హైదరాబాద్ 'ఎన్‌కౌంటర్‌‌'పై సుప్రీం కోర్టు: ముగ్గురు సభ్యులతో విచారణ కమిషన్‌ ఏర్పాటుకు ఆదేశం..

సుప్రీం కోర్ట్

ఫొటో సోర్స్, Getty Images

దిశ కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌పై ముగ్గురు సభ్యులతో విచారణ కమిషన్ ఏర్పాటు చేయాలని గురువారం సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ కమిషన్‌కు ఆరు నెలల గడువును నిర్దేశించింది.

అయితే, ఈ ఎన్‌కౌంటర్ పై తెలంగాణ హైకోర్టు, జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్ఆర్‌సీ) చేస్తున్న విచారణలపై స్టే విధిస్తున్నట్లు సుప్రీం కోర్టు తెలిపింది.

ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం తరపున సీనియర్ అడ్వొకేట్ ముకుల్ రోహ్తగీ వాదనలు వినిపించారు.

"ఈ నలుగురు నిందితులనూ పెట్రోల్ బంక్ దగ్గర బాధితురాలి స్కూటర్‌తో పాటు ఉండటాన్ని గుర్తించారు. వాళ్లు పెట్రోల్ కోసం ఆ బంకుకు వెళ్లారు. వాళ్ల గుర్తింపు విషయంలో ఎలాంటి అనుమానం లేదు. బాధితురాలి మొబైల్, ఛార్జర్, పవర్ బ్యాంక్‌లను సేకరించడానికి నేరం జరిగిన ప్రదేశానికి వారిని తీసుకెళ్లారు" అని రోహ్తగీ కోర్టుకు స్పష్టం చేశారు.

వారిపై గతంలో ఏమైనా నేరాలున్నాయా అని ఈ సందర్భంగా సీజేఐ ఎస్ఏ బాబ్డే ప్రశ్నించారు.

"వారిని ఉదయం 5-5.30 గంటల సమయంలో అక్కడకు తీసుకెళ్లారు. ఆ సమయంలో వారి చేతులకు సంకెళ్లు లేవు. దీంతో వాళ్లు పోలీసుల ఆయుధాలను లాక్కున్నారు. వాటిపై పోలీసులపై దాడికి దిగారు, ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు గాయపడ్డారు. లాక్కున్న పిస్టల్‌తో నిందితులు కాల్పులు జరిపారు. దీంతో పోలీసులు ఎదురుకాల్పులు జరపాల్చి వచ్చింది" అని రోహ్తగీ వివరించారు.

"మీరు రివాల్వర్ ఎందుకు తీసుకెళ్లారు? వాళ్లు పోలీసులపై పిస్టల్‌తో కాల్పులు జరిపారు, కానీ పోలీసులెవరికీ గాయాలు కాలేదా?" అని సీజేఐ బాబ్డే తిరిగి ప్రశ్నించారు.

పోలీసులకు పిస్టల్ కాల్పుల వల్ల గాయాలు కాలేదు అని దీనికి సమాధానంగా రోహ్తగీ చెప్పారు.

ఇద్దరు పోలీసుల నుంచి ఓ నిందితుడు తుపాకులు లాక్కొని, కాల్పులు జరిపారని, ఎదురు కాల్పుల్లో వారంతా మరణించారని ఆయన వివరించారు. దీనికి సంబంధించిన అన్ని ఆధారాలు ఉన్నాయని, దీనిపై విచారణ జరుగుతోందని తెలిపారు.

బాధితురాలి శరీరం దహనమవుతున్న విషయాన్ని ఓ పాలవ్యాపారి ముందుగా గుర్తించారని రోహ్తగీ తెలిపారు.

దిశ అత్యాచార నిందితులు

ఈ ఎన్‌కౌంటర్‌పై స్వతంత్ర విచారణ చేపట్టే అంశాన్ని పరిశీలిస్తున్నామని ఈ సందర్భంగా సీజేఐ వ్యాఖ్యానించారు. దీనిపై స్వతంత్ర విచారణ జరగాలని ఆయన అన్నారు.

గతంలో సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జిని దీనికోసం నియమించారని, అయితే ఆయన విచారణ ప్రక్రియను పర్యవేక్షణ చేయగలరు గానీ, విచారణ చేయలేరు అని రోహ్తగీ చెప్పారు.

మాకు విచారణ గురించి ఆందోళన లేదు, దాని ఫలితాన్ని సుప్రీంకోర్టు నియమించిన కమిషన్ లేదా కమిటీ నిర్థరిస్తుంది అని బాబ్డే స్పష్టం చేశారు.

ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులను మీరు క్రిమినల్ కోర్టులో ప్రాసిక్యూట్ చేస్తే, ఇక మేం చేయాల్సింది ఏమీ లేదు. కానీ, వాళ్లు అమాయకులు అని మీరంటే మాత్రం, ప్రజలకు నిజాలు తెలియాల్సిందే, విచారణ జరగాల్సిందే అని ఆయన వ్యాఖ్యానించారు.

