వైఎస్ జగన్: ‘ఇలాంటి ఎన్‌కౌంటర్లు సినిమాల్లో చేస్తే చప్పట్లు కొడతాం.. నిజజీవితంలో చేస్తే ఎన్‌హెచ్ఆర్సీని పిలుస్తారు’

వైఎస్ జగన్

ఫొటో సోర్స్, facebook/ysrcpofficial

ఒక మహిళపై దారుణంగా అత్యాచారం, హత్య జరిగితే, ఆ కేసులో నిందితులు పోలీసులపై దాడిచేసి, కస్టడీ నుంచి తప్పించుకోబోయారు. వారిని పోలీసులు ఎన్‌కౌంటర్లో కాల్చి చంపితే, అలా ఎందుకు చేయాల్సి వచ్చిందని విచారణలు చేసే పరిస్థితిలో ఈరోజు చట్టాలున్నాయి అని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో వ్యాఖ్యానించారు.

అత్యాచారం చేసిన వారికి 21 రోజుల్లోనే శిక్షపడేలా చట్టాలను రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను, తెలంగాణ పోలీసులను అభినందిస్తున్నానని జగన్ తెలిపారు.

మహిళలపై హింస అనే అంశంపై చర్చించాలని సభలో సభ్యులు కోరడంతో, ఏపీ అసెంబ్లీలో దానిపై ఈరోజు చర్చ జరిగింది. ఈ చర్చ సందర్భంగా సీఎం జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

నిందితులు

"నాకు ఇద్దరు పిల్లలున్నారు, చెల్లి ఉంది, భార్య ఉంది. ఓ ఆడపిల్లకు ఇలాంటి దారుణం జరిగితే ఆ కుటుంబం పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించగలను. అందుకే మహిళలపై అత్యాచారాలకు పాల్పడే వారికి నేరం చేసిన 21 రోజుల్లోనే కఠిన శిక్షలు పడేలా చట్టం రూపొందిస్తాం. 'దిశ' అత్యాచార ఘటనకు మొత్తం సమాజం సిగ్గుతో తలదించుకోవాలి. పక్కా పథకం ప్రకారం నిందితులు నేరానికి పాల్పడ్డారు.

ఇలాంటి దారుణాలు జరిగిన సందర్భాల్లో పోలీసులు ఎలా స్పందించాలో మనం చర్చించుకోవాలి. వారిని కాల్చి చంపడం ఏమాత్రం తప్పు కాదు" అని జగన్ అన్నారు.

'దిశ' అత్యాచారం, హత్య నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేసిన ఘటనపై విచారణకు జాతీయ మానవ హక్కుల సంఘం ఏడుగురు సభ్యుల బృందాన్ని నియమించడాన్ని కూడా జగన్ తప్పుబట్టారు.

"ఇలాంటి ఎన్‌కౌంటర్లు సినిమాల్లో జరిగితే మనమంతా సంతోషంతో చప్పట్లు కొడతాం. కానీ నిజజీవితంలో ఎవరైనా ధైర్యంగా ఇలా చేస్తే దానిపై విచారణకు దిల్లీ నుంచి ఎన్‌హెచ్ఆర్సీని పిలుస్తారు. వాళ్లు వచ్చి, ఇది చాలా తప్పు, ఇలా ఎందుకు చేశారు, ఎలా చేశారు అని ప్రశ్నిస్తారు. మన చట్టాలు ఇంతటి దారుణ స్థితిలో ఉన్నాయి" అని జగన్ వ్యాఖ్యానించారు.

నిర్భయ అత్యాచారం 2012లో జరిగితే ఇంతవరకూ దోషులకు శిక్ష అమలు కాలేదని సీఎం అన్నారు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు దేశంలోని మహిళలు తక్షణ న్యాయం కోరుకుంటున్నారు అని ఆయన అభిప్రాయపడ్డారు.

జగన్ ఎన్‌కౌంటర్‌ను సమర్థించడం తప్పు: రచనా రెడ్డి

ఆ అమ్మాయికి జరిగిన దానిపై కోపం ఉండటం సహజమే కానీ ఎన్‌కౌంటర్‌ను సమర్థించడం తప్పు అని న్యాయవాది రచనా రెడ్డి అభిప్రాయపడ్డారు.

