మాల్టా 'గోల్డెన్ పాస్‌పోర్టులు: వీటి కోసం సంపన్నులు ఎందుకు ఎగబడుతున్నారు?

పాస్‌పోర్టు, డబ్బు
    • రచయిత, క్రిస్టఫర్ గైల్స్
    • హోదా, బీబీసీ రియాలిటీ చెక్

మాల్టా- మధ్యదరా సముద్రంలోని చిన్న ద్వీప దేశం. ఈ ఐరోపా దేశానికి ప్రధాన ఆదాయ వనరు పర్యాటకం. దేశ జనాభా 4.36 లక్షలు. అంటే కర్నూలు పట్టణ జనాభా కన్నా తక్కువ.

రెండేళ్ల క్రితం మాల్టాలో ఒక మహిళా ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టు హత్యకు గురయ్యారు. మాల్టా ప్రభుత్వం ఇచ్చే 'గోల్డెన్ పాస్‌పోర్ట్‌లు' ఈ హత్య తర్వాత తీవ్రస్థాయిలో వివాదాస్పదమయ్యాయి.

మాల్టా గోల్డెన్ పాస్‌పోర్టుల పథకం వల్ల యావత్ ఐరోపాలోకి నేరస్థులు వచ్చి పడే ముప్పుందని, ఐరోపాలో మనీ ల్యాండరింగ్ పెరిగే ఆస్కారముందని యూరోపియన్ యూనియన్(ఈయూ) పార్లమెంటు ప్రతినిధి బృందం ఒకటి ఆందోళన వ్యక్తంచేస్తోంది. ఇంతకూ ఈ పాస్‌పోర్టులు ఎవరు, ఎందుకు పొందాలనుకుంటారు?

మాల్టాలో చట్టబద్ధ పాలన ఎంత మేర ఉందో పరిశీలించేందుకు ఈయూ ప్రతినిధి బృందం ఈ దేశంలో పర్యటిస్తోంది.

2017లో జర్నలిస్ట్ డాఫ్నే కరువానా గాలిజియా హత్య మాల్టా రాజకీయ, అధికార వ్యవస్థలను కుదిపేసింది. దేశంలో అవినీతి, బలహీనమైన న్యాయవ్యవస్థపై ఆరోపణలను, ఆందోళనలను ఈ హత్య ప్రముఖంగా తెరపైకి తెచ్చింది.

తక్కువ పన్నులు, ఉన్నతస్థాయి విద్యా సదుపాయాలుగల దేశంలో నివసించాలని, లేదా రాజకీయ కారణాలతో ఉన్న దేశాన్ని వీడి మరో దేశానికి వెళ్లిపోవాలని అనుకొనే సంపన్నులను ఆకర్షించేందుకు ఉద్దేశించినదే గోల్డెన్ పాస్‌పోర్టుల పథకం.

ఇంతకూ మాల్టా పౌరసత్వం పొందడానికి మార్గాలేమిటి? ఇందుకు ఎంత ఖర్చవుతుంది?

2017లో జర్నలిస్ట్ డాఫ్నే కరువానా గాలిజియా హత్య తర్వాత 'గోల్డెన్ పాస్‌పోర్ట్‌లు' తీవ్రస్థాయిలో వివాదాస్పదమయ్యాయి.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 2017లో జర్నలిస్ట్ డాఫ్నే కరువానా గాలిజియా హత్య తర్వాత 'గోల్డెన్ పాస్‌పోర్ట్‌లు' తీవ్రస్థాయిలో వివాదాస్పదమయ్యాయి.

మాల్టా పౌరసత్వం పొందే మార్గాలు

సంపన్నులను, పెట్టుబడులను ఆకట్టుకోవడానికి 2014లో మాల్టా ప్రభుత్వం గోల్డెన్ పాస్‌పోర్టుల పథకాన్ని ప్రవేశపెట్టింది. పాస్‌పోర్టు పొందాలంటే దరఖాస్తుదారులు తప్పక చేయాల్సిన పనులివీ.

  • జాతీయ అభివృద్ధి నిధికి ఆరున్నర లక్షల యూరోలు ఇవ్వాలి
  • మాల్టా షేర్లలో లక్షన్నర యూరోలు పెట్టుబడి పెట్టాలి.
  • మూడున్నర లక్షల విలువైన ప్రాపర్టీని కొనాలి, లేదా ఏడాదికి 16 వేల యూరోల అద్దె ఉన్న ప్రాపర్టీని అద్దెకు తీసుకోవాలి.