వాస్తవాలను అంచనా వేయాలని మేం కోరుకోవట్లేదు. విచారణ జరగనివ్వండి, దాన్ని మీరెందుకు వ్యతిరేకిస్తున్నారు అని ఆయన ప్రశ్నించారు.

దీనిపై, "ఇప్పటికే జాతీయ మానవ హక్కుల సంఘం దీన్ని సూమోటో కేసుగా తీసుకుని విచారణ ప్రారంభించింది. మెజిస్టీరియల్ విచారణకు కూడా ఆదేశాలు జారీ అయ్యాయి. అందువల్ల సమాంతర విచారణ కుదరదు" అని రోహ్తగీ సమాధానమిచ్చారు.

"పోలీసులుగా మీరు చేసే విచారణ నిష్పక్షపాతంగా ఉండాలి. మేం పోలీసుల చర్యలపైనే విచారణ జరిపే అంశాన్ని పరిశీలిస్తున్నాం" అని సీజేఐ వ్యాఖ్యానించారు.

ఆ ఘటనలో పోలీసులు ఏం చేశారు, నిందితులు ఏం చేశారు అనేది మేం తెలుసుకోవాలనుకుంటున్నాం. వారికి మేం ప్రత్యేకంగా పరిగణించట్లేదు. డిసెంబర్ 6 ఉదయం ఆ నలుగురు నిందితులూ ఎలా చనిపోయారో, దానికి దారితీసిన పరిస్థితులు ఏంటో వెల్లడయ్యేందుకు మేం ఓ విచారణ కమిషన్‌ను ఏర్పాటుచేస్తున్నాం.

ఈ కమిషన్‌కు రిటైర్డ్ జడ్జి వీఎస్ సిర్పూర్కర్ నేతృత్వం వహిస్తారు. బొంబాయి హైకోర్టు జడ్జి రేఖా ఎస్ బల్డోటా, సీబీఐ మాజీ డైరెక్టర్ కార్తికేయన్ సభ్యులుగా ఉంటారు.

ఈ బృందం హైదరాబాద్ నుంచే విచారణను నిర్వహిస్తుంది, వీరికి తెలంగాణ ప్రభుత్వమే అవసరమైన సౌకర్యాలతోపాటు భద్రత కల్పించాల్సి ఉంటుంది.

ఆరు నెలల్లో విచారణ పూర్తిచేసి, నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. దీనిపై తదుపరి ఆదేశాలిచ్చే వరకూ మరే ఇతర కోర్టు గానీ, అథారిటీ గానీ విచారణ జరపజాలదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.

ఈ ఉత్తర్వులతో తెలంగాణ హైకోర్టులో, ఎన్‌హెచ్ఆర్సీలో దిశ ఎన్‌కౌంటర్‌పై విచారణ నిలిచిపోనుంది.

హైదరాబాద్ ఎన్‌కౌంటర్

ఫొటో సోర్స్, Getty Images

బుధవారం నాడు ఏం జరిగింది?

హైదరాబాద్ శివార్లలో వెటర్నరీ డాక్టర్ అత్యాచారం, హత్య నిందితుల ‘ఎన్‌కౌంటర్‌’ వ్యవహారంపై సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితో విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు ప్రతిపాదించింది.

'దిశ' కేసులో నిందితుల ‘ఎన్‌కౌంటర్‌’లో పాల్గొన్న పోలీసు సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని, ఈ కేసును రిజిస్టర్ చేసి, ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని, విచారణ జరపాలని సుప్రీం కోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది.

ఈ పిటిషన్‌ ఈనెల9వ తేదీన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం ముందు ప్రస్తావనకు వచ్చింది.

ఈ పిటిషన్‌ను త్వరితగతిన విచారణకు స్వీకరించాలని న్యాయవాదులు జీఎస్ మణి, ప్రదీప్ కుమార్ యాదవ్‌లు విజ్ఞప్తి చేశారు.

హైదరాబాద్ ‘ఎన్‌కౌంటర్‌’పై సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన జడ్జి చేత విచారణ జరిపించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు జస్టిస్ బాబ్డే ప్రతిపాదించారని బీబీసీ ప్రతినిధి సుచిత్ర మొహంతి తెలిపారు.

ఇందుకోసం జస్టిస్ పీవీ రెడ్డి పేరును పరిశీలించగా.. ఈ కేసు విచారణ చేపట్టేందుకు ఆయన నిరాకరించారని జస్టిస్ బాబ్డే వెల్లడించారు.

ఈ నేపథ్యంలో హైదరాబాద్ ‘ఎన్‌కౌంటర్‌’ కేసు విచారణను అప్పగించేందుకు ఇతర రిటైర్డ్ న్యాయమూర్తుల పేర్లను పరిశీలిస్తామని తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)