మానవ హక్కుల సంఘాన్ని విమర్శించడం సరికాదు, పోలీసులు చేసిన అభియోగాలు తప్పో, రైటో నిర్ధారించాల్సింది న్యాయ వ్యవస్థ. పోలీసులకే ఈ అధికారం ఇచ్చుకుంటూ పోతే అది సహజ న్యాయసూత్రాలకు విరుద్ధం. ఇది ఆటవిక రాజ్యానికి దారితీస్తుంది. ఆ అమ్మాయికి జరిగిన దానిపై కోపం ఉండటం సహజమే. కానీ ఎన్‌కౌంటర్‌ను సమర్థించడం తప్పు. కోర్టుల్లో నిందితులపై అభియోగాలు నిరూపణయ్యే వరకూ వారే నేరం చేశారని ఎలా చెప్పగలం? నేరస్థులు వీళ్లేనా, ఇంకా ఎవరైనా ఉన్నారా? ఇలాంటి ప్రశ్నలు ఎన్నో వస్తాయి. వీటికి సమాధానాలు దొరకని పరిస్థితి ఇప్పుడు.

21 రోజ్లులోనే శిక్షలు వేస్తామంటే మంచిదే. దీనికి ఫాస్ట్ ట్రాక్ కోర్టు కాదు, అల్ట్రా ఫాస్ట్ ట్రాక్ కోర్టు కావాలి. ఇది అమలు చేస్తే మంచిదే.

కొన్ని చట్టాలు చేసే బాధ్యత పార్లమెంటు చేతిలో ఉంటుంది. కొన్నింటిని రాష్ట్ర ప్రభుత్వాలు మార్చలేవు. నిందితులు అప్పీలు చేసుకునే హక్కును, క్షమాభిక్షను రాష్ట్రాలు అడ్డుకోలేవు.

పూర్తి స్థాయిలో ఒకే కేసును రోజంతా విచారించేలా ఏర్పాట్లు చెయ్యడానికి మన దగ్గర తగిన వనరులు లేవు. దీనికి ప్రయత్నాలు చేస్తే సంతోషమే.

ప్రతి కేసులోనూ దిశ నిందితుల విషయంలో జరిగినట్లు జరగాలని చెబితే అది న్యాయ స్ఫూర్తికే విరుద్ధం అని రచనా రెడ్డి అన్నారు.

తెలంగాణ హైకోర్టు

ఫొటో సోర్స్, TS HIGH COURT

హైకోర్టులో విచారణ వాయిదా

హైదరాబాద్ శివార్లలో వెటర్నరీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య చేసిన నిందితుల ఎన్‌కౌంటర్‌పై విచారణను తెలంగాణ హైకోర్టు గురువారానికి వాయిదా వేసింది.

నిందితుల మృతదేహాలను శుక్రవారం వరకు గాంధీ ఆస్పత్రిలో భద్రపరచాలని ఆదేశించింది.

బుధవారం సుప్రీంకోర్టులో విచారణ ఉన్నందున హైకోర్టు తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.

మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఈ కేసులో విచారణకు సీనియర్ అడ్వొకేట్ ప్రకాశ్ రెడ్డిని అమికస్ క్యూరీ (మధ్యవర్తి)గా హైకోర్టు నియమించింది.

సుప్రీం కోర్ట్

ఫొటో సోర్స్, Getty Images

మరోవైపు, 'దిశ' కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసు సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని, ఈ కేసును రిజిస్టర్ చేసి, ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని, విచారణ జరపాలని సుప్రీం కోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది.

ఈ పిటిషన్‌పై విచారణ జరిపేందుకు సుప్రీం కోర్టు అంగీకరించిందని రిపోర్టర్ సుచిత్ర మొహంతీ తెలిపారు.

‘‘ఈనెల 11వ తేదీ బుధవారం ఈ పిటిషన్‌పై దృష్టిసారిస్తాం’’ అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే అన్నారని వివరించారు.

ఈ పిటిషన్‌ను త్వరితగతిన విచారణకు స్వీకరించాలని న్యాయవాదులు జీఎస్ మణి, ప్రదీప్ కుమార్ యాదవ్‌లు విజ్ఞప్తి చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)