ఈ లెక్క ప్రకారం మాల్టా పాస్‌పోర్ట్ పొందాలంటే 11.5 లక్షల యూరోల వరకు ఖర్చవుతుంది. నెదర్లాండ్స్‌కు చెందిన యూరోపియన్ పార్లమెంటు సభ్యురాలు సోఫీ ఇంట్‌ వెల్డ్ చెప్పిన తొమ్మిది లక్షల యూరోల కన్నా ఇది ఎక్కువ.

"మీ దగ్గర తొమ్మిది లక్షల యూరోలు ఉంటే మాల్టా పాస్‌పోర్ట్ కొనుక్కొని యూరోపియన్ యూనియన్ పౌరులు అయిపోవచ్చు" అని సోఫీ చెప్పారు.

దరఖాస్తుదారులు 12 నెలలకు పైగా మాల్టా 'నివాసితుల హోదా' కూడా కలిగి ఉండాలి. అయితే వాళ్లు అంత కాలం తప్పనిసరిగా దేశంలోనే నివసించి ఉండాలనే నిబంధనేమీ లేదు.

ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి 833 మంది పెట్టుబడిదారులు, 2,109 మంది కుటుంబ సభ్యులు మాల్టా పౌరసత్వాన్ని పొందారు.

మాల్టా పట్టిక 2

మాల్టా పాస్‌పోర్ట్ ఉంటే ఐరోపాలోని ఇతర దేశాల్లో వీసా లేకుండా ప్రయాణించవచ్చు. షెంగన్ ఒప్పందంలో మాల్టా భాగస్వామి అయినందున ఇది వీలవుతుంది.

2017 మధ్య నుంచి 2018 మధ్య వరకు మాల్టా పాస్‌పోర్టుల పథకంతో 16 కోట్ల 23 లక్షల 75 వేల యూరోలు సమకూరాయి. అదే కాలంలో మాల్టా స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)లో 1.38 శాతానికి ఇది సమానం. 2018లో పాస్‌పోర్టుల కొనుగోళ్లు తగ్గాయి.

చెప్పుకోదగ్గ స్థాయిలో పెట్టుబడులను ఆకర్షించేందుకు ఇలాంటి పథకాలు పెట్టేలా మాల్టా లాంటి చిన్న దేశాలను ప్రోత్సహిస్తున్నట్లు కనిపిస్తోందని ఇటలీలో ఫ్లోరెన్స్ నగరంలోని 'యూరోపియన్ యూనివర్శిటీ ఇన్‌స్టిట్యూట్‌'లో వలస అంశాల పరిశోధకుడైన లుక్ వాండర్ బారెన్ చెప్పారు. చాలా చిన్న దేశాలు ఇలాంటి పథకాలతో వచ్చే ఆదాయంపై ఆధారపడుతున్నాయని ఆయన తెలిపారు.

మాల్టా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మాల్టా పాస్‌పోర్ట్ ఉంటే ఐరోపాలోని ఇతర దేశాల్లో వీసా లేకుండా ప్రయాణించవచ్చు. షెంగన్ ఒప్పందంలో మాల్టా భాగస్వామి అయినందున ఇది వీలవుతుంది.

మాల్టా పాస్‌పోర్టులు ఎవరు కొంటున్నారు?

గోల్డెన్ పాస్‌పోర్టులకు దరఖాస్తు చేసుకొన్నవారు ఏయే దేశాలవారనే వివరాలను మాల్టా ప్రభుత్వం బయటకు చెప్పదు. అయితే ప్రాంతాల వారీ వివరాలను వెల్లడిస్తుంది.

అత్యధికంగా ఐరోపా నుంచి వీటి కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. మధ్య ప్రాచ్యం, గల్ఫ్ ప్రాంతం, ఆసియా ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

ఈయూ సభ్యదేశాలు కొత్తగా ఎవరికి పౌరసత్వం కల్పించామనే వివరాలను ఏటా వెల్లడించాల్సి ఉంటుంది.

