ఓ గుహలో దొరికిన 44 వేల ఏళ్ళనాటి అతి పురాతన పెయింటింగ్ ఏం చెబుతోంది?

దున్నపోతు

ఫొటో సోర్స్, Maxime Aubert / PA WIRE

ఇండోనేసియాలోని ఓ గుహలో వెలుగుచూసిన ఈ చిత్రం 44వేల ఏళ్ల పురాతనమైందని బయటపడింది.

సగం మనిషి, సగం జంతువులా ఉన్న జీవులు ఈటెలు, తాళ్ల వంటి వాటితో దున్నపోతులను వేటాడుతున్నట్లుగా దీన్ని గీశారు.

సన్నివేశాన్ని వర్ణించేలా ఉన్న చిత్రాల్లోకెల్లా ప్రపంచంలో ఇదే అత్యంత పురాతమనమైంది అయ్యుండొచ్చని కొందరు పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.

ఆస్ట్రేలియాలోని గ్రిఫిత్ యూనివర్సిటీ పరిశోధకులు ఈ చిత్రం గురించి నేచర్ అనే జర్నల్‌లో వివరాలు వెల్లడించారు.

ఆడమ్ బ్రమ్ అనే పురాతత్వ శాస్త్రవేత్త రెండేళ్ల క్రితం దీన్ని గుర్తించారు.

ఇండోనేసియాలోని సులవేసి ద్వీపం దక్షిణ ప్రాంతంలోని బులుసిపాంగ్ 4 అనే గుహలో ఇది వెలుగుచూసింది. దీని వెడల్పు దాదాపు 5 మీటర్లు.

అనోవా అనే రకం దున్నపోతులు, అడవి పందులు ఈ చిత్రంలో కనిపించాయి.

వాటి పక్కనే చిన్నగా ఉన్న మనుషులను తలపించే బొమ్మలు కూడా గీసి ఉన్నాయి. అయితే, వాటికి తోకలు, జంతువుల్లాంటి మూతులను గీశారు. ఒక భాగంలో అవి అనోవాను ఈటెలతో చట్టుముట్టినట్లుగా ఉన్నాయి.

‘‘మేం ఈ ప్రాంతంలో ఇలాంటి వందల చిత్రాలను చూశాం. అయితే, వేటాడుతున్న సన్నివేశాన్ని గీయడం మాత్రం ఇప్పుడే చూస్తున్నా’’ అని బ్రమ్ అన్నారు.

అయితే, నిజంగా ఓ సన్నివేశాన్ని వర్ణించేలా ఈ చిత్రం ఉందా? అనే విషయంలో కొందరు పరిశోధకులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

డుర్హమ్ యూనివర్సిటీకి చెందిన పాల్ పెటిట్ అనే పురాతత్వ శాస్త్రవేత్త ఇదే అనుమానం వ్యక్తం చేశారు.

చిత్రం

ఫొటో సోర్స్, Maxime Aubert / PA Wire

చిత్రంపై ఏర్పడిన కాల్సైట్ (కార్బోనైట్ పదార్థం)‌ను విశ్లేషించడం ద్వారా అది ఎన్నాళ్ల క్రితం నాటిదనేది పరిశోధకులు గుర్తించారు.

ఆ పదార్థంలో ఉండే రేడియో ఆక్టివ్ పదార్థం కాలక్రమేణా థోరియంగా మారుతుంటుంది. బొమ్మపై ఉన్న పదార్థాల్లోని ఆయా ఐసోటోప్‌ల స్థాయిలను లెక్కగట్టి, ఆ చిత్రం వయసును పరిశోధకులు నిర్ధారించారు.

పంది బొమ్మపై ఉన్న కాల్సైట్ కనీసం 43,900 ఏళ్ల క్రితం నాటిదని గుర్తించారు. దున్నపోతుల‌పై ఉన్న కాల్సేట్ 40,900 ఏళ్ల కన్నా పురాతనమైందని కనుగొన్నారు.

సులవేసి‌లో ఈ తరహా చిత్రాలున్న గుహలు 242కుపైనే ఉన్నాయి. ఏటా కొత్త కొత్త ప్రదేశాలు బయటపడుతున్నాయి.

తాజాగా వెలుగుచూసిన చిత్రం కన్నా పురాతనమైన చిత్రాలు ఇదివరకే బయటపడ్డాయి. అయితే, ఓ సన్నివేశాన్ని వర్ణించేలా ఉన్న చిత్రాల్లో మాత్రం ఇదే అన్నింటికన్నా పాతదై ఉండొచ్చని పరిశోధకులు అంటున్నారు.

జంతువుల బొమ్మలతో ఉన్న అత్యంత పురాతన చిత్రం కూడా ఇదే అయ్యుండొచ్చని శాస్ర్తవేత్తలు అభిప్రాయపడ్డారు. గతేడాది బొర్నీయోలో జంతువు బొమ్మలతో కూడిన ఓ చిత్రం వెలుగుచూసింది. అది 40 వేల ఏళ్ల కన్నా పురాతనమైంది కావొచ్చని పరిశోధకులు అంచనా వేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)