిశోధనల్లో విఫలం
- 7.4 శాతం శాంపిల్ బొమ్మలు జ్వలనశీలత పరిశోధనలో విఫలం
- 2.5 శాతం శాంపిల్ బొమ్మలు మెకానికల్, జ్వలనశీలత పరిశోధనల్లో విఫలం

ఫొటో సోర్స్, Getty Images
ఎలాంటి నష్టం ఉంటుంది?
బొమ్మలపై మెకానికల్, కెమికల్ పరిశోధనలు, తర్వాత పెయింట్స్, లెడ్, హెవీ మెటల్ పరిశోధనలు కూడా క్యూసీఐ చేసింది. ఈ పరిశోధనల్లో 33 శాతం బొమ్మలు మాత్రమే పాస్ అయ్యాయి.
మెకానికల్ బొమ్మల వల్ల జరిగే నష్టం గురించి చెప్పిన డాక్టర్ ఆర్పీ సింగ్.. "చాలా బొమ్మలు మెకానికల్ పరిశోధనల్లో ఫెయిల్ అయ్యాయి. మెకానికల్ పరిశోధన అంటే మెటల్ బొమ్మల వల్ల పిల్లల చర్మం గీరుకుపోవచ్చు, కోసుకు పోవచ్చు. నోట్లో వేసుకుంటే అవి గొంతులో ఇరుక్కుపోవచ్చు, వాటిలో అవన్నీ పరిశీలిస్తాం" అన్నారు.
"టాక్సిక్ పరిశోధనల్లో బొమ్మలకు ఎలాంటి కెమికల్స్ ఉపయోగిస్తున్నారో, వాటి మోతాదు ఏంటో పరిశీలించాం. అంటే సాఫ్ట్ టాయ్స్‌లో థైలెట్ అనే ఒక కెమికల్ ఉంటుంది. దానివల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉంది. ఆ బొమ్మ నుంచి వచ్చే దారాల వల్ల పిల్లలకు నష్టం కలగకూడదు. బొమ్మల్లో ఉపయోగించే రసాయనాల వల్ల చర్మ సంబంధిత వ్యాధులు రావచ్చు. వాటిని నోట్లో పెట్టుకోవడం వల్ల ఇన్ఫెక్షన్స్ కూడా రావచ్చు".

ఫొటో సోర్స్, Getty Images
"అంతే కాకుండా లెడ్, మెర్కురీ, ఆర్సెనిక్ లాంటి హెవీ మెటల్స్ కూడా బొమ్మల్లో ఉండకూడదు. పిల్లల టెంట్ హౌస్, కాస్టూమ్స్ లాంటి వాటిలో జ్వలనశీలత ఉందనే విషయం గుర్తించాం. అంటే అలాంటి వాటికి త్వరగా మంటలు అంటుకునే ప్రమాదం ఉంటుంది".
ప్రపంచవ్యాప్తంగా ఈ రసాయనాల మోతాదును భారత ప్రమాణాల ప్రకారం నిర్ణయించారు. ఆ పరిమాణం ఎక్కువైతే దానివల్ల పిల్లలకు నష్టం జరగవచ్చు.
"విదేశీ వాణిజ్య డైరెక్టరేట్ జనరల్ (డీజీఎఫ్‌టీ) ఒక నోటిఫికేషన్‌ను సవరించింది. దాని తర్వాత భారత్‌లోని రేవులకు ఎంత బొమ్మల సరుకు వస్తుందో, వాటన్నిటి నుంచి శాంపిల్ బొమ్మలు సేకరించి, వాటిపై పరిశోధనలు చేసేందుకు ఎన్ఏబీఎల్ ల్యాబ్‌కు పంపిస్తారు. అవి సరిగా లేకుంటే ఆ సరుకును భారత్‌లోకి రానివ్వరు" అని ఆర్పీ సింగ్ చెప్పారు.
భారత్‌లోకి వచ్చే బొమ్మల్లో అత్యధికంగా చైనా నుంచే వస్తున్నాయి. శ్రీలంక, మలేసియా, జర్మనీ, హాంకాంగ్, అమెరికా బొమ్మలు కూడా దేశంలోకి వస్తున్నాయి.
ఇవి కూడా చదవండి:
- మరణ శిక్షల్లో భారతదేశ రికార్డు ఏమిటి? - రియాలిటీ చెక్
- ఏపీకి రాజధాని విశాఖపట్నమా, అమరావతా.. ఒకటికి మించి రాజధానులున్న రాష్ట్రాల్లో వ్యవస్థలు ఎలా ఉన్నాయి
- ‘మనుషులపై ఏనుగులకు తీవ్రంగా పెరుగుతున్న కోపం’
- వీధి కుక్క పిల్లను కాపాడి రేబిస్‌తో మహిళ మృతి
- కుక్క శరీరంపై కంటే మనిషి గడ్డంలోనే ఎక్కువ బ్యాక్టీరియా
- నార్త్ పోల్లోని శాంటా ఇల్లు ఇది... ఇక్కడికి ఎలా వెళ్లాలో తెలుసా?
- రష్యా: ‘ఐదేళ్లలో 80 శాతం తగ్గిన ఆల్కహాల్ విక్రయాలు’.. నిజమెంత?
- పది నిమిషాల్లో ఆనందాన్ని పెంచుకోవడం ఎలా?
- నా కార్టూన్లే నా ప్రాణాలు కాపాడాయి.. కొత్త జీవితాన్ని ఇచ్చాయి.. ఇదీ నా కథ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