‘న్యాచురలైజేషన్’‌తో పౌరులైనవారి మూలాలు. . ఇవి 2017 జూన్ నుంచి 2018 జులై వరకున్న గణాంకాలు.

2014లో గోల్డెన్ పాస్‌పోర్టుల పథకాన్ని ప్రవేశపెట్టిన తర్వాత నివాసం లాంటి విధానం(న్యాచురలైజేషన్)తో మాల్టా పౌరులైన సౌదీ అరేబియా, రష్యా, చైనా దేశీయుల సంఖ్య పెరిగింది.

2015కు ముందు సౌదీ అరేబియా దేశస్థులెవరూ ఈ విధానంలో పౌరసత్వం పొందలేదు. ఆ తర్వాత 400 మందికి పైగా పొందారు.

మాల్తా ప్రధాని జోసెఫ్ మస్కట్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రాజీనామా ప్రకటించిన మాల్తా ప్రధాని జోసెఫ్ మస్కట్

బ్లాక్‌లిస్ట్‌లో పెట్టిన ఓఈసీడీ

ఆయా వ్యక్తులు మాల్టా పాస్‌పోర్టు పొందడానికి సహేతుక కారణాలు ఉన్నాయి. అదే సందర్భంలో, ఈ పథకాన్ని దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలూ ఉన్నాయి.

ఇతర ఈయూ దేశాల పథకాలతో పోలిస్తే మాల్టా పథకం కఠినంగా లేదని, ఇది తమకు ఆందోళన కలిగిస్తోందని 2019 జనవరిలో విడుదల చేసిన ఒక నివేదికలో యూరోపియన్ కమిషన్ చెప్పింది.

గోల్డెన్ పాస్‌పోర్ట్ కావాలనుకొనే దరఖాస్తుదారులు మాల్టాలో నివసించి ఉండాలనే నిబంధన లేకపోవడం, ముందు నుంచి మాల్టాతో సంబంధాలు కలిగి ఉండాల్సిన అవసరం లేకపోవడం లాంటి అంశాలను ఈ సందర్భంలో ఉదాహరణలుగా చెబుతారు.

గోల్డెన్ పాస్‌పోర్ట్ పథకం వల్ల పన్ను ఎగవేత ముప్పు అధికంగా ఉన్న దేశమంటూ 2018లో 'ఆర్థిక సహకారం, అభివృద్ధి సంస్థ(ఓఈసీడీ)' విడుదల చేసిన ఒక నివేదిక మాల్టాను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టింది.

పాస్‌పోర్ట్ జారీలో అందరు దరఖాస్తుదారుల, రాజకీయ ప్రమేయమున్న వ్యక్తుల వివరాలన్నీ క్షుణ్నంగా పరిశీలిస్తామని మాల్టా ప్రభుత్వం చెబుతోంది.

చాలా కుటుంబాలు ఈ పాస్‌పోర్ట్‌ను తమ పిల్లల చదువుల కోసం, లేదా స్వదేశాన్ని వీడి మాల్టా వెళ్లిపోవడానికి వినియోగించవచ్చని వాండర్ బారెన్ అభిప్రాయపడ్డారు.

గోల్డెన్ పాస్‌పోర్టుల పథకం వీటిని పొందే వ్యక్తుల దేశాల్లో అసమానతలను పెంచవచ్చని, ఎందుకంటే సంపన్నులైన అతి కొద్ది మంది మాత్రమే రెండో పౌరసత్వాన్ని దక్కించుకోగలరని ఆయన అన్నారు.

సైప్రస్, బల్గేరియాల్లోనూ ఇలాంటి పథకాలు

యూరోపియన్ యూనియన్లో సైప్రస్, బల్గేరియా దేశాల్లోనూ ఇలాంటి పథకాలు ఉన్నాయి.

2008 నుంచి 2018 మధ్య సైప్రస్ 1,685 మంది పెట్టుబడిదారులకు, వారి కుటుంబ సభ్యులైన 1,651 మందికి పౌరసత్వం ఇచ్చింది. అయితే గత నెల్లో 26 మంది పెట్టుబడిదారుల గోల్డెన్ పాస్‌పోర్టులను రద్దు చేసింది. వీటి జారీలో పొరపాట్లు జరిగాయంటూ ఈ నిర్ణయం తీసుకొంది.

రియాలిటీ చెక్ బ్రాండింగ్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)